ఉపోద్ఘాతము :-

యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రమకాల ధ్యానములు ఈ 2020లో ఫిబ్రవరి 26న భస్మ భుధవారముతో మొదలై, ఏప్రిల్ 11న శనివారముతో ముగించబడును. ఏప్రిల్ 12న ఈస్టరు పండుగ.


ప్రార్థన: దయగల ప్రభువా! మా నిమిత్తము భూలోకమున శ్రమననుభవించి మాకు గొప్ప విజయమునిచ్చుచున్న ప్రభువా! నీకే వందనములు. మా బ్రతుకు ద్వారా మీకు మహిమ కలుగునట్లు మా జీవితమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


నేపథ్యం(theme): యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.

శ్రమకాల ధ్యానములో, రెండు ప్రాముఖ్యమైన విషయాలలో దేవునితో సంబంధము కలిగివుండాలని ఈ వాక్యము ముఖద్వారముగా ఎంచబడినది. 1. కృప 2. సత్యము.

"గాఢమైన లోకజ్ఞానం కంటే నిన్ను నీవు తెలిసికొనియున్న స్వల్ప జ్ఞానం దేవుని దగ్గరకు తీసికొని వళ్ళగలదు" - యం.దేవదాసు అయ్యగారు.

విస్తారమైన వాదనలకంటే కృప, సత్యము; ఈ రెండు విషయాలు కలిగివుండుటద్వారా సమస్తమును ఏవిధముగా సాధించవచ్చు అనే అంశమును ఈ లెంటు దినములలో అభ్యాసము చేయువిధముగా వర్తమానములు వ్రాయబడినవి.


traps

ప్రస్తుతం మనుష్యులను భ్రమపర్చుటకు ఈ లోకములో అనేక రకముల ఉచ్చులు, బోనులు, వలలు ఉన్నవి. అది వ్యసనము కావచ్చు, వ్యాధి కావచ్చు, రాజకీయము, వ్యాపారము, టెక్నాలజీ, మీడియా ... ఏది ఏమైన క్రైస్తవ జీవితము ఈ నాటకీయ భ్రమల గుండా ఈదుకుంటూ సత్యమువైపు తిన్నగా ప్రయాణించడమే ప్రభువు మనకు నేర్పిన పాఠము. కేవలము ప్రభువైన యేసు అనుగ్రహించిన కృపద్వారా మాత్రమే సత్యమును చేరుకొనగలము.


క్రీస్తు శ్రమల వలన కలిగిన భాగ్యము

విశ్వాసులకు శుభము కలుగును గాక! క్రీస్తు శ్రమలను ధ్యానించుచున్న దైవాభిమానులకు దేవుడు మేలు చేయును గాక! 2000 సంవత్సరముల ముందు ప్రభువైన యేసు క్రీస్తు పొందిన శ్రమ వలన మనకు కలిగిన భాగ్యమేదనగా మనకు ఆదరణనిచ్చుచున్న ఆయన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుట, జీవ గ్రంథము మన చేతిలో ఉండుట, దైవ రాజ్యమును స్థాపించుచున్న సంఘములు మరియు మనము ఆయనను ఆరాధించుట, ఇహమందు లోక రీతిగా ఏస్థితిలోనున్నను పరలోకములో బహు భాగ్యమంతులమగుట.

Bible Works దీనిని బట్టి ప్రతి శ్రమకు తగిన ఫలితము తప్పక ఉండును అని ఋజువు చేయబడినది. మరి ముఖ్యముగా దేవుడు చెప్పిన మాటలలో ఏదియు వ్యర్ధముగా పోలేదని తెలిసికొనుచున్నాము. ప్రపంచ సౌభాగ్యము కొరకు అనేక ఘనకార్యములు క్రైస్తవ సంఘము చేయగలదని నిరూపించబడినది.

దేవుడు ఈ సమస్త సృష్టిని ముగించిన తర్వాత ఆయన మన కొరకు మంజూరు చేసిన మంచి ఫలములను మహిమైశ్వర్యమంతటిని స్వతంత్రించుకొనుటకు కావలసిన సామర్ధ్యమును పొందుటకు తన అధికారిక పత్రములను (జరిగిన, జరగబోవు ఘట్టములతో సహా) మనకు బైబిలు రూపములో అందించెను. బైబిలు వాక్యమును బట్టి మనమేమి అడిగినను ఆయన తప్పక ఇచ్చువాడై యున్నాడు. దేవుని అధికార పత్రమైన బైబిలు నిరంతరము పనిచేయుచున్న జీవము. ప్రతి వాక్యములోను జీవమున్నది. ఆ జీవము మనకు జీవమిచ్చుటకై శ్రమపడుచున్నది. ఆ జీవమును ఎంత త్వరగా మనము నింపుకొని జీవిస్తామో అంత ఆరోగ్యవంతులము, ఆస్తికర్తలము, ధనికులము, ఐశ్వర్యవంతులము. ఆలస్యము చేసిన ఆయనకు (జీవమునకు) శ్రమ. తద్వారా సృష్టికి శ్రమ. మన కిక మహా శ్రమ. కాబట్టి ప్రతి దినము బైబిలు ధ్యానించి, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసము చేయుట మనకు నిత్య జీవము. ఇదే దైవ సహవాసమునకు అత్యంత సమీప మార్గము.


