(బాప్తిస్మము పొందినవారికి ప్రభువు రాత్రి భోజనమునకు ముందు పాదశుద్ధి చేయవలెను)

వాక్య పఠన

దా.కీ 23వ అద్యా; మార్కు 14:22-25; 1 కొరింథీ 11:23-33.


బో: తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున - అమేన్.

పాపపు టొప్పుదల క్రమము

  బో: ప్రియులారా! 'నేను పాపములేని వాడనని ' అనుకొనువాడు మోసములో పడిపోవును. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపియై దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమీయుడి.
 1. ప్రశ్న: మీరు మానవ జన్మమునుబట్టియు, మీ తలంపులను బట్టియు, మాటలను బట్టియు, క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టియున్నారని ఒప్పుకొనుచున్నారా?
 2. జ: ఔను, ఒప్పుకొనుచున్నాము.
 3. ప్రశ్న: మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినాడని నమ్ముచున్నారా?
 4. జ: నమ్ముచున్నాము.
 5. ప్రశ్న:మీరు ఏ పాపమునకు లోబడక, సమస్త శోధనలను దైవ వాగ్ధానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా?
 6. జ: ఔను, నిశ్చయించుకొనుచున్నాము.

పాప క్షమాపణ ప్రకటన

నిజముగా పాపములను గురించి దుఃఖించి, వాటిని ఒప్పుకొని, ఇక మీదట జాగ్రత్తగా నుందునని ప్రమాణము చేసిన యెడల, అట్టివారికి వాక్య సేవకుడనైన నేను; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపము నొప్పుకొనక, పాపస్థితి యందుండువారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను.

ప్రభువు ప్రార్థన అందరు చెప్పవలెను.

పాదశుద్ధి క్రమము

(బాప్తిస్మము తర్వాత మొట్టమొదటిసారి ప్రభు భోజన సంస్కారము తీసుకొనుచున్న వారికి మొదట బోధకుడు పాద శుద్ధి చేయవలెను).


బో: ప్రియులరా! యేసుప్రభువు భోజన సమయమందు ఒక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. గనుక నేనును అట్లు చేయుచున్నాను. ఇది పరిచర్య చేయుటకు ఉండవలసిన మనస్సునకు గురుతైయున్నది. అంతట ప్రభువు పళ్ళెములో నీళ్ళు పోసెను. గనుక నేనును అట్లు చేయుచున్నాను. పిమ్మట శిష్యుల పాదములు కడుగుచు, ఆ తువాలుతో తుడిచెను. గనుక నేనును అట్లు చేయుచున్నాను. "నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలులేదని ప్రభువు పేతురుతో చెప్పెను". ("ప్రభువుతో నీకు పాలు కలుగును గాక" అని చెప్పుచు భోజనార్ధుల పాదములు కడుగ వలయును) యోహాను 13:12-17.

భోజనాచారము

స్తుతి ప్రార్థన

ప్రేమవైయున్న తండ్రీ! నీ కుమారునిలో నిన్ను బయలుపరచుకొన్న నీకు మహిమ, మహిమ, మహిమ యని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత ననుగ్రహింపుము. అమేన్.

ఓ దేవా! అరణ్యములో నీ ఎన్నికజనమైన ఇశ్రాయేలీయులకు భోజనపు బల్ల సిద్ధపరచిన నీవు, మాకు నీ కుమారునిద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్ధమై , సంస్కారపు భోజనపుబల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను నీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్.

స్తుతి వచనము

సిం హాసనము ఎదుట దూతలు పాడిన స్తుతి పాట: (యెషయా 6:3)
సైన్యములకు అధిపతియైన యెహోవా! పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది (7 సార్లు చెప్పవలెను)

ప్రసంగము

బో: ప్రియులారా! మీరు ఇప్పుడు ప్రభువు బల్లయొద్దకు రాగోరుచున్నారు. ఇది మంచిదే. ప్రభువు పిలుచుచున్నందున మీరు వచ్చినయెడల మీ రాక యెంతో మంచిది. మీకు చాలా ఆకలిగానుండి వచ్చుచున్నయెడల, మీ రాక ఎంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుచున్న రొట్టెయును, ద్రాక్షారసమును కూడ పుచ్చుకొనుచుండగా ప్రభువుయొక్క శరీర రక్తములను మీ యెదుటనుండి చెదరనీయకుడి. మీ హృదయములను కృతజ్ఞతా స్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు.

వాక్యము

లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తూ! నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్.

ప్రతిష్టించుట మరియు సమభాక్త్వమును ఆచరించుట

వాక్యము: మత్తయి 26: 26-29.

యేసు ప్రభువు రొట్టె పట్టుకొనెను గనుక నేనును అట్లు చేయుచున్నాను. యేసు ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెను గనుక నేనును అట్లు చేయుచున్నాను. ప్రభువా! ఇది దయచేసినందుకు నీకు స్తోత్రము. పిమ్మట ప్రభువు రొట్టె విరిచెను గనుక నేనును అట్లు చేయుచున్నాను. అటుపిమ్మట ప్రభువు దానిని వారికిచ్చెను. నేనును అట్లు చేయుచున్నాను.

"పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకియ్యబడిన క్రీస్తు శరీరము"

ప్రభువు గిన్నె పట్టుకొనెను. నేనును అట్లు చేయుచున్నాను. ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెను. గనుక నేనును అట్లు చేయుచున్నాను.తండ్రీ! ఇది దయచేసినందుకు నీకు స్తోత్రములు. పిమ్మటప్రభువు దానిని వారికిచ్చెను. నేనును అట్లు చేయుచున్నాను.

"దీనిలోనిది మీరు త్రాగుడి. ఇది క్రీస్తు రక్తము". అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము.

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క పరిశుద్ధ శరీరమును, ఆయన అమూల్య రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు, బలపరచుచు, పెండ్లికుమారుని రాకకును, అనంత జీవమునకును మిమ్మును సిద్ధపరచును గాక! ఆమేన్.

ప్రార్ధన చేయుదము: బోధకుడు: ఓ మా ప్రభువా! పెండ్లి కుమారుడుగా దానైయున్న మా ప్రియుడగు ప్రభువా! నీ శరీర రక్తములతో నీవు మమ్మును పోషించినందున నీకు కృతజ్ఞులమై యున్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహింపలేకపోవుచున్నను; ఆ క్రియను క్రియయొక్క ఫలితమును మేము నమ్ముచు వందనములు చేయుచున్నాము. పరలోకపు తండ్రీ! నీ కుమారుని ద్వారా నీ సంఘమునకు నీ వనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్ధేశ్యములన్నిటి విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయుచు, నీ ఉద్ధేశము నెరవేరుటకై నీ ఆత్మయొక్క ప్రేరేపణ దయచేయుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.

(పాట పాడుచుండగా చందా ఎత్తబడును)

ప్రభువు ప్రార్ధన - దీవెన

ప్రభు సంస్కార వాక్యములు


భోధకుడు ప్రభు భోజన సంస్కారమిచ్చుచుండగా ప్రభు సంస్కారపు విందు అను కీర్తనలోని చరణములను సంఘము పాడవలెను.

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

 • Like this page on Facebook

 • Tweet this page on Twitter

 • Recommend this website on Google +