లెంటులోని పన్నెండవ దినము - మంగళవారము

అంతరంగ సిలువ

కొలస్సి.2:13-15.

ప్రార్ధన:- యేసుప్రభువా! నీ సిలువను ఇపుడు ధ్యానించనై ఉన్నాము. అందులోని అంతరంగ చరిత్రను మా కన్నులకు కనపర్చుము, జ్ఞానమునకు బోధపర్చుము. యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.


సిలువధ్యాన పరులారా! ఈ వేళ మంచి శుక్రవారము. యేసుప్రభువు సిలువమీద బాధపడుచుంటే ఇది ఎట్లు మంచి శుక్రవారము? మనకు అర్ధము కాదు. ఒక మిషనెరీ దొరగారు చెప్పినారు. ఏమనగా ఈ సిలువవల్ల మనకు రావలసిన మంచి యావత్తు వస్తింది. అందుచేత ఇది మనకు మంచి శుక్రవారమే అన్నారు. ఓ ప్రియులారా! సిలువ చరిత్ర, సువార్తికుల చరిత్ర అంతా చదివితే, శ్రమ తప్ప మరేమియు లేదు. సంతసింపవలసిన ఒక్క చిన్న సంగతియైనను లేదు. అయినను విశ్వాసులైనవారు సంతసింపవలసిన దినము ఇదే. ఈ దినము సైతానుకు మాత్రమే బహు భయంకర దినము. మనకందరికి అనగా మన దృష్టికి మాములుగా ఒక సిలువ కొయ్య కనబడు చున్నది. ఆ సిలువ కొయ్యమీద గాయపరచబడిన యేసుప్రభువు శరీరము కనబడు చున్నది. అది మనకు మాములుగా కనబడుచున్నది. యేసుప్రభువును వేసిన సిలువ కొయ్య సామాన్యమైన పొడుగైనదే. అయితే అయ్యగారి యొక్క మనోదృష్టిలో అది సామాన్యమైన పొడుగుకాదు. కర్రసిలువ మించిన పొడుగు ఈ సిలువ ఉన్నది. ఈ కర్ర సిలువమీదనున్న శరీరము, సిలువచుట్టు ఉన్న బహిరంగ మనుష్యుల సమూహము; ఇదంతా బహిరంగసిలువవేత. సరే ఈ బహిరంగ సిలువ చరిత్ర ప్రతిసారి మనకు తెలిసినదే. ఇది మనకు కంఠతే. ఇపుడు దానిని గూర్చి కాదు. మన మనోదృష్టిలో ఈ వారము మన మనోనేత్రములకు అంతరంగ సిలువ కనబడుచున్నది, దానిని మనము ధ్యానిస్తే మనకు అసలు విషయము తెలుస్తుంది. అసలు కధ మిక్కిలి చిన్నది, మిక్కిలి విశాలమైనది.అది మిక్కిలి చిన్నది గనుక ఈ వేళ ప్రసంగముకూడా చిన్నదే. ఎక్కువ సంగతిలేదు. సరుకెక్కువ కనిపించుటలేదు. ఉదా: గోడమీద ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూచుటకు ఎంత టైము పట్టును? ఎంతో టైము పట్టదు. అలాగే అంతరంగ సిలువను వినుటకు ఎంతో టైము పట్టదు. కొద్ది సం||లు ఈ బహిరంగ సిలువ ధ్యానిస్తూ ఉంటుండగా దాని వెనుక అంతరంగ సిలువ ఉన్నది. అని నేను చెప్పగా ఆ సంగతి మీకుకూడా తెలిసియుండును. యేసు ప్రభువు ఈ బహిరంగ సిలువమీద ఉన్నారు. 1) ఇక్కడ శిరస్సుమీద ముండ్లకిరీటము ఉన్నదిగదా! అయితే ఆయన వెనుక భాగములో ఉన్న అంతరంగ సిలువమీద ఆయనకు ముండ్ల కిరీటము లేదు. మహిమ కిరీటము ఉన్నది. ఆ కిరీటమునకు ఆయనకు బాధలేదు. సంతోషమున్నది. ఆ ముండ్ల కిరీటము వెనుక ఎంత మహిమ కిరీటము దాగియునాదోకదా! ఆ రెండు ఎంతవరకు సాగినవంటే ఆ మహిమ కిరీటము ఎంత సాగినదంటే పరలోకములో దైవభక్తులున్న మోక్షము వరకు సాగింది. ఈ కిరీటము భూలోకములో ఉన్నప్పుడు అనేక శ్రమలుపొంది పరలోకమునకు వెళ్లిన పరిశుద్ధుల వరకు వెళ్లినది. ఎందుకు సాగివెళ్లింది? ఓ పరిశుద్ధులారా! ఓ భక్తులారా! నేనింక సమాధి కాలేదు. మరణము కాలేదు. సమాధి మీదనున్న రాయి తీయబడలేదు. నేను బ్రతికి సమాధిలోనుండి బయటకు రాలేదు. వచ్చినపుడు నాకు జయముండును. బయటకు వెళ్లినప్పుడు జయముండును. వచ్చును.


