రక్షణ పద్యములు (Poems)

పద్యాంశములు

ఈ పద్యములలోని అంశములు బైబిలునందున్న పుస్తకములలో కనబడును. అవేవనగా:

* ఆదికాండము: సృష్టికి పూర్వమే దేవుడుండుట, భూమ్యాకాశములు కలుగుట, దేవుడు ఆదిమనుష్యులను కలుగజేయుట, సాతానువల్ల వారు పాపములో పడుట, వారి సంతతిని రక్షించుటకు లోక రక్షకుడు వచ్చునను వాగ్ధానము వినబడుట, ధర్మములు నేర్పుటకు దేవుడు ఎన్నిక జనమగు యూదులను ఏర్పరచుకొనుట మొ||నవి.
* యోబు: సృష్టికి ముందే దేవదూతలు ఉండుట.
* సంఖ్యాకాండము, యెషయా, మీకా: లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యూదులలో జన్మించునను ప్రవచనములు.
* మత్తయి, మార్కు లూకా, యోహాను, క్రీస్తుప్రభుని చరిత్ర.
* అపోస్తలుల కార్యములు: క్రెస్తవమత సంఘస్థాపన, అది వ్యాపించుట,
* పత్రికలు: యేసుప్రభువు రెండవమారు మేఘాసీనుడై వచ్చి సజీవ విశ్వాసులను కొనిపోవునను ప్రవచనములు.
* ప్రకటన: 'క్రీస్తు ప్రభువు విశ్వాసులను తీసికొని వెళ్ళును. శేషించినవారికి ఏడేండ్ల శ్రమలు కలుగును. హర్మెగెద్దోను యుద్ధములో సాతానును క్రీస్తుప్రభువు పాతాళములో బాధించును. అతని అనుచరులను నరకములో పడవేయును. క్రీస్తు ప్రభువు వెయ్యేండ్లు భూమి మీద శాంతి పరిపాలన చేయును. సాతానుడు విడుదలకాగా, అతడు ప్రభువుతో యుద్ధము చేయును. అప్పుడు క్రీస్తుప్రభువు అతనినికూడ నరకములో వేయును. అప్పటివరకు దేవుని తట్టు తిరుగని వారికి ఆయన తీర్పు విధించును అను ప్రవచనములు మరియు సంఘచరిత్ర విషయములు, క్రీస్తుప్రభువుయొక్కమహిమ, బైబిలుయొక్క మహిమ, క్రైస్తవ మతముయొక్క మహిమ, దైవప్రార్ధన, పాపము, పశ్చాత్తాపము, రెండు రాకడలు, మానవునికియ్యబడిన గురువులు, స్వాతంత్ర్యము, కులము, పరీక్షోపదేశము, బైబిలు మిషను, గ్రంధకర్తను గూర్చి ప్రభువు బయలుపరచినవి. దీవెన మొదలగు అంశములు ఈ పద్యములలో గలవు .
* సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి (1థెస్స. 5:21).


చదువరులకు విజ్ఞప్తి
సీ|| ఏ మతస్థులయిన - ఏమి చెప్పిన దాని
సంపూర్తిగా నాల - కింపవలయు
ఏది సత్యాంశమో - ఏది కాదో యది
స్థిరపరుపను పరీ - క్షింపవలెను
సరియని తోచిన - సంగతుల్ గైకొని
భీతిలేక నవలంభింపవలెను
వివరంబులన్నిటిన్ - వృద్ధిచేసికొనుచు
తేటగా ధరకు బో - ధింపవలెను


తే||గీ|| జ్ఞానమును మనస్సాక్షిని - ఆనుకొనుచు
చెడు విషయములనెల్లను ! విడిచివేసి
నలుగురికి మచ్చుగా - నడచుకొనుచు
బ్రతుకువారికి సత్యము ! బయలుపడును.

చదువరులకు శుభము
సీ|| మనకు సర్వంబు చే - సిన తండ్రి ప్రతిరోజు
ఏమి కావలసిన - ఇచ్చుగాక
నరులను రక్షింప - నరుడయి పుట్టిన
క్రీస్తు దేవుండు - రక్షించుగాక
బైబిలుకర్తయౌ - పరమాత్మ తద్వార
దినదినంబును నీకు - దెల్పుగాక
బైబిలు చొప్పున - పావనాత్ముడు నిన్ను
మంచిదారిని నడి - పించుగాక


తే||గీ|| అన్ని పనులలో సాఫల్య - మమరుగాక
తోడినరుల స్నేహము సమ - కూడుగాక
అన్నివరములు విశ్వాసి - కందుగాక
ఎల్లవేళల బ్రతుకు వ - ర్ధిల్లు గాకవెన్క


సీ|| నీ శరీరము గోరు నిఖిల - పదార్ధముల్
చోద్యమౌ సృష్టిలో - చూడవచ్చు
నీయాత్మ యాశించు - నీతులు బైబిలు
శాస్త్రమునందున - చదువ వచ్చు
దైవప్రార్ధనచేసి ధైర్యం - బుతో విశ్వ
సింపుచునివి - స్వీకరింపవచ్చు
అ వెన్క పరలోక యాత్ర - రాగా నిత్య
జీవవాసమునందు - జేరవచ్చు


తే||గీ|| దేవరాజ్య విషయములు - దీనమతిని
వరుసగా నేర్చుకొనువారు - వాటివశము
దానముల్ వారి వశమౌను - గానగలుగు
సుఖము భువిమీద శ్రమలందు - శుభము శుభము

దేవుడు - సృష్టి


ఆది లేనప్పుడు ఏదియు లేనప్డు
దేవుడొంటరిగానె తేజరిల్లె

బలము పవిత్రత వెలుగు, జీవము ప్రేమ
ఆద్యంత రహితము ఆయనకళ

దేవదూతలు లేరు దివిలేదు భువిలేదు
సూర్యచంద్రులులేరు చుక్కలేదు

చెట్లు చేమలు లేవు జీవరాసులు లేవు
ద్రాగోను లేడు ఆదాము లేడు

సర్వమును శూన్యముగ నుండె | చప్పుడన్న
మాటయే లేదు దేవుని | మహిమతప్ప
ఊహలోనికి రాగల | దొకటియైన
లేదు; దీనినే బుధులు అ! అనాది యంద్రు. 1


దేవుడు జీవంబు గావున పనిచేయ
కుండ నూరకనె గూర్చుండలేడు

లోకంబులను వానిలో నున్న వానిని
కలుగ జేసెను అవి కాంతిగలవె

సాతాను, దుర్బుద్ధి సర్వపాపంబులన్
ఆయన కల్పన చేయలేదు

ఆ పాప ఫలితాలు అఖిల కష్టంబులు
ప్రియ జనకుండు రప్పింపలేదు

సృష్టిలోపల చేరిన | చెడుగునెల్ల
అంతరింప జేయును దేవు | డద్భుతముగ జేయును
అన్ని విషయాల మనకు సా | యంబుచేయు
వీని నమ్మునరుడె ధన్యు | డౌను భువిని 2


ఈ భూమి మనయిల్లు, యింటికాకాశము
కప్పు మేఘము నీటి కంచుబిందె

సూర్యుండు చంద్రుండు చుక్కలు దీపాలు,
జలము పానము గాలి శ్వాసిపట్టు;

పండ్లు నాకులు తిండి పశువులు వృత్తిస
హాయిలు, గనులు ధనార్జితములు

దేవదూతలు మన కావలి బంటులు
అందరిన్ ప్రేమించు ఆత్మవరులు

పక్షులున్ చేపలున్ ఆట | వస్తువులుగ;
గడ్డినేల తివాచి; యీ | కన్ను చూచు
చున్న సృష్టి వినోదమై | యుండు శాల
ఇన్ని సదుపాయంల్ దేవు | డెన్నో చేసె. 3


హరణము మొదటను ఆవెన్కదంపతు
లను జేయుటే తండ్రి పనుల వరుస

నరులు దేవుని జూచి పరిచయంబుగ మాట
లాడిరి ఇది ధన్యమైన బ్రతుకు

నరులతో దేవుండు పరిచయంబుగ మాట
లాడెను ఇది దివ్యమైన వార్త

స్రష్టశుద్ధుడుగాన సృష్టినట్లేచేసె
ఆది మానవులను అట్లేచేసె

నరునికోసము లోకము | నరుని తనకు
సృష్టిచేసెనుగద అందు | చేత తాను
నరునిలో వాసముండును | నరును కెంత
ఆదరణగ నుండును; ఇది | అందరకును. 4


దేవదూత యొకండు | దేవుని నెదిరించి
సాతానుగామారె | చాల కీడు
ఆదాము హవ్వయు | ఆనందభరితులై
యుండుట సాతాను | ఓర్వడాయె

ఆదంపతులను దై | వాజ్ఞకు దూరులన్
జేసెను మాయలు | చెప్పి చెప్పి
ఈరీతిగా బాప | మీలోకమందు బ్ర
వేసించి యంతటన్ | విస్తరించె

దంపతులు పాపమునబడి | దాగియుండ
శ్రీయెహోవా సమీపించి | శిక్ష రక్ష
వెల్లడించె రక్షకుని పం | పింతునన్న
వాక్కువినిపించి సంతోష | పరచెనపుడు 5


జనములు పెరుగగా | జనములతోపాటు
పాపంబు బెరుగుచు | ప్రాకిపోయె
పాపమున్నందున | పరమాత్ముడుండుట
మానివేసెన్ గదా మహిని నపుడు

అందుచే మానవుల్ | అగుపడు నుపకార
వస్తువులన్ గొల్వ | వలసివచ్చె
ఈపాపమిలయందు | నింకను నైజము
లోనున్న దౌటచే | మానలేరు.

మొదట దేవుని నెడబాసి | పిదప నరుని
నరుడు బాసెను తుదకది | నరులయందు
కొందరికి కులమను గొప్ప | కుమ్మరరంబు
దెచ్చిపెట్టెను దీనిని | త్రెంపలేము. 6


ఉన్న జనములలో | యూదులే మెరుగౌట
చే కర్త వారిని చేరదీసె;
యూదులలోనుండి | అదైవ రక్షణ
కర్త రావలసిన | క్రమము గలదు;

అందుచే వారికి | అన్నియు బోధించి
తండ్రి వారలను సి | ద్ధంబుజేసె
వారికె కన్పడి | వ్రాయించె దనమాట
లోకగ్రంథమందున | నొబ్బిడిగను

నాల్గువేల సంవత్సరాల్ | నడచిపోగ
దేవుడే నరుడుగబుట్టె | దీనమతిని
యేసుక్రీస్తును పేరుతో | నిలను వెలసె
దేవనరుడైన యీయనే | దిక్కుమనకు. 7


జగదైకరక్షక | జన్మంబునకు ముందు
జరుగవలసినవి | జరిగిపోయె
దైవదర్శనము కొం | దరికి కలిగెను వా
రలు దేవవాక్యాలు | వ్రాసికొనిరి

అవి బైబిలనెడి గ్రం | థాధి భాగంబగు
పాతనిబంధనై | బరుగుచుండు
కొన్నాళ్ళు దేవుడా | కొందరికైనను
అగుపడలేదు మా | టాడలేదు.

ఇదియె నిశ్శబ్ధ కాలము | అదివరకును
ప్రజలు విన్న వాక్యంబుల | పట్టువిడక
దర్శనాలున్న లేకున్న | దైవభక్తి
నిలుప నీ కాలమేర్పడె | నిజము నిజము 8


"రక్షణ దేవుండు | రానయి యున్నాడు
అని పూర్వభక్తులు | అనిరి చనిరి
"వచ్చియు"న్నాడని | వచియించె యోహాను
గనుక నాతనివాక్కె | మనకురూఢి

మారుమనస్సునొంది | మార్పునకున్ దగు
మంచిఫలములు ఫలించుడనెను
యేసెమెస్సియయన్ | వ్యాసాన యూదుల
మత సంఘమునకట్లు | హితముజెప్పె

నమ్మినట్టి వారలకు స్నా | నంబొసంగె
అతడు వనవాసి హతసాక్షి | ఆత్మవశుడు
శబ్దవాహి గర్జించు ప్ర | సంగి స్త్రీలు
కన్నవారిలోకెల్లను | ఘనుడు సాక్షి 9


శ్రీ యేసు నాధుండు | క్షితిని జన్మించెనన్
వార్త యూదులకందె | ప్రథమమందు
తర్వాత నన్యుల | దరికి వెళ్ళెను; ఇట్లు
లోకమంతటికందె | లోటులేక

రోగులన్ బాపులన్ | ద్రోసివేయకబరి
శుద్ధులంజేసెను | సూక్ష్మముగను
తాను బోధించిన | ధర్మప్రకారంబు
వర్తించి మాదిరి | వరుసజూపె

నీరు ద్రాక్షారసముచేసె | నిమిషమందె;
రొట్టెలయి దై దువేలకు | బెట్టెదినను;
తోలె దయ్యాల: నణచెను | గాలినీటి
మృతుల కాహ్వాన మిచ్చి జీ | వితుల జేసె. 10


దుష్టబుద్ధినిగల్గి | దృష్టించినంత మా
త్రాన పాపంబనె | జ్ఞానెక్రీస్తు
కుడిచేతి ధర్మంబు | నెడమచేతికి దెల్ప
రాదని బోధించె | సాధుక్రీస్తు

తాను దేవుండని | ధర్మబోధనలోను
నడతలో | జూపెను నరుడు క్రీస్తు
నా నామమునుబట్టి | నన్నేమియడిగిన
చేతననెను వాక్కు | దాతక్రీస్తు

మొదట దేవరాజ్యమునీతి | వెదక వలయు
కలుగు తర్వాత నన్నియు | వలదు చింత
తీర్పు తీర్చనిచో మీకు | తీర్పురాదు
అనుచు తానుడివెను దేవు | డైన క్రీస్తు.
దైవము నరులకు | తండ్రియున్ వరుసను 11


సృష్టీకరించెను | స్వామి యేసు
ఇట్లని దేవుని | యెడ గల దుర్భీతి
బాప ప్రయత్నించె | ప్రబువుయేసు
నరులందరును సహో | దరులను వరుసను

వినిపించె బోధలో | విభుడుయేసు
కుడిచెంపపైగొట్ట | నెడమచెంపను ద్రిప్పు
మని యోర్పు | బోధించె ఘనుడుయేసు

నేర్చుకొనుడి నాయొద్దనే | నేనెదారి
నేనె సత్యము జీవము | నా నిమిత్త
మై శ్రమల్ బొంది హర్షిప | నథిక ఫలము
మోక్షమున గల్గునని పల్కె | రక్షకుండు 12


తలపై కిరీటంబు | తగిలించి యదుమగా
కాలువలౌచు ర | క్తంబుగారె
రెండు చేతులలోను | రెండు మేకులుగొట్ట
కాలువలౌచు ర | క్తంబుగారె

మీగాళ్ళు జతపర్చి | మేకుతో గొట్టంగ
కాలువలౌచు ర | క్తంబుగారె
బల్లెంబుతో బొడ్వ | ప్రక్కలో నుండియు
కాలువలౌచు ర | క్తంబుగారె

నోరిగిరె మంచినీళ్ళియ్య | రైరి అకట
తన యమూల్యరక్తము మన | ధాత్రిజనుల
పాప నివృత్తికై చిందె | పావనుండు
దీని ధ్యానింప శక్తులు | తేజరిల్లు. 13


దూషించినను వారి | దూషింపడాయెను
కొట్టినన్ వారిని | కొట్టడాయె
శపియించినన్ వారి | శపియింపడాయెను
తప్పుమోపిన తప్పు | జెప్పడాయె

అన్నిజేసినగాని | ఏమియు ననలేదు
క్షమించివేసెను | శత్రువులను
తానె దేవుండని | మానవాత్మలకు ఈ
పాపక్షమనుబట్టి | బైలుపడెను

మనశిరము హస్తములు కాళ్ళు | మరియు ప్రక్క
కలుషములు గల్గియున్నవి | గనుక మనము
సిలువ మరణ మొందుట న్యాయ | ఫలితమౌను
పాపమెరుగని క్రీస్తొందె | శాపమెల్ల 14


మనపాపములు క్రీస్తు | తనమీదనేవేసి
కొనెను గావున నవి | మనకులేవు
మనవ్యాధులను క్రీస్తు | తనమీదనే వేసి
కొనెను గావున నవి | మనకు లేవు

మనశిక్షలను క్రీస్తు | తనమీదనే వేసి
కొనెను గావున నవి | మనకు లేవు
ఉన్నవియనియన్న | ఉండును మరియును
లేవని యున్నచో | లేకయుండు

మనకు బదులు తానేమోసె | మహిదురితము
ఇట్లు సిలువపై మరణించె | నెంతప్రేమ
చూపె యేసుప్రభుండిదె | శుభకరంబు
వందనములు చేయుడి కడు | వందనముగ. 15

ఆనందకరమైన | జ్ఞానోపదేశముల్
చేసి పాపాత్ములన్ | చేర్చుకొనిన
చనువుగ నందరి | సరసున జేరిన
నయమార్గమున సదా | నడచుకొనిన

పాపులన్ రోగులన్ | బాగుచేయుచు దయ్య
ముల వెళ్ళగొట్టి వి | ముక్తియిడిన
మృతులను లేపిన | మేళ్ళెన్నిచేసిన
దేవుండని క్రియ | దెలుపుకొనిన

ప్రభుని చంపిరి ఐనను | బ్రతికివచ్చె
తనసువార్త సృష్టికి చెప్పు | డనెను తిరిగి
వత్తువన్న విభుండేగె | స్వర్గమునకు
ఎల్లవారి కాకర్షణ | యేసె నేడు. 16


