రక్షణ వార్తావళి

  1. Home
  2. Docs
  3. రక్షణ వార్తావళి
  4. కాబట్టి ప్రసంగము

కాబట్టి ప్రసంగము

యేసు క్రీస్తు ప్రభువు తప్ప వెరే రక్షకుడు లేడని క్రైస్తవులైన మీరు ఎందుకింత ధైర్యముగా చెప్పుచున్నారని అనేకులు మమ్మును అడుగుచున్నారు. అలాగు అడుగుట మంచిదే. మేము జవాబు చెప్పుట కూడ మంచిదే.

1. యేసు క్రీస్తు తప్ప మరొక రక్షకుడు లేడని మా బైబిలులో వ్రాయబడి యున్నది కాబట్టి మేము బోధించుచున్నాము (అ. కార్య.4:12).

2. ఆయన అనాది దేవుడు కాబట్టి ఆయన గాక వేరొక దేవుడు లేడని మేము బోధించుచున్నాము (కొలొస్సె 1:15-17).

3. ఆయన మన నిమిత్తము మనిషిగా జన్మము ఎత్తక పూర్వము, భూలోకములో జీవింపనైయున్న జీవితమును గురించి మా బైబిలులో ముందే ప్రవచింపబడియున్నది కాబట్టి (యెషయా 7:14, 9:6).

4. అందరు జన్మించినట్లు ఆయన జనించక కన్యకా గర్భమందు జన్మించినాడు కాబట్టి (మత్తయి 1:18-25).

5. పందొమ్మిది వందల ఏండ్ల క్రిందట ఆయన పాలస్తీనా దేశములో బెత్లెహేమను గ్రామములో పుట్టినాడను వార్త మోక్షలోకపు దూతలు భూలోకమునకు తీసికొని వచ్చిరి కాబట్టి (లూక 2:8-14).

6. అందుచేత అది నమ్మదగినది కాబట్టి.

7. నిజమునకు మరియమ్మ, యోసేపులు ఆయన తల్లిదండ్రులు కాక పోయినను పెంచిన తల్లిదండ్రులైనను వారికి లోబడి తిరిగినాడు అని ఆయనను గురించి బైబిలులో చక్కని వ్రాత కనబడుచున్నది. ఆయన దేవుడై యుండగా వారికి లోబడవలసిన 

అగత్యమేమి? అయినను లోబడి ప్రతి యింటిలోని పిల్లలు తల్లిదండ్రులకు లోబడవలెనను సిద్ధాంతమును స్థిర పరచియున్నాడు కాబట్టి (లూకా 2:51).

     8. ఆయన మనుష్యుడై పుట్టుట వలన అసలైన మనుష్యుడనియు, ఏ పాపము లేని మనుష్యుడనియు, మనుష్యులందరిలో గొప్పవాడైన మనుష్యుడనియు తన బ్రతుకు వల్ల ఋజువు పరచుకొన్నాడు కాబట్టి (యోహాను 8:46)

 9. అసలైన మనుష్యుడే కాదు అసలైన దేవుడని కూడ తన యొక్క చర్యల వల్ల ఇతరులు గ్రహించుకొనేటట్లు బయలుపరచు కొన్నాడు కాబట్టి (యోహాను 20:26-280.

 10. ఏ బోధల వల్ల ఇహలోక మనుష్యులకు ధన్యతలు కలుగునో, యే బోధల వల్ల జీవాంతమందు మోక్షము కలుగునో అవన్ని పూర్తిగా బోధించినాడు. అనగా సమస్త ధర్మములు ఉపదేశించినాడు కాబట్టి (మత్తయి 5,6,7 అధ్యాయములు).

 11. లోకమును పాపములో పడవేసిన సైతానును మొట్ట మొదటే పట్టుకొని జయించినాడు కాబట్టి (మత్తయి 4:1-11).

 12. పాపముల మూలకర్తయైన సైతానును మాత్రమే కాదు ముప్పది మూడున్నర సంవత్సరములు ఎన్ని పాపములు అడ్డముగా వచ్చినవో వాటన్నిటిని చెకపెక ఓడగొట్టినాడు కాబట్టి (హెబ్రి 9:26).

