• Home
 • Songs
 • Books
 • Worship
 • Fellowship
Menu

క్రిస్ట్మస్ సందేశములు

Author: Mungamuri Devadasu Ayyagaru

(ఏ మతమునుగాని ఏ మనుష్యునిగాని ద్వేషించరాదు, తుంచనాడకూడదు)

క్రిస్ట్మస్ పద్యములుక్రీస్తు జన్మ ప్రవచన సంవత్సరములుప్రవచనము విన్నవారు వాక్యభాగము సుమారు ఏసంవత్సరమున వినిపించబడెను
1. అదాము ఆది 3:15 క్రీ||పూ|| 4004 సం||
2. నోవాహు ఆది 6:18 క్రీ||పూ|| 2353 సం||
3. షేము ఆది 9:26 క్రీ|| పూ|| 2348 సం||
4. అబ్రహాము ఆది 12:3 క్రీ|| పూ|| 2126 సం||
5. ఇస్సాకు ఆది 26:4 క్రీ||పూ|| 1806 సం||
6. యాకోబు ఆది 28:14 క్రీ|| పూ|| 1760 సం||
7. యూదా ఆది 49:10 క్రీ||పూ|| 1689 సం||
8. ఇశ్రాయేలీయులు సంఖ్యా 24:17 క్రీ||పూ|| 1452సం||
9. మోషే ద్వితీ 18:18 క్రీ|| పూ|| 1451 సం||
10. దావీదు 2సమూ 7:15 క్రీ|| పూ|| 752 సం||
11. యెషయా యెషయా 7:14 క్రీ||పూ|| 742సం||
12. యెషయా యెషయా 9:6 క్రీ||పూ||740 సం||
13. మీకా మీకా 5:2 క్రీ||పూ||710సం||
14. యోసేపు మత్తయి 1:20,21 క్రీ||పూ|| 5సం||

క్రిష్ట్మస్ వర్తమానములు

( లూకా 2:1-20)


 • 1. యేసు ప్రభువు యొక్క జన్మచరిత్ర నెమరునకు తెచ్చుకొనుట వలన ఆత్మీయ జీవన వృద్దికి సహాయకరముగ నుండును, నెమరువేయుట జీవ రాసులకు హాని కాదుగాని మేలు. అలాగుననే క్రీస్తు జన్మచరిత్రను ఎరిగియున్నను స్మరణకు తెచ్చుకొనుట వలన ఆనందాభివృద్ధి కలుగును

 • 2. పండుగలు సంతోషాభివృద్ధికి ఉపయోగములు. ఈ లోకములో ప్రతి మానవునికి ఏదో ఒక విషయములో విచారముండును. "అనుదినము విచారమున్న ఆయుషు క్షీణించును" గనుక అప్పుడప్పుడు పండుగలు ఆచరించ వలసినదే. ఈ సమయములో విచారము పూర్తిగా కాకపోయినను కొంతవరకు తగ్గనైన తగ్గును. మానవుని యొక్క చరిత్రలో సంతోష కరమైన సంగతులు గలవు. వీటిలో మిక్కిలి గొప్పది క్రీస్తు ప్రభువు యొక్క జన్మము. విచారములు, కష్టములు మరిచి ఆనందముతో సంపూర్ణ స్థితి పొందుదము.

 • 3. దేవుడు మానవులను కలుగజేసినపుడు తనవలె పరిశుద్ధులనుగా కలుగ జేసెను. గాని మంచిపాలలో విషపుచుక్కపడినట్లు ఆది మనుష్యులలో పాపము ప్రవేశించినది. కాలక్రమమున జనుల వృద్ధితో పాటు పాపముకూడ వృద్ధి పొందెను. దేవునికి తన సృష్టి చెడిపోవుట బహు విచారము గనుక పాపమును పరిహరించుటకు ఒక రక్షకుని పంపెదనని వాగ్ధానము చేసెను.

 • 4. రక్షకుని పంపెదనని దేవుడిచ్చిన వాగ్దానకాలము నుండి రక్షకుడు వచ్చునప్పటికి నాల్గువేల సం||ములు గతించెను. ఈ నాల్గువేల సంవత్సరములలోను దేవుడు మాటిమాటికి ఈ వాగ్దానములు తన భక్తులకు వినిపించుచు వచ్చినందువలన ఆ వాగ్దానములు అమావాస్య చీకటిరాత్రి ఆకాశమున తళుక్కుతళుక్కుమని మెరియు నక్షత్రములవలె ప్రకాశించుచు విశ్వాసులలోనిరీక్షణ నక్షత్రములను కల్గించుచుండెను.

 • 5. సంవత్సరములు గతించుకొలది ఆ రక్షకుడు రావలెనను కోరిక విశ్వాసులలో ఊరు చుండెను.

 • 6. రక్షకుడు సర్వలోక రక్షకుడుగా ఎవరు రావలెను. దేవుడు దేవుడుగా వచ్చిన నరులు రక్షింపబడుటకు బదులుగా భస్మమై పోవుదురు. గనుక అట్లు వచ్చుటకు వీలులేదు. దేవ దూతలలో ఒకరు రావలసివచ్చిన ప్రజలు భయపడిపారిపోవుదురు అయినను వారు రక్షింపలేరు. ఒకవేళ మనుష్యులలో ఒకరు రక్షకుడుగా రావలెనన్న అంతపనికి తగిన వారెవరు లేరు. ఎంతగొప్ప భక్తుడైనను ఏదో ఒక లోపముండును. ఒకమనిషి ఒక మనిషిని రక్షింపలేడు, అదందరిని అసలు రక్షించలేడు. దైవభక్తుడు సహితము తనకు తాను భక్తిగా నుండగలడు గాని ఒక మనిషిని రక్షించుటకు సమర్ధుడు కాడు. ఒక వేళ రక్షకుడుగా ఒక నరుడు ఏర్పర్చబడిన అతడు శాశ్వితుడుగా నుండలేడు కనుక దేవుడు ఏదో విధముగా వీలుచేసుకొని రావలెను. ఆయన దేవదూత రూపము ధరించుకొని వచ్చిన ప్రజలు దగ్గరకు రారు. జంతురూపమున వచ్చిన రానివ్వరు, కొట్టుదురు. గనుక మనిషి రూపముననే రావలెను అప్పుడు అందరు దగ్గరకు రాగలరు, చూడగలరు, ఇండ్లలో చేర్చుకొనగలరు, మాట్లాడగలరు. కష్టసుఖములు చెప్పుకొనగలరు.

 • 7. దేవుడు మనుష్యులలో మనిషిగా జన్మించిన దేవుడు మా నిమిత్తమై జన్మించి మాతో కలిసి మెలిసి ఉండు రక్షకుడుగా వచ్చినాడని మనుస్యులు అతిశయింతురు, సంతోషింతురు. ఆయన ఆకాశములో జన్మించి అక్కడే ఉండిన ప్రజలకు అందుబడిలో నుండదు. భూమిమీద జన్మించిన మా భూమిమీద, మాదేశములో, మా మనుష్యులలో రక్షకుడు జన్మించినాడని ఆనంద భరితులగుదురు. మనుష్యులలో ఈ కోరికను దేవుడు ఎరుగును గనుక ఆయన మనుష్యుడుగానే రా నిశ్చయించుకొనెను.

 • 8. దేవుడు కలుగ జేసిన మొదటి మనుష్యుడు అనగా ఆదాము, హవ్వలు అనగా ఆదిదంపతులు, అనగా మన మొదటి తల్లి దండ్రులు, అనగా ఆదాము మనతండ్రి, హవ్వ మన తల్లి మనమందరమును ఏదేశపు వారమైనను, ఏజాతి వారమైనను ఏభాష వారమైనను వారి సంతానమే. మనమందరము కలిసి నరవంశమై యున్నాము. ఈ నరవంశములోనే దేవుడు రక్షకుడుగా రావలెను. నరులను రక్షించుటకు నరవంశస్తుడై యుండవలెను. ఆదాము, హవ్వల సంతతిలో కొన్నియేండ్లకు షేము అను దైవ జనుడు జన్మించెను. ఆయన వంశపువారు యూదులని పేరు పొందిరి. వారి సంతతిలో దావీదు అను ఒక రాజు జన్మించెను. ఆ రాజు యొక్క వంశములో మరియమ్మ అను ఒక కన్యకయును, యోసేపు అను నీతిపరుడైన ఒక పురుషుడును జన్మించెను. వీరి జన్మకాలము వచ్చుసరికి రక్షణ వాగ్దానము వినిపించి నాల్గువేల సం||లు అయినది.

 • 9. ఈ మరియమ్మ గర్భమందే లోకరక్షకుడు జన్మించునని కొన్ని వందల యేండ్లక్రిందట ప్రవచింపబడెను. అది ఇప్పుడు నెరవేరి తీరవలెను. అది మాత్రమేకాక ఆ రక్షకుడు బెత్లేహేము అను గ్రామములో జన్మింపవలెను మరి యొక ప్రవచనము గలదు. ఈ రెండు ప్రవచనములు నెరవేరినయెడలనే రక్షకుడు జన్మించినట్లు అనేకులకు తెలియును. ఎంత గొప్పవారు జన్మించినప్పటికిని కన్యగర్భమందు జన్మించని యెడల ఆయన లోకరక్షకుడు కానేరడు.

 • 10. ఆ రక్షకుడు ఎటువంటివాడై యుండవలెను? మొదటిది దేవుడై యుండవలెను. రెండవది మనుష్యుడై యుండవలెను. కన్యకా గర్భమున పుట్టవలెను. నాల్గవది ఆమె గర్భవతి యగుట దైవప్రభావమువల్ల కావలెను. అయిదవది బెత్లెహేము అను ఊరిలో (పాలస్తీనాలోని గ్రామములో) జన్మించవలెను. ఆరవది నరవంశమైనను ఆ నరవంశములో యూదుల జనాంగమందు జన్మించవలెను. ఈగుర్తులు ఉన్నప్పుడే అతడు లోకరక్షకుడై ఉండగలడు. ఇది ప్రవచనానుసారమై యున్నది. బైబిలులో వ్రాత పూర్వకముగా నున్నది. గాలికి ఎగిరిపోవు మాటల పూర్వకముగ లేదు.

 • 11. జన్మ ప్రవచనములు నెరవేరు సమయము వచ్చునప్పటికి నజరేతు అను గ్రామములో మరియమ్మ అను కన్యకను దేవుడు సిద్ధపరచియున్నాడు. ఆమెకా సంగతి తెలియదు గాని తర్వాత తెలిసినది. అంతకు పూర్వము యోసేపను నీతిపరుడు ఆమెను పెండ్లిచేసుకొనవలెనని ఏర్పరచుకొనెను. గాని వివాహాము కాలేదు. ఇంతలో దైవప్రభావమువల్ల ఆమె గర్భవతి ఆయెను.

 • 12. ఒక పక్షిని దేవుడు వృక్షముగా మార్చగలడా? ఒక వృక్షమును పక్షిగా మార్చగలడా? మార్చలేడు గదా? అలాగైన ఆది అంతములేని దేవుడు ఒక మనిషిగా ఎట్లు జన్మించగలడని కొందరు అడుగుచున్నారు. పక్షిని వృక్షముగా మార్చుట సృష్టి క్రమమునకు విరుద్ధము. క్రమమునకు విరుద్ధమైనది దేవుడు చేయడు. అది నైసర్గికముకాదు. నాలుగు అయిదులు ఇరువై అయి యుండగా దేవుడు వాటిని పందొమ్మిదిగా గాని ఇరువై ఒకటిగా గాని మార్చడు. అది న్యాయవిరుద్ధము. సమస్తమును దేవుడు చేయగలడనియు, ఆయనకు అసాధ్యమైనది ఏమియు లేదనియు మనము నమ్మవచ్చును అయితే దేవుడు మనుష్యుడుగా జన్మించగలడా? ఆదిలో దేవుడు మొదటి మనుష్యుని కలుగజేసినప్పుడు తన పోలికగా కలుగజేసెనని వ్రాయబడియున్నది. తన పోలికగా అనగా తనకున్న ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జీవము, స్వాతంత్ర్యము జ్ఞానము, మొదలైనవి పెట్టి మనుష్యుని కలుగజేసెను. అదియే దేవుని పోలిక దేవుడు తన పోలికగల మనుష్యునిగా జన్మించుట సబబుగానే యుండును. సబబునకు వ్యతిరేకముగా లేదు ఎందుకనగా దేవుని పోలిక మనుష్యుని పోలిక ఒకటే, కాకపోతే దేవుడు ఆకారము లేనివాడు, మనుష్యుడు ఆకారము గలవాడు.

