దేవుడు సౌలును నడిపించుట

(1955వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

1 వ సమూ. 9: 1 - 27; యెహా. 15:5; రోమా. 11:7.

నా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను. నేను వారిని దృష్టించి యున్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈవేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును 1 సమూ. 9; 16.

ప్రార్ధన:- ఇశ్రాయేలీయులను దృష్టించి, వారిని విడిపించుటకు సౌలును అభిషేకించిన తండ్రి మిమ్ములనుకూడ లోకమునుండి విడిపించి మేఘమునకు ఆకర్షించుకొనునుగాక. ఆమేన్.

  • 1 ) రాకడ ఆసక్తితో కూడివచ్చిన పిల్లలారా! పై వచనములో ఇశ్రాయేలీయులకు నూతన కాలము ఆరంభమగుచున్నది. నూతన జీవము ఆరంభము కానున్నది. ఇశ్రాయేలీయులు రాజును కోరుటనుబట్టి దేవుడు వారికి రాజు నిచ్చెను. ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రములలో చివరి గోత్రము బెన్యామీను గోత్రము. ఇందులో కీషుయొక్క కుటుంబములో ఉండెను. కీషు గొప్ప ధనికుడు. సౌలు యౌవనవంతుడు. సౌందర్యము గలవాడు. వీరికి నౌకర్లు, గార్ధభము లున్నవి. ఇది కుటుంబ చరిత్ర ఉన్న మొదటి కథ .
  • 2 ) వీరికి కలిగియున్న గార్ధభములు తప్పిపోయినవి. వారి పొరపాటునుబట్టి అవి తప్పిపోయినవి. అపశువులు తప్పిపోయినచో యజమానుల విచారము. గనుక కీషు సౌలును, తన సేవకుని వాటిని వెదకుటకు పంపెను. వారి గార్ధభములు బయటికి వెళ్ళినవి గనుక నౌకరు మరియు కుమారుడు వాటిని వెదకుటకు బయలు వెళ్ళిరి. ఇది రెండవ కథ.
  • 3 ) ఎఫ్ర్రాయీము మన్యము, ఎలేషాదేశము, షయలీము దేశము, బెన్యామీను దేశము నూపు దేశము వెదకిరిగాని, గార్ధభములు ఈ ప్రాంతములలో కనబడనందున వెదకుట చాలించిరి. ఇది మూడవ కథ.
  • 4 ) నౌకరు ప్రదర్శకునిగూర్చి ( ప్రవక్తనుగూర్చి )సౌలునకు చెప్పెను. సౌలు అందుకు అంగీకరించి కానుకను గూర్చి ఆలోచించి, తమ దగ్గరనున్న పావుతులము వెండిని ప్రదర్శకునికి ఇచ్చుటకు సిద్ధపడిరి. ఆ తరువాత వారు నూపుదేశములో ఒక ఊరిలోనున్న ప్రదర్శకుని దగ్గరకు వెళ్ళుటకు నిశ్చయించిరి. ఇది నాలుగవ కథ.
  • 5 ) అచ్చట నీళ్ళకువచ్చిన కన్యకల వలన ఆ దినము బలి అర్పించు దినమనియు, ప్రదర్శకుడైన సమూయేలు ఉన్నత స్థలమునకు పోవుచున్నాడనియు తెలిసికొని, వారును వెళ్ళుచుండగా సమూయేలు వారికి ఎదురయ్యెను. సౌలునుగూర్చి నిన్నటి దినమే ప్రభువు ప్రవక్తకు బైలిపరచియుండెను. సౌలు ప్రదర్శకుడెక్కడ? అని ఆయననే అడుగగా, తానే ప్రదర్శకుడనని, గార్ధభముల సంగతిచెప్పి, ఈ దినము ఆగుమని ప్రదర్శకుడైన సమూయేలు వారితో చెప్పెను. ఇది ఐదవకథ.