అయితే ఇవేవి జరగకముదే నాకు మహిమ కిరీటమున్నది అని ప్రభువు చెప్పినట్లున్నది. సిలువ వెనుక ఉన్న మహిమ కిరీటము ఎవరికినీ తెలియదు.శిష్యులకుకూడా తెలియదు. ఇది పరలోక వాసులకే తెలియును. భక్తులకు తెలియాలి. కర్ర సిలువ ఇంకా తీయనిదే, కర్ర సిలువ వెనుక మహిమ కిరీటమున్నదని రాణువవారికి, శత్రువులకును, వారితో ఉన్న శిష్యులకును తెలియదు. ఈ సంగతి పరలోకమందున్న పరిశ్య్ద్ధులకు తెలియును. గనుక మహిమ కిరీటము అక్కడికి వెళ్లిపోయెను. దావీదు కీర్తన 2వ అధ్యాయములో ఏమున్నదనగా, ఆయన అభిషిక్తునికి శత్రువులు కీడు చేయాలని పన్నాగములు పన్నుచుండగా పరలోకమందు సింహాసనమందున్న దేవుడు ఈ పన్నాగములు నెరవేరవనియు, ఆయనకు జయము కలుగుననియు, ఆ జయమువల్ల కిరీటమున్నదని చెప్పి పకపక నవ్వుచున్నాడు కీర్తన 2:1-4;


ఈ సిలువ చరిత్రవల్ల మనము చాలా దుఃఖిస్తాము గాని మహిమ కిరీటము పలోకము వరకు పొడిగించబడినందున తప్పక సతోషించవలెను. ఎందుకనగా సిలువ చరిత్రలోని జయము మనకు తెలుసును. ప్రభువు సర్కీటులో శిష్యులకు చూచాయగా చెప్పినందున వారికి తెలుసును గాని ప్రభువు లేస్తారనేది పన్నెండు మందిలో ఒక్కరికైనా రవ్వంతైనా జ్ఞాపకములేదు. జ్ఞాపకముంటే సంతోషించి యుందురు. ఈ మహిమ కిరీటము పొడవు పరిశుద్ధలోకము వరకే కాదు. దేవదూతల లోకము వరకు ఈ పొడవు వెళ్లెను. అంతవరకు వెళ్లినది మనకేలాగు తెలియుననగా స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్లగా, ఇద్దరు దేవదూతలు ప్రభువు లేస్తారని తెలియదా? అని చెప్పి, లేచినారని జ్ఞాపకముంచుకొని చెప్పిరి. దేవదూతలు జ్ఞాపముంచుకొని స్త్రీలకు చెప్పిరి. ఈ చరిత్రలో జయించినాడనే మాట దేవదూతలకు ముందే తెలిసినది. నేను జయించినాననేది ముండ్ల కిరీటముతో ఉన్నప్పుడే ప్రభువు చెప్పెను. ఈక్రియవల్ల మార్కు 11:24ను బట్టి జరగకముందే జరిగిందని ప్రభువు చెప్పిరి. ఈ క్రియవల్ల ఈ వాగ్ధానము నెరవేరిందని చెప్పిరి. ఈ కిరీటము అంతవరకు వెళ్లెను.