 • 13. దేవుడు మానవుడుగా అవతరించుట అద్భుతములన్నిటిలో గొప్ప అద్భుతము, అద్భుతక్రియలు చూచుట మానవునికి బహు వినోదముగ నుండును. తర్వాత దేవుని ప్రేమను నరుడు తెలిసి కొనును. నరుని మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన నరుడుగా జన్మించును అని నరుడు ఆశ్చర్యపడి నమ్మును. నరునిమీద ఎంతప్రేమ లేకపోతే పరలోక మహిమలో నుండవలసిన దేవుడు పాపాంధకారముతో నిండియున్న ఈ లోకమునకు వచ్చును. ఎంత ప్రేమ లేకపోతే దేవదూతల యొద్ద నుండవలసిన దేవుడు నరుల యొద్దకు వచ్చివేయును. ఈ అద్భుతావతారము దేవుని ప్రేమను వెల్లడించునదిగా నున్నది. అందుచేతనే పండుగ చేయుచున్నాము.

 • 14. మరియమ్మ ఉన్న నజరేతు గ్రామము బెత్లెహేము అను గ్రామమునకు చాలా దూరము. ఆమె బెత్లెహేమునకు రావలసిన అవసరము లేదు. ఆమె రాకపోయిన బెత్లెహేములో రక్షకుడు జన్మించును అను ప్రవచనము నెరవేరదు, మొదటిది ఆమె రావలసిన అవసరము లేదు. రెండవది వేరే పని అవసరమున్నను స్త్రీ అగుటచేత అంతదూరము నడచివెళ్ళదు. మూడవది ఆమె గర్భవతియై యున్నది గనుక అసలే అంతదూరము వెళ్ళదు. నాల్గవది పెండ్లి కాకపూర్వము గర్భవతియైనందున బిడియము గనుక ఇల్లువిడిచి బయటకు రాదు. మనుష్యుల కంటబడనిది పొరుగూరు ఎట్లు వెళ్ళగలదు.

 • 15. ఏలాగైనను దేవుడు మరియమ్మను బెత్లెహేముముకు తీసికొనిరావలెను. కన్యక గర్భవతియగు నను ప్రవచనము నెరవేరినది. రక్షకుడు బెత్లెహేములో జన్మించునను ప్రవచనము కూడ నెరవేరవలెను ఏ వంక మీద ఆమెను తీసికొని వచ్చిన ఆ ప్రవచనము నెరవేరును?

 • 16. ఆ కాలమందు ప్రజలకు తెలిసిన ప్రపంచమంతటిని రోమా ప్రభుత్వమువారు పరిపాలించుచుండిరి. రోమా పట్టణము ఇటలీ దేశములో నున్నది. అక్కడ ఔగుస్తు అను చక్రవర్తి ఉండెను. ఆయన సర్వలోక ప్రజాసంఖ్యా వ్రాయవలెనని ఒక ఆజ్ఞ ఆయా దేశముల అధికారులకు పంపెను. గనుక జనాభా లెక్క వ్రాయవలెను. అందరి పేర్లు జనాభాలో నుండవలెను. మరియమ్మ, యోసేపు అను వీరు యూదులు. యూదులయొక్క పద్ధతి ఏమనగా ప్రజాసంఖ్యాకాలమందు వారియొక్క పూర్వీకుల గ్రామము వెళ్ళి అక్కడ తమ గోత్రాను సారముగ పేరులు వ్రాయించుకొనవలెను. మరియమ్మ, యోసేపు అను వారియొక్క పూర్వీకుడైన దావీదు రాజుగారి యొక్క జన్మ గ్రామము బెత్లెహేమనే గ్రామము. ఇప్పుడు యోసేపు ఆ గ్రామమునకు వెళ్ళి తనపేరును, మరియమ్మ పేరును వ్రాయించుకొనవలెను. స్త్రీలు వెళ్ళవలసిన ఆచారములేదు గనుక మరియమ్మ పేరును వ్రాయించుకొనవలెను. స్త్రీలు వెళ్ళవలసిన అవసరము లేదు. యోసేపు వెళ్ళిన చాలును. మరియమ్మ వెళ్ళకుండుటకు ఈ ఆచారము ఒక చిక్కుగా నున్నది కాబట్టి ఏమి చేయవలెను. ఆమె వెళ్ళిన యెడలనే బెత్లెహేములో రక్షకుడు పుట్టునను ప్రవచనము నెరవేరును, జనాభా లెక్కవ్రాయించవలసినదని తలంపు చక్రవర్తి హృదయములో పుట్టించిన దేవుడే మరియమ్మలో కూడ బెత్లెహేము వెళ్ళవలెనను తలంపు పుట్టించవలెను. అప్పుడు ప్రవచనము నెరవేరును. అలాగుననే జరిగినది. ఏలాగనిన తాను చేసికొననైయున్న యోసేపు బెత్లెహేము బయలు దేరిన యెడల తాను ఒక్కతె ఇంటిదగ్గర నుండుటకు ఇష్టపడక నేను కూడ నీతో వచ్చెదనని వెంటబడి వెళ్ళెను. ఇట్లు మరియ, యోసేపు వెంటబడి వెళ్ళుట కట్టడలోనిది కాదుగాని ఆమె ఇష్టములోనిది. దేవుడే ఆమెకు అట్టి ఇష్టమును పుట్టించెను.

 • 17. రోమా రాజ్యమునకు ఔగుస్తు చక్రవర్తిగా నున్నపుడు ఆయన చేతి క్రింద సిరియ దేశము గలదు. పాలస్తీనాదేశము, అనగా నజరేతు, బెత్లెహేము ఉన్న దేశము ఆ సిరియ దేశములో ఒక భాగము, ఆ సిరియ దేశమునకు కురేనియ అధిపతిగా నున్నప్పుడు ప్రజాసంఖ్య వ్రాయబడెననియు, అది మొదటి ప్రజాసంఖ్య అనియు బైబిలులో వ్రాయబడియున్నది. ఈ వ్రాత చూడగా లోకరక్షకుడు జన్మించిన వృత్తాంతము నిజము అని రుజువగుచున్నది. ప్రభుత్వమువారి వ్రాత పుస్తకములలో చూచిన బైబిలులో నున్న ఈ సంగతి కనబడును. ఈ రెండు సంగతులు ప్రభువు యొక్క జన్మమునకు రుజువులు.

 • 18. సంగతి తేటగా నుండుటకు విశదముగా వ్రాయుచున్నాము. అప్పటి సర్వ ప్రపంచమును రోమా ప్రభుత్వము ఏలుచున్నది. వానికి చక్రవర్తి ఔగుస్తు, ఆ రాజ్యములో సిరియ దేశము గలదు. సిరియ దేశమునకు కురేనియరాజు, ఆ సిరియ దేశములో పాలస్తీనా దేశముకూడ కలిసియుండెను. ఆ పాలెస్తీనాలో గలిలయ పరగణా (జిల్లా) లో నజరేతుల గ్రామమును, యూదయ పరగణాలో బెత్లెహేమను గ్రామమును ఉన్నవి. మనుష్యుల పేర్లు దేశముల పేర్లు ఇంత స్పష్టముగా వ్రాయబడియున్నందువల్ల రక్షకుని జన్మవృత్తాంతము సత్యమని తెలిసికొనగలము.

 • 19. సర్వలోక ప్రజాసంఖ్య అని బైబిలులో వ్రాయబడియున్నది. రక్షకుడు సర్వలోక రక్షకుడు గాని ఒక్క పాలస్తీనకే రక్షకుడు కాడు. సర్వలోక ప్రజాసంఖ్యకాలమందు సర్వలోక రక్షకుడు పుట్టుట అనునది వినసొంపుగా నున్నది. టక్కున కుదిరినది. కాలము సంపూర్ణమైనప్పుడు రక్షకుడు జన్మించెను అని పౌలు వ్రాతలలో నున్నది. ప్రజలు అనుకొన్నకాలములో ఆయన జన్మించలేదు గాని ప్రవచనాను సారముగా దేవుడు ఏర్పర్చిన కాలములో జన్మించెను. ప్రతి దానికి సమయము కలదు.

 • 20. ప్రజాసంఖ్య వ్రాయబడినప్పుడు ప్రభువు జన్మించెనని వ్రాయబడి యున్నది. ఇది కూడ వినుటకు వినసొంపుగా నున్నది. ఎందుకనగా లోకరక్షకుడు ప్రజలలో ఒకడు, ప్రజల పేరు వ్రాయబడినట్టు ఆయన పేరు కూడ వ్రాయబడవలెను. ఈ రెండు విషయములు పాపులకు ఆనందకరములు. లోక రక్షకుడు మా మనిషి అనియు, ఆయన పేరుకూడ మా పేరులలో ఒకటనియు ప్రజలు కాలక్రమమున తెలిసికొని ఆనందింపవలసినది. ఈ లోకరక్షకుని నామము వలననే మనము రక్షింపబడుదుము. మరి యెవరివలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అని లోకరక్షకుని గురించి బైబిలులో నున్నది. ఆ లోకరక్షకునికి పుట్టిన వెంటనే పేరు పెట్టబడలేదు గాని పుట్టకముందే పెట్టబడెను. ఆ పేరు "యేసు"అను పేరు. "క్రీస్తు". క్రీస్తు" అనగా "అభిషిక్తుడు" అనగా నియమింపబడినవాడు. అనగా రక్షణోద్యోగమునకు రాజువలె అభిషేకింపబడినవాడు. యేసు క్రీస్తు అనగా రక్షణపనికి ప్రత్యేకముగా నియమింపబడినవాడు. ఆయన జన్మమునకు పూర్వము కొన్నివందల యేండ్లక్రిందట ఆయనను "మెస్సీయ" అనువారు (మెస్సీయ=క్రీస్తు=అభిషిక్తుడు) యేసుక్రీస్తు అను నామము స్వదేశనామము కాదు, విదేశనామము కాదు, అది పరలోక నామము. రక్షకుడు ఎట్లు పరలోకము నుండి వచ్చెనో అలాగే ఆయన నామము కూడ పరలోకము నుండి వచ్చినది గనుక సర్వలోకమునకు, ప్రతి దేశమునకు ప్రతి మనిషికి రక్షణ విషయము సరిపోవు నామమైయున్నది. అందుచేతనే ఈ నామమున తప్ప మరి యే నామమున రక్షణ లేదని బైబిలులో వ్రాయబడినది.

 • 21. పరలోకములో జీవగ్రంథమను ఒక గొప్ప గ్రంథము కలదనియు, ఆ గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడి యుండునో వారు మోక్షవారసులగుదురనియు బైబిలు బోధవలన కనబడుచున్నది. వారు భూమిమీద ఉన్నప్పుడు ఎప్పుడో ఒకపుడు, ఎక్కడో ఒకచోట, ఏ స్థితిలోనో ఒక స్థితిలో రక్షణకరమైనది యేసుక్రీస్తు నామము తెలిసికొనవలెను అట్లు తెలిసికొనగల ఒక సమయమును దేవుడు ప్రతివానికి అనుగ్రహించును. ఔగుస్తు చక్రవర్తి కాలమున జనాభాలో వ్రాయబడిన పేరుల సంఖ్య కంటె, యేసు నామమును బట్టి పరలోకమందు జీవగ్రంధములో వ్రాయబడు సంఖ్య చాల యెక్కువ గనుక ప్రతివారు జీవగ్రంధములో పేరులు వ్రాయించుకొనుటకు ముందుగా యేసు నామమును తెలిసికొనవలెను. ఔగుస్తు కాలమందు ప్రజలు తమ పేరులు వ్రాయించుకొనుటకు తమ పూర్వీకుల పట్టణమునకు ఆజ్ఞ కాగానే వెళ్ళి వ్రాయించుకొన్న విధముగానే ప్రతివారును పరలోక జీవ గ్రంథములో పేర్లు వ్రాయించుకొనుటకు త్వరపడవలెను. ఆయన యందు విశ్వసించుటవలనను, ఆయనను స్మరించుట వలనను ఆయనను ప్రార్ధించుటవలనను ఈ భాగ్యము లభించును.

