లెంటులోని ఎనిమిదవ దినము - గురువారము

సిలువలోని అప్పగింతలు

లూకా 18:32

ప్రార్ధన:- యేసుప్రభువువా! నీ మరణ చరిత్ర, నీ ఉద్యోగ చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ మూడు చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుత్ధాన చరిత్ర ఆలోచించుటకై మాకు సహాయము దయచేయుము. ఈ రోజులలో నీ మరణచరిత్ర ధ్యానించుచుండగా, వాటివలన మాకు కావలసిన సహాయము ఇమ్ము. ఆమేన్.


భస్మబుధవారమునాడు ఒక వాక్యము, ఇదివరిలో గడిచిన సంవత్సరాలు బోధించినాను. అదేదనగా యేసుప్రభువు సువార్త ప్రచారముమీద తన శిష్యులకు చెప్పినమాట: 'ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము'. అక్కడ నాకు శ్రమలు, మరణము ఉన్నదని ప్రభువు వారితో అన్నారు. ఈ వాక్యము లూకా 18:31లో ఉన్నది. అది నేను గడచిన సంవత్సరాలలో వివరించినాను. మీరు వ్రాసుకున్నారు. అప్పుడు లోకములోనున్న 'యెరూషలేము వెళ్ళుచున్నాము' అని ప్రభువు చెప్పిన మాట వివరించి, ఆ తరువాత పరలోకములో నున్న 'యెరూషలేము వెళ్ళుచున్నాము' అని యేసుప్రభువు ఈ కాలములోనున్న పెండ్లి కుమార్తె సంఘముతో చెప్పుచున్నమాటను వివరించితిని. కాబట్టి ఆ రెండును ఈ వేళ వివరించను. పాఠము అదేగాని, వివరము మాత్రము ఆ దినము వంటిదికాదు. లూకా 18:31లో 'వెళ్లుచున్నము' అను మాట ముఖ్యమైనది. ఆలాగే 'అప్పగింపబడుట' అనేమాట కూడ ప్రాముఖ్యమైనది. అప్పగింపబడుట, వెళ్లుచూ శ్రమపడుట, పునరుత్ధానము ముఖ్యమే గాని నేనావేళ చెప్పిన చెప్పను. ఒకే మాట ఈ రోజు వివరించెదను: 'అప్పగించుకొనుట'


యేసుప్రభువు శ్రమల వృత్తాంతము పై నాలుగు మాటలలో ఇమిడి ఉన్నది.

పాత నిబంధనలో మాట అప్పగించినట్లు, వ్రాతనుకూడ అప్పగించెను. అక్కడ మాట అప్పగించినట్లు, క్రొత్త నిబంధనలో ఆయన చేసిన పనిని అప్పగించెను. అన్నియు కలిపి శిష్యులకు అప్పగించెను. అందుచేత ఈ వాక్యములో ఒక మాట ఉన్నది. 'ప్రవక్తలు చెప్పిన మాట' అని ఉన్నది. దావీదు, సొలోమోను, యెషయా మొదలైన ప్రవక్తలు వ్రాసినది ధర్మశాస్త్రము లేక ప్రవక్తల ప్రవచనములు. "నన్నుగూర్చి చెప్పినది, వ్రాయబడినది నెరవేర్చినాను. ఆ నెరవేర్చింది మీకప్పగించినాను" అని ప్రభువు అనెను. అప్పుడు శిష్యులు(హింసనుబట్టి) స్వంతదేశములో ఉండుటకు ఇష్టపడక, చెదరిపోయి అందరికి ఆ సువార్త అప్పగించిరి. ఇప్పుడు 6 సంగతులు చెపాను.అందులో చివరి మాట 'అప్పగించుట' అనే మాట. కొందరు ఈ మాటను లెక్కచేయలేదు. దేవునిమాట మనకిప్పుడున్నది. 'మనమెంత వరకు ఆయన మనకప్పగించిన మాట, వ్రాత చదువుచున్నాము'? అంతా(బైబిలులో ఉన్నదంతా) చదువుచున్నామా! అంతా చదివితే, దానిలోనున్న దాని ప్రకారము నడిస్తే, మనకప్పగించినదంతా చేసినట్లే. ఉదా: బైబిలు చదివినావా? అని ఒకరిని అడిగితే లేదు. అన్నారు. కొందరు కీర్తనల గ్రంధము, మరికొందరు బైబిలులో అక్కడక్కడ చదువుతారు. కొందరు మాత్రము 'బైబిలు అనగా దేవుడప్పగించిన మాట' అని అంతా చదువుతారు. దేవుడు పంపిన ఈ బైబిలనే ఉత్తరమంతా చదవాలి. యేసుప్రభువు చేసినవనీ మనకే అని నమస్కరింపవలెను. ఆయన చేసినవన్నియు మనకు సమృద్ధి, సుఖము, సంతోషము కలిగించుటకే. ఆయన మాటను, ఆయనను, ఆయన క్రియను హృదయమందు భద్రపర్చుకొని, ఆ క్రియలన్నీ మాకే అని ఆయనకు కృతజ్ఞతగలవారమై, ఆయన మన కప్పగించిన ఆయన మాటలు, క్రియలు అన్నియు భద్రపర్చుకొనవలెను.

అట్టి ధన్యత చదువరులకు, సిలువ నాధుడైన క్రీస్తు ప్రభువు దయచేయును గాక! ఆమేన్.


కీర్తన: "అప్పగింతు తండ్రి నీకు - నాత్మనంచును = గొప్ప యార్భాటంబు చేసి - కూలిపోతివా!" //ఆహా మహా//