సంఘారాధనలు

  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు
  4. బైబిలు పండుగ స్తుతులు
  5. మతోద్ధారణ పండుగ

మతోద్ధారణ పండుగ

ద్వితి 26:15-19; 28:1-12 లేవి 26:1-13 కీర్తన 46అ|| మత్తయి 21:12,13. కార్య 14:25, 26రోమా 12 1:2, 2కొరింధి 6:1,2 ఎఫెసి 5:15. 16, కొలసై 4:5.

దేవా! నీ వాక్యము లోకము యొక్క నేత్రములకు కనబడేటట్లు దానిని వ్రాతలో పెట్టించినావు కాబట్టి నీకు స్తోత్రములు. ఓ తండ్రీ! లోకమునకు నీ స్వరము వినబడదు. గనుక నీ వాక్యము వినబడేటట్లు అచ్చు వేయించినావు. గనుక నీకు వందనములు. నేటికి నీ గ్రంధము 2000 భాషలలోనికి వచ్చివేసినందువల్ల ఇప్పుడది లోకముయొక్క హస్తభూషణము అయినది. అందుచేత నీ కనేక వందనములు. నీ వాక్య గ్రంధము అందరు చదివినా చదవకపోయినా చూచి పక్కబడి వెళ్ళిపోయినా సాక్షార్ధముగా లోకము యెదుట ఉన్నది. గనుక నీకు వందనము.

ఓ దేవా నీవు హెబ్రీ భాషలో పలికిన పలుకు మా కాలములో 2 వేల పలుకులుగా వినబడుచున్నది. గనుక నీకు స్తోత్రములు. ఓ తండ్రీ! 2 వేల భాషలవారు ఒకచోట కూడుకొని అందరు యోహాను 3:16 చదివితే ఒకరిమాట ఒకరికి అర్ధము కాకపోయిన అందరికి అర్ధము తెలుసు గనుక అందరు నిన్ను స్తుతిస్తారు. ఇన్ని భాషలలో నీకు స్తుతి వస్తుంది. కాబట్టి నీకు వందనములు. ఒక లూతేరు బయటకు తీసిన బైబిలు అన్ని భాషలలోనికి మార్చేటందుకు బైబిలు సొసైటి వారిని లేపినందుకుకై నీ కనేక వందనములు.ఓ తండ్రీ! అక్షరాలు లేని భాషలలోకూడా నీ గ్రంధములోని సంగతులు నీ సేవకులు బోధిస్తున్నారు గనుక నీకనేక వందనములు.

ఓ ప్రభువా! అనేకమంది భక్తులను లేపి నీ గ్రంధముయొక్క అర్ధాలు వ్రాయించినావు. కాబట్టి నీకనేక వందనములు. ఆ అర్ధాలు గల వ్యాఖ్యానములు చదివి నీ సేవకులు సంఘాలకు భోధిస్తున్నారు గనుక నీకు వందనములు. ఓ తండ్రీ నీ గ్రంధము అచ్చు వేయించుటకు చాల ధనము అవసరము. బైబిలు సొసైటీవారు నీ గ్రంధమునకు సరియైన ఖరీదేర్పరచితే అందరు కొనలేరు. అందరియొక్క అందుబాటులో ఉండేటట్లు తక్కువ ఖరీదు పెట్టించినావు గనుక నీ కనికరము నిమిత్తమై అనేకవందనములు. ఓ దయగల తండ్రీ! ఇన్ని యేళ్ళ నుండి నీపుస్తకము అచ్చువేయుటకు బైబిలు సొసైటీవారికి సామర్ధ్యము దయచేసినందుకు వందనములు. ఇంకా శక్తి ఇస్తానని నమ్ముచూ ఆనందిస్తున్నాను.

ఓ దేవా! నీ వాక్యగ్రంధము లోకములోని గొప్పగొప్ప పుస్తకశాలలో ఒక ముఖ్యమైన పుస్తకమైనది. అందుచేత నీకు వందనములు ఓ దయగల తండ్రీ! నీ గ్రంధమును అనేకమంది తప్పులు పట్టవలయునని ఖండించవలయునని చదివినారు. అట్టివారు చదివి చదివి మారుమనసు పొందినారు. కాబట్టి నీకు అనేక నుతులు. కొందరు బైబిలులో పండితులు కావలెనని కోరి నలగ జదివినారు, అట్లు చేయుటవల్ల వారినే నలగగొట్టింది బైబిలు. కనుక వందనములు. ఓ దేవా! నీ వాక్యము పురుషులు వెళ్ళలేని ఘోషా గృహములోనికికూడ పంపించినావు గనుక నీ కనేక నమస్కారములు.

Please follow and like us:
మతోద్ధారణ పండుగ
Was this article helpful to you? Yes 2 No

How can we help?