 13. పాపములు ఓడగొట్టుట మాత్రమే కాదు పాపముల వల్ల నరులకు రావలసిన కీడు అయనకు తట్స్థమైనప్పుడు అన్యాయము లేకుండ కాలక్రమమున ధ్వంసము చేసినాడు కాబట్టి (1పేతురు 2:24).

 14. మానవులకు ఏ కష్టములున్నవో అవి తొలగించినాడు కాబట్టి (మత్తయి 8:26).

 15. మానవులకు ఏ ఉపకారములు అవసరమో అవి చేసినాడు కాబట్టి (యోహాను 2:1-11)

 16. మానవులు ఇంకా తనను గురించి బాగుగా తెలిసికొనుటకు వారితో ఏ ప్రకారముగా కలసి ఉండవలెనో ఆ ప్రకారము కలసియున్నాడు కాబట్టి-అనగా వనవాస సమయములోను, పెండ్లి సమయములోను, జనసమూహము యొక్క ఆకలి సమయములోను, 

మరణాపాయకరమైన సమయములోను, బస చేయవలసిన సమయములోను, ప్రయాణ సమయములోను, పండుగ సమయములోను, దేవాలయములో ఉండవలసిన సమయములోను, ఏకాంత ప్రార్ధన సమయములోను ఉన్నాడు కాబట్టి.

17. దేవుని పూర్ణ మనసుతో ప్రేమించ వలెననియు, ఆ ప్రకారముగానే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించ వలెననియు బోధించినాడు కాబట్టి(లూక 10:27).

18. గవర్నమెంటు వారికి పన్ను చెల్లించుట న్యాయమేననియు, అది మాత్రమే కాదు దేవునికి కానుకలు చెల్లింప వలెననియు బోధించి, ఈ ప్రకారము ప్రజలలో దేవుని యెడలను, అధికారుల యెడలను అభిమానము, గౌరవము కలిగించినాడు కాబట్టి (మత్తయి 

22:21).

19. యూదుల సంఘములోని ఆచారములు, క్రియలు సరిగా లేవని ఖండించి ఈ ప్రకారముగ ఏర్పాటు జనులలోని లోటుపాటులను సవరణ చేయుటకు ప్రయత్నించినాడు కాబట్టి (మత్తయి23వ అధ్యాయము).

20. నా యొద్దకు వచ్చిన వానిని బైటకు త్రోసివేయను అని బోధించుట వలన ప్రతి మనిషికి రక్షకుడై యున్నాడని రుజువు పర్చుకున్నాడు కాబట్టి (యోహాను 6:37).

21. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారలారా! నా యొద్దకు రండి అని ఆయన సమస్తమైన వారిని పిలుచుట వలనను, మరియు నేను మోక్ష లోకమునకు వెళ్ళిన తరువాత అందరిని నా తట్టు ఆకర్షించుకొందునని చెప్పుట వలనను, తన 

శుష్యులతో మీరు “నన్ను గురించి అందరికి చెప్పండి” అని ఆజ్ఞాపించుట వలనను, ఆయన సర్వలోక రక్షకుడనని రుజువు పర్చుకొన్నాడు కాబట్టి (మత్తయి 11:28, యోహాను 12:32, మార్కు 16:15).

22. శిష్యులను మరణాపాయము నుండి తప్పించుటకు సముద్రము మీద లేచిన భయంకరమైన గాలిని, కెరటములను తన మాటతో అణచి వేయుట వలనను, ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి సరిపడునట్లు వృద్ధి చేసి పంచుట వలనను, 

బానలలోని నీళ్ళను క్షణములో అవసరమును అట్టి మధురమైన పానీయ ద్రాక్షారసముగా మార్చి వేయుట వలనను, ఆయన ప్రకృతి మీద అనగా సృష్టి మీద అధికారియైన దేవుడని రుజువు పర్చుకొన్నాడు కాబట్టి (మత్తయి 8:27,యోహాను6:1-14,2:1-11).

   23. అవస్థలో నున్న రోగుల యొక్క బాధ నివారణ చేయు నిమిత్తము తన యొద్దకు వచ్చిన వేలాది రోగులను తన ప్రభావము చేత మందు లేకుంద బాగు చేసినాడుకాబట్టి (లూకా 6:19).

24. భూత పీడితులైన వారిని విడిపించుటకు దయ్యములను వెళ్ళగొట్టినాడు కాబట్టి (మార్కు 5:1-20).

25. మృతులలో కొందరిని తన వాక్కువల్ల బ్రతికించినాడు కాబట్టి (లూకా 7:13-15).

26. జబ్బులు ఆయన పంపలేదని తెలిసికొనుటకు మృతులలో కొందరిని తన వాక్కుచే బ్రతికించి ఈ ప్రకారముగ ఆయన తాను ప్రజల యెడల జాలిపరుడనియు, జబ్బులమీద, దయ్యాల మీద, మరణము మీద అధికారము గలవాడనియు, తాను దేవుడనియు 

రుజువు పర్చుకొన్నాడు కాబట్టి (మత్తయి 9:35,36).

27. జబ్బులు, కష్టములు, ఇబ్బందులు, అవస్థలు తుదకు మరణము పాపమును బట్టి వచ్చినవి గనుక ఆ పాపములు తీసివేయ వలయునని పాపులు తన దగ్గరకు వచ్చినప్పుడు వారి పాపములు క్షమించి వేయుట వలనను, పాపక్షమాపణ ప్రకటించుడి అని 

చెప్పుట వలనను ఆయన పాప పరిహారకుడు అని రుజువు పరచుకొన్నాడు కాబట్టి (మార్కు 2:5, యోహాను 20:23).

28. తనను చంపుచున్న శత్రువులను ఆయన నాశనము చేయ శక్తి గల దేవుడు అయినను వారిని చంపక క్షమించి వేసెను కాబట్టి (లూకా23:34).

29. సర్వలోక ప్రజలు పాప పరిహారము నిమిత్తము తన రక్తమును ధారపోసి మరణము పొందుట వలన మన యెడల తనకు గల మిక్కుటమైన ప్రేమను రుజువు పర్చుకొన్నాడు కాబట్టి (1పేతురు 1:18,19).

30. ఆయన తన ఇష్ట ప్రకారము హతుడయి సమాధి చేయబడెను కాబట్టి (యోహాను 10:18).

31. ఆయన చనిపోయి భూస్థాపన అగు నిమిషము వరకు సాతాను వలనను, పాపము వలనను, శ్రమ వలనను, శత్రువుల వలనను, దెబ్బల వలనను, కౄర మరణము వలనను కలిగిన వేదన సహించుట వలనను ఆయన వాటన్నిటిని జయించినాడు కాబట్టి  

(హెబ్రీ5:7)-ఆయన వాటిని సహించుట మాత్రమే కాక సమాధిలో నుండి బయటికి వచ్చి వేయుట వలనను వాటన్నిటిని రెండవసారి జయించినాడు కాబట్టి (అ.కా.1:3).

  1. మానవునికి మూడు మరణములున్నవి. ఇవి పాపము బట్టి వచ్చిన మరణములు. ఒక మరణ సమయములో మన శరీరమునకును, ప్రాణమునకును ఎడబాటు కలుగును. ఇది శరీర మరణము లేక మొదటి మరణము. రెండవది మనకు మరణముగా

కనబడదు గాని శరీర మరణము కన్న ఈ మరణము మహా భయంకరమైన మరణము. దీనినే భక్తులు ఆత్మీయ మరణమందురు. మనము శరీరమునకు దూరమైన దూరము కావచ్చును గాని మనము దేవునికి దూరమైన గొప్ప కీడు (ప్రకటన 3:1, లూకా

20:37,38). మూడవ మరణము నిత్య మరణము. అనగా దేవునికిని మనకును కలిగిన ఎడబాటు ఎల్లప్పుడు ఉండును. అది నిత్యమైన మరణము దాని పేరే నరకమందురు. బైబిలులో దీనిని రెండవ మరణమందురు (ప్రకటన 21:8). యేసుప్రభువు ఈ మూడు

మరణముల యొక్క పని పట్టుటకు మరణమాయెను అనగా తన చావు వలన చావును చంపివేసెను. అయితే మనము ఆయనను నమ్మిన యెడల ఆత్మ మరణమును, నిత్య మరణమును ఆయన మరణము వలన తొలగిపోవును గాని శరీర మరణము తొలగదు.

శరీరము మోక్ష లోకమునకు పనికి రాదు. అందువలన మట్టి పాలు కావలసినదే. ఆత్మ మోక్షమునకు వెళ్ళగలదు. ఆయన తన మరణము వలన మనలోని మరణ భీతి తొలగించెను. ఆయన జీవమై యున్నాడు. అనగా మరణముపై అధికారము గలవాడనని

రుజువు పర్చుకొన్నాడు కాబట్టి (ప్రకటన 1:18).

33. యేసు క్రీస్తు ప్రభువు తాను దేవుడనని తన అద్భుత క్రియల వలన రుజువు పర్చుకొనుట మాత్రమే కాక మూడు ముఖ్య సమయములలో తనలోని దైవకాంతిని దగ్గరనున్న వారికి బాహాటముగ చూపించెను. 1. తన శిష్యులను పర్వతము మీదికి తీసికొని 

వెళ్ళి ప్రార్ధనలో నున్నప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఇట్టి రీతిగా ఆయన దేవుడనని చూపించుకొనెను. (మత్తయి 17:2). 2. ఆయన తన శిష్యులతో ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండగా “వారు విస్మయ మొందిరి; వెంబడించువారు

భయపడిరి” (మార్కు 10:32) అని వ్రాయబడియున్నది. ఆయన శరీరములో నుండి మహిమ బయలు పడినందున ఆశ్చర్య పడిరి. దీనిని బట్టి ఆయన దేవుడనని బయలు పరచుకొనెను. 3. గెత్సెమనే తోటలో బంట్రోతులు ఆయనను పట్టుకొనవచ్చినప్పుడు

మీరెవరిని వెదక వచ్చిరో ఆయనను నేనే అని చెప్పినప్పుడు వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. అని బైబిలులో ఉన్నది. దీనిని బట్టి ఆయనలోని ప్రభావమును వారు చూడలేక నేల మీద పడిరి. బహిరంగముగా ఆయన దైవకాంతి కనబడుట చేత పడిపోయిరి.

(యెహాను 18:4-6) ఈ ప్రకారము రుజువు చేసుకొనెను కాబట్టి.

34. యేసుప్రభువు మరణమై బ్రతికి వచ్చి కొన్నాళ్ళు బోధించి మహిమ శరీరముతో మోక్షమునకు వెళ్ళెను. మనకు కూడ మహిమ శరీరము వచ్చును. ఆయన రెండవసారి వచ్చి ఆయన రాకడకు సిద్ధమైన భక్తులను మరణము లేకుండ చేసి మోక్షమునకు 

తీసికొని వెళ్ళును. (1థెస్స 4:13-18) చనిపోయిన భక్తులను కూడ మోక్షమునకు జేర్చును. యేసుక్రీస్తు వంటి రక్షకుడు మీకెక్కడైన కనబడినయెడల మీరు ఆ మహ్హత్ముని వెంట పోమంటూ వెళ్ళి ఆయనను ఆశ్రయింపవచ్చును. మాకు తెలిసినంత వరకు ఈయనే 1)

మన పోషకుడు 2) మన వైద్యుడు 3) మన బోధకుడు 4) మన తండ్రి 5) మన దేవుడు 6) మన మనిషి 7) మన కీడు తొలగించువాడు 8) మనలను మోక్షమునకు చేర్చువాడు కాబట్టి. కాబట్టి అను మాటను బట్టి దీనికి ‘కాబట్టి ప్రసంగమూ అని పేరు.

కాబట్టి యేసుక్రీస్తు వారి సంగతి తెలిసికొని కాబట్టినవారైతే అనగా ఆకర్షింపబడిన వారైతే ఆయనకే పూజ చేయుదురు. ఆయన వల్ల మీకందరకు దీవెనలు కలుగును గాక! ఆమెన్.

Please follow and like us:
కాబట్టి ప్రసంగము
Was this article helpful to you? Yes 1 No

How can we help?