లెంటులోని ముప్పది ఆరవ దినము – మంగళవారము

5వ మాట వివరము; సిలువ ద్వారము

యోహాను 19:28

ప్రార్ధన:- తండ్రీ! మా నిమిత్తమై మిక్కుటమైన శ్రమను పొందినందున సిలువ పై నీకు దాహమాయెను. జీవజదాతా! 'నేను దప్పిగొనుచున్నాను' అను మాటను మేము ఏమి గ్రహించగలము? ఏమి వివరించగలము! మా దాహార్తి తీర్చుటకు నీవు దప్పిగొన్నావు. నీకు దహమిచ్చుటకు నేటి దిన మా వాక్య దాహార్తిని తీర్చుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మహశ్రమలో సిలువమీద వ్రేలాడుచు పలికిన ప్రభువు మాట ఇది. మనకు దాహమెప్పుడగును? దాహము తీరుటకు ఏమి చేయుదుము? ఇది మన అనుభవములోనిదే గనుక దానికి వివరమక్కరలేదు. దాహములు ఎన్ని?

ఉదా:- పనులు ఎక్కువగా నున్నప్పుదు ఆ పనులు ముగించుటకు నీరు త్రాగినప్పుడు దాహము తీరును. ఇది మొదటి దాహము.


2) ఏ ఫలితము కొరకు ప్రభువు అంత కష్టపడెనో, ఆ పని ముగింపు తరువాత, తాను నిరీక్షించిన ఫలితము (జీతము) రాకపోవుట అనునది మరొక దాహము. చెమట ఓడ్చి పనిచేసితిని, ఫలిములేకుండ వ్యర్ధమైపోయినది. అదే దాహము. ఫలితము రాగా దాహము తీరును, తృప్తి కలుగును. యేసుక్రీస్తు ప్రభువునకు సిలువమీద కలిగిన దాహము మన దాహమువంటిదేనా? ఆయన దాహము తీరినదా?


నరావతారమునకు పూర్వము యేసుక్రీస్తు దేవుడుగా దేవలోకములో ఉండు దేవుడు. ఆయనకు భూమిమీద ఒక గొప్ప పని ఉన్నది. ఆ పనినేమి? భూమిపైనున్న పాపులందరకు రక్షణ సంపాదించవలెను. ఈ పని ఆయన తప్ప మరెవ్వరును చేయలేరు గనుక ఆయనే రావలెను. గనుక నరుల మధ్యకు నరావతారుయై వచ్చి, యేసుక్రీస్తు అను పేరు పెట్టుకొనెను. ఆయన భూమిమీదికి రాకపూర్వము దేవుడుగా నుండి భూమిపై మరొక పని చేసెను. సర్వజనులలో యూదులను ఏర్పర్చుకొని, వారికి న్యాయధిపతులను, ప్రవక్తలను ఇచ్చి, వారికి మెస్సీయా అను క్రీస్తు అవతారమును గూర్చియు, ఆయన వచ్చి చేయు పనులను గుర్చియు చెప్పి వారిని సిద్ధపరచి, రాబోయే మెస్సీయయందు ప్రేమ, భక్తి పుట్టునట్లు చేసెను. అందుచేత వారు ఎల్లప్పుడును మెస్సీయ్యాను గురించి చెప్పుకొనిరి. ప్రవక్తల వ్రాతలు చదువుకొని, ఆయన వచ్చే వేళయైనదని కనిపెట్టిరి. ఆయన నరావతారియైన తరువాత ఆయనకున్న దాహమును సిలువమీద బైలుపర్చుకొనుటకు ముందు సమరయ స్త్రీకి నూతివద్ద బైలుపరచెను. వారిరువురి సంభాషణంతయు చదువగా ఆ సంగతి తెలియును (యొహాను 4:7). యేసుప్రభువు సమరయ స్త్రీని ఏమని అడిగెను? 'నాకు దాహమునకిమ్ము!' ఇక్కడ యేసుప్రభువు నీళ్ళిమ్ము అని అడుగలేదు. గాని నీవును, యూదులును ఎదురుచూచుచున్న మెస్సీయ అనబడిన క్రీస్తును నేనే అని చెప్పెను. ఆమె జీవజలములను తెలిసికొనవలెను అనునదియే ఆయన దాహము. అట్లు తెలుసుకొంటే ఆమె నమ్మును. అప్పుడు ఆమె ఏమి చేయును? ప్రభువును ప్రార్ధించును. ఆ ప్రార్ధన ఏమిటీ? వస్తావని చెప్పి వచ్చినావు గనుక నన్ను క్షమించు అని ప్రార్ధించెను. ఇదెట్లు? ఆయనే ఆమెను ప్రార్ధించి, ఆమెచేతే ఆ ప్రార్ధన చేయించుకున్నాడు. నాకు దాహమునకిమ్ము. నేను క్రీస్తునని నమ్ముము. ఈయన ఆమెకు ప్రార్ధన నేర్పి, ఆమెచేత ప్రార్ధన చేయించి, ఆమెకు జీవజలమును ఇచ్చెను. ఆమె గ్రామములోని అందరు గ్రామము విడిచి పనులు మాని, నూతివద్దకు వచ్చిరి. వారిచేతను ప్రార్ధన చేయించుకున్నాడు. ఆమెయు, ఆ గ్రామస్ధులును ఈయన రావలసిన మెస్సీయ అని నమ్మిరి. గనుక ఆయన దాహము తీరినది. అన్యులు ఆయన దాహము తీర్చిరి. ఆయన వారికి జీవజలములను ఇచ్చెను. ఆ జీవజలము ఏది?

వారాయన దాహమును తీర్చిరి. ఆయన వారికి జీవజలములను ఇచ్చెను (యోహాను 7:38).