 • 22. మరియమ్మయును, యోసేపును తమ పేరులు వ్రాయించుకొనుటకు నజరేతు నుండి అనగా ఉత్తరము నుండి దక్షిణమునకు అనగా బెత్లెహేమునకు చాలా దూరప్రయాణము చేసిరి. అప్పుడే ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆమె లోకరక్షకుని కనెను. ఆ శిశువును బట్టతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అప్పుడు ఆదేశ ప్రాంతములోని యూదులకు ఈ వర్తమానము తెలియగానే వారువచ్చి ఆయనకు నమస్కరించెను. ఆ తరువాత కొన్నిదినములకు తూర్పు దేశము నుండి అన్యులైన జ్ఞానులు వచ్చి ఆయనకు నమస్కరించి వెళ్ళిరి. ఈ రెండు గుంపుల వారు వచ్చుటవలన ఆయన సర్వలోక రక్షకుడని కనబడుచున్నది. ఎట్లనగా ఆయన యూదులలో జన్మించెను గనుక యూదులు ఆయన స్వజనులు. తూర్పుజ్ఞానులు పరజనులు, అనగా యూదులకు పరజనులును కలిసి స్వజన సంఘము అయినది గదా! సర్వలోకమునకు వీరు ప్రతి నిధులు గదా! గనుక మొదటిలోనే క్రీస్తు జన్మవార్త ఉభయులకును తెలియబడినది.

 • 23. సంతోషకరమైన ప్రభువు యొక్క జన్మ వార్త ఒక సంతోషకరమైన జన్మవార్త , అది క్రీస్తు జన్మవార్త మరియొక సంతోషకరమైనవార్త యూదులకును అన్యులకును తెలియబడుట. తుదకు ఈ వార్త 2015 సం||ల కాలము అడ్డబడి మన యొద్దకు వచ్చినది. ఇది కూడా సంతోషకరమైన వార్తయే. ఈ వార్త పాలెస్తీనా దేశము మొదలుకొని భూమిమీదనున్న అన్ని దేశములకు వెళ్ళినది. ఇదికూడా సంతోషకరమైన వార్తయే. ఈ వార్త ఇంకను పట్టణములకు, పల్లెలకు, ప్రతి మనిషి యొద్దకు ఇంకా నడచుచున్నది. ప్రజలు అంగీకరించిన అంగీకరించక పోయినను ఇది ఇంకను ప్రకటింపబడుచున్నది. ఈ వార్త వెళ్ళిన దేశములలోను పట్టణములలోను ఈ క్రిష్ట్మస్ పండుగ చేయుచున్నారు. నేడు మనము కూడ ఈ పండుగ చేయుచున్నాము. ఈ పండుగ చేయుటకు క్రైస్తవులు డిశంబరు 25వ తేదీ ఏర్పరచుకొన్నారు గాని పాపి ఎప్పుడు మొదటిసారి ఈ వార్త విని నమ్మి అంగీకరించునో అప్పుడే అతని జీవిత కాలమునకు మొదటి క్రిష్ట్మసు పండుగయై యుండును.

 • 24. యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా ఆయన రాయబారియైన యోహాను జన్మించెను. ఈ యోహానును గూర్చి "ఆ"శిశువు ఎదిగి ఆత్మ యందు బలముపొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్యా... ..."; ఆ దినములలో అనగా యోహాను జన్మించినకాలము అని అర్ధము. యేసు జన్మము నిజమని తెలియపర్చుటకు ఇది కూడ చరిత్ర సంబంధమైన ఒక ఋజువు.

 • 25. మరియమ్మ సత్రములోనికి వెళ్ళెను గాని స్థలము దొరకలేదు. దొరికిన యెడల ఆమె సత్రములోనే ప్రసవించియుండును. ఇక ముందునకు ఈయనను లోకము అంగీకరింపదు అనుదానికి ఇది ఒక ముంగుర్తై యున్నది. ఈ లోకము సత్రము వంటిదే.

 • 26. సత్రములో స్థలములేని ఆయనకు పశువుల తొట్టెలో స్థలము దొరికినది. అనగా లౌకికులు ఆయనను అంగీకరింపకపోయినను, వినయ మనస్కులు, దైవాభిమానులు ఈయనను అంగీకరింతురు అని దానికి ముంగుర్తుగా నున్నది.

 • 27. ఆయన బట్టతో చుట్టబడుట చూడగా ఆయన ఎంత దేవుడైనను కాపుదల అవసరమైన మనుష్య మాత్రుడని దీనివల్ల తెలియుచున్నది. ఒకతల్లి ఉండుటయును, పరుండబెట్టు ఒక స్థలముండుటయును, కప్పుకొనుటకు బట్ట ఉండుటయును కేవలము మనుష్యుడే అని నమ్ముటకు వీలున్నది.

 • 28. మన నిమిత్తమై దేవుడు చిరకాలమునుంచి రక్షకుని రాకడ వాగ్ధానములు వినిపించుచు వచ్చెను. మన నిమిత్తమై ఆ రక్షకుడు జన్మమెత్తవలసి వచ్చెను. మన నిమిత్తమై ఆయన మనుష్యుడను పేరు పొందవలసి వచ్చెను, లోకరక్షకుడు అనియు మన నిమిత్తమై చేసినవాడై యున్న యెడలనే తప్ప లోక రక్షకుడై యుండ జాలడుగదా!

 • 29. శిశువు నొద్దకు ఎవరుబడితే వారు వెళ్ళవచ్చును. ఎవరు బడితే వారు ఎత్తుకొనవచ్చును. ఏమియు అనడుగదా శిశువును సమీపించుట సులువే గదా! యేసుప్రభువు అను శిశువు పెద్దవాడై సేవలో ప్రవేశించినప్పుడు - నా యొద్దకు వచ్చువానిని ఏ మాత్రము త్రోసివేయననియు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతుననియు చెప్పి - పిలిచినాడు, రానిచ్చినాడు. ఇప్పుడు కూడ ఆ పనినే చేయుచున్నాడు.

 • 30. ఆ దినములయందు లోకరక్షకుడు పుట్టెనని వ్రాయబడియున్నది. అనగా ప్రభువునకు ముందుగా జన్మించిన రాయబారియైన యోహాను దినములు అని అర్ధము. యోహాను మానవుడు గనుక ఎంత భక్తుడైనను కాలమునకు బంధింపబడియున్నాడు. లోకరక్షకుడు మనుష్యులయొక్క కాలపరిమితిలో జన్మించి నందువలన ఆయన కూడ కాలమునకు బంధింపబడి యున్నాడు. రక్షకుడు కాలమునకు బంధింపబడని దేవుడైనను మన నిమిత్తమై కాలమునకు బంధింపబడి వినయ మనస్కుడైన యోగ్యుడు గనుక దైవ రక్షకుడు. కలములేని స్థితిలో నుండి కాలముగల స్థితిలో నుండి కాలముగల స్థితిలోనికి ప్రవేశించుటవల్ల అనగా అంత వరకు తన్నుతను తగ్గించుకొనుటవల్ల విధేయుడాయెను. ఇట్టి వారు రక్షకుడు కాకపోయిన కాల బంధముగల నరులకు మరి యెవడు రక్షకుడు కాగలడు!

 • 31. సర్వలోకమును వ్రాతలోనికి వచ్చిన (రికార్డుసమయమున రక్షకుడు జన్మించెను అని వ్రాయబడియున్నది. తను ఇంకా లోకమునకు రక్షకుడుగా బయలుపడక పూర్వమే తాను రక్షించుటకు వచ్చిన సర్వలోకము అనుమాట ఆయన జన్మ వృత్తాంత సందర్భమున వ్రాయబడినది. ఇది మంచి సూచన. ఇట్టి సూచన గలవాడు రక్షకుడు గాక మరియెవడు రక్షకుడుకాగలడు.

 • 32 ప్రజల పేరులు రిజిస్టరులో వ్రాయు సమయమందు తన పేరు కూడ వ్రాయబడుటకు వీలగునట్లు సరిగా అప్పుడే జన్మించెను. ఈ రీతిగా ప్రజలపేరుతో పాటు తన పేరు కూడ సమాన పద్ధతిని వ్రాయించుకొనుటకు సమ్మతించుటవల్ల వినయ మనోవిధేయుడాయెను. ఇట్టివాడు రక్షకుడు కాకపోయిన మరి యెవడు రక్షకుడు కాగలడు.

 • 33. ఈయన అధిపతులకు, రాజులకు చక్రవర్తులకుమించిన వాడు("దేవుడు") అయినను, వారందరు ఆయన చేతి క్రింద ఉండవలసిన వారని ఎంచుకొనుటకు వీలున్నను, ఔగుస్తు అనే చక్రవర్తి యొక్క పరిపాలన క్రిందకు వచ్చివేయుటవలన అనగా అంత వినయ మనోవిధేయుడగుట వలన తన్నుతాను తగ్గించుకొనెను. ఇది ఏలాగున్నదనగా దేవుడు మనిషియెదుట చేతులు కట్టుకొని నిలువబడినట్లున్నది. తన కూలి వాని యెదుట పాలేరు మునసబుగారు చేతులు కట్టుకొని నిలువబడినట్లు ఉన్నది. ఇట్టివాడు రక్షకుడు కాకపోయిన మరెవడు కాగలరు?

 • 34. మరియమ్మ అను కన్యకను ఈయనే కలుగజేసియున్నాడు. ఆయన వల్ల సృజింపబడిన ఆమె ఆయనకు అనగా సృష్టికర్తకు తల్లియైనది. ఆయనకు అనగా సృష్టికర్త సృష్టమును తాను కలుగజేసిన కన్యకను తల్లిగా అంగీకరించెను. అంతమట్టుకు తన్నుతాను తగ్గించుకొనెను. ఇట్టి మనోవిధేయుడు కాక మరి యెవరు రక్షకుడు కాగలడు.

 • 35. మరియమ్మకు భర్త కాబోవునట్టి యోసేపునకు ప్రభువు సృష్టికర్తయే అయినను అతనిని తండ్రిగా గైకొనెను. అంతవరకు తగ్గించుకొన్న ఇట్టి మనోవిధేయుడు గాక మరియెవరు రక్షకుడు!

 • 36. దేవుడు ఒకరి వంశములోనికి రాకూడదు. జననము మరణముగల నరవంశములోనికి అసలు రాకూడదు. నిరాకారులును, పరిశుద్ధులునైన దేవదూతల యొక్క వంశములోనికి వచ్చిన అది కొంతవరకు బాగుండును గాని పూర్తిగా నరవంశములోనికే వచ్చివేసి యూదులకు పూర్వము రాజైన దావీదు వంశములోనికి వచ్చియున్నాడు. తన్నుతాను అంతగా తగ్గించుకొన్న ఇట్టివాడు రక్షకుడు కాక మరెవరు రక్షకులుకాగలరు.

 • 37. రక్షకుడు లోకవాసియనియు, నరవంశస్తుడనియు, నరపుత్రుడనియు పిలిపించుకొనుటకు సిగ్గు పడనివాడై లోకమునకు వచ్చెను. అంతవరకు తన్నుతాను తగ్గించుకొన్నవాడు కాక మరెవరు రక్షకుడు కాగలడు.

 • 38. రక్షకుడు పుట్టుటకు సత్రములో స్థలము దొరికలేదని వ్రాయబడి యున్నది. భూగోళమంతటిని కలుగజేసిన దేవ రక్షకునికి స్థలము దొరకకపోవుట బహు విడ్డూరముగా నున్నది. ఇట్లు అనేకులచేత నిరాకరింపబడుటకు ఆయన సమ్మతించి లోకమునకు వచ్చెను. అంత తగ్గించుకొన్నవాడు రక్షకుడు కాడా!