వివరము:- సౌలుపేరు చరిత్రలో మొదట వ్రాసినాడు సమూయేలే. సౌలు కుటుంబములో ఏమియు చెడుగులేదు. ప్రపంచములోని ప్రతి కుటుంబములోని ప్రతి కుటుంబము యొక్క చరిత్ర బాగుండవలెను. కుటుంబములలో ఐక్యత లేకుండుటయే యుద్ధములు వచ్చుటకు కారణము. కుటుంబములు బాగున్న యెడల దేశచరిత్ర బాగుండును. గార్ధములు వృత్తికి సంబందిచినవి. అవి భారములు మోయు పనులు చేయును. దేవుడు ఇప్పుడు సౌలును సింహాసనము దగ్గరకు నడిపించుచున్నాడు. అనగా ఇశ్రాయేలు రాజ్యభారమును మోయుటకు సిద్ధపర్చు చున్నాడు. దేవిని నడిపింపు వీరిలో ఎవరికి తెలియదు. ఒక్క ప్రదర్శకునికి మాత్రమే తెలియును. దేవుని చిత్తమును బట్టి జరుగుచున్న సౌలు నడిపింపు చాల చక్కనిది. ఈ నడిపింపు పైకి నరులకు కనబడదుగాని చివరకు తెలియును. సౌలులోనున్న మంచి గుణము ఏదనగా, తండ్రి చెప్పగా వెళ్ళినాడు గనుక విధేయుడు. సౌదర్యము గలవాడు. ఇది బైటి కథ అనగా బహిరంగములోనిది. అయితే లోని కథ అనగా అంతరంగములోని విధేయత, ఎత్తు, సొగసు ఈ మూడును ఉండెను. పిల్లలు ఇంటిలో విధేయత మొదట నేర్చుకొని ఏ పని చెప్పిన చేయవలెను. పిల్లలకు మంచి లక్షణములు నేర్పువారు తల్లిదండ్రులే.

సౌలు మరియు అతని నౌకరుకు గాడిదలు కనబడలేదు. ఎందుకనగా ముందు వీరికి సమూయేలు కనబడవలెను. ఇది దేవుని నడిపింపు. వారు ఐదుదేశములు తిరిగిరి గాని కనబడలేదు. దీని అర్ధమేమనగా మనిషియొక్క స్వంత క్రియలు నిష్ప్రయోజనము. దేవుని సహాయము లేకపోతే మనిషి ఏమి చేయలేడు. గార్ధభములను వెదకుట మిక్కిలి చిన్నపనియైనను, దేవుని సహాయము లేకపోతే మనిషి ప్రయత్నములు నిష్పలమని మొదటగా సౌలు పాఠములో నేర్చుకొనుచున్నాము. తప్పిపోయిన గార్ధభములను ( గొర్రెలను ) వెదకుట గొప్ప పనియే. అయినను దేవుని సహాయము లేకపోయినయెడల ఆ ప్రయాసమంతయు వృధా పోవును.

దేవుడు మనకు గొర్రెలమంద, గాడిదలమంద, గుర్రములమంద, ఆవులమంద, ఏ మందనిచ్చినను వాటిని పోగొట్టు కొనకూడదు. ఆత్మ సంబంధముగా ఇచ్చినవికూడ పోగొట్టుకొనకూడదు. పోగొట్టుకొన్నయెడల వాటిని తిరిగి సంపాదించుకొనుట చాల కష్టము. దొరుకవు గనుక జాగ్రత్తగా నుండవలెను. మరుపు మరియు అజాగ్రత్తల వలన మనకు దేవుడిచ్చినవి పోగొట్టుకొందుము. సౌలునకు దేశ సంచారములో రెండు మాటలు వినబడెను. 1 ) తండ్రి విచారిస్త్తాడు అన్నమాటలు, 2) దైవజనుని గురించిన మాటలు. సౌలు దైవజనుని గురించి మంచి మాటలు వినెను. ప్రదర్శకుడు అనగా దివ్యదృష్టితో చూచువాడు. ప్రదర్శకుడు ఉన్నాడు గనుక దేశమునకు క్షేమము. ఆయన దైవజనుడు గనుక ఆయన చెప్పునది జరుగును. ప్రదర్శకుడు మనము ఏ మర్గమున వెళ్ళిన యెడల పోగొట్టుకొనునది దొరుకునో, ఆ మార్గమును చూపించును. అట్లే ఆత్మసంబందహముగా కూడ మార్గము చూపించుట దైవజనుని పనియైయున్నది. తరువాత కన్యకలు చెప్పిన చల్లని మాటలు గలవు. ఆయన మీ యెదుట నున్నాడు, త్వరగా కలిసికొనుడి, ఈ దినమే వచ్చినాడు, అతడు బలిని ఆశీర్వదించితేనేగాని ప్రజలు భోజనము చేయరు. ఇది ఇశ్రాయేలీయులలో గొప్ప అలవాటు, కన్యకలను కనుగొనిన తర్వాత వారు ప్రవక్తను కనుగొను పని మాత్రమే గలదు. గనుక త్వరగా వెళ్ళుడని చెప్పిరి. కన్యకల వరుస అనగా వధువు సంఘము. వాక్యమువలన మనము శుద్ధియైన యెడల కన్యకల వరుసలోనికి వచ్చెదము. "ఆయన మీ ఎదుటేనున్నాడు, త్వరగా వెళ్ళుడి" ఇది కన్యకల స్వరమై యున్నది.

