లెంటులోని ముప్పది ఎనిమిదవ దినము – గురువారము

పాద శుద్ధీకరణ పరిచర్య

యోహాను సువార్త 13వ అధ్యాయము

ప్రార్ధన:- తండ్రీ! మా నిమిత్తమై వచ్చిన నీవు మా కొరకు చేసిన పరిచర్యలన్నియు వివరించుటకు మా జ్ఞానము చాలదు. నీవు చేసిన పరిచర్యలను అందుకొనుటకు మా యోగ్యత చాలదు.కేవలము నీ ఉచిత కృపను బట్టియే అని మేము అందుకొని అనుభవించుచున్నాము. గనుక నీకు వందనములు. తండ్రీ! నీవు చేసిన పరిచర్యను మేము ఈ లోకములో కొనసాగించుటకు నేటి దిన వర్తమాన మిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.


క్రైస్తవులరా! సంఘకాలములో క్రైస్తవసంఘము యొక్క హింసకాలములో ఉన్న విశ్వాసులారా! ఆదివారమునాడు యేసుప్రభువు గార్ధభాసీనుడై వెళ్ళిన కధలో పల్లెటూరివారి పరిచర్య, శిష్యుల యొక్క పరిచర్య; పట్టణస్తులయొక్క పరిచర్య ఈ మూడు పరిచర్యలు వివరించి రెండు వదిలినాను. ఆ రెండును యేసు ప్రభువు మనకు చేసిన పరిచర్యలు. ఆ మూడును మనుష్యులు యేసుప్రభువునకు చేసిన పరిచర్యలు. ఈవేళ యేసుప్రభువు మనుష్యులకు చేసిన పరిచర్య చెప్పెదను. అందులో నొక యంశము

ఈ కధ చాల పెద్ద కధ. ఈ వేళ కధలో ఈ ఐదంశములున్నవి. ఈ కధలో మోదతి భాగము, రెండవ భాగము వేరు వేరుగానేయున్నది. అది ఈ వేళ చెప్పను. ఈ ఐదు అంశములుగల మొదటి భాగము జ్ఞాపకముచేసెదను, ఇపుడు మనము చెప్పుకొనునది పరిశుద్ధవారము లోని గువారపు కధ, ప్రభువు ఒకమాటన్నారు, "నేను పరలోకము నుండి రావడము ఎందుకనగా, నేను మీచేత పరిచర్య చేయించుకొనుటకు కాదుగాని నేనే మీకు పరిచర్య చేయుటకు వచ్చాను". పరిచర్య యనగా మన మామూలు మాట 'చాకిరి చేయుట'. క్రైస్తవులు ఈ మాటను 'సేవచేయడమంటారు' . ఈ మూడు నొకటే యర్ధము ఇచ్చును. మనచేత పరిచర్య చేయించుకొనుటకు కాక తానే మనకు పరిచర్య చేయుటకు వచ్చడనే సంగతి విడ్డూరమైన సంగతి. మనకు తెలిసినంతవరకు ఇతరుల మతములో నీయాచారమున్నది, అదేదనగా శిష్యులయిన వారు గురువుల పాదములు కడగడము. అయితే గురువులు, శిష్యుల పాదములు కడగడమనేది ఇతర మతములలో లేదు. అయితే ప్రభువు చరిత్రలో గురువైయున్న యేసుప్రభువు శిష్యుల పాదములను కడుగుట విడ్డురము. ఇది లోకమునకు క్రొత్త. క్రీస్తు మతము లోకము కేలాగు క్రొత్తో, ఆలాగే శిష్యుల పాదములు గురువులు కడుగుట కూడ క్రొత్త.