 • 39. ఆకాశ, మహాకాశములు పట్టనివాడు అయినప్పటికిని, పశువుల తొట్టిలో ఇరుకుకొని పండుకొనవలసిన గతి లోక రక్షకునికి వచ్చినది. దీనికి సమ్మతించి, అంతగా తగ్గించుకొని వచ్చెను గనుక రక్షకుడు కాడా!

 • 40. రాజ గృహములలో పుట్టిన శిశువులు ఉయ్యాల తొట్టిలో పరుండియుండగా ఈ దేవరక్షకునికి పశువుల తొట్టి ఉయ్యాలతొట్టి అయినది. దీనికి సమ్మతించి తగ్గించుకొన్న యేసు ప్రభువు రక్షకుడు కాడా!

 • 41. మహిమ మేఘములు ఆయనను ఆవరించియుండగా నరశిశువులు కప్పుకొనవలసిన పొత్తిగుడ్డలు కప్పుకొనుటకు రక్షకుడు సమ్మతించెను. ఇంత వినయ మనస్కుడు రక్షకుడు కాడా!

 • 42. పశువులతొట్టి చిన్న స్థలములో పరుండెను. ఆ స్థలమునకు బంధింపబడిన వాడయెను. దేవునికి స్థలము అక్కరలేదు. అయినను స్థలమునకు బంధింపబడి తన్నుతాను తగ్గించుకొన్నవాడు రక్షకుడు కాదా!

 • 43. దేవునిని ఎవరును ముట్టుకొనలేరు. ఎందుకనగా ఆయన అగ్నివంటివాడు మరియు నిరాకారము గలవాడు ఆకారము గల పాపి ఆయనను ముట్టుకొనలేడు అయినను ఆయన ఆకారము ధరించుకొనిన నరశిశువాయెను. గనుక అందరు భక్తులు, భక్తిహీనులు ఆయనను ముట్టుకొనవచ్చును ఆయన అనగా శిశురక్షకుడు అందరిని ముట్టుకొననిచ్చునంతగా తగ్గించుకొనెను.రక్షకుడు కాడా!

 • 44. ఎల్లప్పుడు పనిచేయువాడు, తాను సృజించిన సృష్టినంతటిని, మానవులను చూచుచున్నాడు. అట్టివాడు పశువుల తొట్టిలో విశ్రాంతిగా పరుండవలసి వచ్చెను. అంతగా ఆయన తగ్గించుకొనెను గనుక ఆయన రక్షకుడు కాడా!

 • 45. దేవుడు తాను సృజించిన సృష్టి యావత్తును మానవులైన మనలను, మనకున్న సమస్తమును కాపాడుచున్నాడు. ఆయనను కాపాడువారు ఎవరునులేరు. ఆయనకు కాపుదల అవసరము లేదు. ఆయనకు చలిగాని, సూర్యుని వేడిమిగాని తగలదు. ఆయన క్రిందపడడు. హాని కలుగదు. దేవుడనగా అట్టివాడు. ఒకరిని ఆయన కాపాడువాడు గాని, ఒకరి వలన కాపాడబడువాడు కాడు. అయితే ఈవేళ ఆ రక్షకుడు తొట్టెవలనను, పొత్తిగుడ్డల వలనను, మరియమ్మ అను తల్లి వలనను, యోసేపను తండ్రి వలనను అనగా వస్తువుల వల్లను, మనుష్యుల వల్లను కాపాడబడవలసిన వాడాయెను. అంతవరకు తగ్గించుకొన్న ఆయన రక్షకుడు కాకపోయిన మరెవడు రక్షకుడు కాగలడు.

 • 46. యేసుప్రభువు మరియమ్మకు తొలిచూలు కుమారుడని వ్రాయబడియున్నది. మరియమ్మ ఉన్న యూదజనాంగమునకు దేవుడు పూర్వము ఒక ఆజ్ఞ ఇచ్చెను. అదేమనగా ప్రతి గృహములోను పుట్టిన ప్రధమపుత్రుడు దైవసేవకు ప్రతిష్టింపబడవలెను. ఈ ఆజ్ఞకు యూదులందరు లోబడిరి. ఇప్పుడు ఈ రక్షకుడు ఎంత దేవుడైనను, మనుషుడే గనుక అందులో యూద జనాంగములో జన్మించెను గనుక వారికివ్వబడిన ఆజ్ఞ ప్రకారము రక్షకునికి జరుగవలెను. సేవలన్నిటిలో ఏ సేవ గొప్పది. శరీరమునకు అనగా మనము ఇతరుల యొక్క శరీరమునకు చేయు ఉపకారమే గొప్పదా! లేక వారి ఆత్మకుచేయు సేవగొప్పదా! శరీరమునకు సదుపాయము చేయుట అను సహాయము గొప్ప సేవయేగాని ఆత్మకు పాపము లేకుండా చేయు బోదనోపకార సేవ అంతకంటె గొప్పది ప్రజలకు ధర్మముపదేశించి వారిని దైవమార్గములయందు నడిపించునట్టి ఉపకార సేవ మహా గొప్పది. దైవభక్తి నేర్పించి అభ్యాసము చేయింపగల ఉపకార సేవకు మించిన సేవ లేదు. ఈలోకములో అవసరమైన సహాయము చేసిన గొప్ప ఉపకారసేవ అయిన మానవులు ఈ జీవితము చాలించిన తర్వాత మోక్షములో ప్రవేశింపగల సదుపాయములు నేర్పుట మరింత గొప్పసేవ. రక్షకుడు దేవుడయినను మానవ కుమారుల వలె సేవకు ప్రతిష్టింపబడుట ఆయనకు తగ్గింపు కదా! అంతగా తగ్గించుకొన్న ఆయన రక్షకుడు కాకపోయిన మరెవరు రక్షకుడు కాగలడు!

 • 47. రక్షకుడు లోకముతో సేవ చేయించుకొనుటకు రాలేదు గాని ఇతరులకు సేవ చేయుటకు వచ్చెనని గ్రంధములో వ్రాయబడి యున్నది. లోకరక్షకుడు రోగముతోనున్న వారిని బాగుచేయుటకు వచ్చెను. ఇది శరీర సేవ. ఇంతేకాకుండా మానవులకు మంచి విషయములలో మాదిరి చూపించుటకును, దైవ విషయములను తేటపరచుటకును తుదకు సర్వలోక పాప పరిహార యజ్ఞముగ తన ప్రాణమును సమర్పించుటకును లోకమునకు వచ్చెను. అట్టి సేవ మనుష్యాత్మకు అవరమైన సేవ నరులెవ్వరును నరులకు సేవ చేయలేరు. రక్షకుడు, దేవుడును, మానవుడును అయినందువల్ల శరీరసేవ, ఆత్మసేవ రెండును చేయగలడు. తొలిచూలి కుమారుడు అనగా జ్యేష్టపుత్రుడు అయినందుకు ఈ గొప్పసేవ సాగించగలడు. మరియమ్మ జ్యేష్టపుత్రుడు యూదులలోని జ్యేష్ట పుత్రులందరికంటె ఎక్కువసేవ అనగా వారెవ్వరును చేయలేని సేవ చేసినాడు. ఇట్టి సేవ చేయగలిగిన ఆయన రక్షకుడు కాడా!

 • 48. మరియమ్మ, యోసేపులు తొట్టివైపు తొంగి చూచుచున్నారు. ఏమి చూచుచున్నారు? వారికి ఏమి కనబడుచున్నది? అపూర్వమైన ఒక మర్మము కనబడుచున్నది. దేవుడు నర శిశువుగా జన్మించుటే ఆ మర్మము. కన్యకకు కుమారుడు కనుటయే ఆ మర్మము. చూచువారికి దేవుడుగా కనబడక పోవుటయే ఆ మర్మము. అవతారము ఎవరికి అర్ధము కాకపోవుటయే ఆ మర్మము. మర్మము లన్నిటికన్న ఇదే గొప్ప మర్మము. అట్టి మర్మము యెదుట వారు కూర్చున్నారు. ఎంత ధన్యులు!

 • 49. మరణములేని దేవుడు నరజన్మ మెత్తుటవలన కాలము గల వాడై, నరుల కాలములో ప్రవేశించుటవల్ల నరుల కాలమునకు వన్నె తీసికొనివచ్చెను. నరుల జీవిత కాలమును ఆయనయొక్క కాల ప్రవేశము ద్వారా సద్వినియోగ కాలముగాను, సౌఖ్యకాలముగాను మార్చగలడు. ఆయన తన జన్మము వలన విశ్వాసుల జన్మమును సార్ధక జన్మముగా మార్చగలడు.

 • 50. స్థలములేని దేవుడు స్థలములో ప్రవేశించెను. స్థలము అనగా బెత్లెహేము గ్రామములో స్థలములో ప్రవేశించెను. స్థలము అనగా బెత్లెహేము గ్రామములో స్థలము అనగా పశువుల తొట్టి అని అర్ధము. ఆయన మనము ఉండవలసిన స్థలములలో గూడ ప్రవేశించుటవలన విశ్వాసులయొక్క స్థలములు పవిత్ర స్థానములుగా మార్చబడును. మన గ్రామములలోనికి పట్టణములలోనికి, ఇండ్లలోనికి రానిచ్చిన యెడల ఆ స్థలములు పవిత్ర స్థానములగును. ఆయనకు ప్రతిష్టింపబడిన స్థలములగును. భూమిమీదకి వెయ్యేండ్ల పరిపాలన కాలము రానై యున్నది. అదంతయు మంచికాలమె. అప్పుడు ఈ భూస్థలము మహా పరిశుభ్రముగా నుండును. క్రీస్తు ప్రభువు ఆ కాలములో భూస్థలమును పరిపాలించుటను బట్టి కాల స్థలములు రెండును ఆశీర్వాదమయమై యుండును.

 • 51. రక్షకుని జన్మము ఔగుస్తు చక్రవర్తి కాలములో కలిగినందువలన ఆయన ఆ చక్రవర్తి పరిపాలనలోని మనుష్యుడాయెను. ఆయన మనుష్యుల యొక్క పరిపాలనలో నుండకూడని దేవుడైనను మన నిమిత్తము మనుష్యుడైనందుకు నరపరిపాలన పరుడాయెను. అనగా పాలితుడాయెను. గాని వెయ్యేండ్ల కాలములో యేసుప్రభువే భూలోకమంతటికి రారాజై పరిపాలించును. ఆయన పరిపాలన విశ్వాసులకు సర్వవస్తు సమృద్ధిగల పరిపాలన, శాంతి పాలన అయియుండును.

 • 52. యేసు అను పేరు ప్రజాసంఖ్యాకాలమందు మన పేరులలో చేర్చబడెను. విశ్వాసులరా, మీ పేరులకు ఆయన పేరు చేర్చిన యెడల మీ పేరులకు పేరు వచ్చును. ఆయన పేరును బట్టియే మనము జీవింతుము. మన నామములు ఆయన నామమును బట్టి జీవగ్రంధములో వ్రాయబడును.

 • 53. సర్వలోక చక్రవర్తియగు ఔగుస్తు యొక్క పరిపాలనలో ప్రజలమధ్య యేసుప్రభువు జన్మించెను. వెయ్యేండ్ల పరిపాలన రాకముందు ఉన్న కాలమంతటిలో భూలోక మంతట నివసించు విశ్వాసుల యొక్క సంఘములకు, యేసుప్రభువు చక్రవర్తియై యుండును. ఈ సంగతి విశ్వాసులకు తెలియును. ఇతరులకు తెలియదు.

 • 54. ఆయన శరీర రీతిగా పేదవాడాయెను. సర్వజనులకు కావలసినవన్నియు సృజించిన దేవుడు, మానవులకు కావలసిన సర్వవస్తు సృష్టిచేసిన దేవుడు మన నిమిత్తము పేదవాడాయెను. భూలోకమంతయు ఆయన స్థలము, సత్రముకూడ ఆయన స్థలము. సత్రములో ఆయనకు చోటు దొరికినదా! ఎంత పేదరికము! ఔగుస్తు చక్రవర్తి యొక్క బిడ్డలు, హేరోదు రాజు యొక్క బిడ్డలు, హేరోదు రాజు యొక్క బిడ్డలు, శృంగారమైన ఉయ్యాల తొట్టిలో పరుండి ఊగుచుండగా సర్వసృష్టి కర్తకు పశువుల తొట్టి గతి ఆయెను ఎంత పేదరికము!