ఇప్పుడు తయారయ్యే పెండ్లికుమార్తె చెప్పవలసిన మాటలు ఏవనగా సౌలునకును అతని సేవకునికి, కన్యకలు చెప్పిన నాలుగు మాటలే నేటి కన్యకలును అనగా రాకడకు సిద్ధపడిన వారును చెప్పవలెను. అదేదనగా పరకములో ఏడేండ్లు విందు జరుగును. (ప్రవక్తను కనుగొన్నట్లు) ప్రభువును మీరు కనుగొనవలెను. సౌలుకు తప్పిపోయిన గాడిదలు దొరికినట్లు, ఈ లోకములో తప్పిపోయినవి అక్కడ మీరు కనుగొందురని చెప్పవలెను. పెండ్లి కుమార్తెగా సిద్ధపడు కన్యకలు ప్రభువును ఇక్కడనే కనుగొనవలెను.

భూలోకములో ఆజ్ఞాతిక్రమమువలన ఏది పోగొట్టుకొన్నామో , అవన్ని ప్రభువు పరలోకములో దాచియుంచును. అవి అక్కడ దొరుకును. క్రొత్తవికూడ దొరుకును. ప్రవక్తను కనుగొనుటకు ఉన్నత స్థలమునకు పోవలెను. అలాగే మనమును తక్కువ స్థలమునుండి ఉన్నత స్థలమునకు పోవలెను. అలాగే మనమును తక్కువస్థలమునుండి ఉన్నత స్థలమునకు వెళ్ళవలెను అనగా దైవ సన్నిధికి వెళ్ళవలెను. సౌలును, అతని సేవకుడు ప్రదర్శకుని కనుగొనినట్లు మనమును ఈలోకములోనే ప్రభువును కనుగొనవలెను. స్త్రీలమాటలు బాగుగా నున్నవి. వారు కన్యకలు, నీళ్ళు తోడుకొనుటకు వచ్చిరి. సౌలుయొక్కనౌకరు, నయమాను గృహమందున్న సేవకుని వంటివాడే. వీరు యజమానులకు సలహాలిచ్చి హెచ్చరించేవారు. ప్రభువు దైవజనునితో చెప్పినమాటలు; 'రేపుఒకనిని నీయొద్దకు రప్పించెదను. ఒకప్రక్కనున్న కథ-గాడిదలు, మరియొక ప్రక్కనున్న కథ- కన్యకలు మాటలాడుట. ఇంకొకప్రక్కనున్న కథ దేవుడు వారిని నడిపించుట. ఇన్ని కోణాలు ఈ కథలో కనబడుచున్నది. ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతిలోనుండి విడిపించుటకు దేవుడు సౌలును నడిపించెను, గాని అతనిని పిలువలేదు. సమూయేలు దేవునితో కలిసి పోయెను. చిన్ననాటనుండి సమర్పణ అయిపోయినాడు గనుక దేవునితో కలిసిపోయెను. సౌలునకు దొరికెను. ప్రవక్తయైన సమూయేలు సౌలునకు దొరికెను. ప్రభువు లోకములోనుండి పెండ్లికుమార్తె సంఘములో నుండుటకై ఎవరు దొరుకునా! అని వెదకుచున్నాడు. ఎందరు దొరుకుదురా! అని చూచుచున్నాడు. ప్రభువునకు దొరుకు వారిలో మనమును చేరియుందముగాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद