సంఘారాధనలు

  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు
  4. 14. కాలోచిత ప్రార్ధనలు
  5. పునరుత్థానము

పునరుత్థానము

మత్తయి 22:31; 28అ|| మార్కు 16అ|| లూకా 14:14; 24అ|| యోహాను 5:28; 11:23; 20అ|| కార్య 26:26. 1కొరింథి 15:1-20; 50,56 1 థెస్సలో 4:15-18 ప్రకటన 20:4-6.

 స్తుతి:- పునరుత్థానుడవైన ప్రభువా! నీవు సమాధినుండి లేచుట వలన విశ్వాసులైన మృతులుకూడ లేతురను విశ్వాసము సంఘమునకు అనుగ్రహించిన నీకు నుతులు. నీవు లేచినావు. గనుక మేముకూడ పాపములు, శోధనలు, కష్టములు మొదలగువాటిలోనుండి లేచు కృప దయచేసినావు. గనుక నీకు సంస్తుతులు. లోక చరిత్రలో ఎప్పుడును, ఎన్నడును, జరుగని పునరుత్థానమును గొప్పచరిత్ర జరిగించి రాబోవు కాలములోకూడ సంఘమునకిట్టి గొప్పచరిత్ర అనగా పునరుత్థానము జరిగింపనై యున్న నీకు నిత్యస్తుతులు. పునరుత్థాన సమయమందు సాతాను కంటికి కనబడకుండ చేసిన ప్రయత్నములు దాని ప్రేరేపణ వలన మానవులు కంటికి కనబడునట్లు చేసిన ప్రయత్నములు ధ్వంసము చేసినట్లు సంఘము పునరుత్థానముకాకుండ సాతాను, మానవులు చేయు ప్రయత్నము లన్నిటిని జయించునను సంతోషము మాకు కలిగించిన నీకు ఆగని ప్రణుతులు. పునరుత్థాన దినమున నీ వెలుగు ఎదుట చీకటి

పారిపోయినట్లు నీ పునరుత్థాన వెలుగునుబట్టి విశ్వాసులయొక్క చీకటిని కూడ పారదోలుదువు. ఇట్టి గొప్ప ఉపకారములు మా యెడల జరిగించిన నీ కృపకు తరుగని నమస్కారములు. ప్రభువా! నీ సహింపు వలన మొదటి జయమును, పునర్జీవితుడవైనందున సంపూర్ణ జయమును పొందినట్లు నీబిడ్డలమైన మేమును, నీ రాకడ వరకు శ్రమలు సహించుట వలన యీ లోకమందు జయమును, రాకడ కాలమందు పొందు పునరుత్థానమువలన అసలు జయమును పొందుదుమను ఆదరణ మాకనుగ్రహించిన నీకు సంపూర్ణ స్తోత్రములు. ప్రభువా! సాతాను, శత్రువులు, గెత్సెమనే తోట మొదలుకొని, సిలువవరకు వచ్చినారు గాని పునరుత్థానమందు ఎవరు రాలేకపోయిరి గనుక ఇది సాతానుకు గొప్పసిగ్గు. అలాగేశత్రువులు విశ్వాసులను చివరివరకు తరుముకొని వస్తారుగాని వారి చేతులలో పడకుండ సంఘము ఎగిరిపోవునప్పుడు సాతానుకు, దాని అనుచరులకు గొప్ప సిగ్గు కలుగును. ఇట్టి సంతోషము విశ్వాసులకు కలిగించు నీ పునరుత్థానమును బట్టి నీకు అనంతకాల నుతులు అర్పించుచున్నాము. పాపముచేసి మానవుడు తెచ్చుకొన్నమరణము నిన్ను ఆదరించి నీవు లేవకుండ గట్టిగా బంధించినానని తలంచినది గాని మరణము నిన్ను సమాధిలో ఉంచలేకపోయినట్లు లేపు మృతులైన విశ్వాసులను మరణముగాని, సజీవులైన విశ్వాసులను లోకముగాని ఆరోహణము కాకుండ ఆపుజేయలేవను గొప్ప విజయ వర్తమానము మాకందించిన నీకు మంగళ హారతులు.

పునరుత్థానుడవైనప్రభువా! మేము జరిగిపోయిన నీ పునరుత్థానమును, రేపు జరుగనై యున్న సంఘ పునరుత్థానమునకును, మధ్య మమ్మునుంచి త్వరగా రానైయున్న నీ రాకడ నిరీక్షణ మా కనుగ్రహించిన నీ కృపాసహితమైన పని నిమిత్తమై మంగళస్తోత్రములు. పాపముచేసి మానవుడు తెచ్చుకొన్న మరణము నిన్ను ఆవరించి నీవు లేవకుండ గట్టిగా బంధించినానని తలంచినది. గాని మరణము నిన్ను సమాధిలో ఉంచలేకపోయినట్లు రేపు మృతులైన విశ్వాసులను మరణముగాని, సజీవులైన విశ్వాసులను లోకముగాని ఆరోహణము కాకుండ ఆపుచేయలేవను గొప్ప విజయవర్తమానము మా కందించిన నీకు మంగళ హారతులు. మా స్తుతులు. స్తోత్రములు త్వరగా రానైయున్న యేసుప్రభువు ద్వారా ఆలకించుము. ఆమెన్.

Please follow and like us:
పునరుత్థానము
Was this article helpful to you? Yes 2 No

How can we help?