భస్మ బుధవారము

వాక్య భాగము: మత్తయి 20:17; మార్కు 10:32; లూక 18:31

గమనిక: ఈ వ్యాసము దేవదాసు అయ్యగారి భస్మ బుధవారము యొక్క 7 ప్రసంగములనుండి క్రోడీకరించబడినది.

యేసుప్రభువును చంపుటకు యూదులు కుట్రపన్ని, ఎదురు చూచుచున్న సంగతి తెలిసినను, మన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు తాను మహా శ్రమను పొందుటకు యెరూషలేము బయలుదేరి; ఆయన శిష్యులు ప్రభువు పొందబోవు మరణశ్రమను ఎరిగినవారై భయపడి విస్మయము పొందుచున్నప్పటికిని ఆయన వారికి ముందుగా నడచెను. ఆయన ప్రేమ ఎంత గొప్పది!

మన శ్రమను, వ్యాధిని, పాపమును ఆయన సిలువపై మోసెనను విశ్వాసముతో దేవునిని స్తుతించుటకు, ఆయన ఈ లోకముపై మనకిచ్చిన విజయమును స్వతంత్రించుకొనుటకు ఈ 40 దినముల సిలువ ధ్యానమును చేయుదము.


లూక 12:49 :- యేసు ప్రభువు ఈ విధముగా చెప్పెను "నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను."
అగ్ని = సర్వసత్యములోనికి నడుపు పరిశుద్ధాత్మ. మనలో ఈ అగ్ని మండినయెడల ఎట్టి శ్రమయైనను భస్మమై పోవును.

భస్మ బుధవారము ఆచరించుటకు గల కారణములు:

ash wednesday అనేక దేశాలలో ఆచరిస్తున్నట్టుగా, భస్మ బుధవారమనగా నుదుట నల్ల విభూధి రాసుకోవడం కాదు. ఇది బాహ్యముగా జరిగె ప్రక్రియ కాదు. ఇది క్రీస్తు సిలువ కార్యమును స్మరించుకొనుటకు శరీరమును, మనసును, ఆత్మను సిద్ధముచేసుకొను దినము.

మన సాంప్రదాయ సంఘాలు చాలా సంవత్సరములుగా ఆచరిస్తున్నట్టు మనము కూడ ఆచరించుట తప్పేమిటి అని ఈ 40 రోజులు ఉపవాస ప్రార్ధనలు చేయుట మంచిదే. అయితే ఒక గురి లేదా లక్ష్యం కలిగి చేయుటకు గల 3 ప్రాముఖ్యమైన కారణములను ధ్యానించుదము.
 1. పూర్వము ఆది క్రైస్తవ సంఘము ఈ క్రింది వాక్యమును బట్టి భస్మ బుధవారము ఆచరించెడివారు.
  ఆది 3:19 - "నీవు మంటిలోనుండి తీయబడితివి గనుక మన్నైపోవుదవు "
  అయితే 1969 లో రోమన్ రైట్ అనే సువార్తికుడు , మార్క్ 1:15 ప్రకారం "మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి" అనే నినాదంతో నూతన అద్యాయమును ప్రారంభించెను.

  దీనికి ముందు ఇండియాలో దేవదాసు అయ్యగారు భస్మ బుధవారపు మూల వాక్యములను,లక్ష్యములను, ఇప్పుడు దేవుడు మనకిచ్చే సంస్కారపు అభిషేకమును నిర్వచించిరి. ఈ క్రింది భాగములలో వాటిని ధ్యానించుదము.
 2. క్రీస్తు రగిలించిన అగ్నిలో కాల్చబడుటకు

  భస్మ బుధవారముయొక్క అర్థము: ఆది 18:27 లో అబ్రహాము ఈ విదముగా చెప్పెను, "ధూళియు, బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను". విశ్వాసులకు తండ్రియని పేరుపొందిన అబ్రహాము అట్లనిన, మనము ఏమి అనవలెను? భస్మమనగా కాలుట వలన ఏర్పడిన బూడిద. బంగారము సహితము కాలుటవలన కరిగిపోవును. అయితే కొన్ని వెల గల రాళ్ళు, బండలు బూడిద కావు. విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము గారు ప్రభువు సన్నిదిలో కాల్చబడినప్పుడు, దేవుని పాదములయొద్ద బూడిద మరియు ధూళిగా పడియుండేటంతటి గొప్ప విధేయత, దీనత్వమనే లక్షణమును దేవుడు చూచి , మొర విని, లోతును రక్షించెను.

  అయితే క్రీస్తుయొక్క సిలువ కార్యము తర్వాత వున్న మనము, యేసు క్రీస్తు అనే బండమీద పునాది వేసికొన్నచో, ఎన్ని శ్రమల అగ్నిగుండములలో ప్రయాణించినను క్రీస్తు యొక్క దైలక్షణములు (వెల గల రాళ్ళు) బయట పడును గాని, మనము (దైవాత్మ) కాల్చబడము. అయితే మన శరీర నైజము భస్మమై భూడిద కావలెను. ఈ నైజము ప్రభువు రగిల్చిన ఆత్మాభిషేక అగ్నిలో కాల్చబడవలసినదే. దీనిని బూడిద చేసినచో సాతనును అగ్నిగుండములో వెసినట్లే. ఇక వాడు మనలను శొధింప జాలడు.