దేవుడు మనిషియై లోకములో పుట్టుటేలాగు క్రొత్తో, ఇందులో మొదటి యంశము పైబట్ట యవతల పెట్టుట. అందులో పరిచర్య యేమున్నది. అందులో నేమి కనబడుటలేదు గాని, బట్టనవతల పెట్టుటలో పరచర్యకు పూనికొనినట్లు కనబడుచున్నది. పై బట్ట నవతల పెట్టుట శిష్యులు చూచి, ప్రభువు యేదోపని చేయబోవు చున్నాడనుకొనిరి. ఆ యనుకొనుటలో ఆయన పూనుకొన్నాడు. అనగా మనలను రక్షించుటకు అనగా శరీరాత్మలను రక్షించుటకు పూనుకొన్నాడు. మనమధ్య కొంతకాలము నివసించిన పిదప తనప్రేమను చూపించుటకును, మనయందాయన కెంత శ్రద్ద యున్నదో యది చూపించుటకును, పూనుకున్నాడు. చాలా మంది పైన కోటు వేస్తారుగాని, పై బట్టవేయరు. యూదులెన్ని వేసికొన్నను పై బట్టవేసికొనుట అలవాటు ప్రభువు యూదుడు. గనుక యెంత అంగీవేసికొన్నా పై బట్ట వేసికొనుట యున్నది. పై బట్ట వేసికొని పండుకొన్న బర్తిమయి యను గ్రుడ్డివాడు పై బట్ట వేసికొనుట గొప్ప యలవాటు. పాస్టరు గారు పైబట్ట వేసికొన్నారని కొందరుందురు.


యేసుప్రభువునకు పై బట్ట ఎందుకలవాటనగా ఆయన పరలోకములో ఆయన సింహాసనము పై కూర్చున్నప్పుడు, గౌరవార్ధమైన మహిమ వస్త్రమాయనకున్నది. ఆ మహిమను విడిచిపెట్టిరావడము, పై వస్త్రము అవతలపెట్టడానికి గుర్తు. బైబిలులో ముందు గుర్తులున్నవి. ఆ తర్వాత నెరవేర్పున్నది. ముందొక గుర్తున్నది, దానికి నెరవేర్పు ఇంకొకటి యుండును. బలి పాతనిబంధనలో నున్నది. ఆ బలి క్రత్తనిబంధనలో బలియైన (నెరవ్రర్పు) యేసుప్రభువునకు ముంగుర్తు. ఆయన బలియైనాడు. ఇధి అలాగు ముంగుర్తు కాదు. యేసుప్రభువు మహిమనంతా నక్కడ విడిచిపెట్టి వచ్చి పైబట్టలేకుండ మసలినాడంటే మహిమ బట్టను విడిచిపెట్టివచ్చినాడు. ఇదంతా జరిగిన పిదప, పై వస్త్రము మరల వేసికొన్నట్లు ఆరోహణమైన పిదప దేవుని కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు. తరువాత ఆ మహిమ వస్త్రము వచ్చినది. యోహాను 17అ||లో నున్నట్లు 'ఆదిలో నాకే మహిమవుండెనో యా మహిమను తిరిగి నాకు ఇచ్చావని ఆయన ప్రార్ధించెను'. యేసుప్రభువు భూలోకములో నడిచినపుడాయనకు