 • 55. అయితే ఈ శిశువు వెయ్యేండ్ల పాలనలో అందరికిని సమృద్ధి కలుగునట్లు భూమిని అనగా శపింపబడిన భూమిని ఆశీర్వాద భూమిగా మార్చును. ఆ కాలము రాకముందు ఉన్న ఈ కాలములో విశ్వాసుల సంఘమునకు ఏ కొదువయు లేకుండ చేసి "యెహోవా నాకాపరి నాకు లేమి కలుగదు" అను పాట పాడించు చున్నారు. క్రిష్ట్మసు దినమున పిల్లలకు మంచి బహుమానము లిచ్చుట ఆ సమృద్ధిని సూచించును. అయితే విశ్వాసికి అనుదినము బహుమానములే, అనుదినము క్రిష్ట్మసే.

 • 56. శిశువు పొత్తిగుడ్డలు ధరించెనని వ్రాయబడియున్నది. ఔను వెయ్యేండ్ల పాలనలో ఎవరికిని బట్టలు కొదువయుండదు. విశ్వాసులకు ఇప్పుడు నీతి వస్త్రములకు కొదువ ఉండదు.

 • 57. యేసు ప్రభువు మరియమ్మకు జ్యేష్టపుత్రుడు. ఆయన సర్వలోక జనుల యొక్క రక్షణార్ధమై సమర్పణయైన జ్యేష్టపుత్రుడు జ్యేష్టుల సంఘము పరలోకమున ఉన్నది. మనము అక్కడికి పిలువబడి యున్నాము. మరియమ్మ యొక్క జ్యేష్టపుత్రునివల్ల మనము దేవునికి జ్యేష్ట పుత్రులము కాగలము. ఇట్టి గొప్ప భాగ్యము ఈ శిశువువల్ల మనకు దొరుకును.

 • 58. యేసు ప్రభువు పాపము లేనివాడుగా జన్మించెను. ఆయన "వలన మనకు పునర్జన్మ కలుగును. ఒక కాలము వచ్చును. ఆ కాలమందు మనము పాపము చేయలేని స్థితిని కల్గియుందుము. ఈ స్థితిని గురించి బైబిలులో ఇట్లు వ్రాయబడియున్నది. "దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజమై నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగ పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు".

ఈ క్రిష్ట్మస్ పలుకులు చదువరులైన మీకు జ్ఞానోదయము కలుగజేయును గాక!

Home


క్రిస్మస్ మహోత్సవాచరణ


ఆ వాక్యము శరీరధారియై కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను." యోహాను 1:14


 • 1. దేవుడెందుచేత మనుష్యుడాయెను? తానుకలుగజేసిన మనుష్యుల సంతతివార్కి కనబడవలెనని

 • 2. దేవుడెందుకు నరుడాయెను? నరుని తనస్వరూపమందు సృజించెను గనుక అట్టివారిని, నరరూపములో చూచుటకు

 • 3. దేవుడెందు నిమిత్తమై మానవుడాయెను? తన రూపము చెడగొట్టుకొన్న మానవులకు తన నిజ స్వరూపము ప్రత్యక్ష పర్చుటకు

 • 4. యే పనులుండబట్టి దేవుడు మనుజుడాయెను? మనుజులకు తాను స్వయముగా చేయవలసిన పనులన్నియు చేసి చూపించుటకు

 • 5. దేవుడు తనలోని ఏ కారణమునుబట్టి శరీరధారియాయెను? కేవలము ప్రేమ కారణమును బట్టియె.

 • 6. దేవుడేవుల యేసుక్రీస్తుగా వెల్లడిలోనికి వచ్చెను? తన ప్రవర్తనను అందరు గుర్తించటకు.

 • 7. ప్రేమగల దేవుని ప్రేమను లోకులు తెలిసికొనుటకు క్రీస్తే ముఖ్య కార్యము చేయవచ్చెను? సిలువమీద తన ప్రాణము సమర్పించు కార్యము చేయుటకు.

 • 8. సర్వశక్తిగల దేవుని ప్రజలు గ్రహించుటకై క్రీస్తే కార్యము చేయ వచ్చెను? చనిపోయి బ్రతికివచ్చుకార్యము చేయవచ్చెను? సాతానును, పాపమునకు, పాప ఫలితమును జయించిన జయము దీనిలోని కనబడుచున్నది.

 • 9. దేవుడు ఏ కడవరిపని చేయుటకై వచ్చెను? భూలోక వాసులను పరలోక వాసులనుగా సిద్ధపర్చి తీసికొని వెళ్ళుటకు (ఇది ఆరోహణ చరిత్రలో కనబడుచున్నది.)

 • 10. దేవుడు ఎవరి కొరకు పుట్టినాడు? మీకొరకు రక్షకుడు పుట్టి యున్నాడని యూదులకు వార్త అందుటనుబట్టి చూడగా యూదులకొరకె అన్నట్టున్నది. గాని ఆయన అందరికొరకు అని తరువాత చరిత్రవల్ల తెలియుచున్నది.

 • 11. ఆయన నీకొరకు జన్మించెననునది నేటి క్రిస్మస్ ముఖ్య వార్త 12. ఆయన జీవిత చరిత్ర నీ కొరకు.

 • 13. క్రీస్తు జన్మ చరిత్రధ్యానమును దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్ళిన గొల్లల అంతస్థు మీకు కలుగుగాక!


Home


క్రిష్ట్మస్ కేంద్రము

లూకా 2:1-20; మీకా 5:2; యెషయా 9:6: 7:14; మత్తయి 2:11; గలతీ 4:4"ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించెను" ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు మహిమ ప్రకాశించెను. అది రాత్రివేళ, బేత్లేములోనున్న వారికి ఆరాత్రి ఉన్నది. అది సృష్టిలోనున్న రాత్రి. లోకములోనున్న వారందరికి ఆ రాత్రి ఉన్నది. అయితే బేత్లెహేములోనున్న ఆరాత్రికిని, ఇతర స్థలములలోనున్న రాత్రికిని తేడా యున్నది. లోకములోనున్న రాత్రి బెత్లెహేములోనున్న రాత్రిని గ్రహించలేని రాత్రి. ఆ చీకటి రాత్రి ప్రభువుజన్మించుటవలన వెలుగు కలిగెను, గనుక అది ప్రత్యేకమైన రాత్రి, యెషయా 9:2లో "చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచున్నారు. మరణఛ్చాయ గల దేశ నివాసులమీద వెలుగు ప్రకాశించును." అని గలదు. ప్రభువు పెద్దవాడై గలిలైయ ప్రాంతములలో తిరిగి పనిచేసినప్పుడు ఈవాక్యము నెరవేరెను. ఆ ప్రాంతములవారిమీద రక్షకుని వెలుగు ప్రకాశించినది. గొల్లలు, జ్ఞానులు ప్రభువు మహిమను చూచియున్నారు. ఆనందించి యున్నారు. మనకును క్రిస్ట్మస్ ఆనందమును, ఆయన మహిమనుచూచు భాగ్యమును లభించును గాక!

క్రిష్ట్మస్ మహోత్సవ వాస్తవ్యులారా! క్రిష్ట్మస్ మహోత్సవ దృష్టిగలవారలారా ! క్రిష్ట్మస్ మహోత్సవ వర్తమానము కొరకు కూర్చున్నవారలారా ! క్రిష్ట్మస్ సందేశము మీకందరికిని అందును గాక. తన కుమారుని పంపిన తండ్రికి స్తోత్రములు కలుగును గాక! పాపపు జనులమధ్యకు ఒడబడివచ్చిన కుమారునికి వందనము గలుగును గాక! ఈ విషయము గ్రంధములో వ్రాయించి మనకొరకు దాచి ఉంచిన పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతులు కలుగును గాక!

ఈ దినము ప్రభువు జన్మించిన వర్తమానమునుబట్టి మాసమునుబట్టి కాదు, లేక దినమునుబట్టి కాదు. ఆయన జన్మించిన రాత్రినిబట్టికాదు. ఆయన కన్యకయందు జన్మించిన కన్యకను బట్టికాదు. ఆయన జన్మించిన బేత్లేహేము పట్టణమును బట్టికాదు. ఆయన పరుండియున్న తొట్టినిబట్టినిబట్టి కాదు. మరి దేనిని బట్టి క్రిష్ట్మసు పండుగ? క్రీస్తు ప్రభువు జన్మించిన జన్మమునుబట్టి గాని మరి దేనిని బట్టి కాదు. ఎందుకు పండుగనగా దేవుడు దేవుడే, క్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదికి వచ్చుటను బట్టి పండుగ చేయవలెను. ఆయననుబట్టి చేసినదే నిజమైన క్రిష్ట్మసు. క్రీస్తు పుట్టినది మనకొరకని కాదుగాని నాకొరకు ప్రభువు పుట్టినాడని తలంచినవారై పండుగ చేసిన అది నిజమైన పండుగ. క్రిష్ట్మస్ తొట్టిలో ప్రభువు పండుకొన్నాడు. ఆ తొట్టినిబట్టినిబట్టి కాక ఆ తొట్టిలోని బాలుని బట్టి పండుగ చేసిన అదే నిజమైన క్రిష్ట్మస్. "హృదయమను తొట్టిలో - నేయుండుమని మొఱ్ఱ - బెట్టుకోమొఱ్ఱ బెట్టుకో మనకు - ముదమిచ్చి బ్రోచెడి - ముద్దుబాలకుని పట్టుకో -ముద్దుబెట్టుకో," పై కారణము లన్నియు వేరు! ఇప్పుడు చెప్పబోవు కారణములన్నియు వేరు. గొల్లలు ప్రభువును దర్శించినారు గనుక పండుగ చేసికొన్నారు. గొల్లలు చేసినారు గనుక మనమును పండుగ చేయుదమని చేసినయెడల అది నిజమైన పండుగకాదు. జ్ఞానులు కానుకలనిచ్చినారు గనుక మనమును ఇవ్వవలెనని కానుక లిచ్చినయెడల అది నామకార్ధ క్రిష్ట్మసు గాని నిజమైన క్రిష్ట్మసుకాదు. పూర్వకాలము అన్న సుమెయోను మొ|| వారు పండుగ ఆచరించిరి. అటువలె మనముకూడ ఆచరించెద మనుకొనిన యెడల అది నిజమైన పండుగ కాదు. ఆలాగు చేసిన అది మనస్వంత క్రిష్ట్మసు కాదు. అన్ని దేశములలో ప్రతి సంవత్సరము, డిశంబరు 25వ తేదీ క్రిష్ట్మసు చేయుదురు. కాబట్టి నేనును చేయుదుననుట క్రిష్ట్మసు పండుగ చేయుటకాదు. స్వంత క్రిష్ట్మసు చేయుటకు వెళ్ళువారినిచూచి అదిగో వారు క్రిష్ట్మసు చేయుటకు వెళ్ళుచున్నారు. మనముకూడ వెళ్ళుదము అని చేసిన అది క్రిష్ట్మసు యేలాగగును? మన దృష్టివాటిని, వాటిని, వారిని, వారినిచూచి చేసిన అది పండుగకాదు. మనకు కన్నులున్న యెడల జన్మించిన బాలుని చూచిన యెడల అదే నిజమైన క్రిష్ట్మసు అగును. ఈ పండుగ దినములలో బహుమతులు అందుకొందురు. అది మంచిదేగాని మన దృష్టి బహుమతులమీద నున్నయెడల అది క్రిష్ట్మసు కానేకాదు. పరలోక మందున్న ఆ తండ్రి ఈ కుమారుని మనకు బహుమతిగా నిచ్చినాడు గనుక ఈ బహుమతిని చూచిన యెడల అదే నిజమైన క్రిష్ట్మసు. ఈ కాలములో ప్రజంటు అందుకొందురు. మనకన్ను ఆ ప్రజంట్లు పైనున్న యెడల అది పండుగ కాదుగని ఈపాడు భూలోక మంతటికిని తన కుమారుని ప్రజంటు చేసిన విషయమే తలంచవలెను. అన్నిటికి మధ్య స్థానమందున్న బాలుని జన్మ ధ్యానము కలిగియున్న అదే నిజమైన పండుగ.