ప్రభువుయొక్క హస్తములు ఈ రీతిగా కొయ్యకు తూర్పు పడమరలుగా చాపబడియున్నవి. ఎడమ చెయ్యి ఆదాము,హవ్వలు పాపము చేసిన సమయమునుండి, సిలువమీద ఆయన గాయములు పొందిన అంతవరకు చాపబడియున్నది. జాలరలు వల దూరముగా విసిరి, అందులో పడిన చేపలను మెల్లగా దగ్గరకు లాగును. ఆ చేపలు దగ్గరకు వచ్చును. దగ్గరగా వలవేసే ఎక్కువ చేపలు పడవు. దూరముగా వేస్తేనే పడును. ఆయన ఎడమ చెయ్యి ఆదాము,హవ్వలు మొదలు సిలువవరకు, 4 వేల సం||లు నుండి పాపులగా నున్న పాత నిబంధన పాపులందరిని దగ్గ్రకు లాగుచున్నది.(లాగుకున్నది) దూరముగానున్న బిడ్డను దగ్గరకు మనము లాగుకున్నట్టుగా ప్రభువు వారందరిని తన దగ్గరకు లాగుకొనెను.


కుడిచెయ్యి, మహిమ సిలువమీద నున్న చెయ్యి ఈ చేతిలో ఆయన రాకడ వరకు 7సం||లు శ్రమలవరకు, 1000 ఏండ్ల పాలన చివరి వరకు; దీని చివరన అంత్యతీర్పు చివర వరకు ఉన్న ప్రజలను తన దరికి ఆకర్షుంచుకొనుచున్నారు. ఆలాగు ఆయన ఇక్కడ వరకు ఉన్నవారిని తనదరికి చేర్చుకోపోతే మనిషి అక్కడ వరకు వెళ్లి,ఆ తరువాత నరకములోకి దూకివేస్తారు. అక్కడవరకు వెళ్లిన ఈ చెయ్యుని చూచి అపుడు, ఏమయ్యా! మేము ప్రవచింపలేదా! బొధించలేదా! అద్భుతాలు చేయలేదా! అంటారు. ప్రభుని రెండు చేతులిట్లు పొడించబడినవి.


కొందరు ఆ రెండు చేతుల దరి అంచునుండి దుమికి వేస్తారు. వారిని గూర్చి అయ్యగారు రక్షించమని ప్రార్ధించగా ప్రభువు ఇలా అన్నారు; 'ఎవ్వరు చేయని ప్రార్ధన నీవు ఒక్కడివే చేసినా'వని చెప్పిరి. ఈ రెండు చేతులు ఇచ్చటి వారిని లాగి ఏమి చేసెననగా; ఆయన ప్రక్కలో బల్లెముతో పోడువగా ప్రక్క గాయము క్రింద ఆయెను. తప్పిపోయిన కుమారుని, తండ్రి తన ప్రక్కలోనికి చేర్చుకొన్నట్లు ప్రభువు రెండు చేతులతో, ఈ పాపులందరిని తన ప్రక్కలోకి చేర్చుకొనెను. అందుచేతనే ఈ ప్రక్క గాయము. ఆయన చేతులు అంతవరకు పాపుల నిమిత్తమై సాగుటకు కాబోలు ఆయన చేతులకు గాయములు. దేవదూతల లోకానికి వెళ్లుననే కాబోలు, ప్రభువుకు ముండ్ల కిరీటము శత్రువులు వేసిరి. కాలిపై కాలు పెట్టి ఆయన కాళ్ళకు పొడుగైన మేకులున్ కొట్టిరి. ఈ మేకు అంతరంగ సిలువలోనుండి పాతాళ అగాధమైన హేడెస్సుకు వెళ్ళెను. మారుమనస్సులేని అవిశ్వాసుల లోకము వరకు వెళ్ళిన ఆ మహిమ పాదాల గాయములు చూచి, ఆ క్షణములో అక్కడి వారందరునూ, మా నిమిత్తమై పొందిన గాయములని మహిమ ఆ పాదాలను చూచి, ఆ పాదాలు అంతవరకు వెళ్లినందున వారును రక్షించబడిరి. ఇంతవరకు వెళ్లిన ఈ సిలువ ఎంత పోడవో, ఎన్ని మైళ్ళ విస్తీర్ణములో వ్యాపించి ఉన్నదో, తెలియదు. ఇన్ని సం||లనుండి ఉన్నది అని కూడా చెప్పలేము గాని, 7ఏండ్ల శ్రమలు గల సంవత్సరములని, వేయ్యేండ్ల ప్రభువు పరిపాలన సంవత్సరములని తెలియును. అదెప్పటికో తెలియదు.