అయితే మనకు శ్రమలు లేవా?

దేవుడనుగ్రహించు మహిమ పొందుటకు మనకు శ్రమ అనివార్యము. కాబట్టి మంచిని, మేలును నిర్మించుటకు మనము నిరంతరము పరిశ్రమిస్తు ఉండాల్సినదే. అయితే మన శ్రమ ఎటువంటిది? కలిసివచ్చే నిర్మాణాత్మకమైనదా? లేక దేవునితో విడగొట్టి ఇతరులపై ద్యాసను పెంచే వినాశనకరమైన శ్రమలా?

అయితే ప్రభువు సిలువ శ్రమ ఆనందకరమైన శ్రమ. దీనిలో బహుగా ఫలించుటవలన పరలోకమందున్న తండ్రి సంతోషించును.

ప్రభువు సిలువ శ్రమ అంటే ఏమిటి? దేవుడు మనకొరకు సిద్ధపర్చిన ప్రణాలికను తెలిసికొని, ఎంత శ్రమ ఎదురైనను దాని ప్రకారము చేయుటయే. ఈ శ్రమయందు మనకు హాని లేదు గాని అధిక ఐశ్వర్యము గలదు. ప్రభువైన యేసు క్రీస్తు అనాదిలో సంకల్పించిన మహా రక్షణను సంక్షిప్తముగా అర్థము చేసుకొనుటకు మహిమ వార్తావళి అను అయ్యగారి ప్రసంగ సంకలమును రుచి చూడండి.

శ్రమ అనగా లేమిని, బలహీనతను మౌనముగా భరించడంకాదు. దైవరాజ్యమును స్వతంత్రించుకొనుటకు, సత్యమునకు నిలబడుటవలన కలుగు కష్టములను భరించి ఒక ఘనకార్యమును సాధించుటకు శక్తిని పొందుచు, కష్టములను ఎదుర్కొనుచు మానక పనిచేయుటయే. కాబట్టి భక్తులు తమ ప్రణాళికను ప్రభువునకు మహిమార్థమై ఘనముగా ముగించుటకు ఈ శ్రమకాల ధ్యానములను ఉపయోగించుకొనుట మంచిది.


ప్రభువు ప్రకటన గ్రంథములో (1:18) "నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి". అని చెప్పెను

ఇంతగొప్ప ప్రవచన వాక్యములను అందుకొనుటకు యోహానుకు గల ప్రత్యేకత ఏమిటి?

( ప్రకటన 1:9) మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమ లోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

ప్రభువు యొక్క శ్రమలలో పాలుపొందుట మరి ముఖ్యముగా ఈ లోకమునుండి వేరై పరవాసిగానుండి ధ్యానించుటవలన ప్రకటన గ్రంధమును మనకు అందించగలిగెను. ప్రకటన లేకపోతే క్రీస్తు శ్రమ ఒక ముగిసిన అద్యాయము. ఒక మహనీయుని చరిత్ర. కాని ప్రభువు తన శ్రమను మరలా గుర్తు చేసి ప్రస్తుతమందును, రాబోవు యుగమునందును ప్రభువే సర్వాధికారియని ఋజువు పరచెను. ప్రభువు మననిమిత్తము సిలువ శ్రమను పొంది ఇహమందును పరమందును సర్వాధికారియై మనకు రక్షణనిచ్చుచున్నందున మనము చింతలేనివారమై ముందుకు సాగుదము.

కాబట్టి ఈ లెంటు కాలములో లోకమునకు, దుర్వార్తలకు, ఫేక్ న్యూస్ లకు, ఫేస్ బుక్ లకు దూరముగానుండి క్రీస్తుయొక్క శక్తిని పొందుటకు దేవుడు మనలను ఆయత్తపరచును గాక.

శ్రమల ధ్యానములో ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞతలు సమర్పించుకొనుచు, ఒక ఘన కార్యమును సాధించుటకు సిద్ధపడుదము.


దేవుడు తన ఆత్మను నిండుగా మనకు దయచేయును గాక! అమేన్

Social Media Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +