రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. తత్వ విచారణ

తత్వ విచారణ

       ప్రియులారా! మనము ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని తుంచనాడరాదు. ద్వేషింపరాదు. దూషింపరాదు. క్రీస్తుప్రభువు దూషింపబడియు, మరల దూషింపలేదు. 1పేతురు 2:23. దూషించువారు దైవభక్తులు కారు. గాని పరీక్షించి మన మనస్సునకు సరిపోవుదానిని చూచి, ఆనందించి అనుసరింపవలెను.” సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేఅట్టుడి.” 1తెస్స5:21. బైబిలులోని ఈ వచనములో రెండు భాగములు కలవు. సమస్తమును పరీక్షించుడి అనునది మొదటిది. మేలైనదానినే చేపట్టుడి అనునది రెండవది. ప్రస్తుతము మొదటిభాగము ఆలోచించుము.

    సమస్తము అనగా నేమి? దేవుడు ఎదివరకు కలుగజేసినవి, ఇప్పుడు కలుగజేయుచున్నవి. ఇక ముందునకు కలుగజేయునవియునై యున్నవి. అనగా మనకు తెలిసిన సూర్య, చంద్ర, నక్షత్రములు, వర్షము, గాలి, భూమి, పక్సులు, మృగములు, పశువులు, వృక్షాదులు, పురుగులు, జలచరములు ఇట్టివి, సమస్తములో మనము కూడ ఇమిడియున్నాము. ఇంకను సమస్తములో చెప్పవలసినవి యేవి? దేవుడు కలుగజేసినవిగాక మనుష్యులు తమ జ్ఞానమును బట్టి కలుగజేసికొనుచున్న ఇండ్లు, ఇంటిలోని సామానులు, నూతులు, పుస్తకములు, ఔషదములు, బండ్లు, ఓడలు, నావలు, స్తీమర్లు, విమానములు, ఇట్టివి. ఈ రెండు విధములైన సృష్టి కార్యములు మన ఉపయోగము నిమిత్తమే గదా అని వీటిని పరీక్షించుచు వాడుకొనుచుండుట సబబుగా నుండును. అంగడికి వెళ్ళి పరీక్షింపకుండ యేదియు కొనము గదా! పరీక్షింపకుండ యెవరి జతయైన పట్టముగదా! మనము పరీక్షింపవలసినవీ ఇంకను గలవు. అవి ఏవనగా లోకములోని మతములు, వాటికి సంబంధించిన గ్రంధములు. ప్రతివారును ఏదో ఒక మతమునకు సంబంధించియున్నారు. వారు దేవుడు కలుగజేసిన సృష్టిని చూచి ఆయనకు వందనములు చేయుదురు. ఇదే మతాచారము. మన జత మనుష్యులు యేదైన యిచ్చిన వందనములు చేయుదుము. ఆలాగే దేవుడు మనకు, మన జన్మమునకు పూర్వము యిచ్చివేసిన వాటి నిమిత్తమై దేవునికి వందనములు ఆచరింతుము. ఆదిలో దేవుడు కలుగజేసిన సమస్తమును పవిత్రముగానే ఉండెను. గాని పాపము ప్రవేశించిన పిమ్మట సమస్తమునకు కళంకము కలిగినది. అందుచేతనే పరీక్షించి వాడుకొనవలసి వచ్చినది. ప్రతి మత గ్రంధములో మనకు సరిపడినవి. సరిపడనివి గలవు. సరిపడినవే గైకొందుము. ప్రతి మతములోను సజ్జనులును, దుర్జనులును గలరు. ప్రతి మతములోను సదాచారములు, దురాచరములు గలవు అంతమాత్రమున యే మతమును దూషింపరాదు.        

       ఒకరిలో నాలుగు దుష్టగుణములు ఉండవచ్చును. ఒక మంచి గుణముకూడ ఉండవచ్చును. గనుక అతనిని కూడ మనము మెచ్చుకొనవలెను. సలహా ఇవ్వవలెను. లోకములో అనేక మతములు గలవు. అనేక మత సాఖలు గలవు. బైబిలు ఒక్కటే దైవగ్రంధమనియు, క్రీస్తు ఒక్కడే సర్వజనుల రక్షకుడనియు, క్రైస్తవ మత సంఘమొక్కటే అన్ని మతముల వారిని పిలిచి చేర్చుకొనునట్టి ఆహ్వాన సంఘమనియు చెప్పుచున్న క్రైస్తవ మతములోనే ఎనిమిది వందల కంటె ఎక్కువ మిషనులు గలవు. అందరు అన్ని విధములుగా బోధించుచున్నారు. ఏది నిజమో తెలిసికొనుట నరులకు కష్టముగా నున్నది. మన యెదుట సృష్టి కార్యములు మూడు గలవు. 1. దైవసృష్టి 2. నరులు కల్పించుకొన్న ఉపకార సాధనముల సృష్టి 3. పిశాచి కలిగించుచున్న సృష్టి అనగా పాపేచ్చలు, పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు క్రియలు, పాపఫలితములగు వ్యాధులు, ఇబ్బందులు, హత్యలు, మరణములు ఇట్టివి. సత్యమును తెలిసికొనుటకు కొన్ని పద్దతులు గలవు. అవి 1. దేవుడు మనలో పెట్టిన జ్ఞానమును బట్టి కొంతవరకు సత్యమును తెలిసికొనవచ్చును. 2. దేవుడు మనలో పెట్టిన మనస్సాక్షిని బట్టి కొంతవరకు తెలిసికొనవచ్చును. 3. గ్రంధములను బట్టి కొంత తెలిసికొనవచ్చును. 4. మత గురువులను బట్టి కొంత తెలిసికొనవచ్చును గాని సంపూర్ణ సత్యమును తెలిసికొను పద్దతి ఒకటి గలదు. జ్ఞానమును, మనస్సాక్షిని, గ్రంధములను, గురువులను అడిగిన యెడల కొంత వరకు సత్యమును తెలిసికొనగలము. అది నిర్లక్ష్యము చేయరాదు. కాని, సంపూర్ణమైన, నిష్కళంకమైన సత్యమును తెలిసికొనుటకు దేవునిని ప్రార్ధింపవలెను. అది నిర్లక్ష్యము చేయరాదు. ఆలాగైన ఆయనను యేలాగు ప్రార్ధింపవలెనో వినండి:- ప్రార్ధన:-      దేవా! సృష్టికర్తవైన తండ్రీ! నీకు నమస్కారములు. మేము పాపులము. నీ కటాక్షమును కలిగియుండుటకు అయోగ్యులము. అయినను అనుదినము నీ ప్రేమను అనుభవించుచున్నాము. అందుచేత నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుచున్నాము. జవాబులు దయచేయుము. తండ్రీ! ఇన్ని మతములున్నవి, నేను ఏ మతములో ఉండుట నీకిష్టము? ఎన్నో మత శాఖలున్నవి, ఏ శాఖలో ప్రవేశించుట నీకిష్టము? ఎన్నో మిషనులున్నవి. ఏ మిషనులో చేరవలెను? నీవు స్థాపించిన సంఘము యేది? నాకు చెప్పువరకు నేను ఉన్న మతములోనే ఉండిపోదును. అందువలన నేను నేరస్థుడను కాను. నాకు కనబడుము, నాతో మాటలాడుము. నా ప్రశ్నలన్నిటికి జవాబులు చెప్పుము.       ప్రియులారా! క్రైస్తవులలో కొందరు ప్రతి గురువారము ధ్యానములో ఉండుచుండగా క్రీస్తు ప్రభువు కనబడి సంస్కార ప్రసంగము కొద్దిగా వినిపించి, ఆయనే స్వయముగా సంస్కార భోజనము వడ్డించుచున్నారు. పాదిరిగారు హృదయముల స్థితి ఎరుగరు గనుక అందరికి ఇచ్చుచున్నారు. ప్రభువైతే కొందరికే ఇచ్చుచున్నారు. గుడిలో ఇచ్చు భోజనము వలన బహిరంగ పాపములను జయింపగలము. అయితే ప్రభువిచ్చు భోజనము వలన నైజపాపమును గెలువగలము. ఇందునుబట్టి రాకడకు సిద్ధము కాగలము. ప్రతి శ్రమలో ఆనందింప గలము. సైతానును యెదిరింపగలము. అతనిని మనము ఎదిరింపగలము గనుక అతడు పారిపోవునని బైబిలు చెప్పుచున్నది. బలము, జయము, మహిమ సంపాదించుకొనుడి. తథాస్థు.

Please follow and like us:
తత్వ విచారణ
Was this article helpful to you? Yes No

How can we help?