అయ్యగారు ఒకసారి సముద్రము ఒడ్డున నిలిచిరి. దగ్గరనున్న జాలరులు మైలు దూరము వరకు వలవేసిరి. అందులో కొన్ని పడ్డవి. వారితో కొంతదూరము అయ్యగారు వెళ్లిరి. ఈ వల చరిత్ర చీచినట్లు, ఈ సిలువ చరిత్రలోని నాలుగు భాగములను మనోదృష్టితో వెళ్లిచూచి చెప్పుచున్నాను. ఆ మహిమ కిరీటము చూచి, నాకును ఇట్టి కిరీటమున్నదనియు, ఆ చేతలుచూచి నన్నుకూడా ఆ చేతులతో ప్రక్కలోనికి చేర్చుకొనుననియు, ఆ పాదాలుచూచి నాకు సంబంధించిన వారిని అధోలోకమునుండి తెచ్చి తన ప్రక్కలోనికి ఆయన చేర్చుకొనుననియు తలంచాలి. ఈ చరిత్ర అంతా మహిమ చరిత్రే.గనుక మనమందరము 3 గంటల వరకు ఈ చరిత్రలోని మహిమయొక్క మహిమ ఎంత గొప్ప చరిత్రో చూస్తాము.


1) దేవాలయపు తెర చిరుగుట అనగా దేవునికి మనిషికిమధ్య అడ్డులేదు. దైవసన్నిధికి ప్రతి పాపి వెళ్లవచ్చును. 2) సిలువధ్యానమును గ్రహించి చేయుట మంచిది. అది ప్రభువుకు కిరీటము. అది ఆయనకు ఆనందము. 3) భూగర్భము, ప్రభువు సిలువ కొయ్యను తనలో పాతినందుకు దుఃఖించు చున్నది. అయితే అందులోనుండి పాతాళములో ఉన్నవారిని ఆయన రక్షించెను. 4) పరలోక పరిశుద్ధులు ప్రభువు మహిమ సిలువను చూచి సతోషించుచున్నారు. 5) భూలోకములోని వశ్వాసులు సహితము పాపులు గనుక ప్రతివారు సిలువ మోయవలెను. 6) మీ హృదయములను సిలువలోనున్న క్రీస్తు పాదములమీద వేయండి. అపుడు శుద్ది కలుగును. 7) మన పాపములు ఆయనను బాధపెట్టెను గనుక దుఃంచవలెను.

ఈలాగు క్రీస్తు ప్రభువుయొక్క అంతరంగ సిలువలో మహిమ చరిత్ర మీ అనుభవములలో ఉండును గాక. ఆమేన్.


కీర్తన: "అందు దిమిరము కమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు = నింద వాయువు లెనో వీచెను - కందు యేసుని ఆవరించెను - పందెముగ నొక కాటు వేసెను - పాత సర్పము ప్రభువు యేసును" //ఎంత గొప్ప//