నమ్మి స్నానముబొందు | నరునికి మోక్షంబు
నమ్మనివానికి | నగును శిక్ష
యేసువాక్యము శిష్యు | లెత్తి క్రీస్తు సువార్త
భూమియంతట చెప్ప | బూనుకొనిరి

అందుచేత దైవాత్మ యందు | బాప్తిస్మంబు
నొంది పూర్ణంబు | నందుకొనిరి
ఆ సమయమందె | యేసు క్రీస్తు మతంబు
స్థాపింపబడె నొక | సంఘముగను

ఆమతస్థులె క్రైస్తవు | లనబడుదురు
చంపచూచిరి యూదులా | సంఘజనుల
గనుక పారి పోయిరి వేరు | జనుల కడకు
అపుడు సర్వత్ర సంఘంబు | అలుముకొనియె. 17


యేసుని చంపింప | నెగిరి పోయెను సంఘ
మును చంపచూచిన | మొలకలెత్తే
అని పిశాచి వివాద | మును బెట్టె వారిలో
వారికె వాదము | లూరిపోయె

గాన బైబిలు పరీ | క్షగ నేర్చుకొన గల
భాగ్యంబు గలిగెను | పండితులకు
ఆవెన్క సైతాను ఆ గ్రంధమును దాచె
నందుచే చీకటి యావరించె

గాన దేవుడు లూతేరు | కంటికపుడు
బైబిలును చూపి దానిని | బైట బెట్టె
దాని చదువగ నర్ధ భే | దంబుగలిగె
గనుక వానిచే నెన్నో మి | షను లేచె. 18


వాక్యార్ధ భేధమున్ | బట్టి సంఘంబెన్నో
మిషనులై పోయెను | మిగుల చివుకు
ప్రభు నర్ధమడిగిన | పలువిధ సిద్ధాంత
ములు నిన్ని మిషనులు | మూగకుండు

క్రీస్తు సంఘములోనె | కీచులాటలుగాన
ప్రభువు తలుపుతట్టి | బైటనిలుచు
ఐనను విశ్వాసి | యందువసించును
అందరి ప్రార్ధన | లాలకించు

అన్ని మిషనులు నిప్డైన | నడుగు నెడల
ప్రభువు కంపడి బైబిలు | వ్యాఖ్యచెప్పు
అప్డు సంఘంబులేచును | అన్నిమిషను
లంతరించును వాదము | లణగియుండు 19


ప్రభువు జన్మమునమ్మి | ప్రతియేట క్రిస్మసు
పండుగ జేసిన | ఫలముగలదు
ప్రభుని సిల్వనునమ్మి | ప్రతి యేడు శ్రీ శుక్ర
వార మనుసరింప | ఫలముగలదు

ప్రభుని లేచుటనమ్మి | ప్రతియేట నీష్టరు
పండుగ చేసిన | ఫలముగలదు
ప్రభుని బోధలునమ్మి | బహువిధంబులవాని
ప్రజలకు ప్రకటింప | ఫలముగలదు

అయిన రెండవ రాక స | మయమువచ్చె
నంచు నమ్మనిచో సిద్ధ | మగుట యెట్లు
చావులేకుండ నీ మన | స్థలమునుండి
పైకి నెత్తబడంగల | ఫలము గలదె. 20


యేసు మహిమ మేఘ మెక్కివచ్చును రాక
కొరకు చూచినవారి గొంచుపోవు
రాకకు పూర్వము లోకాన గుర్తులు
నెరవేరె రావచ్చు నేడె యేసు

భూకంపముల్ భిన్న బోధలు యుద్ధాలు
వ్యాధులు కరువులు భయము భయము
ఇట్టి గుర్తులు చూడ యేసు రెండవ మారు
వచ్చు కాలంబిదే వచ్చెనిపుడు

మిగత జనులకు హింసలు | మిక్కుటముగ
కలుగు కావున కొందరు | తెలివినొంది
మారి వేరొక మోక్షంబు | చేరుకొంద్రు
వారి యొద్దను క్రీస్తుని | వాసముండు. 21


మృతులైన భక్తులు మేఘమెక్కుదురు శ్రీ
యేసు మేఘముమీద నెక్కి రాగ
తర్వాత భూలోక దైవ మానవులును
నెగిరి యా మేఘమే యెక్కగలరు

పాపమెరుంగని బాల బాలికలు నా
వెలుగు మేఘంబెక్కి వెళ్ళగలరు
ఈ మూడు గుంపులకే పెండ్లికూతురన్
పారమార్ధికమైన పేరుగలదు

పరమ పురమైన నూతన | యెరూషలేము
చేరి అంతంబు లేనట్టి | జీవ మందు
క్రీస్తు లక్షణములలో సు | ఖించుచుండు
వధువు సంఘమునకు సిద్ధ | పడుడినేడే. 22


మగశిశువును గన్న మాతయె క్రైస్తవ
మతమది యూదుల మతము గాదు
మగశిశువే తొలిమారెత్తబడి పై యె
రూషలేమునకు నా రోహణమగు

శేషించు సంఘంబు దూషణ హింసల
పాలగుచుండగా బాధపడును
మిగత విశ్వాసుల మీద క్రీస్తు విరోధి
పడి పలు తెరగుల బాధపెట్టు

వసుధ వాస్తవ్యులైన వి | శ్వాసులెల్ల
మూడు తెగలుగ నగుదురు | మొదటివారు
పెండ్లికూతురు సంఘమై | వెళ్ళిపోగ
రెండు గుంపుల వారి కే | డేండ్ల శ్రమలు. 23


భక్తులు పైకెత్త బడగానె మిగిలిన
మనుజు లందరికిని మతులు చెడును
కొందరన్నను చంపుకొందు రొకరినొక
రది మృతికొక సమయంబు గనుక

భక్తికి కరువు కాబట్టి పంటకు కూడ
కరువయి యన్నము దొరకకుండు
మృగములు నరులను తెగదిన జంపును
లోకాధిపతి యిట్లులోకువగును

భక్తులును భక్తి హీనుల | పాలగుదురు
చంపబడుదురు మరియు భూ | కంపముండు
పర్వతాలును లంకలు | పట్టుదప్పు
నరుల జీవమునకు గొప్ప | నలుగుడౌను. 24


సూర్యుండు నలుపెక్కు చుక్కలు రాలును
చంద్రుడు ఎరుపెక్కు క్షయముకాంతి
జ్ఞానకాంతి కృశించు మానవాళికి జ్యోతి
కాంతి తగ్గును క్రమ క్రముగాను

పర్వతాల్ తనమీద పడ వేడుకొందురు.
దైవోగ్రతాగ్నికి తాళలేక
దేవుని ప్రార్ధింప స్థిరపర్చుకొనలేదు
రాళ్ళను ప్రార్ధింప మేళ్ళొసగునె

అగ్ని వడగండ్ల వలన వృ | క్షాదులెల్ల
మాడిపోవును కూరలు | నీడలేక
ఆశ్రయాధారములులేక | యదురుబుట్టు
స్రష్టయాధారపడకున్న | శాంతి సున్న 25


సాంద్రంబు రక్తమౌ చచ్చును చేపలు
ఓడలు నశియించు నుప్పుపాడు
వర్తకమే తమ బ్రతుకు సాధనమను
వారికి కీడొక పాఠమగును

జలములు చేదౌను జనులు చత్తురు త్రాగి
త్రవ్విన దొరకదు త్రాగునీరు
మతిలోన చీకటి మహిపైన చీకటి
ఈ బాధ వివరింప నెవరి తరము

బట్టి బాధలు బోధలు | ఎన్నియున్న
నరులు మారరు దేవుని | పరమదయను
గుర్తెరుంగరు కాబట్టి | కోరుకొన్న
దయ్యముల గుంపె వారికి | దగిన జట్టు. 26


సూర్య చంద్రుల మీద చుక్కల మీదను
సాతాను కధికార శక్తిలేదు
నేలపై నీళ్ళపై గాలిపై కాపుపై
సాతాను కధికార శక్తిలేదు

దివిపైన భువిపైన దేవుని సృష్టిపై
సాతాను కధికార శక్తిలేదు
గాన భూకంపముల్ గాడ్పుల్ తాఫానులు
వరదలు సాతాను పనులుగావు

భయముజెప్పి మానవులకు | బాధలోను
వారి నెల్లను తనతట్టు | జేరబిలిచి
నరకమునుబాపి తనమోక్ష | పురము జేర్ప 27


ఇలకు దేవుండు రానిచ్చు హింసలివియె
దేవుండు లేడని భావించు వారిపై
సాతాను కధికార శక్తిగలదు
పాపనైజము మాని బ్రతుకని వారిపై

సాతాను కధికారశక్తి గలదు
దైవోపదేశంబు దలపని వారిపై
సాతాను కధికారశక్తిగలదు
వారు తనవారు అని వారి | వదలిపెట్టు

యేసు కొరకున్న వారిని | హింసపెట్టు
వార లెదిరింప నా తండు | పారిపోవు
ఇంత పిరికివాడని గ్రహి | యింప వలయు 28


సాతాను నాతని సైన్యంబు భూమిపై
బడి తమ భక్తులన్ బాధపెట్టు
తాము పూజించు సాతానును దయ్యాలు
బాధకులని బైలుపడును నాడు

సాతానె తమ గొప్ప సంరక్షకుండని
నమ్మినవారిప్డు నమ్ముటెట్లో
దయ్యాలు మిడుతలై తమవారి గుట్టంగ
తేలు బాధనుబోలు తీపు గలుగు

అయిదు మాసాలవరకును | అట్లేయుండు
చావుకోరుదు రది పారి | పోవు గనుక
దీర్ఘకాలము బాధలు | తెలిసివచ్చు
దైవముద్ర ధారికి బాధ | తగులుకుండు. 29


భక్తులు గెల్వగా | బంధింపబడినట్టి
నాల్గు దయ్యాల్ ఫరాత్ | నదిని గలవు
అవిగూడ నరులను | అధికంబుగా బాధ
పరచును అది వాటి | వల్లనౌను

దయ్యాలకేగాని | దైవమునకు సందు
ఇయ్యని వారుందు | రిహమునందు
అందుచే పాతాళ | మందలి దయ్యాల
నిలకు దేవుండు రా | నియ్యవలయు

ఉన్న పాపాలలో నరు | లూరి పోవ
విడువలేరు వాటిని నిక | నడువలేరు
మంచి మార్గాన బోధ ప | ల్మారు విన్న
అగ్ని పొగ గంధకము భూమి | నావరించు. 30


దేవలోకమునుండి | దివ్యోపదేశకుల్
వచ్చి బోధింతురు | వసుధ మీద
నరులు వారిని జంప | దరుముదురే గాన
కొంచమైనను విని | పించుకొనరు

పరలోక వాసులు | పరవశులై యుండ
చచ్చినారని కొంత | జనము తలచు
గాని వారలు లేచి | గగనమార్గంబున
మోక్షమేగిరి వారి | ముఖమునెదుట

అప్డు భూకంపమొదవంగ | ఆరునొక్క
వేలు చత్తురు మిగిలిన | ప్రేక్షకులకు
భయముపుట్టి దేవుని ఘన | పరుప గలరు
కష్టములవల్ల మార్పు కలుగకున్నె 31


అంతె క్రీస్తుని ముద్ర | అతని ప్రతిమపూజ
గలవారికిన్ వుండు | కలుగుచుండు
సూర్యరశ్మికి కాల | శుష్కించువారలు
దేవునే దూషించి | ధిక్కరింత్రు

వేదన కోర్వక | విసుగుచు నాలుకల్
కరచుకొందురు గాని | తిరుగకుండ్రు
తమ పాపములె గదా | తమ మీది కిన్నిన్ని
హింసలన్ రప్పించు | నిది యెరుగరు

దయ్యములు క్రీస్తు తోడ యు | ద్ధంబుచేయ
రాజులను పోగుచేయును | గోజులాడి
నరులు దయ్యాలు మారరు | నరులు తుదకు
నొకవిధముగ దయ్యాలౌదు | రకట అకటా! 32

7 ఏండ్ల శ్రమలవల్ల నేర్చుకొను పాఠము

సూర్యుని చంద్రుని | చుక్కలన్ పూజించు
వారికి చీకటి | వలన శిక్ష
కన్ను నాలుక చెవి | కాలు హస్తముచేయు
పాపాన రోగాల | వలన శిక్ష

జంతుపూజలుచేయు జనులకు పైబడి
వారినిజంపుట | వలన శిక్ష
చెట్టును పూజించు | నట్టివారికి చెట్లు
పాడయిపోవుట వలన శిక్ష

సృష్టికర్తను విడనాడి | సృష్టివైపు
చూచువారికై హింసలు | వేచియుండు
గాన ప్రకటన గ్రంధము | లోన వీని
తెలిసికొని తప్పుకొనవేడ ! వలయు ప్రభుని 33


భూ సేవకులక్రింద | భూకంపములు పుట్టి
ప్రాణముల్ మ్రింగుట | వలన శిక్ష
జలమును పూజించు | జనులకు చేదైన
జలములు కలుగుట | వలనశిక్ష

సాంద్రము రక్తమౌ | చచ్చును చేపలు
వర్తకమాగుట | వలన శిక్ష
భుక్తి ముఖ్యంబను వ్యక్తుల కిబ్బంది
గలిగించు కరువుల | వలన శిక్ష

సృష్టికర్తను విడనాడి | సృష్టివైపు
చూచువారికై హింసలు | వేచియుండు
గాన ప్రకటన గ్రంధము | లోన వీని
తెలిసికొని తప్పుకొనవేడ | వలయు ప్రభుని 34


సీ|| దయ్యములన్ మ్రొక్కి | దండము పెట్టిన
వారికి దయ్యాల వలన శిక్ష
వాన దేవుని పిల్చు వారిపై పిడుగులు
వడగండ్లును | పడుట వలన శిక్ష

నరులను పూజించు | నరులను ఆ నరుల్
వధియించి వేయుట వలన శిక్ష
బండలన్ బొమ్మలన్ | కొండలన్ ప్రార్ధింప
ఫలము శూన్యమగుట వలన శిక్ష

తే||గీ|| సృష్టికర్తను విడనాడి | సృష్టివైపు
చూచువారికై హింసలు | వేచియుండు
గాన ప్రకటన గ్రంధము | లోన వీని
తెలిసికొని తప్పుకొనవేడ | వలయు ప్రభుని 35


సీ|| ఈ శ్రమకాలము | ఇలకు రానగునని
వ్రాసియున్నారు ప్ర | వక్త వరులు
ఈ శ్రమ కాలము | ఇలకు రానగునని
ప్రకటించియున్నారు ప్రభువు యేసు

ఈ శ్రమకాలము | ఇలకు రానగునని
తరచియున్నారు పే | తురును, పౌలు
ఈ శ్రమ కాలము | ఇలకు రానగునని
బోధించు ప్రకటన పుస్తకంబు

సృష్టికర్తను విడనాడి | సృష్టివైపు
చూచువారికై హింసలు | వేచియుండు
గాన ప్రకటన గ్రంధము | లోన వీని
తెలిసికొని తప్పుకొనవేడ | వలయు ప్రభుని 36


పరలోక సైన్యాలు | ప్రభువుతో వచ్చుట
వసుధ సేనలు చూచి | వణకిపోవు
అంతెక్రీస్తునిసేన | అవని భక్తుల మీద
పడబోగ ప్రార్ధింత్రు | ప్రభుని తలచి

భూకంపమొక్కటి | బొడమంగ భక్తులు
నెరదలో దాగొని | దొరకకుండ్రు
వారిని తరుముచు | వచ్చిన సైనికుల్
హతులై నశించెద రాక్షణాన

వస్తు శోధకుల్ కల్పించు | పలువిధంబు
లైన విషవాయువుల్ మరల్ | అధికమౌచు
నింగినిన్ భూమినిన్ | నీటి నింపు గాని
క్రీస్తు పరలోక సేనలన్ | గెలవగలవె 37


దీనిన్ హర్మగె | ద్దోను యుద్దంబండ్రు
యేసే గెల్చును తన | శ్వాస చేత
విశ్వాసులను హింస బెట్టిన అంతె క్రీ
స్తుని క్రీస్తు నరకాన త్రోసివేయు

మూడు కప్పలు దయ్య | ములు మాయ వక్తయు
ఆ అగ్నిలోనికే | త్రోయబడును
సాతానునప్పుడు | గోతిలో బందించు
వెయ్యి యేండ్లతనికి | గొయ్యి ఇల్లు

తన్ను గూర్చి యోచన చేయ | తరుణమున్న
అతడు మారడు మారడు | అన్ని యేండ్ల
కాలమున చెరసాలలో | కఠినుడౌను
సిలువ దరిచేర ప్రభువు ర | క్షింపలేడే. 38


ఆ వెయ్యియేండ్లను | అవని యంతట రాజ్య
పరిపాలనచేయ | ప్రభువుదిగును
భక్తులలో గొప్ప భక్తులు దిగివచ్చి
చివరికివారికి బోధ | జేయగలరు

పాపమున్ చేయించు | వారుండరప్పుడు
నైజ పాపమెయుండు| నరునియందు
మానవు లెందరో | మారి రక్షణనొంద
కొందరు దానిని గైకొనరు వినరు

కరవు విషజీవి భీతి భూ | కంప భయము
యుద్ధము తరచు చావులు | నుండబోవు
పంట స్వేచ్ఛా విహారము | ప్రభునిపూజ
దేవ బోధయుండును వారు | తిరగకుంద్రు 39


పరలోక వాసులు | పదినూర్ల వర్షాలు
మతబోధ చేతురు మహిని తిరిగి
ఆబోధ విన్నట్టి | యందరిన్ ప్రభుయేసు
పిలిచి యీ | భూమిపె నిలువబెట్టు

