లెంటులోని ఇరువది ఎనిమిదవ దినము - శనివారము

ఆదరణ లోయ

కీర్తన:- 23:4

ప్రార్ధన:- మా యేసుప్రభువా! నీవు శ్రమలలో ఆదరణ పొందినావు. నీవు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేక పోయినను, గ్రహింపగలిగినంత మాకు అందించుమని, వేడుకొనుచున్నాము. ఆమేన్.


శ్రమకాల: గత ప్రసంగములో "లోయ" అను పాఠమును చదివితిమి. అందు క్రీస్తు ప్రభువు యొక్క శ్రమానుభవము వివరింపబడెను. ఈ పాఠములో ప్రభువు ఆ గాఢాంధకారపు లోయలో ఎట్టి ఆదరణ పొందినది వివరించుదును. ఇదివరకు వివరించిన శ్రమల లోయలో "ఇదిగో యోరుషలేము వెళ్ళుచున్నాము" (మత్తయి 20:17) అని ప్రభువు ప్రవచించినప్పటినుండి, లోయలో ప్రవేశించి, లోయలో చివరినున్న మరణము సమాధివరకు వివరింపబడెను. లోయ మధ్యభాగములో చిక్కుప్రశ్నలు, దూషణలు, అవమానములు, శ్రమలు కలవు. ఇపుడు ధ్యానించెది శ్రమలు కాదు, అవమానము కాదు, శ్క్షావిధి కాదు, సిలువవేత కాదు, అయితే మన ధ్యానంశము మారేది? ఆయనకు శ్రమలో ఆదరణ, అవమానములో ఆదరణ, శిక్షావిధిలో ఆదరణ గలదు. గనుక మన ధ్యానము ప్రభువు పొందిన ఆదరణ. మన శ్రమలలో కూడ మనకు ఆదరణ కావలెను. అందుచేత ఆయన మనకు ముందుగా తనశ్రమలో ఆదరణ పొందెను. లోయ పొడుగునా, ఎడమప్రక్క శ్రమలు, అవమానము, కొట్టుట, దూషించుట, సిలువవేయుట, చంపుట అను చీకటి గలదు. అయితే లోయ కుడిప్రక్కన ఆదరణ, ఆదరణ, ఆదరణ గలదు. మనము లోయలో బడి ఆయనతో వెళ్ళవలెను. శ్రమ అనుభ- వించుటకే కాదు, ఆయన పొందిన ఆదరణ కూడ పొందుటకు మనము వెళ్ళవలెను.


యేసుప్రభువు యొక్క చివరి ప్రార్ధన మనకుకూడ అలవాటగును గాక!


కీర్తన: "ఎవరు నా శత్రువు - చెదిరించి గెల్చిరి - ఎవరు వా శోకంబు - నెగుర గొట్టిరి? = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేదదీర్చి మనసు - చివుకు మనుగాయంబు మాంపిరి! - సివబడ్డ యేసుక్రీస్తే" ||నాకింత||