ఈ శరీర జీవితములో పై బట్ట యున్నది. ఆత్మీయ జీవితములో ఉన్న పైబట్టను పరలోకమునందు విడిచి వచ్చెను. నడుముకు తువాలు....ఇది దేనికి గుర్తు. అనగా మొదట పైబట్ట నవతల పెట్టుట అనేది పరిచర్య చేయుటకు, పూనుకొనుతకు గుర్తు. తువాలు కట్టుకొనుట పనిచేయుటకు మొదలు పెట్టుట. సిపాయిలు కష్టపడి పనిచేయుటకు నడుము గట్టిగా కట్టుకొందురు. స్త్రీ వివాహమప్పుడు వడ్డాణము నడుముకు అందానికి, బలమునకు పెట్టుకొనును. ఈ పరిచర్య యేసుప్రభువు చేయుటకు పూనుకొనుట చాల కష్టమైన పని గనుక ఆయన తువాలు కట్టుకొని బలపడ్డాడు. పనిసాగించాలి, శిష్యులు చూస్తున్నారు. ఏమి యడుగలేదు. నాపై బట్టతీసి అవతలపెట్టండియని వారినడుగలేదు. పెద్దయ్యగార్లు అలా చాలాసార్లంటారు. కానీ ప్రభువెవరిని అడుగక తానే చేసుకొన్నారు. అందరు దగ్గరకు వచ్చిరి. శిష్యులపుడు గ్రహించలేదు, తరువాత గ్రహించిరి, అదెందుకు? ఇదెందుకు? యని యడుగలేదు. ప్రభువే మీరు గ్రహించలేరన్నారు. రెండువేల సంవత్సరాలైన పిదప మనము గ్రహించుచున్నాము. అపుడు సమీపస్తులుగా నున్న గొప్పవారైన శిష్యులు గ్రహించలేదుగాని దూరస్తులమైన, శిష్యులమైన మనము గ్రహించుచున్నాము. ఇపుడు గ్రహించలేరుగాని ఆత్మ వచ్చినపిదప గ్రహిస్తారనేది ఇపుడు నెరవేరుతుంది. మన గొప్ప పరిచారకుడు సిద్ధముగా వున్నానని పూనుకొన్నానని నడుముకు గట్టిగా కట్టుకొని పని ప్రారంభిస్తారు. ఇవన్ని సుళువేకాని వారు గ్రహించలేదు.


3. ఆయనే పళ్లెములో నీరు పోసినారు:- కాని నేను అంటాను ప్రభువు దగ్గర పన్నెండుమంది యున్నారు గదా! నా దగ్గరయితే నొక్కరే, అదయినా నేను చేయక అతని చేత చేయిస్తాను. ప్రభువు వారుచేత చేయించుకొనుటకు రాలేదు. ఆయనే వారికి చేయుటకు వచ్చెను. యేసుప్రభువు చేసే ఈ పరిచర్య (చాకిరి; సేవ) వారి కవసరము. ప్రభువెళ్లిన తరువాత వారు గ్రామములలో, సంఘములలో యిండ్లలో మనుష్యలందరికి చేయుటకు మాదిరిగా, వారికి నేర్పించినానని ప్రభువన్నారు. నేనెందుకీ యైదు పనులు చేసినానంటే 'మీరును అట్లు చేయుటకు నేర్పించుటకు చేసినాను'. మాదిరికి చేసేవారు వారే చేస్తారుగాన ప్రభువట్లు చేసెను. నీళ్ళు శుద్ధికి గుర్తు. ప్రభువు శుద్ధి చేయుటకే వచ్చెను.

అప్పుడాయిన పై నాలుగు విషయములను గూర్చి యడుగవలసినది గాని అడలేదు. అది యెవరికి అభ్యంతరము కాదు. నేనప్పుడపుడు చేస్తాను. ప్రభువు నీళ్ళు పోసిరి. ఒకరి పాదములొకరికి తగులుట అభ్యంతరము. ఇంకొక మిషను నున్నది. పాదములు కడిగే మిషను.


4. శుద్ధి కార్యక్రమము:- ప్రభువు ప్రారంభించిన పనియావత్తును పూర్తి చేసి ముగుంచిరి. నీళ్ళు పోయుట ముగింపైనది. ప్రభువు సిద్ధపడుటలో ఈ మూడును కలవు. (1. పై వస్త్రము 2.తువాలు 3.నీపోయుట) ఈ మూడును బాగున్నవి కాని పాదములు కడుగుట కష్టతరమైన పని ఉదా:- పెద్దాపురమునకు పదునాలుగుమైళ్ళు దూరము నుండి ఒక జమీందారుగారి అల్లుడు వచ్చి (అయ్యగారి) కాళ్ళు పట్టుకొనిరి. అప్పుడు అయ్యగారికి గుండె జల్లుమన్నది. 'ప్రార్ధకని వచ్చి పాదములను పట్టుకొని నరభక్తి చేయుచున్నావు'. అని అయ్యగారన్నారు. అది ఆయనకు అయ్యగారిపై నున్న ప్రేమ, గౌరవముబట్టి అలాగు చేసినారు. పరిశుద్ధుల పాదములపై అపరిశుద్ధులు చేతులు పడితే ఫరవాలేదు. గాని పరిశుద్ధుని చేతులు పాపాత్ముల పాదములపై బడుట చాలా కష్టము.


