లెంటులోని ఇరువది ఐదవ దినము - బుధవారము

సిలువద్వారా కలిగే మార్పు - మారలేని యూదా

యోహాను 1:2-3

ప్రార్ధన :- యేసుప్రభువా! తీర్పు శ్రమలో నిలబడిన ప్రభువా! సిలువను నీ మీద వేసికొన్న యేసుప్రభువా! నీ చరిత్ర ముందు నడిచివెళ్లుచుండగా అనేకమందికి మార్పు కలిగినది. నేటివరకు అట్టి మార్పు కలుగుచూనే యున్నది. నీ సిలువ చరిత్ర మార్పు కలిగించలేనట్టి ఒక వస్తువుకూడ ఈ లోకములో లేదు. 'కలిగియున్నది ఏదియు నీవు లేకుండా కలుగలేదు'. గనుక సృష్టిలో నీవు చేసిన ప్రతి వస్తువు ద్వారా ఒక మార్పు కలిగించుచున్నావు. నీవు సూర్యుని కలిగించినావు. ఆ సూర్యునిద్వారా ప్రతి వస్తువునకు, సృష్టి అంతటికి మార్పు కలిగించుచున్నావు. పువ్వులు రకరకములు. వాటికి రకరకమైన రంగులు సుర్యుడు లేకుండా రావు. అది జరగదు.ఏ సూర్యుని కలిగించినావో ఆ సూర్యునివల్ల వస్తువులను మార్చే శక్తి కలిగించినావు. నీవు కలుగజేసిన వృక్షములలో మార్పు ఏదనగా, వృక్షము వృక్షముగానే యుండును గాని దానిక్రంద నీడ కలిగించినావు. అలసట నొందినవారు నీడను కూర్చుండి నెమ్మది పొందుదురు. ఇదే మార్పు. చంద్రుని కలిగించినావు. దానివల్ల వెన్నెల. ఆ వెన్నెల వలన చల్లదనము, ఇదే మార్పు నరులకు చల్లదనము కలిగించినావు. అనగా నీళ్లు కలిగించినావు. నీళ్లు దాహము తీర్చును. దాహము తీర్చుటే, మార్పు. ఆహారము తిన్నయెడల దాహము తీరదు. నీళ్లవలనే దాహము తీరే మార్పు. నీవు చేసిన ప్రతి వస్తువువల్ల మార్పు కనబడినపుడు నీవల్ల మార్పు ఎందుకు కలుగదు. తప్పక కలుగజేతువు గనుక నీకు వందనములు. ఈ లోకములో నీవు సంచరించినపుడు ఒకనాడు రోగులలో ఎంత మార్పు కలిగించినావు! ఆనంద గీతము పాడుచు గంతులు వేయుచువెళ్లిరి.

నీ శ్రమ చరిత్రలో మరొక అంశము: మార్పు పొందక పోవుట. మరొక క్రొత్త అంశమును ధ్యానించబోవు చున్నాము. కృప దయచేయుము. ఆమేన్.


1. నీకును, నీ శ్రమలకును - నిత్యమును జయము జయము.


2. నీకును, నీ ఓర్పునకును - నిత్యమును జయము జయము.


3. నీకును, నీ సిలువకును - నిత్యమును జయము జయము.


ఇవి 40 దినము ధ్యాన కాల కార్యక్రమమునకు పెద్దలు నియమించిరి. ఒక్కొక్కటి ఒకొక్క అర్ధము. (క్రమముగా ధ్యానించిన వివరముతో అర్ధమగును. అట్లు చేయనందున కొంత విడిచితిని. చెప్పుటకు సమయము లేదు).


విడిచిన అంశములు ఈలాటి అంశములు అన్నియు, ఆయన శ్రమ చరిత్రలోనివే. ఇవి కూడా ధ్యానింపవలెను. పాట: ఈలాటదా యేసుప్రేమ. ముఖ్య కార్యక్రమము వివరింపగోరుచున్నాను. ఆయన శ్రమచరిత్రవల్ల మారిన వారున్నారు. ఆయన పూర్వజీవితము వల్ల మాత్రమేగాక, ఆయన శ్రమచరిత్రవల్లకూడా కొందరు మారలేదు. ఎవరు మారలేదో వారిని జ్ఞాపకము చేసికొందాము.

ప్రార్ధన:- ఈ మాటలు విని, ప్రయత్నించువారిని దీవించి మార్చుము. మాలో మారుటకు ప్రతివారిని ప్రతి విషయములోను మార్చుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.


కీర్తన:
1. మహాత్ముడైన నా ప్రభు


విచిత్ర సిల్వ జూడ నా


యాస్ధిన్ నష్టంబుగా నెంచి


గర్వం బణంగ ద్రొక్కుదున్||


2. నీ సిల్వ గాక యో దేవా


దేనిన్ బ్రేమింప నీయకు


నన్నాహరించు సర్వమున్


నీ సిల్వకై త్యజింతును|| ఆమేన్.