ఇప్పుడు పాలస్తీనా దేశములోనున్న యెరూషలేము పట్టణమునకు నాలుగుమైళ్ళ దూరములోనున్న బెత్లెహేమను ఊరికివెళ్ళి చూచినయెడల క్రిష్ట్మసును ఆచరించు ప్రజలు లక్షలకొలది ఉంటారు. అక్కడమంచి రోడ్లువేసియున్నారు. ఆ కాలములో పట్టణములోను సత్రములోను, రోడ్డుమీద స్థలములేనట్టు ఇప్పుడును స్థలము ఉండదు. యేసుప్రభువు జన్మము నాకని ఎవరు మురియు చుందురో అన్న, సుమెయోను, గొల్లలు, తూర్పు జ్ఞానులవలె ఎవరు సంతోషించుదురో వారే నిజమైన క్రిష్ట్మసు ఆచరింపగలరు. భక్తులు చేయుచున్న అంతరంగ క్రిస్ట్మస్ ఎవరుచేయుదురో వారి క్రిష్ట్మస్ తండ్రి అంగీకరించెదరు. ఈ దినము రేపు (24,25 తేదీలు) అట్టి క్రిష్ట్మసు చేయుదురు గాక!

Home


క్రీస్తు జన్మ చరిత్ర (క్రిష్ట్మస్)


(ఈ పత్రిక క్రైస్తవేతరులకు)


బైబిలులో ఉన్నది ఉన్నట్టు ప్రచురించుచుచున్నాము, గాని షరాలో స్వాభిప్రాయమును కొద్దిగ చేర్చుచున్నాము

(ఒక మతమునుగాని, ఒక మనుష్యునిగాని దూషింపరాదు. సలహాలీయవచ్చును.)

 • 1. క్రీస్తు అవతారము అనాది యోచనయైయున్నది: ఎఫెసీ 1:3-6. "ఎట్లనగా తనప్రియునియందు తాను ఉచితముగా మన కనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తనకోసము నిర్ణయించుకొని మనము తనయెదుట పరిశుద్ధులమును, నిర్ధోషులమునై యుండవలెనని జగత్తు పునాదివేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను యేర్పచుకొనెను."

  షరా: ఒక భక్తుడు చెప్పుచున్నట్లు, దేవుని మొదటితలంపు క్రీస్తుయొక్క అవతారము. అనగా జన్మ విషయము.

 • 2. అనాదియోచన బైలుపడిన ఆది ప్రవచనము:ఆది 3:15. "మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీదకొట్టును. నీవు దాని మడిమిమీద కొట్టుదువు" అని దేవుడు సర్ప వేషము ధరించియున్న పాపకారకుడగు సైతానుతో చెప్పెను.

  షరా: దీనిలో "స్త్రీ సంతానమునకు" అను మాట గుర్తించండి. మొదటి పురుషుడగు ఆదామును భార్యయైన స్త్రీ వరుసలోనికి అనేకవందల ఏండ్లకు వచ్చిన కన్యకయగు మరియమ్మ గర్భమందు క్రీస్తు జన్మించెనుగదా! ఇక్కడ క్రీస్తు జన్మ సూచన కనబడుచున్నది. అనాది విషయము ఈ ఆదివిషయములోనికి వచ్చినది. ఆదియందు వాక్యముండెను; సమస్తమును ఆయనమూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. యోహాను 1:1,2; ఆవాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను 1:14. క్రీస్తునకు వాక్యము అను బిరుదు గలదనియు ఆయన దేవుడనియు ఆయన మనుష్యావతార మెత్తెననియు ఈ రెండు వేదవచనములలో నున్నవి. ఇవి క్రీస్తు జన్మసూచనలు, క్రీస్తు సమస్తమును కలుగజేసెను అని వ్రాయబడినది. సమస్తములో మన హిందూదేశము కూడ ఉన్నది. కనుక క్రీస్తుమతము మనదేశములో స్థావరముగ ఉండవలసిన మతమని గ్రహించుకొనవలెను.

 • 3. "ఆదిదంపతులకు అందిన ఆ ఆది ప్రవచన వాగ్ధానము నోవహునకు దేవుడు అందించుట": ఆది 9:8-10. "మరియు దేవుడు నోవహును అతని కుమారులనుచూచి-ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోను మీతోకూడనున్న ప్రతిజీవితోను, పక్షులేమి, పశువులేమి, మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికివచ్చిన సమస్తభూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.

  షరా : ప్రవచనము నిబంధన ఈరెండును నమ్మగలవారికి దీవెనలుకూడ అయియున్నవి. క్రీస్తువలన లోకమంతటికిని దీవెన కలుగును. నిబంధనలో యిద్దరు ఉండవలెను. ఒకరు వినిపించువారు, ఒకరు వినువారు; నమ్మువారు. ఇక్కడ నిబంధన వినిపించిన వ్యక్తి దేవుడు; విన్న వ్యక్తి నోవహు. నోవహు అంగీకరించెను. ప్రతి నిబంధనలో ప్రతి ప్రవచనములో ప్రతి దీవెనలో క్రీస్తుజన్మమును గూర్చిన ప్రమేయము కూడ అంతరార్ధమున గలదు.

 • 4. ఆ నిబంధనాశీర్వచనము షేమునకు దేవుడు నోవహు ద్వారా అందించుట:- ఆది 9:26. "షేము దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక".

  షరా:- షేము నోవహు కుమారుడు. దేవుడు వందింపబడుటకు కార నము క్రీస్తు అవతారము. ఆయన మొదటి స్త్రీ సంతానములో నుండియు నోవహు సంతానములో నుండియు షేము సంతానములో నుండియు వచ్చి లోకమునకు ప్రత్యక్షము కావలసినయున్నది. ఇక్కడ కూడ క్రీస్తుజన్మ సూచనగలదు.

 • 5. ఆ ముగ్గురికి అందిన దీవెన అబ్రహామునకు అందుట: ఆది 12:3 :- "భూమి యొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును" అని దేవుడు అబ్రహాముతో చెప్పెను.

  షరా:- ఆ దీవెన భూగోళమంతటికి సంబంధించుచుచున్నది. క్రీస్తు చరిత్ర యిప్పుడు భూమి మీది అన్ని వంశములకు అందినది. క్రీస్తు అబ్రహాము సంతతిలో పుట్టెను. (మత్తయి 1:1) ఇక్కడకూడ క్రీస్తు జన్మ సూచనగలదు. క్రీస్తువలన అందరికి ఆశీర్వాదము కలుగును. క్రీస్తుమతము వలన దీవెనేగాని హానిలేదు.

 • 6. ఆ దీవెన అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు అందుట:- ఆది 26:4,5. అప్పుడు (యెహోవా దేవుడు) ఇస్సాకునకు ప్రత్యక్షమై - నీకును, నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశనక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు యిచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నామాటవిని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

  షరా:- అబ్రహామునకు అందిన దీవెన ఇస్సాకునకు అందినది. దీనిలోకూడ క్రీస్తువలన అందరికి దీవెన అందునని ప్రవచింపబడెను. కనుక యిది క్రీస్తుజన్మమునుకూడ స్ఫురింపజేయుచున్నది.

 • 7. ఇస్సాకునకు అందిన దీవెన ఆయన కుమారుడగు యాకోబునకు అందుట:- ఆది 28:13,14. "యెహోవా (దేవుడు) యాకోబుతో యిట్లనెను-నేను నీతండ్రియైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవా (దేవుడు)ను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద (లెక్కకు) ఇసుకరేణువులవలె నగును; నీవు పడమటితట్టును, తూర్పుతట్టును, ఉత్తరపుతట్టును వ్యాపించెదవు; భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును".

  షరా:- అబ్రహాము దీవెనలోలేని భూగోళస్థలములు దీనిలో ఉన్నవి. భూలోకవంశములు ఆశీర్వదింపబడునని అబ్రహాము దీవెనలో నున్నమాటలు యిక్కడకూడనున్నవి. క్రీస్తువిషయములు అన్ని స్థలములలో వ్యాపించును. ఆయన పుట్టనిదే యెట్లు వ్యాపించును? కనుక దీనిలో క్రీస్తుజన్మముకూడ తలంపునకు వచ్చుచున్నది.

 • 8. యాకోబునకు పుత్రుడైన యూదాకు ఆ దీవెన అందుట:- యూదా కొదమసిం హాము ఆది 49:9; అతనికాళ్ళ మధ్యనుండి రాజదండముతొలగదు. ఆది 49:10; ఆ గ్రంధము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు- ఏడవకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపుసిం హము ఏడుముద్రలును తీసి ఆగ్రంధమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను. ప్రకటన 5:4,5

  షరా:- క్రీస్తునకు యూదాగోత్రపు సిం హమును బిరుదుగలదు. సిం హము అడవిజంతువులన్నిటిలో గొప్పది. అలాగే రక్షకులని అనుకొన్న వారందరిలో క్రీస్తే గొప్పవాడు.

  షరా:- యూదాకు రాజదండముగలదు. దండములన్నిటిలో రాజదండమే గొప్పది. అలాగే పారమర్ధికవిషయములో క్రీస్తుయొక్క శాంతిపాలన గొప్పది. ప్రకటన 20:4; లూకా 1:33. "ఆయన రాజ్యము అంతములేనిదై యుండును."

 • 9. దావీదునకు ఆ దీవెనయే అందుట:- లూకా 1:32,మత్తయి1:1.

  షరా: ఈ వచనములలో క్రీస్తుప్రభువు దావీదుయొక్క వంశము ననుసరించి కుమారుడాయెనని సృష్టమగుచున్నది. దావీదువంశములో ఆయన పుట్టవలసిపుట్టవలసియున్నందున ఆ దీవెన అందెను.

 • 10. ఆ దీవెన మరియకు వచ్చెను. క్రీస్తు ఆమెయందు జన్మించుటవలన ఆ దీవెన నెరవేరెను: లూకా 2:4-7:- " యోసేపు దావీదువంశములోను గోత్రములోను పుట్టినవాడుగనుక తనకు భార్యగా ప్రధానముచేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని బేత్లేహమనబడిన దావీదు ఊరికి ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారునికని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలములేనందున ఆయనను పశువులతొట్టిలో పరుండబెట్టెను"; గలతీ 4:5, "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీ యందు పుట్టి, మనము స్వీకృతపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను "; ఫిలిప్పీ 2:5-7:"క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను".

 • 11. ఆ దీవెన నమ్మగలుగు వారందరికి అందును: యెషయా 9:6. "మనకొరకు శిశువుపుట్టెను". లూకా 2:, "నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు".

  షరా: యేసుక్రీస్తుప్రభువు మేఘాసీనుడైన కనబడి భూమిమీదనున్న భక్తులను తన ప్రభావమువలన ఆకర్షించుకొని మోక్షమునకు తీసికొనిపోవును. వారికి చావులేదు. ఒక రెప్పపాటులో వారికి మహిమశరీరము కలుగును. ఇది గురుతులు అయిన తరువాత జరుగును అని బైబిలులోనున్నది. ఆ గురుతులు నేడు అయిపోయినట్టే; కనుక ఆయన రెండవసారివచ్చుట మిగుల సమీపములో నున్నది. కనుక దైవధ్యానమువలన ఆరోహణ మగుటకు సిద్ధపడండి. క్రీస్తుప్రభువు ఆయా దేశములలో కొందరికి దర్శనమిచ్చి "త్వరగా వచ్చుచున్నాడు" అని చెప్పుచున్నావు" అని చెప్పుచున్నారు. మీరుకూడ ఆయనను అడగండి.