5. నీళ్ళతో శుద్ధి :- నీళ్ళతో శుద్ధి చేసిన తరువాత తువాలుతో పాదములను తుడిచిరి, ఈ యైదు యేసుప్రభువు యొక్క జన్మనుండి సమాధి లోనికి వెళ్ళు పర్యంతము యేసుప్రభువు చేసిన పనులన్నిటికి ముంగుర్తులై యున్నవి.

బెత్లేహేములో ప్రభువు జన్మ మప్పుడే పై బట్ట తీసివేసిరి. సేవలో ప్రవేశించగానే నడుముకు బట్ట కట్టుకొని పిశాచిని జయించిరి.


6. నీళ్ళు పోయుట:- (నీళ్ళు అనగా వాక్యము) కొండ ప్రసంగములో, యెరూషలేము దేవాలయములో, సునగోగులలో ఉపదేశించినపుడు వారిని వాక్యముతో శుద్ధి చేయుటకు మొదలుపెట్టెను. నీళ్ళులేనిదే శుద్ధిలేదు. వాక్యము యెక్కువగా నేర్చు కుంటే అది (వాక్యము) వారి హృదయములను శుద్ధిచేయుటకు సాధనముగా నుండును. అపుడు సేవ చేయవచ్చును.


7. తుడుచుట :- నేను మీకు చెప్పవలసిన విషయములన్నియు చెప్పియున్నాను. నేను పరలోకమునకు వెళ్ళుచున్నానని ముగింపు చేసెను. వారు కొన్ని గ్రహించినను మరికొన్ని గ్రహించలేదు. వారి హృదయములో నున్న అనుమానములను సందేహములన్నింటిని ఆయన తుడిచిరి. ముఖ్యమయిన అనుమానమేదనగా ఆదివారము పునరుత్ధానమగుదునని ప్రభువు చెప్పినా, యెందరు ప్రవక్తలు చెప్పినను వారు నమ్మలేదు. వాటన్నిటిని నొక మాటతో తుడిచినాడు 'నేను వెళ్లి ఆత్మను పంపించెదను'. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు బోధిస్తారు. అపుడు మీరు యెక్కువ గ్రహించెదరని చెప్పిరి. ఇక్కడ కాదు. పరలోకములో నెక్కువనేర్చుకొనెదరని చెప్పెను. అదే తుడిచివేయుట. పొడి కాళ్ళతో నడిచి వెళ్ళవచ్చును. ప్రభువు జన్మమొదలు పునరుత్ధానము వరకు యోహాను 17వ అధ్యాయములోనున్నది. దీనిలో క్రైస్తవుల కధ మాత్రమే కాదు. సంఘము యొక్క కధకూడ యున్నది. గనుక అందరికిని సువార్త ప్రకటించవలెను.


అట్టి ధన్యత, పరిచర్యచేయు వీలు వరుడు మీకు దయచేయును గాక. ఆమేన్.


ప్రార్ధన:- యేసుప్రభువా నీవు నడిచిన సమస్తమైన పరిచర్యలోను గొప్ప గొప్ప కార్య క్రమములో మమ్మును శుద్దిచేయుచు, సిద్ధపరచు, నిన్ను మహిమపరచే శక్తి ననుగ్రహింపుము. కృపతో సెలవిమ్మని యేసుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.


కీర్తన: "నా యేసు నాధా నీకు - నే నచ్చియున్న దెల్ల - నా లేమితో బ్రేమ గదా! = నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను - నన్ను నేనే నీకు - నర్పించుకొనుట గాక" ||ఓ వింత||