వీరి తీర్మానంబు | విని తీర్పుచెప్పు ని
దే సజీవులతీర్పు | పెంచిచూడ
సత్కరించినవారు | స్వాస్థ్యంబు నొందగా
నితరులు నిత్యాగ్ని | కేగవలయు

పరుల కేదిచేసిన నది | తిరిగి క్రీస్తు
విభునకే చేసినట్లు భా | వింపబడును
గొర్రె మేకల తీర్చని | కొందరనుట
వాక్యశబ్దాను సారము | పట్టిచూడ 40


వెయ్యి గతించిన | వెంటనే క్రీస్తు పా
తాళమున్ విప్ప సై | తానువచ్చి
క్రూరుడై కఠినులన్ | గూర్చి దేవునిమీద
యుద్ధంబు సేయ సం సిద్ధుడగును

వారు ధరణిపైన వ్యాపించి పరిశుద్ధ
పట్టణంబును చేర ముట్తడింత్రు
దేవుని కడనుండి | దిగివచ్చి నగ్ని వా
రిని కాల్చివేయ నా | శన మగుదురు

అంతె క్రీస్తున్న గుండంబు | నందు నగ్ని
గంధకము మండుచుండగ | నందు ద్రోయ
బడును సైతాను యుగ యుగ | బాధనొందు
తనకు తానె యీగతి తెచ్చు | కొనెను అకట. 41


ధరను పవిత్రులు | పరమున శుద్ధులు
సౌఖ్యమొందుదురు శాశ్వతమువరకు
ఊహ నెరుగనట్టి యొకచోట తీర్పుండు
శుద్ధులు దూతలు చూడబోరు

ఆదినుండియును స | మాధులలోనుండి
మారని వారట్క | చేరుకొండ్రు
అప్పుడు కొందరు | అద్భుతాల్ నీ పేర
చేయలేదా ప్రశ్న | వేయగాను

యెన్నడైనను మిమ్మును | నేనెరుగను
అక్రమము చేయు మానవు | లార మీరు
పొండి నా సన్నిధానంబు | నుండి యనుచు
నిత్య నరకములోనికి | నెట్టివేయు 42


ఆదాము తీర్పుతో ఆరంభమైనట్టి
తీర్పులున్నవి నేటి దినమువరకు
ఇది కడవరితీర్పు ఇక తీర్పులుండవు
యిట్టి బ్రతుకె యుండదికనుభువిని

గాని నూతన భువిపైన భక్తులు పాప
నైజములేకుండ నడచుకొండ్రు
వారియొద్దకు క్రీస్తు ప్రత్యక్షమైయుండు
యీక్షితి యపుడొక మోక్షమగును

రక్షితుల మోక్షముననుండు | రక్షకుండు
క్రొత్త యెరూషలేమున పెండ్లి | కూతురుండు
నట్టి స్థలముల నుండును | ఆత్మస్థితిని
బట్టి ప్రతివారిలో నుండు ప్రజ్ఞమీద 43


యేసుక్రీస్తు ప్రభువు | ఇలకువచ్చును వచ్చె
పనిచేసి మృతిగెల్చి | పైకివెళ్ళె
వధువును కొనిపోవ | వచ్చును త్వరలోనె
పిదప పరలోకాన | విందుజరుపు

వచ్చి శత్రువులను వహిని | లో పడవేసి
సాతానుకు చెర | శాలవేసి
తరువాత పదినూర్లు | ధరణినిపాలించు
జీవించువారికి | చెప్పుతీర్పు

యుద్ధమున నపవాదిని | నోడగొట్టి
అగ్నిలోవేయ మృతులకు | నడుపుతీర్పు
పృథ్వియును మోక్షభాగమన్ | పేరుదాల్చు
ఇదియె రక్షణ క్రమమని | ఎరుగవలయు 44

క్రీస్తుప్రభుని చరిత్రలోని నిగ్గు

సీ|| మనవలె శిశువాయె మనవలె భుజియించె
మనవలె పెరిగెను మన మనుజుడె
మనవలె మనవలెను మనవలె నలసెను

మనవలె నిద్రించె మన మనుజుడె
మనవలె వినగల్గె మనవలె చూచెను

మనవలె మాట్లాడె మన మనుజుడె
మనవలె ధరియించె మనవలె బసకోరె
మనవలె జతకోరె మన మనుజుడె

గీ|| పాపశోధన పగవారి | బాధహాని
పరుల సుఖ దుఃఖముల పాలు | బడసె తుదకు
మరణ మొందె గావున మన | మానవుండె
ఇదియె యేసుక్రీస్తు ప్రభుని | ఇహచరిత్ర 45


సీ|| తలపులోనైన నే | తట్టుచూచిన గాని
రవ్వంతయైన నే | రంబులేదు
జనులు చెప్పినవి తా | వినుట పరీక్షింప
రవ్వంతయైన నే | రంబులేదు

పాపులన్ జూచిన | చూపును పరికింప
రవ్వంతయైన నే | రంబులేదు

గీ|| క్రియలు తలచగా నేమియు | కిటుకులేదు
నీతిమంతుడు అవివాహి | నిజ నరుండు
మనుజులను మించు నద్భుత | మానవుండు
ఇదియె యేసుక్రీస్తు ప్రభుని | ఇహచరిత్ర. 46


దేవుండు దేవుండు | గా వచ్చె నరుడయి
గనుక దేవుడె మన జనుడు గాడు
దేవుండె యనితోచు | తీరున బోధించె
గనుక దేవుడె మన జనుడు గాడు

తన శక్తిచే నద్భు | తములు మేలని చేసె
గనుక దేవుడె మన | జనుడుగాడు
తానె మృత్యువుజేరి తానె బ్రతికివచ్చె
గనుక దేవుడె మన జనుడు గాడు

మహిమ రూప మానవుడుగా | మళ్ళె మోక్ష
పురికి; నైనను శిష్యుల | దరినె యుండు
త్వరగ వచ్చును వధువు భ | క్తాళి కొరకు
వెలువడియె నిందు క్రీస్తు దై | విక చరిత్ర 47


ధరణికి నొకమారు దర్శన మిచ్చుట
విమల నరావతా | రము వలెనె
మానవుల్ వర్తించు | మాదిరి జూపుట
విమల నరావతా | రము వలెననె

పాపాలు శిక్షలు | భరియించి యార్పుట
విమల నరావతా | రము వలెననె
మృతుడై సజీవుడై | మృతిని జయించుట
విమల నరావతా | రము వలెననె

మనము చేయజాలనియట్టి | పనులు మనకు
బదులు దేవుండు చేయుట | పరమదేవ
తత్వమును కనపర్చుట | తనివి తీర్చి
బ్రతుకు క్రమపర్చుట యవతా | రము వలన్ననె 48


జంతు రూపము దాల్చి | సంచరించినయెడల
నరులు లోకువగట్టి | తరుమకుండ్రె
దూత రూపము దాల్చి | దొర్లబడిన యెడల
నరులు భీతాంగులై | నక్కకుండ్రె

దేవుండె స్వయముగా | దిగివచ్చి కన్పడ్డ
నరులు భస్మంబయి | నలుగకుండ్రె
నరజన్మమెత్తి మా | నవుల ధర్శించిన
ప్రేమజూపుచు గౌర | వింపకుండ్రె

అందుచే నరరూపాన | నవతరించె
నరులుపిల్చుటకున్ యేసు | నామధారి
యాయె రక్షకుడని దాని | కర్ధమగును
హిందువుల పుస్తకముచెప్పు | యేషు ఇదియె. 49

(షరా:- శ్రీ శుష్కవేదాంత తమోభాస్కరము 174పేజి)


నరులను రక్షింప | నరుడయి పుట్టిన
సత్యవతారియౌ | స్వామి యెవరు
పాపముల్ మన్నించి | పరమ శాంతిని ప్రసా
దించిన స్రష్టయౌ దేవు డెవరు

వాక్కుచే వ్యాధులు | బాగుచేసిన యట్టి
బాహ్యాంతరంగాల | వైద్యులెవరు
వేలాది ప్రజలకు | వింతైన రీతి బో

జనము వడ్డించిన | జనకులెవరు
నడువ వలసిన మాదిరి | నడచి చూపి
చెప్పవలసిన బోధలు | చెప్పివేసి
మన నిమిత్తము యజ్ఞమై | మరల బ్రతికి
యున్న యేసుక్రీస్తే మరి | యొకరు యెవరు? 50


ఎవడు మొదటిరాక | ప్రవచనంబునుబట్టి
అవనిపై నరుడుగా | నవతరించె
ఎవడు దర్శనములు | వివరించి నడచుచు
మాదిరి కనబర్చె | మానవులకు

ఎవడు పాపికి క్షమ నెరిగించి రోగముల్
మందులేకుండనె | మాన్పివేసె
ఎవడు దయ్యములను | ఎగరగొట్టెను గాలి
అలల గండంబును | ఆపుజేసె

ఎవడు మృతులను బ్రతికించె | భువిని గాన
మరణమైలేచి పరలోక | పురము వెళ్ళె
భక్తులను తీసికొనిపోవ | త్వరగ వచ్చు
అతడె యేసుక్రీస్తుగ నన్ను | ఆవరించె. 51


అసలైన దేవుండు - అసలైన నరుడుగ
భూమిపై మనకయి - పుట్టెనెవడు
ఎన్నికజన్మము - ఇదెగాన కన్యకా
గర్భాన మర్మమై - గలిగి నెవడు

వందల వర్షాల - క్రిందట ప్రవచింప
బడిన వృత్తాంతాల - ప్రభలుడెవడు
పాపుల భోజన - పంక్తిని కూర్చుండి
దివ్యబోధలను బో - ధించెనెవడు

తలపులతో వింతజరిపిన - బలుడెవండు
మాటతో వింత జరిపిన - మాన్యుడెవండు

క్రియల వింత జరుపు మహా - షయు డెవండు
అతడె యేసుక్రీస్తను రక్ష - ణాధికారి. 52


నీటియాపద లెల్ల - దాటించి శిష్యులన్
దరికిచేరినయట్టి - దార్ద్యుడెవడు
ఆకలిగానున్న - ఐదువేల కయిదు
భక్ష్యముల్ పంచిన - భక్తు డెవరు
ఉన్నప్రశ్నలకెల్ల - ఉత్తరమిచ్చిన

పరిశుద్ధుడౌ మత - గురువెవండు
అన్నియుగాలలో - అవసరమైనంత
పూర్తిగా కంగున - మ్రొగునెవడు
ఒకడె దేవుడు నరుడు నై - ఒప్పె నెవడు

నరుడయిన పాప మంటని - నరు డెవండు
నరుడయిన దేవుడుగ నున్న - నరుడెవండు
అతడె యేసుక్రీస్తను రక్ష - ణాధికారి. 53


సీ|| గడియ రానప్పుడు - ఘనకార్యమైనను
మానివేసినయట్టి - మాన్యుడెవడు
రానున్న మరణము - రాగనె దానికి
దొరకక జారిన - దొరయెవండు

పాపులంటుకొనిన - పాపమంటుకొనని
పావన నరుడగు - దేవు డెవడు
రోగులనంటిన, రోగములంటని
పరిపూర్ణ జనితుడౌ - నరుడెవండు

తే||గీ|| పాపులను రొగులను క్రీస్తు - వశమెయైరి
వేళయును కాలచక్రము - విభుని వశము
ఎట్టిచిక్కును మరణము - యేసువశము
యేసుక్రీస్తె నను వశము - చేసికొనియె 54


సీ|| నమ్మిక లేనిది - నమ్మికయున్నది
పరికించు నాత్మీయ - వైద్యుడెవడు
తప్పులేనందున - తప్పొప్పుకొననట్టి
పండితులందు - దుర్భావము కనిపెట్టి

పరిశుద్ధ నరుడగు - భక్తుడెవడు
గద్దించియున్నట్టి - జ్ఞానియెవడు
అడుగనివారికి - అక్కరదీర్చిన
దయగల నిజమైన - తండ్రియెవరు

తే||గీ|| సకలజనులను పిలిచిన - యొకడె యెవడు
శ్రేయబోధనలకు నుపా - ధ్యాయు డెవడు
పరమత్రిత్వమందలి దేవ - వ్యక్తియెవడు
అతదె నా యాది అంతము - నందుకొనియె 55


సీ|| దేవుండననకనె - దేశానికెరిగింప
బ్రతుకును యెదుటనె - పరచె నెవడు
అసలై నరుడను - అని ప్రజకెరిగింప
బ్రతుకును ఎదుటనె - పరచెనెవడు

పాపినంచును రూఢి - పరచుట యెవరని
పందెము వేసిన - వాదియెవడు
లోకాలు తనవైన - లోకాస్తిలేకుండి
పరులపై నాధార - పడెనెవండు

తే||గీ|| మనము ధనవంతులగుటకై - తనకు బీద
తనమురానిచ్చి ఓర్చిన - ఘనుడెవండు
అతడు దేవుడు గావున - అన్ని మేళ్ళె
అతడు నరుడుగావున మరి - యన్ని మేళ్ళు 56


సీ|| వచ్చెదనని చెప్పి - వచ్చినతర్వాత
వచ్చితినన్న ప్ర -వక్తయెవడు
అలలపై నడిచిన - యట్లెకష్టాలపై
నడచిన మునుగని - నాధుడెవడు

తనకు రొట్టెలుచేసి - కొనక జనాళికి
కావించె నా సృష్టి - కర్తయెవడు
అపనమ్మకస్తుల - కద్భుతాల్చేయుట
మానివేసిన బుద్ధి - మంతు డెవడు

తే||గీ|| అన్నమాటలు నెరవేర్పు - కొన్న దెవడు
అన్ని దయచేయుచున్న ధ - ర్మాత్ముడెవడు
ఎల్ల కష్టాలలో తోడు - యేసుక్రీస్తె
అతడు నాయందు నేనును - అతనియందు 57


సీ|| సాతాను పొగడుచు - సలహాలు ఇచ్చిన
విననట్టి స్థిరుడైన - విజయుడెవడు
శిష్యులన్ విశ్వాస - సిద్ధులజేయుట
కద్భుతమునుచేయు - నర్హుడెవడు

విశ్వాసనైజము - వెల్లడియగుదాక
సాయముచేయని - సరసు డెవడు
తానె రక్షించిన - నీ నమ్మికయె నిన్ను
రక్షించెనన్న సత్ - ప్రభుడెవండు

తే||గీ|| ఇట్టి శ్లాఘనీయంబగు - గట్టి గుణము
కనబరచియుండునట్టి యా - జను డెవండు
అతడె నాకు ఈ గుణములు - అద్దుచుండు
అతడె నను విడనాడక - అనుసరించు 58


సీ|| పట్టుపడని దైవ - బలమున్న కూల్చక
పట్టుబడిన గొప్ప - బలు డెవండు
కొట్టగా వెంటనే - కొట్ట బలంబున
కొట్టకుండును ఊరు - కొన్న దెవడు

తీర్పరి తానైన - తీర్పరి యెదుటను
సిగ్గు పడక నిలి - చిన దెవండు
చంపు హంతకులను - చంప జీవము గల్గి
చంపనిచ్చిన ధైర్య - శాలి యెవడు

తే||గీ|| ఇట్టి శాంతశక్యుండు నా - యేసుప్రభువె
క్రియలతోను నేర్పినది నా - క్రీస్తు ప్రభువె
అతని శక్తులు వర్ణింప - నలవికాదు
అతని గుణములువిందు నే - ననుభవింతు. 59


జీవజలంబీయ - స్త్రీని నూతిజలము
అడిగిన పరమ దానాత్ముడెవడు
క్రీస్తును అనిచెప్పి - ఆ స్త్రీని బోధకు
రాలిగ మార్చిన - రాయుడెవడు

సమరైయులకు యూదయ - జనులకు పొత్తు
కలపిన ఆ న్యాయ - పురుషుడెవడు
ఏకాంతమున పరస్త్రీకి మర్యాదగ
ధర్మముచెప్పిన తండ్రియెవడు
అన్నపానాదు లవసర | మైనగాని

పరుల రక్షణకై పాటు | పడిన దెవడు
అతడు దేవుడే యేసుక్రీ | స్తాయె నాకు
నన్ను తనయందు నిల్పిన నరజనుండు. 60


ముందు వెనుకలకు - సందియ్యకుండెనె
వేళకు పనిచేసి - వేసెనెవడు
దూరమందున్నట్టి - దుస్థితి పరులకు
దానసుఖమిడిన - జ్ఞాని యెవడు

స్త్రీ పురుషులను వీ - క్షించినపుడు బిడ్డ
అనియున్న దయగల - జనకుడెవడు
దప్పితీర్పని స్త్రీకి - దప్పిక తీర్చెడి
దైవోదకమిడిన - దాతయెవడు

శత్రువులకు జంకని ధైర్య - శాలి యెవడు
భూతములకు భయపడని - పురుషుడెవడు
వేళరానిదె మృతిపైకి - వెళ్ళడెవడు
అతడె యేసుక్రీస్తను రక్ష - ణాధికారి. 61


తాను బోధించిన - ధర్మము నెరవేర్ప
దారిగానగు ఉపా - ధ్యాయుడెవడు
మందువాడక తన - మహిమతో రోగులన్
బాగుచేసిన చిత్ర - వైద్యుడెవడు
ప్రజలలో దూరుచు - బాధించు చుండిన

దయ్యములను వెళ్ళ - దరిమె నెవడు
మృతులను కొందరిన్ - బ్రతికించి జగతికి
దేవుండు తానని - తేల్చెనెవడు
పాపనివృత్తికై సిల్వ బడె నెవండు

మృతినిరానిచ్చి చనిపోయి - బ్రతికెనెవడు
మోక్షమునకు శరీరిగా - బోయెనెవడు
అతడె యేసుక్రీస్తను రక్ష - ణాధికారి. 62