  షరా: ఏ మతస్థులైనను సరే ప్రతిదినము అధమపక్షము ఒక గంటయైనను దైవధ్యానములో ఉన్నయెడల కీడంతయు తొలగి మేలంతయు కలిగి మహాధన్యులగుదురు. ఎన్ని పనులున్నను ధాన్యములోనుండుపనిచేసుకొనుట అంతకష్టముకాదు; ప్రయత్నించండి.

 • 12.క్రీస్తునకు గల నామధేయములు:

  నామధేయము వాక్యభాగము
  మెస్సీయ (యోహాను 4:25)
  ఇమ్మానుయేలు (యెషయా 7:14)
  యేసు (లూకా 1:31)
  యేసుక్రీస్తు (1కొరింథీ 1:1)
  క్రీస్తుయేసు (కొరింథీ 1:1)
  క్రీస్తు (లూకా 2:11)

  క్రీస్తుకు గల బిరుదులు:
  నామధేయము వాక్యభాగము
  అబ్రహాము కుమారుడు (మత్తయి 1:1)
  దావీదు కుమారుడు (మత్తయి 1:1)
  మరియమ్మ కుమారుడు (లూకా 2:7)
  యోసేపుకుమారుడు (మత్తయి 1:21)
  మనుష్యకుమారుడు (మార్కు10:45)
  కుమారుడు (యెషయా9:6)
  దావీదు చిగురు (ప్రకటన 5:5)
  యుదా గోత్రపు సింహము (ప్రకటన 5:5)
  దేవుని గొర్రెపిల్ల (యోహాను 1:29)
  వాక్యము (యోహాను 1:1)
  వెలుగు (యోహాను 1:4)
  సత్యము (యోహాను 14:6)
  జీవము (యోహాను 14:6)
  మార్గము (యోహాను 14:6)
  పునర్థానము (యోహాను11:25)
  వేకువచుక్క (ప్రకటన 22:16)
  కడపటి ఆదాము (1కొరింథి 15:45)
  రెండవమనుష్యుడు (1కొరింథి 15:47)
  యూదులరాజు (మత్తయి 2:2)
  తండ్రి (యెషయా 9:6)
  ఆశ్చర్యకరుడు (యెషయా 9:6)
  రక్షకుడు (లూకా 2:11)
  రిక్తుడు (ఫిలిప్పి 2:7)
  దాసరూపి (ఫిలిప్పి 2:7)
  దేవస్వరూపి (ఫిలిప్పీ 2:6)
  నమ్మకమైనసాక్షి ( ప్రకటన 1:5)
  భూపతులకు అధిపతి (ప్రకటన 1:5)
  విమోచకుడు (ప్తకటన1:6)
  పరిచారకుడు (మార్కు10:45)
  ప్రభువు (లూకా 2:11)
  సేవకుడు (మత్తయి 12:18)
  ఉత్తరవాది (1యోహాను 2:1)
  పరలోకమందును, భూమిమీఅను సర్వాధికారముగలవాడు. (మత్తయి 28:18)
  మరణముయొక్కయు, మృతుల లోకముయొక్కయు తాళపుచెవులుగలవాడు. (ఫ్రకటన 1:18)
  నిత్యము జీవించువాడు (ప్రకటన 1:18)
  అన్ని కాలములలో నున్నవాడు (ప్రకటన 1:8)

షరా: క్రొత్తగా క్రిష్ట్మస్ సంతోషమును క్రొత్తగా క్రొత్తసంవత్సర సంతోషమును మీకందరకు కలుగును గాక! సృష్టికర్తయైన దేవుడు మనతండ్రి, అందరిని అక్కరలకొలదీ దీవించును గాక!


Home


జ్ఞానుల క్రిష్ట్మస్


మత్తయి 2:1-12


క్రిష్ట్మస్ సమయమున గొల్లలు, దేవదూతలు, తూర్పుజ్ఞానులు యేసుబాలుని ఆరాధించిరి. తూర్పుజ్ఞానుల విషయము జ్ఞాపకము చేసికొందము.

 • 1. నక్షత్రము ఆకాశమున కనబడకముందు వ్రాయబడిన ప్రవచనము
 • 2. చుక్క కనబడుట
 • 3. ఆ చుక్క చేత నడిపింపబడగా జ్ఞానులు యేసుప్రభువును చూచుటకు నడచి వెళ్ళుట
 • 4. యేసుప్రభువు గూర్చి మీకా గ్రంధములో వ్రాయబడిన ప్రవచనము
 • 5. తరువాత వారు బాలుని చూచి అత్యానందభరితులగుట
 • 6. శిశువును దర్శించుట
 • 7.సాష్టాంగపడుట
 • 8. పూజించుట
 • 9. కానుకలర్పించుట
 • 10. దైవ ప్రత్యక్షత అనుభవించుట.

ఈ పదిభాగములు చెప్పుట కష్టము. జ్ఞాపకము చేయుచున్నాను. ఈ కథ కాంతిగా కనబడుచున్నది. ఈ కాంతిలో పది అంశములున్నవి. వారు ప్రభువును ఇంటిలో ఆరాధించిరి.

యేసు ప్రభువు జన్మించకముందు కొన్ని ఏండ్ల క్రిందట పర్షియాలోని గొప్ప అనుభవశాలి తన శిష్యులకు ఇట్లుచెప్పెను. పరిశుద్ధకన్యక కుమారుని కనును. అప్పుడు గొప్పచుక్క ఆకాశములో పుట్టును. ఆ చుక్క మొదట మీకే కంపించును. గనుక మీరు మొదట వెళ్ళి కానుకలర్పించుడని చెప్పెను. ఆవిధముగానే పర్షియాలో గొప్పనక్షత్రము పుట్టగానే చరిత్ర చదివి వారు వెళ్ళి బాలునిచూచి కానుకలర్పించిరి. ఇది బైబిలులో లేదుగాని లోకచరిత్రలో నున్నది. బైబిలుకు సరిపోయిన చరిత్ర గనుక నేను ఎత్తుకున్నాను. వారు నక్షత్రము నడిపించిన మార్గమున వెళ్ళిరి. వారు యెరూషలేములో రాజుగారూండు దర్భారులో ప్రవేశించి అడిగిరి. గాని వారు తెలియదని చెప్పిరి. వారు ధర్మశాస్త్రము తెలిసిన పండితులే. మీకావ్రాసిన ప్రవచన వాక్యములున్నకట్ట వారిచేతిలో నున్నవారే. అప్పటికి క్రొత్తనిబంధన రాలేదు. వారు బెత్లెహేమునకు 4 మైళ్ళు దూరములోనేయున్నారుగాని క్రీస్తుపుట్టినవార్త వారికి తెలియదు. గ్రంధములో చదివి జ్ఞానులకు చెప్పిరి. బెత్లెహేములో పుట్టినచుక్క రెండవసారి ధర్మశాస్త్రములో పుట్టినది. జ్ఞానులు ఆయనను పూజించుటకు వచ్చితిమని చెప్పిరి. మనముకూడా దేవాలయములో పూజచేయుటకు వచ్చినాము. వారిని చుక్క నడిపెను. మనలను మనలోనున్న ఆశ: బైబిలు జ్ఞానమను చుక్క నడిపించుకొని వచ్చెను. వారు అత్యానందభరితులైనట్లు మనమును ఆనందముతో నిండుకొనవలెను. వారు యేసుబాలుని తొట్టిలో కాదు. ఇంటిలోచూచిరి. వారెంత సంతోషించిరో మత్తయి వ్రాయలేదు గాని అత్యానందభరితులైరని వ్రాసెను. దానివలన వారి సంతోషమెట్టిదో గ్రహించుకొనవలెను.

 • 1. సాష్టాంగ పడుట వలన సంతోషము
 • 2. దర్శించుటవలన సంతోషము
 • 3. కానుకలిచ్చుటవలన సంతోషము.
మనము దేవాలయమునకు వచ్చినది నక్షత్రమువలన సంతోషము కాదు. హేరోదు ఇంటిలో వినబడినది దైవవాక్యము. మనము వాక్యము విని ప్రేరేపింపబడి జ్ఞానులవలె ఆయత్తపడి వచ్చియున్నాము. వారు యేసుప్రభువును చూచిరి. మనమును దేవాలయములో ఎవరిని చూడవలెను, పూజించవలెను. ఆరాధించవలెను. ప్రభువునే చూడాలి. పూజించాలి. ఆరాధించవలెను. అదే మన సంతోషము. అట్టి స్థితి ప్రభువు కృపవలన మనకు కలుగునుగాక!

వారు జ్యొతిష్యులు, పండితులు, జమీందారులు, గొప్పవారు అయినను ఆ చిన్న బాలుని యెదుట సాగిలబడిరి. చిన్న బాలుని యెదుట గొప్పవారైన పెద్దలు సాగిలపడుదురా! రాజసింహాసనము మీద నున్నప్పుడు సాగిలపడవచ్చును. వారికి యూదుల రాజని తెలిసినది గాన రాజు గనుక పూజించి సాగిలపడుట న్యాయమే. మనలో కొందరు ఏకాంగులు గలరు. అనగా కుటుంబము లేనివారు. వారు దినదినము ఆరాధన చేయుదురు. ఆరాధనచేస్తారు ఈ ఆరాధనలో ఏకాంగులు, కుటుంభికులు కూడా నున్నారు. జ్ఞానులు ఏకాంగులా, కుటుంభికులా? వారు . ఏకాంగులంటారు. వారు ఎందరు వచ్చినది మనకు తెలియదు. మత్తయి జ్ఞానులని మాత్రము వ్రాసెను. కుటుంభికులుకూడా వారి యొక్క ప్రయాణము, పూజ, కానుకలు ఈ సర్దాలోపడి మత్తయి వారెందరయినది వ్రాయలేదు. కాని కానుకలనుబట్టి ముగ్గురన్నట్టున్నది. బంగారము, భోళము, సాంబ్రాణి వీటినిబట్టి ముగ్గురనుకున్నారు. యేమైతేనేమి ముగ్గురు గొప్పవారు. ముగ్గురు జ్యోతిష్కులు. ముగ్గురు జమీందారులని చెప్పుచున్నారు. వారు అరణ్యములనుదాటి కౄర మృగములను దాటి రావలెను. గాన వారు సేవకులతో వచ్చియుండవలెను. గాని జ్ఞానులసంగతే మనము తెలిసికొన్నాము. వారు సాగిలపడి పూజించిరని తెలిసికొన్నాము. వారు అత్యానందముతో హృదయము నింపుకొని కానుకలను తెచ్చిరి. మనము ఆరాధనలో ఆరాధించుట మాత్రమేగాక. ఆరాధనలో కానుకలిచ్చుట కూడ ఒక ముఖ్యభాగము. గనుక క్రిష్ట్మస్ ఆరాధనలో అత్యానందముతో మన హృదయము నింపుకొని కానుకలు వేయవలెను. తర్వాత దేవుడు వారితో మీరు వేరేదారిన వెళ్ళండి అని చెప్పెను. అన్యదేశములలోని వారు దేవుడు మాట్లాడుట ఎరుగరు. ఇదే మొదటి పర్యాయము. వారికి చాల పనులున్నను కట్టిపెట్టి ప్రభువును ఆరాధించుటకు వచ్చిరి. మనమును మన పనులన్ని కట్టిపెట్టి ప్రభువు ఆరాధనకు వచ్చుట సవ్యముగా నున్నది. ఆరాధనలోనేకాదు ఇంటిదగ్గర దినమంతయు ఎక్కువ వాక్యము చదువుట, పాడుట, స్తుతించుట, ధ్యానించుట ఎక్కువగా నుండవలెను. ఎక్కువగా పనులు కల్పించుకొనక, లోకసంభాషణలోనికి, లోకచింతలలోనికి దిగక ప్రభువునే ఆరాధించవలెను. పరలోక పరిశుద్ధులు నిత్యారాధనలో నున్నారు. సంఘము ఎత్తబడినప్పుడు ఇక్కడున్న వారిలో ఎందరు తగ్గెదరో! ఎత్తబడువారందరు నిత్యారాధనలో పాల్గొందురు గాన అట్టివారు లోకములో పనులు కల్పించుకొనకూడదు.