  వివరము:

  దేవదాసు అయ్యగారు, మన శరీరమును నడిపించే రెండు అవయములను గూర్చి వివరముగా బోధించిరి. ఆ శరీరావయములేవనగా

  • మనస్సాక్షి - హృదయాంతరంగమునుండి సత్యమును బోధించుచుండును
  • నైజము - శరీరాశ, లోకాశ లను బట్టి నిరంతరం శోధించుచుండును

  ఈ శ్రమకాల ధ్యానములో కాల్చి భూడిద చేయవలసినది మన శరీర నైజమును. మన శరీరములో ఏ అవయములు పోయినను, ఈ రెండు అవయములు మాత్రము మనము బ్రతికున్నంత వరకు మనలను శాసిస్తూ ఉంటాయి.

  మరి నైజమును కాల్చి భూడిద చేయుట యెట్లు? నైజమును తీసివేయలేము గాని నైజ గుణమును మార్చుటకు పద్ధతులు గలవు. అవి
  • దినదినము దైవ స్తుతి చేయుట ద్వార దురిత నైజపు వేరు పెరికివేయబడి, పరిశుద్ధ నైజ సంపద వచ్చును.
  • దైవ సన్నిధిలో కనిపెట్టుట ద్వారా ప్రభువే స్వయముగా సంస్కారపు విందు ఇచ్చును. ఈ పరిశుద్ధాత్మ అభిషేక విందును అందుకొను అనుభవము సంపాదించుట వలన నైజ పాపములు కాలి భూడిదగును.
  • తీర్మానము: దైవ చిత్తమును తెలిసుకొనుటకు సన్నిధిలో వుండి ఆయన చెప్పినదే చేయుదును. నైజము ఎంత శోధించినను చేయనే చేయను.


  ఈ తీర్మనమును అభ్యాసములో పెట్టి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ శ్రమల ద్వారా మనకు దయచేసిన నిర్మలమైన మనస్సాక్షి నడిపింపుతో నడుచుటకు రూపాంతరము పొందిన యెడల మనము బహిరంగ సాక్షులుగా ప్రకాశించుదము.

  ఈ క్రింద గీయబడినది కేవలం ఊహా చిత్రం : నైజము మరియు రూపాంతర మహిమానుభవముల యొక్క వివరముల కొరకు అయ్యగారు వ్రాసిన మనస్సాక్షి, ఆత్మీయ స్వస్థత, ప్రార్థనా మంజరి మొదలగు పుస్తకములు చదవండి.

  naijamFigure 1: నైజము - మన శరీరమునకు ఇద్దరు మాస్టర్స్(నడిపించేవారు లేదా రెండు ద్వారములు) అనగా మనస్సాక్షి/నైజము ఉన్నారు, మనస్సాక్షి మాటవింటే నైజమును నెరవేర్చరు. నైజమునకు లొంగితే మనస్సాక్షి క్షొభించును.

  1 పేతురు 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

  కావున ఈ శ్రమకాల ధ్యానములో నిర్మలమైన మనస్సాక్షిని పొందుటకు ప్రయాసపడుదము.

 3. శ్రమవలన కలుగు భాగ్యము: విలువగు కాంతిగా మెరయుట

  శ్రమల మార్గమే - విమల మార్గము - శ్రమభక్తుని కాశ్రమము =
  శ్రమలే సంపూర్ణంబగు దైవ - మానవునిజేయుగదా - శాంతి గలుగు కాంతివెలుగు


  క్రైస్తవ విశ్వాసి అత్యధిక శ్రమానుభవములో పయనించునప్పుడు , నిత్యమూ కదలని క్రీస్తు ప్రేమ, జీవము, పరిశుద్ధత లాంటి మేలిమి లక్షణాలు స్పష్టముగా, బహిరంగముగ సాక్ష్యమిచ్చును గాని, శరీరాశలతో కూడిన నైజము మాత్రము కాలి భూడిదగునని పైన తెలుసుకొన్నాము. కాని శరీర నైజము చాలా తెలివైనది. ఏ చిన్న సందు దొరికిన, దానికి అనుకూల పరిస్తితులను కల్పించకూడదు. దీనికి మార్గము, దేవుడు మనకు అందించిన సంపూర్ణానుభవము ఈ మండల కాలములో అభ్యసించి, జీవితకాలమంతయు దానిలో ప్రయాణించడమే.

సారాంశము:

ఈ 40 రోజుల శ్రమల ధ్యానములలో, ప్రభువైన యేసుక్రీస్తు పొందిన శ్రమల ముందు మనశ్రమలు ధూళి కణము వంటిదని గుర్తెరిగి, ఆయన కృపద్వారా మనకు కలిగిన పరిశుద్ధాత్మాభిషేకమును పొంది, మన అహంకారమును, ద్వేషమును, నైజమును కాల్చి భూడిద చేసి, ప్రభువు చెంత సన్నిధిలో కనిపెట్టి, అనాది లో దేవుడు మనకు అమర్చివుంచిన ఐశ్వర్యమును, ఆశీర్వాదమును పొందుకొని, ఆయన రాకడకు సిద్ధ పడుదము.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

 • Like this page on Facebook

 • Tweet this page on Twitter

 • Recommend this website on Google +