సీ|| పావనదేవుండు కావలిదూతలన్
దివి భువి సర్వంబు స్థిరముజేసె
పాపవిముక్తికా ప్రభువు క్రీస్తుగపుట్టి
మేలు కార్యాల్చేసె, వేలకొలది

ప్రాణమర్పించియు బ్రతికి మోక్షమువెళ్ళె
మనలను కొనిపోవ మరలవచ్చు
ఎప్పుడో తెలియదు ఇప్పుడే సిద్ధమై
యుండి నిరీక్షింప నుత్తమంబు

తే||గీ|| చావు రాదట్టి వారికా | సమయమందు
యేసు క్రీస్తు ప్రభునికథ | ఇష్టమున్న
యెడల బైబిలు చదవండి | బడలికనక
శుభము, దీవెన, జ్ఞానము | సుఖము మీకు 63


సీ|| దేవుడెట్లుండెనో తెలియగోరెడి మాన
వులకు క్రీస్తును జూప గలము మేము
రోగులన్ మాటచే బాగుచేసెను వేగ
దేవుడిట్లుండును తెలిసికొనుడి

పాపులన్ మన్నించె పాపశిక్షనుబాపె
దేవుడిట్లుండును తెలిసికొనుడి
నరునికి దేవుండు నడిపెను సర్వంబు
దేవుడిట్లుండును తెలిసికొనుడి

గీ|| రూపులేని దేవుడు నర | రూపమందు
యేసుక్రీస్తయి భువిలో ని | వాసముండి
సర్వజనులను ప్రేమతో | సత్కరించె
దేవుడిట్లుండునని మీరు | తెలిసికొనుడి. 64


సీసమాలిక (1)

సీ|| ఇట్టివారికె మోక్ష మియ్యంబడుననుచు
పిల్లలన్ చేర్చి దీ | వించెనెవడు

గద్దించునప్పుడు | కనికరమున్ చూపి
అయ్యోల నిట్టూర్పు | లరిచెనెవడు

నాది భూరాజ్యము | కాదని చెప్పిన
పరలోక సామ్రాజ్య పతియెవండు

దివినుండి దిగివచ్చి | దిక్కులన్నియుజేరి
చిన్న పెద్దలను ద | ర్శించెనెవడు

తన దర్శనముచేయ | దలచినవారికి
దర్శనమిచ్చిన | ధారియెవడు

తనలోని ఊహతో | దయ్యాల తోలిన
దైవాధికారియౌ | దార్ద్యుడెవడు

పిలువనప్పుడు వెళ్ళి | పిలిచినప్పుడు వెళ్ళి
అక్కర్లుదీర్చిన | అధికుడెవడు

తమ ఊళ్ళు రానీక | తరుమగా బోధకున్
పంపి చెప్పించిన | బంధువెవడు

గుడిలోని జీవురన్ | కొట్టక బయటికి
పంపివేసిన ద | యా పరుడెవండు. 65


యేసుక్రీస్తు మనకొరకే

సీసమాలిక (2)

మనమూలమునగదా - తనకు జననగతి
మనమూలముగదా తనకుతల్లి

మనమూలమునగదా - తనకు భూలోకము
మనమూలమునగదా - తనకుతండ్రి

మనమూలమునగదా - తనకు స్థలములేమి
మనమూలమునగదా - తనకు తొట్టె

మనమూలమునగదా - తనకు పొత్తిపరుపు
మనమూలమునగదా - తనకు కాపు

మనమూలమునగదా - తనకు విదేశము
మనమూలమునగదా - తనకు యాత్ర

మనమూలమునగదా - తనకు బాప్తిస్మము
మనమూలమునగదా - తనకు గురువు

మనమూలమునగదా - తనకుపవాసము
మనమూలమునగదా - తనకు క్షుత్తు

మనమూలమునగదా - తనకన్నపానాలు
మనమూలమునగదా - తనకు బట్ట

మనమూలమునగదా - తనకు కాలినడక
మనమూలమునగదా - తనకు దోనె

మనమూలమునగదా - తనకెండ బడలిక
మనమూలమునగదా - తనకు దప్పి

మనమూలమునగదా - తనకు నరుల జట్టు
మనమూలమునగదా - తనకు తోడు

మనమూలమునగదా - తనకు నేత్రజలము
మనమూలమునగదా - తనకు చింత

మనమూలమునగదా - తనకు నిట్టూర్పులు
మనమూలమునగదా - తనకు చివుకు

మనమూలమునగదా - తనకు వైరులబాధ
మనమూలమునగదా - తనకు నింద

మనమూలమునగదా - తనకు నల్లచెమట
మనమూలమునగదా - తనకు కలత

మనమూలముగదా - తనకు రక్తపుధార
మనమూలమునగదా - తనకు చావు

మనమూలమునగదా - తనకాజ్ఞశాస్త్రము
మనమూలమునగదా - తనకుకట్టు

మనమూలమునగదా - తనకాజ్ఞనెరవేర్పు
మనమూలమునగదా - తనకు విధులు 66


సీసమాలిక (3)

తనమూలమునగదా - మనకు ప్రత్యక్షత
తనమూలముగదా - మనకుతేట

తనమూలమునగదా - మనకుపదేశము
తన మూలముగదా - మనకు తెలివి

తనమూలమునగదా - మనకు రక్షణదారి
తన మూలమునగదా - మనకు స్వేచ్చ

తనమూలమునగదా - మనకునీతి గ్రహింపు
తన మూలమునగదా - మనకు నీతి

తనమూలమునగదా - మనకు శ్రమలగొప్ప
తనమూలమునగదా - మనకు చావునిదుర

తన మూలమునగదా - మనకు మెప్పు
తన మూలమునగదా - మనకు హాయి

తనమూలముననగదా - మనకు పైజీవము
తనమూలమునగదా - మనకు బ్రతుకు

తన మూలమునగదా - మనకు ఉత్థానము
తన మూలమునగదా - మనకు ధ్వజము

తనమూలమునగదా - మనకాత్మస్నానము
తన మూలమునగదా - మనకు నుండు

తనమూలమునగదా - మనకు రక్షణవాది
తనమూలమునగదా - మనకు ముదము

తనమూలమునగదా - మనకు భక్తిని హత్య
తన మూలమునగదా - మనకుకీర్తి

తనమూలమునగదా - మనకు ప్రేరులవ్రాత
తన మూలమునగదా - మనకుముద్ర

తన మూలమునగదా - మనకు తుష్టి
తనమూలమునగదా - మనకు భాగ్యావళి

తన మూలమునగదా - మనకు మోక్షపువిందు
తన మూలమునగదా - మనకు పురము

తనమూలమునగదా - మనకధికారము
తనమూలమునగదా - మనకు బలము

తనమూలమునగదా - మనము దేవైక్యత
తనమూలమునగదా - మనకు పొత్తు

తనమూలమునగదా - మనకు తథాస్తులు
తన మూలమునగదా - మనకు సిద్ధి

తే||గీ|| ఇట్టిరక్షకుడౌ క్రీస్తు - యేసు ప్రభుని
మ్రొక్కకుండ నీవెవరికి - మ్రొక్కగలవు
యేసు నీవాడె నీవాడె - ఎప్పటికిని
క్రీస్తు చరితము నే నప్ప - గింతునీకు 67


గీ|| పాపములు రోగములు కీడు | బాపుటెవరు?
విన్నపము లాలకించి దీ | వించుటెవరు?
చివరకున్ మోక్షమున నిన్ను | చేర్చుటెవరు?
క్రియకు దేవుండయిన యేసు క్రీస్తుగాక! 68


తే||గీ|| పాపమున వ్యాధి కరువు ఇబ్బంది చిక్కు
పీడ భూతము మరణము | వీనినెల్ల
పరిహరించు రక్షణకర్త | ప్రభువు క్రీస్తె
చావురానిచ్చి కొనిపోవు | జీవమునకు 69


ఉ|| మరణము పాపదోషము స | మాధియధోగతి నారకాగ్నియున్
హరణముగా శరీరమును | నర్పణచేసిన యేసునంటునా
కిరణమునంట వీలగునె | క్రింది కళంకములోన జొచ్చినన్
చరణములెత్తి క్రీస్తునకు | సంస్తుతిచేయుము క్రైస్తవాఖ్యుడా 70


ఉ|| ఇత్తడి పాము వైపు కను | లెత్తగ సర్పవిషంబుపోయె ని
స్సత్తువ యంతరించె విభు | సన్నిధి సిల్వనుచూడ పాపముల్
బొత్తుగ మాయమౌను పరి | పూర్ణబలంబు గల్గునప్డు నీ
చిత్తము వచ్చినట్టు ఘన | సేవయొనర్పను వీలులభ్యమౌ 71


ఆ||వె|| నమ్మి స్నానమొందు | నరులకు రక్షణ
గాని నమ్మకున్న | గలుగు శిక్ష
యేసు క్రీస్తు ప్రభువె యిట్లు | వచించెను
దీని భావమేమొ | తెలిసికొనుడి 72


ఆ||వె|| క్రీస్తు బోధవిన్న | క్రియకు శుద్ధి
క్రీస్తు బోధవిన్న కిట్టదు చెడుగన్న
క్రీస్తు బోధవిన్న | కీడు తొలంగును
గాన క్రీస్తుబోధ | గానవలయు 73


యేసునామ స్మరణ

ఆ||వె|| బైబిలు కథయెరిగి - భావ మెరుగకున్న
యేసు రక్షకుడని - యెరుగకున్న
మతవిషయములందు - మనసు గలుగకున్న
యేసు నామస్మరణ - యెంచిచూడు 74


ఆ||వె|| దేవవ్యక్తిలేడు - దేవదూతలులేరు
ముక్తిలేదు పాప - మూర్తిలేడు
అనుతలంపులెల్ల - అవతరించినవనాడు
యేసునామస్మరణ - యెంచిచూడు 75


ఆ||వె|| అన్నిమతములొకటె - అనుసరించునెడల
దేనిమ్రొక్కుచున్న - దేవుండందు
కొనుటంచు తుష్టి - గొని మురిసిననాడు
యేసునామస్మరణ - యెంచిచూడు 76


ఆ||వె|| జనుని మోసపుచ్చు - సైతాను దయ్యాలు
లేనిమాట నిజము - లేనివార్త
నున్నవార్తయన్న - ఊహ పుట్టిననాడు
యేసు నామస్మరణ - యెంచి చూడు 77


ఆ||వె|| క్రీస్తు మతములోను - క్రియలు బాగుగాలేవు
యేసు మిధ్య యేమొ - ఎవరికెరుక
ఇట్టి మనసు నిన్ను - యేడ్పించు చుండగా
యేసు నామస్మరణ - యెంచిచూడు 78


ఆ||వె|| యేసు నామస్మరణ - లెన్నియో చేసితి
గాని నాకుమేలు - గలుగలేదు
అనునిరాశవృద్ది - నణచివేయునపుడు
యేసు నామస్మరణ - యెంచిచూడు 79


ఆ||వె|| యేసుక్రీస్తె నరుల - యేకైక రక్షకు
డని ప్రకటనచేయు - అందరన్ని
మిషనులైరి దేవమిషనేది - యన్నప్డు
యేసు నామస్మరణ - యెంచిచూడు 80


ఆ||వె|| గొప్పపనులు పూను | కొంటి జరుగలేదు
చెడ్డవారిమాట | చెల్లుచుండు
మంచివారిమాట | మంట గలియునన్న
యేసు నామస్మరణ | యెంచుచూడు 81


ఆ||వె|| గాలివరద పిడుగు - గాడ్పు చలి కరువు
వ్యాధి నింద అల్ప - వయస్సు హాని
తెలిసి ఊరుకొనెడి - దేవుడెందుకనిన
యేసు నామస్మరణ - యెంచిచూడు 82


ఆ||వె|| నీటి మీదహాని - నేలమీదహాని
గాలిలోనుహాని - గనులుహాని
భూమివణకుహాని - మురికిచోటులుహాని
యేసునామస్మరణ | యెంచిచూడు 83


ఆ||వె|| సంశయంబు కలత - శ్రమ పెట్టిననాడు
లేమివ్యాధిభీతి - లేచునాడు
మంచితోచనపుడు -మలినముండిన నాడు
యేసునామ స్మరణ - యెంచిచూడు 84


ఆ||వె|| దీన జనులకొరకు - దేవుండు క్రీస్తుగా
వచ్చెగాన నతని - ప్రక్కజేరు
వారుకడకు మోక్ష - వాస్తవ్యులౌదురు
యేసు నామస్మరణ - యెంచిచూడు 85


ఆ||వె|| పాపిరోగి బీద - వాడ చిక్కునబడి
యున్నవాడ శత్రు - వున్నవాడ
అప్పులున్నవాడ - ఆస్తిపోయినవాడ
యేసు నామస్మరణ - యెంచిచూడు 86


ఆ||వె|| ఇట్టి యిట్టి యెట్టి ! యెట్టి - సంశయమున్న
యేసు నామస్మరణ - యెంచిచూడు
ఇట్టి యిట్టి యెట్టి - యెట్టి కష్టములున్నా
యేసు నామస్మరణ - యెంచిచూడు 87


ఆ||వె|| సౌఖ్యకాలమందు - సర్వబాధలయందు
మార్పు శూన్యమందు - మరణమందు
నీకు నరకమన్న - నిమిషకాలమునందు
యేసు నామస్మరణ - యెంచిచూడు 88


తే||గీ|| చింత, భీతి సందేహము | చివుకు నీకు
కలదు సాతానునకు దయ్య | ములకు గెల్పు;
నిరుకు నిర్భీతి నమ్మిక | నీకు గెల్పు
జయమునకు యేసుపై దృష్టి | సరిగ నిల్పు 89


తే||గీ|| ప్రతినిమిషమును క్రీస్తుని | మతి దలంచి
చూడు మొకదినమైనను | చోద్యమునకు
కష్టముల మధ్య సౌఖ్యము | కలుగు నీకు
స్వానుభవమెగ నీకొక | సత్యసాక్షి 90


తే||గీ|| స్వీయరూపాన త్రైకుండు | చేసె నరుని
పాపమొనరించి అతడు కు | రూపియాయె
జీవితాంతాన మోక్షము | చేరుకొనిన
మహిమ రూపము యేసిచ్చు | మానవునకు 91


తే||గీ|| యేసుక్రీస్తు ప్రభుని పేరు | ఎవ్వరైన
పెట్టుకొనలేదు ఈనాడు | పెట్టుకొన్న
మహిని నిల్వజాలరు క్రీస్తు | మహిమయెదుట
యేసె రక్షకుడనుటకు ఇదియె ఋజువు 92


తే||గీ|| యేసుక్రీస్తుని పేరును | ఎవరైన
పెట్టుకొన్నచో నాపద | వేచియుండు
లేనిచో క్రీస్తులో చేరు | లెక్కచేయవచ్చు
యేసుక్రీస్తుని పేరు నీ హితము హితము 93


తే||గీ|| యేసు కథవంటి కథ సృష్టి - చేసియున్న
కట్టుకథ యిదియని పొడ - గట్టవచ్చు
దివియు భువియు నరుల అను - భముసాక్షి
మూడుకాలాలు దీనికి ముద్రవేయు 94


క్రిస్మసు మణులు

తే||గీ|| ఎంతకాలంబునుండియో | యెదురు చూచు
చున్న భక్తులబృందము | నుద్దరింప
బూని మరియమ్మగర్భాన | బుట్టినావ
పాపులకు ముక్తి మార్గంబు జూపినావ 95


తే||గీ|| పేదలను హీనముగాజూడ - రాదంటంచు
చిన్నతనమునుండియె బోధ - జేయనెంచి
ధరను బాలించు ఘనుల సౌ - ధములవదలి
పశులపాకలో నొకమూల - బండినావు 96


గీ|| ముందునకు సిల్వభారంబు - మోయవలసి
యున్న భారంబు నీమీద - నున్నవనియు
నెరిగియున్నను నెరుగని - నరుని పగిది
పండి యాడుచునుంటివా - పశులదొట్టి? 97


గీ|| నీదు ప్రధమ యాగమనము - నేదలంప
నెపుడు రెండవరాకడలో - నెత్తబడుదు
నెపుడు బరిపాలనమును వె - య్యేండ్లుచేయ
ననెడి తలపులు పుట్టె నా - మనఃమునందు 98


గీ|| దూతలనుగూడి చేసెద - స్తోత్రములను
గొల్లలను జేరి నీ కీర్తి - గొప్పజేతు
జ్ఞానులను గూడి యర్పించు - గానుకలను
పాడుకొందును నీ పేరు - ప్రతిదినంబు 99


గీ|| జనన దినమందు రక్షణ యనుఫలమ్ము
దెచ్చి ప్రేమతో నీవు నా - కిచ్చినావు
ఎట్టి బహుమతిన్ మారుగా - నీయగలను!
ఇదియె! హృదయమున్ కాన్కగా - నిచ్చివైతు
రమ్ము స్వీకరింపుము జగ - ద్రక్షకుండ! 100


గీ|| చూడుడీ మరియమ్మ - చూచినరీతిగ
మనకీయబడిన కు మారునిపుడు

చూడుడీ యోసేపు - చూచిన విధముగ
ఇమ్మానుయేలగు - హితునిజతను

చూడుడీ పై దూత - చూచిన కరణిని
ప్రభువైన క్రీస్తుని బాలవరుని

చూడుడీ పైసేన చూచినపగిదిని
ధరకువచ్చిన సమా - ధానకరుని

తే||గీ|| చూడుడీ గొల్లలాశతో చూచినట్లు
అందరికి మోదమిడురక్ష - ణాధిపతిని
చూడుడి తూర్పుజ్ఞానులు - చూచినట్లు
సర్వజనముల రాజును - శాలయందు 101


సీ|| హృదయంపు పళ్ళెమం - దదిమి విశ్వాసము
కానుకయిమ్ము బంగారమగును

హృదయధూపార్తిలో నిమిడించి ప్రార్ధన
రాజనిమ్మదియ సాంబ్రాణియగును

హృదయంపుపాత్రలో నెగయు పశ్చాత్తాప
మునుబెట్టి యిమ్మది బోళమగును

బంగారమైన సాంబ్రాణియైన బోళ
మైన లేదనుచింత మానవలయు

తే||గీ|| నివి గలిగియుండినను మంచి
హృదయ మొకటి లేనియెడల నేమైన గానరాదు
కనుక నీమూడు గుణములు - గల్గియుండి
హృదయమును క్రీస్తునకు నీయ నెరుగవలయు 102


రెండవ రాకడ

సీ|| ప్రభువు త్వరగ వచ్చి - వధువు సంఘమును మో
క్షమునకు గొనిపోవు - క్షణములోనె

త్వరగ వచ్చుననుచు - బైబిలు చెప్పును
త్వరగ రాడని నీవు - పలుకనేల?