Home


బెత్లెహేము నక్షత్రము

వాక్యము: యెషయా 9:6:లూకా 2:1-13.

ఈ దినము క్రైస్తవుల క్రిష్ట్మస్, వచ్చే ఆదివారము అన్యుల క్రిష్ట్మసు. క్రైస్తవుల క్రిష్ట్మసునకు జనాభా చాలమంది యున్నారు. అయితే అన్యుల క్రిష్ట్మస్ నకు జనాభాచాల తక్కువ, గనుక ఈభూమిమీద రెండు క్రిష్ట్మస్ పండుగలు గలవు. మొదటి క్రిష్ట్మస్ యూదులకు చెందినది, రెండవ క్రిష్ట్మస్ జ్ఞానులకు చెందినది. అదే అన్యుల క్రిష్ట్మస్.

ఒక లెక్కకు రెండు క్రిష్ట్మసులు మరియొక లెక్కకు మూడు క్రిష్ట్మసులు.

 • 1. యూదుల క్రిష్ట్మస్
 • 2. అన్యుల క్రిష్ట్మస్
 • 3. క్రైస్తవుల క్రిష్ట్మస్.
 • పరలోకమునుండి దేవదూతలు భూలోకమునకు వచ్చి క్రిష్ట్మసు చేసిరిగాన దూతల పండుగతో నాలుగు పండుగలు. ఇతర మతస్థులుకూడా ఈ పండుగ చేయుచున్నారు. ఉదా: రాజమండ్రిలో జిల్లా మునసబుగారు అన్ని పండుగలు చేయుచున్నారు. అయితే ఈ దినము తూర్పు జ్ఞానులను గురించి చెప్పకూడదు గాని పిల్లలు సంభాషణలలోను, పాటలలోను వారినికూడ కలిపియున్నారు గాన నేనును వారిని గురించి చెప్పెదను. తూర్పున చుక్కపొడిచినదని మత్తయి 2:2లో నున్నది. ఆ చుక్కనుచూచి తూర్పున జ్ఞానులు ప్రభువును చూచుటకు వచ్చియున్నారు. ఈ కథ బైబిలులో నున్న కథ. బైబిలులో లేని కథ ఇప్పుడు చెప్పుదును. పడమర ఒక నక్షత్రము పుట్టినది. అందుచేత ఐరోపా మొదలగు ఖండములవారు క్రైస్తవులైనారు. బెత్లెహేములో పుట్టిన శిశువునకు చుక్కయని మరియొక పేరు ప్రకటనలో నున్నది. "ప్రకాశమానమైన వేకువచుక్క" ప్రకటన 22: 16. భక్తులు యేసు ప్రభువును ఆకాశము నందలి చుక్క అనక బేత్లెహేము నక్షత్రమని చెప్పియున్నారు. ఆ నక్షత్రమే క్రీస్తుప్రభువు. ఈయన చరిత్ర బెత్లేహేము వారికి, తూర్పు దేశస్థులకు ఐరోపావారికి కూడ తెలిసి క్రైస్తవులైనారు. ఐరోపా ఖండములోని అన్నిదేశముల వారు ఇటలీ, డెన్మార్కు మొదలగు దేశముల వారందరు ఈ నక్షత్రమును గురించి తెలిసికొన్నారు. క్రైస్తవులైనారు. సజ్జన క్రైస్తవులు నామక క్రైస్తవులు ఈ లోకములో నున్నారు. ఇరువురును బేత్లేహేము నక్షత్రమైన క్రీస్తును తెలిసికొని క్రైస్తవులైరి - నక్షత్రమును చూచి తూర్పు జ్ఞానులు భక్తులైరిగాని క్రైస్తవలు కాలేదు. అప్పటికి బాప్తిస్మమురాలేదు. అయినను వారు మనకన్న ముందున్న క్రైస్తవులు. వారు మనకన్న ముందు క్రీస్తు అను నక్షత్రమును చూచినారు, అంగీకరించినారు. వారు ఒక్క నక్షత్రమునే చూచినట్లున్నది గాని బైబిలు త్రవ్వుచు త్రవ్వుచుపోగా

   రెండు నక్షత్రములు ఉన్నవి.
  • 1. ఆకాశనక్షత్రము
  • 2. ప్రభువగు నక్షత్రము.

  భక్తుడైన అగస్టీను ఒకటి వ్రాసెను. తూర్పు జ్ఞానులు ఆకాశముననున్న నక్షత్రమును చూచుటకు తలలు పైకెత్తిరని వ్రాసెను. జ్ఞానులుతమ తలలు పైకెత్తిరి. పరలోక దేవదూతలు తలలుదించి క్రిందనున్న ప్రభువును చూచి, వారు వీరు నక్షత్రము తూర్పున, పడమర, ఉత్తరమున కూడ పుట్టెను. ప్రపంచమునకు ఉత్తరమున రష్యా దేశములవారు ఈనక్షత్రమునుబట్టి అనగా క్రీస్తును బట్టి క్రైస్తవులున్నారు గనుక నక్షత్రము అక్కడ పుట్టెను. ప్రపంచమున దక్షిణదేశములు ఆఫ్రికా, ఆష్స్ట్రేలియాలు. ఈ నక్షత్రకిరణములు దక్షిణమునకు కూడ వ్యాపించెను గనుక వారు క్రైస్తవులైనారు. తూర్పు నక్షత్రము అని వ్రాసిన మత్తయినకు మిగత మూడు దిక్కుల నక్షత్రముల వార్త తెలియక ఒకదిక్కు నక్షత్రమే అని వ్రాసెను. (జ్ఞానులే) గొప్పవారము. ప్రపంచమంతటికి మధ్యనున్నది, నాలుగు దిక్కులకు మధ్య జన్మించెను. అక్కడనుండి ఆయన మహిమ నాలుగుదిక్కులకును వ్యాపించెను. జ్ఞానుల చుక్క ఆ ముగ్గురు జ్ఞానులను నడిపించి వెళ్ళిపోయినది. అయితే క్రీస్తు అను చుక్క అన్ని దేశములలో అన్ని స్థలములలో ఉండిపోయెను. తూర్పు జ్ఞానులు యేసుప్రభువును చూచినట్లు మీరును క్రిష్ట్మస్ వారమంత ప్రభువును చూచుటకు ప్రయత్నించండి. వారమంత దర్శనములో ప్రభువును, మరియమ్మను, యేసేపును, జ్ఞానులను, గొల్లలను, దేవదూతలను చూడండి దేవదూతలు పాడిన పాటకూడ వినండి. దాని రాగము ఏమైనది చూడండి. ఆ పాటయొక్క రాగము ఇంకా ఎవ్వరికిని తెలియదు. సన్నిధి కూటస్థులు తప్పక ఆ పాట వినపించవలెను. రోజునకు ఒకరు చొప్పున చూచి ఏడవ దినమున దేవాలయమునకు రండి. మీకందరికి వారందరిని చూచు నేత్రము కలుగును గాక!

  Home


క్రీస్తు అవతారము యొక్క అంతరంగ ఉద్దేశ్యము


(నరులు స్వతంత్రులు, ఎవరిమతము వారు ప్రచురించుకొనవచ్చును. బేదాభిప్రాయములున్నను కలహింపరాదు. తెలియని సంగతులు దేవుని నడిగి తెలిసికొనవలెను.)

పవిత్రులైన ఆదిమానవులు పాపములో పడిపోయినందువల్ల వారు పరిశుద్ధ దేవునికి ఎడమై పోయిరి. ఆయన భూమి మీద ఉన్న వారి యొద్దనుండి తన నివాసము మార్చుకొని దేవలోకమునకు వెళ్ళిపోయెను. అప్పటినుండి వారికిని, వారి సంతానములో జన్మించిన కోట్లకొలది ప్రజలకును ఒక ఆశయుండెను. అది ఏదనగా దేవుని చూడవలెను. ఈ ఆశ మంచిదేగాని నరునిలో పాపమున్నందున్నందువల్ల దేవుని చూడలేడు. ఎందుకనిన దేవుడు అనాది పరిశుద్ధుడు. అనంత పరిశుద్ధుడు, జ్యోతులకంటె ప్రభావము గలవాడు, నిరాకారుడు. పాపియైన మనుష్యుడు. పరిశుద్ధ దేవుని ఎట్లు చూడగలడు? ఆకారముగల మానవుడు నిరాకారుడైన దేవుని ఎట్లు చూడగలడు? చూడవలెనను ఆశ మానవునికి గలదు. కనబడవలెనను ఆశ దేవునికి ఉన్నది. కాని నరుడుచూచుట, దేవుడే కనబడుట అను రెండు ఏకాంశములు సిద్ధించుట. కేవలము అసాధ్యము గనుక దేవుడు నరుడై రూపము ధరించుకొని (నాటకములో మనుష్యులు వేషము ధరించుకొను రీతిగా కాదు) జన్మించెను. గనుక ఇద్దరి కోరిక నెరవేరెను. ఇదే యేసుక్రీస్తు జన్మోద్దేశము.

యేసు అనగా రక్షకుడు. ఆయన పుట్టకముందే ఈ పేరు వినబడెను. ఈ పేరు దేవదూతవలన తెలిసినది. ఇది మోక్షములోనుండి వచ్చిన నామము. భూలోకమున కలిగిన నామము కాదు. మానవుని జీవితములో మిగుల అవసరమైనది రక్షణ. రక్షణ లేని యెడల ఎంత ధనము, ఆస్థి, జనము, విద్య, ఆరోగ్యము, ఉన్ననేమి ప్రయోజనము? యేసు అను నామమును గురించి విచారణ చేయగా ప్రజలకు పాపములనుండి రక్షించుట అను అర్ధము మొదటి పర్యాయము కనిపించుచున్నది. మానవునికి కలిగియున్న లోక భాగ్యములు వలన పాపపరిహారము కలుగదు, అనగా రక్షణ కలుగదు. రక్షణ గలవారు ఎన్ని కష్టములున్నను ఈలోకములో పాప పరిహారానందము అనుభవించగలరు. మోక్షమునకు వెళ్ళగలమను నిరీక్షణ గలవారైయుందురు. ధన ధాన్యాధులు ఈ లోకమునకే, రక్షణ మహాభాగ్యము రెండు లోకములకును సైతాను శక్తినుండియు, పాపమునుండియు అనగా వ్యాధి, కరవు మొదలగు పాపఫలితముల నుండియు, మరణ భీతినుండియు, తుదకు నిత్య నాశనము నుండియు యేసుక్రీస్తు ప్రభువు తనను నమ్మినవారిని రక్షించును. గనుక యేసు అను పేరు ఆయనకు తగిన పేరైయున్నది.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా19:10


జంతురూపము దాల్చి సంచరించినయెడల
నరులు లోకువ గట్టి తరుమ కుండ్రె
దూత రూపము దాల్చి సంచరించినయెడొర్లబడిన యెడ
నరులు భీతాంగులై నక్క కుండ్రె
దేవుండె స్వయముగా దిగివచ్చి కన్ పడ్డ
నరులు భస్మంబయి నలుగ కుండ్రె
నరజన్మమెత్తి మానవుల దర్శించిన
ప్రేమజూపుచు గౌరవింప కుండ్రె!
అందుచే నరరూపాన ! నవతరించె
నరులు పిల్చుటకున్ యేసు ! నామధారి
యాయె రక్షకుడని దాని 1 కర్ధమగును
హిందువుల పుస్తకము చెప్పు ! యేసు ఇదియె!
(షరా: శ్రీ శుష్క వేదాంత తమోభాస్కరము 174పేజీ)


"రూపలేని దేవుడు నర ! రూపమందు
యేసుక్రీస్తయి భువిలోని ! వాసముండి
సర్వజనులను ప్రేమతో ! స్త్కరించె
దేవుడిట్లుండునని మీరు ! తెలిసికొనిడి!

(షరా: యెష 9:6, యోహాను 1:14, మత్తయి 11:28)

(దీవెన)

దివ్య దేవుడు నిన్ను దీవించును గాక! రక్షకుండౌ క్రీస్తు రక్షించును గాక!

Home