ప్రభువు తన్ను ప్రేమించిన స్వజనులయొద్దకు వచ్చినాడు. ఆ ఎన్నికజనులైన యూదులు ఆయన దాహము తీర్చలేదు. ధర్మశాస్త్రములో చదివి నేర్చుకొని, ఎవరి రాకకొరకు ఎదురుచూస్తున్నారో, ఆ మెస్సీయ్యను నేనే. నేనే అసలైన మనిషిని, అసలైన దేవుడను. నేను మీ తండ్రినని చెప్పకుండా ఔనో, కాదో మీ ధర్మశాస్త్రములో నన్నుగూర్చి వ్రాయబడినవన్ని జరుగుచున్నవో లేదో చూడండి అని తన మాదిరి ప్రవక్తనను కనుపరచి, బోధలు వినిపించి, స్వస్ధత పొందినవారిని చూపి, మృతులను లేపి, అద్భుత ఆహారము పెట్టి, సృష్టిమీద తన అధికారము చూపి, దురాత్మలను వెడలించి, గ్రుడ్డివారికి కండ్లు, చెవిటి వారికి వినికిడి, కుంటివారికి నడక ఇచ్చి తన దేవత్వమును వెల్లడిచేసెను. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఇవన్నీ చూచి, ఆయనను పరీక్షించి మనము ఎదురుచూచు మెస్సీయ ఈయనే. 'మన మెస్సీయ వచ్చినాడు' అని శాస్త్రులు పరిసయ్యులకు, పరిసయ్యుల సంఘమునకు చెప్పి, అందరు ఏకమై ఆయనయొద్దకు వచ్చి ప్రభువా! వచ్చావా? నమస్కారము. మమ్మును రక్షించమని ప్రార్ధించితే, ప్రభువునకు దాహము తీరియుండును. వారికి రక్షణ జీవజలముగా వచ్చేయుండును. అట్లు జరుగలేదు గనుక ఆయన దాహము తీరలేదు.


ఉదా:- సమరయ స్త్రీకి ఒక గుర్తు చూపినాడు. ఆతని పనులు పాపమని ఆమె అనుకొనని పాపమును ఆమెలో చూపినాడు. ఆమెను అసహ్యించుకొనకుండ, దాచకుండ ప్రేమతో మాట్లాడి ఒక్కమాటతోనే, ఆమె ఆయనను మెస్సీయ అనునట్లు చేసెను. యూదులకు మూడున్నర సంవత్సరములు ఎన్నో చూపినను వారు గుర్తించలేదు. అది ఆయన దాహము. చివరగా సిలువమీద బాధలోనుంది, వారు కనిపెట్టే మెస్సీయాకు విధించిన శిక్షనుబట్టి వారికెట్టి శిక్ష రాబోవుచున్నదో అది చూస్తు, అది రాకుండా చేయుటకై వారిని క్షమించిన క్షమాపణ మాతలు వినియు వారు మారలేదు. ఇంత ప్రయాసపడిననూ, సిలువమీద ఆయన పడుచున్న శ్రమలు చూచువారికి రవ్వంతైనా జాలిలేకపోవుట; వారికున్న ద్వేషము, కోపము, తీక్షణమైన కోపము ఎండవలె ఆయన నెత్తిని కాల్చుచుండగా, మరొక ఎండ అనగా ఆకాశములో సూర్యకిరణములు గాయములున్న ఆయన దేహమును కాల్చుచుండగా, ప్రభువునకు ప్రియులైన ఎన్నిక జనులు రక్షణను నిరాకరించినందున ఎండకు పడిన ప్రయాస అంతయు నిష్పలమైనట్లుగా దాహముండెను.గనుక 'నేను దప్పిగొనుచున్నాను' అని సమరయ స్త్రీ ప్రార్ధించినట్లు, సిలువమీద వుండి సిలువ క్రిందనున్న శపించు తనవారిని, (ఈ పరిశుద్దుడైన తన్ను మెస్సీయాను) నమ్మండి అని ప్రార్ధించి ప్రాణము విడిచెను. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఆయన ఎరిగి, వారి ఎదుట ఆయన చేయవలసిన పనులన్నియు ముగించి, వారిచేత అనిపించుకొనుటకు ఎన్నో ప్రయత్నములు చేసినాడు గనుక ఇక చేయవలసినవి లేవు అని అర్ధము. ఈలాగు జరుగునని ముందుగానే దావీదుకు బైలుపరచెను (కీర్తన 69:21).


దాహముతో ప్రభువు చనిపోయెను. ఆయన శరీరమునకున్న దాహమైన వారు తీర్చక చిరకనిచ్చిరి. ఎంత కఠినాత్ములు? మనము ప్రభునకున్న దాహము తీర్చుదము. నా నిమిత్తమే వచ్చెను, బోధించెను, శ్రమ పడెను, సిలువ వేయబడెను, చనిపోయెను, లేచెను, వెళ్లెను. నా నిమిత్తమై వచ్చును. అని నమ్ముటవలన, నమ్మి నమస్కరించుటవలన; ఇవన్నీ చేసినయెడల మనము ఆయన దాహము తీర్చువారమౌదుము. అట్లు నమ్మువారికి జీవము గల రక్షణ వచ్చును.


అట్టి స్ధితి దప్పిగొన్న ప్రభువు నేడు మీకందరుకు దయచేయును గాక! ఆమేన్.


కీర్తన: "ఎన్నికజనుల ద్వేషంబు - నీకు - ఎండయైనందున - దప్పిగొన్నావా! = ఉన్న ఎండకును బాధకును - జిహ్వ - కూట లేనందున - దాహమన్నావా!" ||ఏడు||