గురుతుల నెరవేర్పు - గుర్తింపవలసిన
మనగడియారమై - తనరుచుండు

బైబిలుకంటితో - ప్రభుని రాకడ జూడ
త్వరగనే యనిబోధ - పడును మనకు

తే||గీ|| లేక లేక నుతుడు బుట్ట - నాకువద్దు
అనునె యేతల్లియైన నీ - యవనియందు
రాక రాక రాకడరాగ - రాకడ త్వరగ
ఏలవచ్చినదందురా - ఎవ్వరైన 103


తే||గీ|| రాకవెలుగు నర్ధాల మ - ర్మాలవెలుగు
అచ్చు బైబిలు ప్రతుల సం - ఖ్యాళి వెలుగు
నీతిమంతుల దైవ స - సన్నిధి వెలుంగు
భూమిపైబడున్ చెలరేగె - భూతసేన. 104


వెలుగు వెలిగిచ్చును

తే||గీ|| సూర్యకాంతి చంద్రునికిని - 1చుక్కలకును
వెళ్ళుటవలన వాటికి - వెలుగు కలుగు
నీతిసూర్యుడౌ క్రీస్తుని - వెలుగు
క్రియలుగల భక్తులను వెలి - గించుచుండు 105


Note 1. వీనస్ (మరియు ఇతర సూర్య గ్రహములు ).

రెండు రాకడలు

సీ|| పశువుల తొట్టిలో - బండినబాలుడె
మహిమ మేఘంబెక్కి - మరలవచ్చు

పొత్తిగుడ్డలపైన - బొర్లినబాలుడె
మహిమవస్త్రములతో - మరలవచ్చు

మట్టిపైబుట్టిన - మరియమ్మబాలుడె
మహిమలోకమునుండి - మరలవచ్చు

నరులమధ్యను జీవ - నముచేయు బాలుడె
నరులను గొంపోవ - మరలవచ్చు

తే||గీ|| ఆదిరాకకు క్రిస్మసు - నాచరించు
మనము రెండవరాకకు - మరివిశేష
మైన రీతిని పండుగ - నాచరింప
దగును రాకకు సంసిద్దు - లగుడివేగ 106


సీ|| దైవాత్మనొందుడి - దైవాంశములువిన
నవలీలగా మీకు - నర్ధమగును

దైవాత్మనొందుడి - దైవచిత్తాను సా
రముగ వర్తింప ని - ష్టముకలుంగు

దైవాత్మనొందుడి - ధర్మముల్ బోధింప
వాగ్ధాటివరుసగా - వచ్చుచుండు

దైవాత్మనొందుడి - ధైర్యంబుతో ప్రతి
పాపంబు నెదిరింప - బలము వచ్చు


తే||గీ|| ఆత్మపూర్ణులై యుండుడి - అనుదినంబు
ఆత్మ అందించువరములు - అందుకొనుడి
ఆత్మనడిపింపు గోరుడి - అన్నిచోట్ల
ఆత్మయే కష్టములయందు హర్షపదము 107


దేవుని మహాపవిత్ర గ్రంథమగు బైబిలు

సీ|| ఏది పాపమొ యది - ఎత్తి చూపించుచు
గద్దించి నేర్పించు - గ్రంథమేది?

పాపాత్ములకు మోక్ష - పథము స్పష్టంబుగా
గనపర్చి నడ్పించు - గ్రంథమేది?

వెయ్యిభాషలనచ్చు - వేయంబడిన వార్త
గా ప్రచారము చేయు - గ్రంథమేది?

దేవుండునొక్కడే - దేవావతారుని
కథయు నొక్కటె యను - గ్రంథమేది?


తే||గీ|| క్రైస్తవమతమె దైవ - సంకల్పనంబు
యేసుక్రీస్తే మానవులకు - నిహపరాల
యందు సర్వమైయున్నాడు - అనుచుదెల్పు
గ్రంథరాజంబు బైబిలు - గ్రంథమొకటె 108


సీ|| అచ్చుపుట్టిన యప్డె - అచ్చుపడిన తొలి
గ్రంథమై వెడలిన - గ్రంథమేది?

వేదాంత పండితుల్ - విసుగకుండను యక్ష
రములు లెక్కించిన - గ్రంథమేది?

వయసుమించిన - వ్యాఖ్యానపుస్తకాల్
కల్పించుకొన్నట్టి - గ్రంథమేది?

అన్ని పదాలకు - అన్వయపదాలు
వ్రాయ పడినయట్టి - గ్రంథమేది?

తే||గీ|| అన్ని గొప్పతనాలకు - అమరగలది
అన్ని ప్రార్ధనలకును - అవుననునది
అన్ని ఖండనలకు నిల్పి - ఆగగలది
బైబిలొక్కటేగాక ఏ వ్రాతగలదు 109


సీ|| చెడ్డవారికి గల | శ్రేష్టమౌ కోర్కెలు
మనవిగా నెంచును | మన జనకుడు

మంచివారికి గల | మంచికోరికలెల్ల
మనవిగానెంచును | మనజనకుడు

భక్తులచేతనే | ప్రార్ధన చేయించి
మనవి నాలించును | మనజనకుడు

భక్తిహీనులుచేయు | ప్రార్ధనల్ దిద్దుచు
మనవి నాలించును | మన జనకుడు


తే||గీ|| మనవి వినలేదు అని చెప్పి | విననె వినడు
భక్తునికిది హర్షంబుగ | పరిణమించు
ప్రభువు చేసేది మేలుగ | ప్రభలమగును
గాన విసుగక ప్రార్ధింప | మానరాదు 110


సీ|| ఘనమైన నీవాక్య - మనుభవించుట నాకు
అనుదినాహారమై - అమరు చుండు

ఘనమైన నీవాక్య - మనుభవించుట నాకు
అనుదినౌషధమయి - అమరు చుండు

ఘనమైన నీవాక్య - మనుభవించుట నాకు
అనుదిన దీపమై - అమరు చుండు

ఘనమైన నీవాక్య - మనుభవించుట నాకు
అనుదిన జీవమై - అమరు చుండు

తే||గీ|| వాక్యగ్రంథమౌ బైబిలు - పఠనచేసి
అందుగల ధన్యతలనెల్ల అందుకొనుచు
జీవనముచేయ బలమిమ్ము - దేవజనక
గ్రంథవిషయమై నీకు నా - వందనములు 111


దైవ స్థాపితమగు క్రైస్తవ మతము

సీ|| మతము సర్వజనుల మతము గాకున్నచో
మతమను మతము సమ్మతముగాదు

"పూర్తిరాగా న సంపూర్తిపోవును" అను
బైబిలువాక్కులు శుభముగాదె

దేవుండె పూర్తిగా దిగివచ్చి ప్రత్యక్ష
మాయెను తేటగా మహినిబుట్టి

గాన మతాలన్ని గలిసి పరీక్షించి
ప్రార్ధింప సత్యంబు బయలుపడును


తే||గీ|| సూర్యుండుదయింప చుక్కల - జోలియేల
దైవమతము గన్పడ ఈ మ - తంబులేల
అన్నిమతము లొక్కేమత - మైనయెడల
ఈ విదేశ స్వదేశాల - యొగ్గుపోదె 112


సీ|| దేవుడెక్కడయని - దీక్షతో వెదకెడి
మనస్సు దేవుడుబెట్టె - మనుజులందు

ఇందుకే వారలు - యిన్నిమతాలు స్థా
పించుకొన్నారిల - వీలుకొలది

సర్వమతాలలో - సత్యాంశములుకొన్ని
యుండకమానవు - ఓడ్చిచూడ

అంతమాత్రంబున - అన్నిమతంబులు
దైవ కల్పనయని - తలపలేము


తే||గీ|| సూర్యబింబము దేవుని - చోద్యసృష్టి
దీపములు నరకల్పన - తేజసున్న
మతములందును దేవుని - మతముగలదు
వెదకవలె నదిదొరకును - ఇదియెయండ్రు 113


సీ|| అన్న వస్త్రాదులు - ఆశ్రయస్థానాలు
ఏర్పాటుచేసిన - దేమతంబు

దేశ దేశాలలో - దేవ వాక్యముచాట
నేర్పాటుచేసిన దేమతంబు

విద్యానాగరికత - వివిధ వృత్తులు నేర్ప
నేర్పాటుచేసిన - దేమతంబు


తే||గీ|| అంటుమాప యత్నించె వై - ద్యంబుచేయు
శాలలనుబెట్టె బైబిలు - సర్వభాష
లకును మార్చె క్రైస్తవమత - మొకటె యిట్టి
మంచిపని చేయునది దైవ - మతముగాదె 114


సీ|| కులబేధమెంచక - కులములన్నిటిలోని
మనుజులన్ దరిజేర్చు - మతమదేది

పరమతస్థులబిల్చి - పరమ మతంబిదె
మళ్ళు డంచునుజెప్పు - మతమదేది

క్రైస్తవేతర మత - గ్రంథముల్ ప్రచురించి
మతపరీక్షకుబెట్టు - మతమదేది

క్రైస్తవులకు లోట్లు - కలిగినన్ క్రీస్తుని
మహిమ వెల్లడిచేయు - మతమదేది


తే||గీ|| ఆదివారమారాధన - ఆచరించు
వ్రతముకల్గి వాక్యమువిను - మతమదేది
అన్నిదేశాలకైవచ్చి - యున్న మతము
మహిని చుట్టిన క్రైస్తవ - మతముకాదె 115


సీ|| సంఖ్యకు ఎక్కువ - సాగుట కెక్కువ
వివరాలకెక్కువ - ఎవరిమతము

రచనకు ఎక్కువ - రాజ్యాల కెక్కువ
కవనమున కెక్కువ - ఎవరిమతము

విద్యకు ఎక్కువ - వైజ్ఞానికెక్కువ
నవశుచి కెక్కువ - ఎవరిమతము

చేతిపనికెక్కువ - సేవకు ఎక్కువ
అవనిలో ఎక్కువ - ఎవరిమతము


తే||గీ|| సర్వకులములవారును - సర్వదేశ
వాసులును సర్వభాషల - వారు సర్వ
కాలములవారు సర్వ మ - తాలవారు
చివరకున్ జేరు క్రైస్తత్వ - మెవరి మతము 116


సీ|| లెక్కకుమించిన - రొక్కము వ్రయపర్చి
మతవృద్ధిచేసిన - మతమదేది

సంఖ్యకు మించిన - జనులకు బోధించి
మతవృద్ధిచేసిన మతమదేది

అంచనకున్ మించు - అవమానములకోర్చి
మతవృద్ధిచేసిన - మతమదేది

పద్దునకున్మించు - బహుమతుల్ వెదజల్లి
మతవృద్దిచేసిన - మతమదేది


తే||గీ|| జ్ఞానమును మనస్సాక్షిని - ఆనుకొనుచు
దైవప్రార్ధనచేయ స - త్యంబు నెరుగు
మనుచు బోధించుచున్నట్టి - మతమదేది
క్రీస్తుమతముగాక మరి - యే క్రీస్తు మతము 117


దైవ ప్రార్థన

ప్రభువు నేర్పిన ప్రార్ధన:-

సీ|| పరలోకమందున వసియించు మా పిత
నీ పేరు పరిశుద్ధ నీయమగుత

నీదు రాజ్యమువచ్చు నీ చిత్తమాకాశ
మందువలెనే భూమియందుగూడ

సిద్ధించుగాక మా జీవనోపాదియౌ
నాహార మిమ్ము మాకనుదినంబు

మాఋణస్థుల మేము మన్నించునట్లుగ
మాఋణంబులయెడ మన్ననొసగు

తే||గీ|| మమ్ము శోధనలోనికి - మరలనీక
కీడులోపలనుండి కా - పాడుమమ్ము
రాజ్యము బలము మహిమ ని - రంతంబు
వగుచునుండును నీవియు - యై తథాస్తు. 118


ప్రభువు ప్రార్థన గొప్పతనము

సీ|| సర్వాంశములుగల్గి సంపూర్తియై వెల్గు
దైవ ప్రార్ధన యేది ధరణియందు

సర్వమతస్థుల సమ్మతియైయున్న
దైవప్రార్ధనయేది ధరణియందు

ఏ మత దేవుని నామము లేనట్టి
దైవ ప్రార్ధనయేది ధరణియందు

బిడ్డలు తండ్రిని వేడు విధముజూపు
దైవప్రార్ధనయేది ధరణియందు


తే||గీ|| మనసు దిగగలనిచ్చెన - మరలనెక్క
గలుగు నిచ్చెన మధ్యను నిలుచుచోటు
ఇట్టి పతకాన వ్రాయుట - కిమిడియుండు
ప్రార్ధనము క్రీస్తునేర్పిన - ప్రార్ధనంబు 119


ప్రార్ధన మెట్లు

మోకరించుము కండ్లుమూసి సర్వముమర్చి
తండ్రినిమాత్రమే తలచుకొనుము

తండ్రి సన్నిధిని నీ తప్పులన్నియుచెప్పి
ఇకమీదటను తప్పులేమియు చేయను

వేసి క్షమాపణ వేడుకొనుము
అంచు గట్టిన నిశ్చయించుకొనుము

క్షమదొరికెను గాన సంస్తుతి చేయుము
ఎంచినవెత్తి ప్రార్ధించుకొనుము

తే||గీ|| పిదప దైవోత్తరమునకై | వేచియుండ
వలయు నిశ్శబ్దముగ తృప్తి | గలుగువరకు
దేవశబ్దము వినబడు దెటగాను
ప్రార్ధనలుచేయు మెట్లివే | పట్టుకొనుము 120


కుటుంబ ప్రార్ధన

సీ|| తల్లియు తండ్రియు తనయులు కూతుళ్ళు
పనివారలును చూడవచ్చువారు

ప్రతి దినోదయమును రాత్రియు నింటిలో
గూడి ప్రార్ధన చేసికొనగవలయు

పొందిన మేళ్ళకై వందనంబులు చేసి
పరమాత్మ సంతోష పరుపవలయు

మనవులు తండ్రికి వినిపించి యదునుకు
సిద్దించునని నిరీక్షింపవలయు


తే||గీ|| ఇట్లుచేసిన నిల్లు వ | ర్ధిల్లుచుండు
ఊళ్ళు దేశాలు దీనిలో | నొకటిగాగ
లోకమున కిప్డు నెమ్మది | రాకపోదు
ప్రార్ధనయు చేయ లెండి ఈ | పాటికైన 121


సీ|| స్నానోప వాసాల సమయదినంబును
భయభక్తితోనె యేర్పరచుకొనుము

సర్వలోకంబుల స్రష్టయౌ దేవుని
సేవించి ప్రార్ధన చేసికొనుము

నీ కల్పన మతంబు నాకు జెప్పిన స్వీక
రించెదనని విన్న వించుకొనుము

దైవమతంబు ప్రత్యక్షంబు కాగానె
అనుసరించుము దాని నానుకొనుము


తే||గీ|| నిత్యమౌ శాంతి యప్పుడే - నీకుగలుగు
ఎల్లవారికీవార్తను - వెల్లడించి
మహిమపర్తువు దేవుని - మహినికీర్తి
ప్రార్ధనమువల్ల జరుగని - పనులుగలవె 122


చం. చెడుగును మంచియున్ మదిని - చేరిన ప్రార్ధనకడ్డుగాన నేర్పుతో
విడువుము బైటచెప్పులను - వీడువిధంబుగ నేర్పుతోసుమీ
తడవక నీవె నీహృదయ - ద్వారముచేసి స్మరించి తండ్రినిన్
అడుగుము నీవుకోరినవి - యన్నియు నెల్ల ఫలంబులభ్యమౌ 123


సీ|| బైబిలులోనున్న - పరిశుద్ధకథలెల్ల
ఎత్తిప్రార్ధించిన - ఉత్తమంబు

బైబిలులోనున్న - వాగ్దానములనెల్ల
ఎత్తిప్రార్ధించిన - ఉత్తమంబు

సభగధలందున్న - సవ్యవిషయములు
ఎత్తి ప్రార్ధించిన - ఉత్తమంబు

నీయనుభవములో - నీప్రార్ధనోత్తరా
లెత్తిప్రార్ధించిన - ఉత్తమంబు 124


తే||గీ|| గ్రంధవృత్తాంతములును వా - గ్ధానములును
సంఘవృత్తాంతములును నీ - స్వానుభవము
చేరి నినుబలపరచి నీ - చేత లెక్క
లేనిపనులు చేయించును - లెమ్ము లెమ్ము 125


సీ|| ప్రార్ధన తర్వాత | భయమును దిగులును
అనుమానమును జంకు | పనికిరాదు

ప్రార్ధన తర్వాత | ఫలము రాకున్నచో
ప్రభువు పై - విసుగుటల్ | పనికిరాదు

ప్రార్ధన తర్వాత | పరిహాసకరమైన
ప్రశ్నలువేయుట | పనికిరాదు

ప్రార్ధన తర్వాత | భక్తిగా నడచుట
ప్రకటన మానుట | పనికిరాదు

తే||గీ|| నీకు దేవుడు సత్యము | నేర్పునపుడు
నిలకడగ దానిలో కోరి | నిలుప వలయు
అపుడు జయమును శాంతియు | అందగలవు

ఉత్తరమునకు ఓపిక | ఉండవలయు

సీ|| ఏకష్టమైనను | ఏదయ్యమైనను
నీప్రార్ధనకుమించి | నిలువగలదె

నీప్రార్ధనకుమించి | నిలువగలదె
ఏవ్యాధియైనను | ఏకరువైనను

ఏకలహమైనను | ఏయుద్ధమైనను
నీప్రార్ధనకుమించి | నిలువగలదె

ఏమృగమైనను | ఏపురుగైనను
నీ ప్రార్ధనకుమించి | నిలువగలదె


తే||గీ|| అన్నిటికిదైవ | వాక్యకడ్గంబు చూపు
మపుడు అవియన్ని | యునువేగ అంతరించు

దేవునికి నీదుమనవులు తెల్పునట్టి
పనికె ప్రార్ధన అని పేరు | వచ్చియుండె 126


ఉ|| భారము కాదు నాకునిను | ప్రార్ధనచేయ వినోద మౌను నా
భారము నీవెగాన | కలభారము లన్నియు | నంతరించునీ
భారము లోకపాపముల | భారమదెక్కువ | మోత యాయెనా
భారము నిన్ను మెచ్చుకొను | భాగ్యము స్తొత్రము యేసు రక్షకా|| 127


తే||గీ|| కరుణ మొనరించు పని కవ | సరము కలము
వరిని పండించు పని కవ | సరము పొలము
సరిగ ఏలునతని కవ | సరము స్థలము
స్రష్టకడను ప్రార్ధన కవ | సరము ఫలము 128


పాపము

సీ|| పాపంబు వలననే | పంటలు పాడౌట
పాపంబువలననే | వ్యాధి గణము

పాపంబు వలననే | పలువిధ మౌ శ్రమల్
పాపంబు వలననే | పాము తేలు

పాపంబు వలననే | భక్తి నాశనమౌట
పాపంబు వలననే | శాప వృద్ధి

పాపంబువలననే | ప్రజలకు మరణంబు
పాపంబువలననే | పశువుచావు


తే||గీ|| పాపమున్ బట్టియే మన | ప్రభువు నకును
మనకు నరులకు నెడబాటు | మహిని గలదు
కడకు శాశ్వతమౌ నర | కంబు గలుగు
వినికిన్ మూలకర్త సై | తాను నుండి 129


సీ|| పరులను అవమాన | పరచు మాటలు క్రియల్
మానవజనితులు | మాన వలయు

తిట్టుట దోచుట | కొట్టుట చంపుట
మానవ జనితులు | మానవలయు

స్త్రీ పురుషాది దూ | రిచ్చను పూర్తిగా
మానవ జనితులు | మానవలయు

కల్పన మాటలు | కలహంపు మాటలు
మానవ జనితులు | మానవలయు


తే||గీ|| నరిని యక్కర కనిపెట్టి | సరుకు ధరలు
హెచ్చు చేయుట లంచాలు | పుచ్చుకొనుట
మానకున్న నెన్నటికైన | హాని హాని
చెడుగు మానిన నెమ్మది | చేరు కొనును 130


సీ|| పాపంబు మానక | బైబిలు చదివిన
ఏమి ప్రయోజన | మెప్పుడైన

పాపంబు మానక | ప్రార్ధనల్ చేసిన
ఏమి ప్రయోజన | మెప్పుడైన

పాపంబు మానక | ప్రభుసేవ చేసిన
ఏమి ప్రయోజన | మెక్కడైన

పాపంబు మానక | ప్రతిగుడి కేగిన
ఏమి ప్రయోజన | మిక్కడైన


తే||గీ|| పాపములు మానకుండ న | ర్పణలు వేసి
సంఘ కార్యములన్నియు | సరిగ చేయు
చున్న నేమి రక్షణ మోక్ష | మొంద గలరె
పాపమును మాని యవిచేయ | ఫలము రాదె 131


సీ|| తమ్ముని నిష్కార | ణమ్ముగా చంపిన
కయీనుడేపాటి | ఘనత బొందె

దీవెన పుత్రుని | దీవెన నాశించి
ఏశావు ఏపాటి | హెచ్చు ఆయె

దావీదు రాజును | తరుముచు వెళ్ళిన
సౌలురాజేపాటి | చావుచచ్చె

సొమ్మాశ గురినితో | అమ్ము కొన్నట్టియూ
దావ్యక్తి ఏపాటి | ధనికుడాయె


తే||గీ|| తమ్ముడును దీవెనయునురా | జ్యమ్ముధనము
ఎటుమరలరా గల్గును | హీనవాంచ
మిక్కుటముగనున్న యెడల | మిత్రులార
కలుష బీజ ఫలితము దుఃఖంబుగాదె 132


తే||గీ|| పిరికితనమును దైర్యము | మరుపు తెలివి
సోమరితనము మందము | చురుకుదనము
కోపగుణము శాంతగుణము | కూడియుండు
ఒకరి హృదయములోననె | ప్రకటితముగ 133


ఉ|| ఇసుక కణంబు లొక్కటయి | ఎత్తగు పర్వతమౌనుగాదె నీ
విసుగు గుణంబు లొక్కటయి | వింతగు పర్వతమౌనుగాదె నీ
బస స్థిరమెట్లుకాగలదు | వచ్చినకష్టములూడ్చుగాదె నీ
రసమును గెల్వలేవు పశు | ప్రాయుడవౌదువు క్రైస్తవోత్తమా 134


పశ్చాత్తాపము

సీ|| తప్పు తెలిసికొన దలచి తెలిసి పరి
తాప మొందినవారు ధన్యజనులు

దుర్భాషలాడిన దోషమునకు పరి
తాప మొందినవారు ధన్యజనులు

లేనిపోని యసత్యమైన వుండిన పరి
తాప మొందినవారు ధన్యజనులు

తే||గీ|| వినికిలో చూపులో తప్పు - గనపడంగ
తాపమొంది దేవుని సన్ని - ధానమందు
ఒప్పుకొని చేయమంచును - చెప్పియికను
తలపనట్టి వారలు మహా - ధన్యజనులు 135


తే||గీ|| తప్పుచేసినవెంటనే - తప్పుకొనుము
అప్పుడు దేవునియొద్దను - ఒప్పుకొనుము
అన్నిపాపములకు క్షమ - అందుకొనుము
మంచిగానుండి బ్రతుకు సా - గించుకొనుము 136


రాగకందము || నేరము తెలిసినవెంటనె
భారముకూడను తెలిసినవాడవునుగదా
భారము తెలిసినవెంటనె
నేరము భారము తొలగగ నిజ భక్తుండౌ 137


సీ|| సృష్టిని మ్రొక్కుటచే మనంబున పరి
తాప మొందినవారు ధన్యజనులు

పరులను గొట్టిన దురితంబునకు పరి
తాప మొందినవారు ధన్యజనులు

నరహత్య ద్రోహమునకు మనస్సున పరి
తాప మొందినవారు ధన్యజనులు

వ్యభిచార వాంచలో ఒడినందులకు పరి
తాప మొందినవారు ధన్యజనులు

తే||గీ|| తప్పునకు నేడ్చుదొంగలు - ధన్యజనులు
పరుల నొప్పించినందున - పరులకమయు
ప్రభుని నొప్పించినందున - ప్రభునిక్షమయి
దయయు బొందినవారు ! ధన్యజనులు. 138


సీ|| ముందె రక్షణనొంది - బుద్ధి గలిగిననా
సద్భుద్ధులకు వన్నె - సంభవించు

ముందె రక్షణనొంది - మోక్షవార్తలుజెప్ప
ప్రజలు హర్షింతురా - పలుకునమ్మి

ముందె రక్షణనొంది - పుణ్యకార్యంబులు
చేసిన దేవుండు చెప్పుకొనును

ముందె రక్షణనొంది - ముఖ్యవిద్యలు సొమ్ము
గడియించుకొన్నచో - ఘనతగల్గు


తే||గీ|| ఎన్ని విద్యలు నేర్చిన - నెంత ధనము
గూర్చినను ఈతవిద్యలే - కున్నయెడల
ఏటిగండము దాటుట - యెవరి వశము
రక్ష నిర్లక్షపెట్టిన - రాదె ముప్పు 139


సీ|| ధనధాన్యములవల్ల దారిద్యము గతించు
గాని మోక్షము మీకు గలుగబోదు

విద్యవల్లను తెల్వి యుద్యోగము లభించు
గాన మోక్షము మీకు గలుగబోదు

గొప్ప కులమువల్ల గొప్పతనమువచ్చు
గాని మోక్షము మీకు గలుగబోదు

మంచిక్రియవల్ల మంచి పేరుగలుగు
గాని మోక్షము మీకు గలుగబోదు


తే||గీ|| మనకు మోక్షంబు నిడుటకే - మహికివచ్చి
యేసుక్రీస్తైన దేవుండు - చేసినట్టి
పనులు నమ్మిన మోక్షము - మనకు దొరుకు
సుళువుగా మోక్షముంజేరు - సూత్రమిదియె 140


రక్షణ నిశ్చయము

(ఈక్రింది పద్యములోని పదివిషయములు చేసిన రక్షింపబడుదురు)

సీ|| పాపంబులేకుండ - భక్తి గానడువుము
బైబిలుచదువుము ప్రతిదినంబు

ప్రతియంశమునుగూర్చి - ప్రార్ధనచేయుము
అపుడు ప్రభునిమాట లాడనిమ్ము

వాక్యముచెప్పుము - పరులకెవరికైన
చందాలు వేయుము సంఘమునకు

విధిలనెల్లను నెర - వేర్చుచు పొందిన
మేళ్ళకై దేవుని మెచ్చుకొనుము


తే||గీ|| యేసునే నమ్మ రక్షణ - యేలరాదు
నీవు రక్షింపబడినావు - నిజము నిజము
ఎన్ని సందేహములు నిన్ను - ఎదురుకొనిన
తొలగకుండుము స్తంభమై - నిలువబడుము 141


గడువులు

సీ|| నరుడు క్రీస్తునితట్టు | తిరుగుటకున్ గడు
వులపైని గడువులు - గలవు కలవు

సుఖమందు తిరుగని - చో కష్టమందైన
తిరుగవచ్చును అప్డు | తిరుగకున్న

మరణమందున క్రీస్తు - మాట్లాడినపుడైన
తిరుగవచ్చును అప్డు తిరుగకున్న

పాతాళమందైన | భక్తులబోధకు
తిరుగవచ్చును అప్డు తిరుగకున్న


తే||గీ|| తీర్పుదినమునందైనను | తిరుగవచ్చు
అప్డు తిరుగనియెడల న | నంతమైన
నరకమునకు పోవలయును | నైజబుద్ధి
దీనికారమౌనిది | తెలిసికొనుడి 142


సీ|| యేసునకున్ముందు | ఎందరో మృతులైరి
వాని సంగతి ఏమి | తీరుపపుడు

ఇప్పుడు నెరుగని | ఎందరోగలరిల
వారి సంగతి ఏమి | తీరుపపుడు

యేసుని యోచన | ఏమియు నచ్చని
వారి సంగతి ఏమి | తీరుపపుడు

మతిలేనివారి సం | గతి యేమి చెవుడున్న
వారి సంగతిఏమి | తీరుపపుడు

తే||గీ|| క్రీస్తునాది దేవుడనుట వాస్తవంబు
గనుక సర్వకాలముల ర | క్షకుడుగాదె
ఏనరుండైన నన్యాయ | మైనతీర్పు
నొండని భీతి మాని యా | నందపడుడి 143


సీ|| మనసుచేతను క్రీస్తు | మతము చెప్పించిన
మనుజులు కొందరు | వినరు వినరు

బైబిలులో దీని | ప్రత్యక్షపరచిన
మనుజులుకొందరు | వినరువినరు

జ్ఞానబలంబుచే | దీని చెప్పించిన
మనుజులు కొందరు | వినరు వినరు

తే||గీ|| జనుల కీ నాల్గుబోధన | సాధనములు
అవసరంబైన స్వప్నము లందునైన
దర్శనములయందైనను | తగినరీతి
సత్యమును మీకు దేవుండు | స్పష్టపరచు 144


తే||గీ|| మార్పుచెందుట భూలోక | మందె సుళువు
కస్సుమనువారికెల్ల హే | డెస్సుమేలు
అచట భక్తులబోధలు | ఆలకింత్రు
ఇచట మారుట కెన్నియో | యేండ్లుపట్టు 145


త్రిత్వము

సీ|| సత్కృపా వర్షంబు | సర్వంబుపై కురి
యించు జనకుని చూ | పించు వాన

దేవత్వమును తేట | గా వెళ్ళడింపను
వచ్చిన సుతునగు పరచు వెలుగు

ప్రభుని బోధను వివ | రముగను బోధింప శు
ద్ధాత్మ నీలోగల | డనును గాలి

తండ్రి గద్దెకు ప్రక్క | తనయుని గద్దె నీ
అంతరంగంబు శు | ద్ధాత్మ గద్దె


తే||గీ|| ఒకరు ముగ్గురు ముగ్గురు | ఒక్కరె ఒకరు
జ్వాల వేడి వెల్తురు | వేరుపరుపలేము
ముగ్గురునులేని ఒకరిని మ్రొక్కలేము
త్రిత్వమర్మము రక్షణ దిక్షయాయె 146


ఆత్మనేత్రము

సీ|| చెవి చూడనేరదు | చెప్పినమాటలు
నేత్రము వినదొక - నిమిషమైన

నాలుక నడవదు | కాలు కూరలరుచి
ఏమాత్రమైనను | ఎరుగకుండు

శిరసు వ్రాయదు వ్రాత | చేయి యాలోచన
చేయదు సుళువైన చిక్కులున్న

నోరు లావైనట్టి | భారముల్ మోయదు
భుజము భుజింపదు | భోజనంబు


తే||గీ|| దేవుడాత్మగావున మన | దేహవాసి
యైన యాత్మచూడగలదు | అయ్యది మన
కన్నుచూచు దినట్లుగ గ్రాహ్యమగును
కండ్లుమూసినన్ దేవుని | గానవచ్చు 147


సీ|| మహిమరాగనె పాపమ యమైన దుస్థితి
మరలిపోవును ఒక్క | మాటుగానె

మహిమగప్పంగనె | మలినమంతయు నడు
గంటిపోవును ఒక్క యదుపులోనె

మహిమ చుట్టంగనె | మహిమలోపలనుండి
శుభవార్త వినబడు | శ్రోత్రములకు

మహిమ ప్రకాశింప | మహిమ రక్షకుని
దర్శనము లభించును | తనివిదీర


తే||గీ|| మహిమ చూచిన భయమొంద | మనకు గలదు
మహిమ భయమును బోగొట్టు | మహిమనుండి
మహిమ పరలోక మహిమకు ! మార్గమగును
మహిమకై వేడుడి భువిని మనుజులారా 148


తే||గీ|| యేసుక్రీస్తు ప్రభువులోని - ఎంచదగిన
దివ్యగుణములు చూచిన - దీర్ఘదర్శి
యైన యెషయా అనుభవము - అందరకును
కలుగు గాక దీవనగానె - క్రైస్తవమున 149


సీ|| క్రైస్తవులకు హింస | కలిగించి బైబిలు
చింపిన సుందర | సింగుగలడు

సర్వలోకంబుల | స్రష్ట కల్పించుము
నిను గొల్తునని యొక | మనవిచేసె

అపుడు క్రీస్తతనికి | అగుపడగా నిన్ను
పిలువలేదని సింగు | పలికెనంత

సర్వలోకంబుల | స్రష్టనుగనుకనె
వచ్చితినని క్రీస్తు బదులుచెప్పె


తే||గీ|| మనసుమార సుందరుడు న | మస్కరించె
వెంటనే క్రీస్తతనిలో ప్ర | వేశమాయె
నిత్యవాసిగ సింగులో | నిల్చిపోయె
సాధు సుందర సింగు పు | స్తకము గొనుడి 150

ఇతర అంశములు

సీ|| బ్రతుకొక చెడుగాధ | బ్రతుకొక కడుబాధ
తీర్చుమునాసేద | దేవనాధ

ననుజూచె నీకన్ను | నినుజూచె నాకన్ను
నేడు రేపునుమున్ను | నీవెతెన్ను

పలుమారు ననుదిద్ది | కలుగజేయుము వృద్ధి
నీ లక్షణములద్ది | నేర్పుబుద్ది

నీ కటాక్షముబట్టి | నెనరుతో ననుగట్టి
నీకడ ననుబెట్టి | నిలుపబట్టి


తే||గీ|| ఎంత కీడున్న గల్గును | హృదయశాంతి
నామదికి వెల్తురగును నీ | మోముకాంతి
ప్రభువ సిద్ధపరచుము నీ | వధువు బంతి
యందు స్థిరపరచుము | నాకదియెజయంతి 151


సీ|| దైవభక్తాళికి - దారిద్ర్యమబ్బును
కెరటాల కష్టముల్ - పొరలివచ్చు

ఎంత ప్రార్ధించిన - ఎక్కువయగుగాని
అలలెంతమాత్రము - అణగకుండు

అదియట్టులుండని - రాశా సముద్రంబు
సృష్టంబుగా గాన - బడుచునుండు

దైవవగ్ధానాలు - తలపున - కు వచ్చినన్
చప్పగచప్పగ నుండ - సాగుచుండు


తే||గీ|| కష్టకాలమందుగూడ - నిష్టముగనె
ప్రభుని సేవింప నలవాటు - పడినయెడల
ఆత్మకెంతయు బలము జ - యంబు కీర్తి
అప్పుడపవాది దయ్యముల్ - తప్పుకొనును 152


ఉ||మా|| చీమలు రాతిపై నడువ - చిన్నదియైనను దారి ఏర్పడున్
పామరుడెంతగా చెడిన - భక్తులమాటలు మాటిమాటికిన్
నామకరీతినైన వినునా - వినడా మది మారకుండునా
క్షేమ సువార్త చెప్పవలె - క్రీస్తున కిష్టము క్రెస్తవాఖ్యుడా

తే||గీ|| వాక్యపఠనము ప్రార్ధన్సు - వార్తబోధ
కానుకల యర్పణము దివ్య - మైన నడత
అడ్డులెన్ని వచ్చినను యీ - యైదుపనులు
చీలకున్న తప్పుడు దర్శ - నాలు రావు 153


సీ|| మీరూరుకొన్నచో ఈ రాళ్ళు కేకలు
వేయును అని యేసు విభుడు చెప్పె

పరదేశ రాజులు బైబిలు చరితము
వ్రాసిన రాళ్ళిప్డు బైలుపడియె

అవి తలపైకెత్తి అడుగుడి బైబిలు
సత్యమేయని గట్టిసాక్ష్యమిచ్చు

యూదాజనాంగము ఊరుకున్నది క్రీస్తు
చర్య లెవరికిని చాటలేదు

తే||గీ|| నమ్మలేనిది క్రీస్తునీ - నాడు నేడు
పరమతస్థులెనమ్మి స - ర్వత్ర వెల్ల
డించుచున్నారు విధిగానె - యెంచుకొంచు
అన్యజనులె యీ రాళ్ళొక - యర్ధమందు 154


క్రొత్త సంవత్సరము

తే||గీ|| నూత్న సంవత్సరం క్షితిన్ - ఖ్యాతిగాంచి
ధర్మమైయున్న నీదయా - ధాత్రిలోన
ధరణి ధరియింపజేసితివి - రివిగాను
యేసు నీప్రార్ధనంబును - జేసికొందు 155


స్వస్థత

తే||గీ|| మనసుతీర బోధించుట - మాదివంతు
మిగుల దృఢముగా నమ్ముట - మీదివంతు
స్వస్థపరచుట మన క్రీస్తు - ప్రభునివంతు
కుదరగామీరు వేతురు - దుప్పిగంతు 156


తే||గీ|| ఆదివారము సృష్టికి - ఆది దినము
అన్నిటిని ప్రభువోడించి - యున్నదినము
ఆత్మసభమీద - కుమ్మరింపైన దినము
గనుక త్రియేకుని స్తుతింప గలుగు - దినము 157


సాతానునెదురించు పద్యము

సీ|| సాతానుసర్పమా - సర్వకార్యములందు
శ్రమలతోకూడిన - చావునీకు

నరులను బాధించు - నపుడెల్ల వ్రాతలో
పడిన శిక్షలు పయి - బడును నీకు

యూప్రటీస్ నదివద్ద - ఉన్న భూతాలకు
కల్గినదుర్గతి - కలుగునీకు

విజ్ఞప్తిపత్రిక - వెల్లడింపకముందె
కంపయు భీతియు - కలుగునీకు


తే||గీ|| హేడెసనుమాట తలనొప్పి - హింసనీకు
హర్మగెద్దోను యుద్ధము హ - డలు నీకు
కడుతరుగని గొయ్యియె మొట్టి - కాయ నీకు
అగ్నిగుండ మనంత ని - రాశ నీకు 158


స్వాతంత్ర్యము

సీ|| తిట్టిన కొట్టిన | తిరుగ పై బడుచుండు
స్వాతంత్ర్యమెక్కడ | చచ్చిపోదె

దోచిన చంపిన | దొరలిమీదనెబడు
స్వాతంత్ర్య మెక్కడ | చచ్చిపోదె

కీడుచేసినవెన్క | కీడె తరిమివచ్చు
స్వాతంత్ర్యమెక్కడ | చచ్చిపోదె

మేలు చేయనుమాన | మేలుకలుగకుండ
స్వాతంత్ర్యమెక్కడ | చచ్చిపోదె

తే||గీ|| ఇందువలన వ్యాకులతయు | హీనస్థితియు
సంభవించును తప్పదు | చావుచావు
కీడుమాని మేలొనరింప | క్షేమమగును
ఇదియె స్వాతంత్ర్యజీవము | హితము హితము 159


సీ|| పాపముల్ మాన్పించు | భక్తులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

మతవైరమునుతీర్చు | మాన్యులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

కులమును పోగొట్టు | కోవిదుల్ లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

శత్రుత్వమును నాపు | సాధువుల్లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు

తే||గీ|| సృష్టిపూజను మాన్పించి - స్రష్టపూజ
నేర్పు నిపుణులులేచిన - నిండుస్వేచ్చ
కలుగగా దేశమునకు సు - ఖము లభించు
స్రష్టపూజయే భాగ్యాల - సాధనంబు 160సీ|| తలపులో తప్పున్న - తనువెల్ల చెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె

మాటలో తప్పున్న - మర్యాదచెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె

క్రియలలో తప్పున్న - క్రియకన్ని చెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె

మూటిలో ఒకటైన - మూలబడినయెడ
స్వాతంత్ర్యమెక్కడ చచ్చిపోదె


తే||గీ|| మూడునొక్కటై పనిచేయ - ముప్పుపోవు
దైవభక్తి నాగరికత - ధర్మగుణము
విద్యమున్నగువానికి - వెలుగువచ్చు
అపుడు సంపూర్ణ స్వాతంత్ర్య - మబ్బు మనకు 161


సీ|| ఏలికయును ప్రజ - ఏకీభవించిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము

పరదేశజనసహ - వాసముండిన గొప్ప
స్వాతంత్ర్యమేలదా - జయము జయము

కలహంబులకు సందు - కలుగగా నణచిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము

సోదరభావంబు - శోభ్బిల్లుచుండిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము


తే||గీ|| దేశచిత్రాలు దర్శింప - తిరుగనెడల
అనుభవాభిమానంబులు - అధికమగును
సర్వస్థల జనములపరి - చయము కల్గు
సంతసముతుష్టి స్వాతంత్రత - శక్తిపుట్టు 162


అ||వె|| సత్యమైన యేసు - సత్యము స్వాతంత్ర్య
మిచ్చుననుచు చెప్పి - హెచ్చరించె
సత్యమైన యేసు - స్వామినిచేరిన
పూర్ణస్వేచ్ఛ మనము - పొందగలము 197


తే||గీ|| క్రీస్తు తొలగింప నేరని - కీడులేదు
వీలుకాదని అంగల - మేలు లేదు
ఈయ శక్తి లేకున్నట్టి - ఈవి లేదు
కడను చేర్చలేనట్టి మో - క్షంబులేదు. 198


కులము

తే||గీ|| మాటలలో కులమును రూపు - మాపవలయు
వ్రాతలోకులమును నెడ - బాపవలయు
నిమ్న జాతికి తగువిద్య - నేర్పవలయు
సంకర వివాహమందది - గ్రుంకవలయు 163


తే||గీ|| క్షుద్ర జాతుల గృహములు - శూద్రులున్న
పేటలందు నడుమజల్లి - వేయవలయు
ప్రేమగౌరవములను చూ - పింపవలయు
అపుడు కులము పూర్తిగ - నంతరించు 164


తే||గీ|| పాపము ధరణిమీదికి - ప్రాకిపోయె
అందుచేతనే ఐక్యత - అంతరించె
అపుడు క్రమముగ కులనిష్ట - అవతరించె
కులము దేవుని సృష్టిలో - గలుగలేదు 165


దేవదాసు అయ్యగారి గురించి ప్రభువు అందించినవి

సీ|| పరమ ధర్మములన్ని - పట్టింపుగా నేర్పు
కొనబట్టి నీకు ఈ - గొప్పతనము

పరమ ధర్మములను - బట్టి నడువబట్టి
శుభకరంబుగ నీకు - ప్రభుని మెప్పు

పరమ ధర్మములను - పరులకు బోధింప
పనిపూనుకొను నీకు - ప్రతిఫలంబు

ప్రకటింపకుండనె - పరులకై ప్రార్ధించి
పరము చూచిన నీకు - ప్రజ్ఞ కీర్తి

తే||గీ|| వేడి దేవునితో మాట - లాడవలయు
చదివి దేవవాక్కాలింప - సాగవలయు
పాపక్షమయును బలమును - బాయవలయు
విజయమొంది మోక్షమపుడు - వెళ్ళగలవు 171


సీ|| తల్లిదండ్రులకు నీవు - తగిన పుత్రుండవు
అందుచే ఐశ్వర్య - మబ్బెనీకు
బంధవులకు నీవు - బంధు జనుండవు
అందుచే ఐశ్వర్య మబ్బెనీకు
స్నేహితులకు నీవు - స్థిర స్నేహితుండవు

అందుచే ఐశ్వర్య - మబ్బెనీకు
తే||గీ|| అన్ని మంచి విషయములం - దాశనీకు
అన్ని దుర్గుణంబులును హే - యంబునీకు
ప్రజల రక్షణ విషయము - పట్టు నీకు
దైవసేవ వ్యాప్తికి దేవ - దాసు నీవు 172


తే||గీ|| అన్ని విషయాలు ప్రకటన - యైన వెన్క
మిషనులు మతాలు బైబిలు - మిషనులోకి
వెళ్ళునను వచనము నెర - వేరగలదు
దైవవాక్కిదియని దేవ - దాసు చెప్పె 173


తే||గీ|| మానవుల పనివంతు స - మాప్తమగును
అపుడు నీవంతు స్వప్నము - నందుగాని
దర్శనము నందుగాని నీ - ధర్మబోధ
జనుల కందించుమందునా - జనకనిన్ను 174


తే||గీ|| వెలు దేవ సృష్టిని చూపు - విశదముగను
గాలి వసుద జొచ్చును అన్ని - మూలలందు
వాన దాని ఋతువునందు - వచ్చుచుండు
మూడు సుఖదాయకము లివి - భూజనులకు 175


పరీక్షోపదేశము

సీ|| వినవలె తర్వాత - వివరంబుగ పరీ
క్షింపవలెను దాని - దుంపవరకు

నచ్చినరీతిని - నడువవచ్చును నీకు
వెగటుగానున్నవి - విడువవచ్చు

గాని నిన్నెరిగిన కర్తయౌ దేవుండు
నీకు తీర్పరిగాను - నిలుపబడును

రోషంబు కూడదు - ద్వేషంబు కూడదు
వేషంబు కూడదు - విసుగరాదు

తే||గీ|| ఎవరి మతమునువారు లు - విశదముగను
ప్రచురపరచి స్వాతంత్ర్యము వాడవచ్చు
మతపరీక్షకై దేవుని - మదితలంచ
ప్రార్ధనము చేయ సత్యంబు - బైలుపడును 176


సీ|| మత వివాదాంశముల్ - మాట్లాడుకొనవచ్చు
గాని విరోధాలు - గలుగరాదు

పరమతమును నిష్టపడక పో - వచ్చును
గాని విరోధాలు - గలుగరాదు

స్వమతమందలి గొప్ప - చాటించుకొనవచ్చు
గాని విరోధాలు - గలుగరాదు

అన్ని మతాలేనేర్చు - కొన్నచో మంచిదే
గాని విరోధాలు గలుగరాదు

తే||గీ|| ఎన్ని వ్యతిరేక విషయంబు - లున్నగాని
వరుస సోదర భావము - వదలరాదు
అపుడు పోట్లాట యుద్ధముల్ - ఆగిపోవు
సర్వలోకమునకు గొప్ప - శాంతిగలుగు 177


తే||గీ|| మానవులగు మీహృదయము - లోనున్న
జ్ఞానమును మనస్సాక్షిని - ధ్యానమందు
అడిగినట్లైన నిజమ గుపడును మీకు
అపుడు సంతుష్టికలుగు నీ - యాత్మయందు 178


సీ|| దేవుడున్నాడను దీక్షతో జీవింప
జీవాంతమున ముక్తి జేరవచ్చు

ష్టాలుండవది నీకు మేలుగాదె
దేవుండులేకున్న ఏవిధ లాభ న

దేవుండె యున్నచో నీ వపనమ్మిక
కల్గియున్నందున కలుగు కీడు

కనుకనే దేవుండు కలడను మాబోధ
సృష్టి మనస్సాక్షికి చెప్పునిట్లె


తే||గీ|| దేవుడే క్రీస్తుగానుండి - తెల్పినట్టి
బైబిలను భేదమొక్కటే - భక్తితోడ
అనుసరించుడి మోక్షంబు - అందుమీకు
తరచి చూచువారికి శాంతి - దొరక గలదు 179


సీ|| గాలి ఒంటికితాకి - గలదని తెల్పును
గాని కంటికి అది - కానరాదు

పలుకు చెవికి విన - బడుచునే ఉండును
గాన కంటికి అది - కానరాదు

జ్ఞానమునకు నస్తు - జ్ఞప్తి వచ్చుచునుండు
గాని కంటికి అది - కానరాదు

ప్రాణము ఉన్నట్టు ప్రతివా రెరుగుదురు
గాని కంటికి అది - కానరాదు

తే||గీ|| ఐనవి ఉన్నవని నమ్మ - నగునెకాదె
కంటికగపడ్కదేవుడు - కలడనంగ
నరులు నిరుకుగ ఎందుకు - నమ్మరాదు
దీని నమ్మువారలు ధన్య - లైన జనులు 180


తే||గీ|| జ్ఞానమునకు తోచిన మత - మూనవలయు
మననుకోరు మతము చేరు - కొనగవలయు
కలకుగనపడు మతమున గరియవలయు
గాని తీర్పరిదేవుడే - కడవరకును

తే||గీ|| మతములును శాఖలును ప్రతి - మానవుడును
చెప్పు బోధలు వేరుగా - నొప్పుచుండు
దేవ చిత్తముకొరకు ప్రా - ర్ధింపవచ్చు
గాని తీర్పరిదేవుడే - కడవరకును

పరీక్ష

సీ|| నరులు స్వతంత్రులు | విరివిగ మతబోధ
వెల్లడింపగవచ్చు | విశ్వమునకు

పరజన బోధలు - పడనివి ఉన్నచో
కలహింపకుండుట | ఘన ఘనత

ఎవరైన తోడి మా | నవులేగదా యని
సహించుకొనుటయే | శాంతి గుణము

అయినను సలహాలు | అందింపవచ్చును
తక్కినమర్మములు | తరచవచ్చు

తే||గీ|| సర్వమతముల వారొక - స్థలమునందు
కూడి అందరు దెవుని - వేడుకొనగ
నిజము తెలియును అప్పుడు - నిగ్గుతేలు
సత్యము ననుసరించుట | సాహసంబు 181


సీ|| నరుడు స్వతంత్రుడు | సరికానిరీతిని
బ్రతికి తత్పలమును | బడయగలడు

నరుడు స్వతంత్రుడు | సరికానిరీతిని
బ్రతికి తత్పలమును | బడయగలడు

స్వమతంబు విడనాడి | పరంతంబున జేరి
బ్రతికి తత్పలమును | బడయగలడు

స్వమతశాఖను వీడి | పరశాఖలోగూడి
బ్రతికి తత్పలమును | బడయగలడు

తే||గీ|| తన మనస్సాక్షి జ్ఞానంబు | ననుసరించి
నడచుచును పనులన్నియు | నడుపుకొనుచు
పరజనులను తన కడకు | బిలుచునెడల
దేవన్యాయంబె యతనికి తీర్పుతీర్చు 182


తే||గీ|| జ్ఞానమును మనస్సాక్షిని | ఆనుకొనుచు
దైవప్రార్ధన చేత స | త్యంబు నెరుగు
మనుచు బోధించుచున్నట్టి | మతమదేది
క్రీస్తుమతముగాక మదియే | క్రీస్తుమతము 183


సీ|| మా మతమే దైవ | మతము తక్కిన మత
ములు కావు వాటిలో | ముక్తిలేదు

అర్ధభేదమోగాని | అన్ని మతంబులు
ఒక్కటే మనసున చక్కబడిన

నాది ఏమతమును | కాదు సమ్మతమే నా
కున్నమతము అను | కొన్న మతము

ఈ మూడు మతములు | ఇహలోకమంతటన్
పెరుగుచువచ్చెను | స్థిరమతములు


తే||గీ|| ఏ మతమునందు గలవాని | నెత్తకుండ
అన్నిమతముల పెద్దలు | అనుదినంబు
దేవ! ప్రత్యక్షమగుము నా | భావమందు
అంచు వేడిన సత్యము | నెంచగలరు 184


వస్తుసాక్షి

సీ|| ఏడు రంగుల ప్రొద్దు - యేసు దేవుడు నన్ను
కలుగజేసెను నిన్ను - కాగడగను

పాలుగ చంద్రబిం - బము నేను నన్నును
పరమాత్ముడుంచె దీ - పంబుగాను

చీకటిరాత్రిలో చిన చుక్కలము మేము
అతడె వెల్గించె దీ - పావళిగను

మేఘపాత్రనునుండు - మింటిజలము నేను
భూశిరస్సుపయిన - పోతనేను


తే||గీ|| ప్రాణమేమియు లేనట్టి - వస్తుగణము
యిట్టి బలమైన సాక్ష్యము లిచ్చుచుండ
దైవజ్ఞానము జీవము - దాల్చియున్న
ఇల జనుల మెంతగ సాక్ష్య - మియ్యవలెను 185


సీ|| నింగిని భూమిని - నిర్మించుటవలన
పరమ దేవుడు తానె - బైలుపడియె

మానవ హృదయాన - జ్ఞానమిచ్చుటవల్ల
పరమ దేవుడు తానె బైలుపడియె

సరసునందున మాన - స్సాక్షిండుటవలన
పరమదేవుడు తానె - బైలుపడియె


తే||గీ|| బాహ్యక్రెస్తవ సభయందు - బైలుపడియె
బైబిలను గ్రంథమందున - బైలుపడియె
పట్టు పట్టినవారికి - బైలుపడియె
వీని గుర్తించు మనుజుడే - జ్ఞానియౌను 186


సీ|| తన వినయము స్వప్న - మున గనపర్చుచు
పరమ దేవుడుతానె - బైలుపడియె

తన ముఖబింబము - దర్శనమున చూపి
పరమ దేవుడు తానె బైలుపడియె

తన స్వరమునుతేట - గను వినిపించుచు
పరమదేవుడుతానె - బైలుపడియె

తన వ్రేలితో వ్రాసి - తన చిత్తమునుదెల్పి
పరమదేవుడు తానె - బైలుపడియె

తే||గీ|| కార్యసిద్ధియందు - కష్టసుఖములయందు
వివిధము నెల్ల - వినుటయందు
గ్రంథ పఠనయందు - కాలస్థితులయందు
ఊహలందు దేవు - డుండుచుండు 187


సీ|| మానవులందరిలోను - దేవుని లక్ష
ణములు జన్మమునందె - అమరియుండె

వానిని క్రైస్తవుల్ - వాడి యంత్రాదులు
క్రొత్త విద్యలు కను - గొన గలిగిరి

అవి చూచి ఇతరులు - ఇవి మాకు ముందున్న
వని తేలికగచెప్పు - కొనుటగలదు

అది నిజమైనను - అవి పూర్వికులు వృద్ధి
చేయకుండనె చని పోయిరకట


తే||గీ|| వాస్తవమొనకు వాటిని - క్రైస్తవాళి
వృద్ధిలోనికి తెచ్చిరి - వృద్ధి మనము
అనుభవించుచున్నాము - నేడనుదినంబు
క్రైస్తవ జనకార్య ముపయో - గంబుగాదె. 188


సీ|| సాతాను సర్పమై - జనుల తల్లిని పాప
మున ద్రోసి మృత్యువున్ - మొదటదెచ్చె

పాపాలు పాములై - ప్రజలను గరచుచు
సర్వకాలములందు సంచరించు

కష్టాలు పాములై - కలుషాలు ఫలితమై
చుట్టువేసికొనుచు - కొట్టుచుండు

భక్తిహీనులు భక్తి - పరులును నను వివ
క్షతలేక ఓడించు - ప్రతినరునిని


తే||గీ|| ఒకడుమందు డొక్డ జ్ఞాని - యొకడు రోగి
ఒకడుసుఖి ఒకడవమాన - మొందువాడ
ఒకడు కీర్తిమయుండిటు - లుండు బ్రతుకు
ఇదియె పాము న్యాయంబని - యెరుగవలయు 189


స్వపరీక్ష

సీ|| పరుల నల్లరి పెట్టు - పనిమీద నున్నావు
రక్షణ తెలిసెనా - మోక్షమునకు

కట్టుకథ లనేకంబు - కల్పించు చున్నావు
రక్షణ దొరికెనా - మోక్షమునకు

మేళ్ళకు కీడునే - ప్రేమించు చున్నావు
రక్షణ నిలిచెనా - మోక్షమునకు

నను క్షమించును - అనియను చున్నావు
రక్షణ పెరిగెనా - మోక్షమునకు

తే||గీ|| ఆవగింజంత ఫల - మైనదియు పోదు
కొండ ఎంతటి ఫలమైన కొట్టబడదు
నిండు గింజంత పట్టుం - డవలయునీకు
నీమదిని దొంగిచూడుము - నీకు తెలియు 190


సీ|| పరులను కొట్టిన - దురితంబునకు పరి
తాప మొందినవారు ధన్యజనులు

నరహత్య దోషంబు - నకు మనసున పరి
తాప మొందినవారు ధన్యజనులు

సృష్టినీ మ్రొక్కుట - చే మనంబున పరి
తాప మొందినవారు - ధన్యజనులు

తే||గీ|| పరుల నొప్పించినటువంటి - పనులు చేయ
నా పరులనే క్షమాపణ - యడుగ వలయు
ఇట్లు రెండుక్షమలనొంది - హృదయశుద్ధి
దాల్చుకొను ధీరులే మహా - ధన్య జనులు. 191


క్రిస్మసు

తే||గీ|| సర్వలోక ప్రజాసంఖ్య - సమయమందు
సర్వలోకాధిపత్య వై - శాల్యమందు

సర్వలోక రక్షణకర్త - జననమాయె
సర్వజన దైవ గ్రంధాన - చవుమిద్ది

సీ|| ప్రభువు పుట్టినవార్త - ప్రభువు దూతయెవచ్చి
ధరణికి చెప్పె యు - క్తంబుగాదె

ప్రభువు పుట్టినవార్త - పరలోక వాసి యెవచ్చి
ధరణికి చెప్పె యు - క్తంబుగాదె

ప్రభువు పుట్టినవార్త - ప్రభువు నెదుటనిల్చు
గబ్రియేల్చెప్పె యు - క్తంబుగాదె

తే||గీ|| మొదటి తాజెప్ప విన్నట్టి - మొదటివారు
తోటి నరులకుచెప్ప నా - తోడివారు
ఇతరులకు జెప్ప వ్యాపించె - క్షితిని మనకు
వార్త పంపిన తండ్రికి - ప్రణుతి ప్రణుతి 192


ఉ|| దోసముబాపి నిన్ను తన - తో నివసించు స్వతంత్రమియ్యనీ
కోసము వచ్చి కన్పడెన్ - గొల్లలకున్ - నరరూపధారిగా
ఆ సువిశేషమందె అది - హర్షమొసంగును నీకు నెప్పుడున్
యేసును గొల్వకుండ మరి - యేరిని గొల్చిన!మోక్షమందునో 193

పక్షవాతరోగి

సీ|| పక్షవాయువురోగి - బాగు పడకముందె
లెమ్మని యేసు వా - క్యమ్ము పలికె

పక్షవాయువురోగి - బాగుపడకముందె
పరుపెత్తుకొమ్మని - ప్రభువుపలికె

పక్షవాయువురోగి - బాగుపడకముందె
పక్షవాయువురోగి - రక్షకుడన్నట్లు

ఇంటికి పొమ్మని - యేసు పలికె
చేయగ రోగంబు - మాయమాయె

తే||గీ|| అట్టి విశ్వాసమును విధే - యతను నీవు
ప్రభువు చారిత్ర చదువుట - వల్లగలుగు
నమ్మికయు విధేయతయు మ - నస్సు నందు
ఉన్ననాటిక్రీస్తే నేడు - నున్న క్రీస్తు 194


సిలువ

సీ|| కడలేని ప్రేమ - ఎక్కడలేని ప్రేమ ఇ
క్కడ కనబడియెను - కడకు నాకు

కడలేని శక్తి ఎ - క్కడలేని శక్తి ఇ
క్కడ కనబడియెను - కడకు నాకు

కడలేని జీవ మె - క్కడలేని జీవ మి
క్కడ కనబడియెను - కడకు నాకు

కడలేని న్యాయ - మెక్కడలేని న్యాయ మి
క్కడ కనబడియెను - కడకు నాకు

తే||గీ|| వేడుకొన్న క్షమకు అది - ప్రేమయాయె
సహనమునకు హేతువు ఘన - శక్తియాయె
చెడని మంచికి మూలము - జీవమాయె
నరుల సిల్వ క్రీస్తొందట | న్యాయమాయె 195


నీ నిమిత్తమెగదా

సీసమాలిక (4)
నీ నిమిత్తమెగదా - నిత్యదేవుండు ఈ
వసుధకు రాగోరె - వార్తపంపె
నీ నిమిత్తమెగదా - అనిజవార్తను
ప్రవచనములయందు - బైలుపరచె

నీ నిమిత్తమెగదా - నిష్కళంక కన్య
యయిన మరియయందు - నవతరించె
నీ నిమిత్తమెగదా - నికిల ధర్మములను
పూర్తిగా ప్రజలకు - బోధపరచె

నీ నిమిత్తమెగదా - నీవవలంబించు
మార్గాన నడచుచు - మచ్చుచూపె
నీ నిమిత్తమెగదా - నీవంటిపాపులన్
క్షమియించి ఆత్మకు - శాంతియొసగె

నీనిమిత్తమెగదా - మానని వ్యాధులన్
పరిమార్చి ఆరోగ్య - భాగ్యమిచ్చె
నీ నిమిత్తమెగదా - మానవులందున్న
దయ్యములను వెళ్ళ - దర్మివేసె

నీనిమిత్తమెగదా - నీటి యాపదనుండి
శిష్యులన్ తప్పించి - చింతతీర్చి
నీ నిమిత్తమెగదా - నీటి యాపదనుండి
శిష్యులన్ తప్పించి - చితతీర్చి

నీ నిమిత్తమెగదా - నిర్జనారణ్యాన
ఆకలి తీర్చెను - అద్భుతముగ
నీనిమిత్తమెగదా - నిర్జీవమృతులను
బ్రతికించె తనదైవ - బలమువలన

నీనిమిత్తమెగదా - లేని నేరములకు
శిక్షార్ధమైనట్టి - సిలువమోసె
నీనిమిత్తమెగదా - మ్రానిపై వ్రేలాడి
ఘోరమరణమొందె -కోర్కెతోడ

నీనిమిత్తమెగదా - ఆనాడు మరునాడు
భూగర్భమందుండి - భువికివచ్చె
నీనిమిత్తమెగదా - నీదోషములకెల్ల
రావలసినశిక్ష - తావహించె

నీనిమిత్తమెగదా - సిలువపాపములను
సాతానునోడించి - జయమువడసె
నీ నిమిత్తమెగదా - నిన్ను మోసముజేయు
సాతానుపనిని నా - శనముచేయు

నీ నిమిత్తమెగదా - నానాశ్రమలయందు
ఆనందఫలముండు - ననివచించె
నీ నిమిత్తమెగదా - నానామమందున
అడిగిన చేసెద - ననుచుపలికె

నీ నిమిత్తమెగదా - నేనాత్మనంపుదు
ననెడి వాగ్ధానము - నప్ప చెప్పె
నీ నిమిత్తమెగదా - నేను వెళ్ళినను మీ
వద్ద ఉందుననెడి - వాక్కునుడివె

నీ నిమిత్తమెగదా - పైని మోక్షముజేరి
నీ రాకకైచూచు - నెనరుతోడ
నీ నిమిత్తమెగదా - నీ అంతమందున
మహిమలో నినుజేర్ప మరలవచ్చు

నీ నిమిత్తమెగదా - నీవప్పుడున్నచో
వధువు నిమిత్తమై - వచ్చుత్వరగ
నీ నింత్తమెగదా - నిను పెంచుటకు భూమి
పైన సంఘము స్థా - పనము చేసె

నీ నిమిత్తమెగదా - నీ రక్షకునిచూప
బైబిలుగ్రంధము - ప్రచురమాయె
నీ నిమిత్తమెగదా - నీకొక పనిపెట్ట
పరజన దేశాల - పటముచూపె

నీ నిమిత్తమెగదా - నీశక్తివృద్ధికై
అపవాదితో యుద్ధ - మాడనేర్పు
నీ నిమిత్తమెగదా - నింగియు భూమియు
సృజింపబడుటకు - శిల్పియాయె

నీ నిమిత్తమెగదా - ఆనందకరమైన
పరదైసునకువెళ్ళె - మరణమొంది
నీ నిమిత్తమెగదా - నీతిలేని మృతుల
లోకపాతాళము లోకిదిగెను

నీ నిమిత్తమెగదా - నివసించు స్థలమును
ఏర్పరుపను మోక్ష - మెక్కిపొయె

తే||గీ|| ఇట్టి రక్షకుడౌ క్రీస్తు - యేసుప్రభుని
మ్రొక్కకుండ నెవరినిక - మ్రొక్కగలవు
యేసు నీవాడె నీవాడె - ఎప్పటికిని
క్రీస్తుచరితము నే నప్ప - గింతు నీకు 199


యూదులు

సీ|| యూదులు మెస్సియ - ఉద్భవించును అంచు
కనిపెట్టియును రాగ - గానరైరి

తత్బోధనా ప్రవ - క్తలను విసర్జించి
యేసుప్రభుని చంపి - వేసిరకట

ఆ పాపఫలముగా - అన్ని దేశాలకు
వారలు చెదరిపో - వలసివచ్చె

జంతువు కరువు వి - సర్జితమౌస్థితి
ఖడ్గము వీనిచె - గలిగె బాధ

తే||గీ|| రెండువేల వత్సరాలలో - దండిగాను
ఇన్ని హింసలు గలుగలేదే - జనులకు
కోలదన్నగా కాలికి - గుచ్చుకొనదె
క్రీస్తు నంగీకరింపని - కీడు కీడు 196

బైబిలు మిషను

సీ|| బైబిలు మిషనును ప్రభువె స్థాపించెను
వేరుచోటను లేనిపేరు పెట్టె

దర్శనమందు కొందరికి గన్పడుచుండు
పరలోకవాసులన్ పంపుచుండు

బైబిలులో గొప్ప పాఠముల్ నేర్పించు
పాతవి క్రొత్తవి బైలుపర్చు

స్వర్గీయ భాషాది వరములిచ్చును వాక్య
సేవకావళిని పోషించుచుండు

తే||గీ|| దశమభాగమునకు మించు దానిగోరు
పావనాత్మ బాప్తిస్మము ప్రభువెయిచ్చు

శీఘ్రముగ వచ్చుచున్నట్టు చెప్పుచుండు
యేసె పోషకుడనుట విశ్వాస పదము

సీ|| ధనమురాగలయెట్టి దారిలేకున్నను
బైబిలు మిషను స్థాపనము జరిగె

బడులు బోర్డింగులు పనులు లేకున్నను
బైబిలు మిషను స్థాపనము జరిగె

నిలువసొమ్మును పంటపొలములు లేకున్న
బైబిలు మిషను స్థాపనము జరిగె

మన్ననజేయు సమాజాలు లేకున్న
బైబిలు మిషను స్థాపనము జరిగె 166

తే||గీ|| వచ్చివేయుడి యన్నట్టి - ప్రభువుమాట
పుచ్చుకొని నిర్భయంబుగా - వచ్చివేసి

క్రైస్తవులు కొందరీ మిషన్ - కట్టుకొనిరి
పదియు తొమ్మిది నూర్ల ము - ప్పది యెనిమిది 167


తే||గీ|| ఏడులోకాలు ప్రార్ధనల్ - ఏడుమెట్లు
బైబిలుకథ క్రీస్తునికథ - ప్రభుని మతము

ఐదు అంశాలు నేర్చిన - అతడె గురువు
నెగ్గగలడు విమతుల - నిష్టయెదుట 168


సీ|| పరమదేవుండు మన - నరులతో మాట్లాడు
జాబైన గ్రంధంబు - బైబిలొకటె

దేవుండు నరుడునౌ - దివ్యరక్షణకర్త
క్రియకు లెక్కకు యేసుక్రీస్తు ఒకడే

అన్నిమతాలకు - ఆహ్యానమంపిన
మతము క్రైస్తవ సంఘ - మతము ఒకటె

మిషనులన్ మతములన్ - మించి బైలుపడిన
మిషనగు బైబిలు - మిషను ఒకటె

తే||గీ|| సరిగ ఈనాల్గుబోధలు - సొంతముగను
ఋజువు పరచుచు బోధించు - సుజనపరులు
గొప్ప బోధకులని నేడు - చెప్పవచ్చు
నీవు నట్టివాడవగుట - నేర్చుకొనుము 169


తే||గీ|| దైవసృష్టియును నరుల - దైవసృష్టి
స్రష్ట కెపుడును స్తోత్రముల్ - సలుపుచుండు
నరుడు స్తుతిచేయకుండును - తరచుగాను
సృష్టి మతబోధ చేయును స్పష్టముగను 170


కం|| లక్షలకొలది జనులు నీ
పక్షముగా నుండు కాల - భాగ్యమువచ్చెన్
లక్షల కొలది ధనము నీ
రక్షణ వార్తలకౌ ప్రచు - రమునకు వచ్చున్ 200


తే||గీ|| ఏడులోకాలు ప్రార్ధన ! యేడుమెట్లు
బైబిలు మహిమ మనయేసు | ప్రభునిమహిమ
సంఘవృత్తులు ప్రకటన | సారమెల్ల
చెప్పనిచ్చిన కొద్దిగ | చెప్పగలను 201


తే||గీ|| ఇన్ని మతములు మిషనులు | ఇలనులేవ
బైబిలుమిషను దేవుడు | బయలుపరచె
ఎందుకో లోకమిది గ్ర | హింపవలెను
కొన్ని నాళ్ళకైనవచ్చు | క్రొత్తవార్త. 202


తే||గీ|| స్వస్థిశాల నివేదిక - పత్రికపని
బైబిలుమిషను ప్రభువుచే | బయలుపడుట
ఇట్టివాటిని బోధలో | పెట్టినాము
చెప్పనిచ్చిన కొద్దిగ | చెప్పగలను 203


Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person ** Be united in Lord Jesus Christ ** Our Lord is with us. | Please visit www.ebiblemission.org for more info.