క్రైస్తవ పండుగలు

 1. Home
 2. Docs
 3. క్రైస్తవ పండుగలు
 4. సర్వ పరిశుద్ధుల పండుగ
 5. సర్వ పరిశుద్ధుల పండుగ – I

సర్వ పరిశుద్ధుల పండుగ – I

( ఎఫెసీ 1:1-3)

ప్రార్ధన:- ఓ తండ్రీ! మనుష్యులు అపపవిత్రులైనను పవిత్రులనుగా చేయుచున్నావు గనుక నీకు వందనాలు. ఈ మాటలు ఎఫెసీ సంఘములోని వారు సమ్మతించినారు గనుక వారిని పరిశుద్ధులనుగా చేసియున్నావు. ఆలాగే మమ్మును పరిశుద్ధపరచుటకును, మార్చుటకును నీ వాక్యము నిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. ప్రతి దినము నీ వాక్యము చదువు చున్నప్పుడు నీ కృప అనుగ్రహించుము. ఇక్కడ కూడుకొన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు, అవిశ్వాసులకు, అపరిశుద్ధులకు, క్రొత్తగా వచ్చిన వారికి వర్తమానము అందించుము. మారని వారియొక్క హృదయములను అగ్నికి మైనము కరుగునట్లు, మారుటకు తగిన వర్తమానము అందించుము. పిల్లలకు తినే వస్తువులు పంచి పెట్టునప్పుడు అందుకొని, చక్కగా అది ‘నా కొరకే, అని తిందురు. అట్లే అందరు ఈ వర్తమానము ‘నా కొరకే’ అని అనుభవించి, బలము పొందునట్లు దీవించుము. ఆమెన్.

వర్తమానము:- దేవుని వాక్యము గంభీరమైనది, మరియు లోతైనది. ఆ వాక్యము అన్ని జనాంగముల ఎదుటకు వచ్చినది. షుమారుగా ఇప్పటికే రెండువేల భాషలలో అచ్చువేయబడినది. ఆ వాక్యము దుర్గుణములు తీసివేసికొనుటకును, సద్గుణములను అలంకరించుకొనుటకును ఉపయోగ పడును. ఈ వాక్యమును నమ్మువారు పాపమునుండి విడిపింపబడుట మాత్రమే గాక ప్రభువు యొక్క పరిశుద్ధ లక్షణములను పొందవలెను. ఒక గొప్ప బైబిలు మ్యూజియము కట్టించి, పరిశుద్ధులందరి బొమ్మలు అందులో వేయించవలెను. పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ లక్షణములను దయచేయుమని ప్రార్ధించి, స్తుతించి సంతోషించవలెను. పాత నిబంధన భక్తులను, వారి పనిని తలంచుకొని స్తుతి చేయవలెను. క్రొత్త నిబంధన పరిశుద్ధుల సంగతి, పరలోకమునకు వెళ్ళిన పరిశుద్ధుల సంగతి కూడ చెప్పవలెను. వారు మహిమ లోకములో “నేను చేయలేనివన్ని నీవే చేసి పెట్టినావు” అని పాడుచుందురు.

 1. పరలోకమందలి పరిశుద్ధులు – నేను మానలేనని అనుకొన్న పాపములన్నిటి నుండి నన్ను విడిపించినావు నీకు వందనములు అని చెప్పుదురు. మరియు నాకు నేను పరిశుద్ధపరచుకొనవలేను, గనుక నీవే నన్ను పరిశుద్ధపరచే పని చేసినావు. నీకు స్తోత్రములు అని చెప్పుదురు. మా స్తుతి నీవు చేసే పని ఎదుట ఏ మూల? నీ పని చాల గొప్పది! మేమెంత స్తుతించినను నీ ఋణము తీరదు అని చెప్పుదురు. ఈ రీతిగా పరలోక పరిశుద్ధులు అన్నట్లు, భూలోక పరిశుద్ధులు అనలేరు. స్తుతించలేక పోవుచున్నారు. సందేహించుచున్నారు. యూదా ఇస్కరియోతువలె, అననీయ, సప్పీరాలవలె పడిపోవుదుమని సందేహించుచున్నారు.
 2. క్రొత్త నిబంధన పరిశుద్ధులు:- స్నానికుడైన యోహాను పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను ఉన్నాడు. నా కంటె శక్తి మంతుడు వస్తాడని క్రొత్త నిబంధన ప్రసంగము చేసెను. సర్పసంతానమా! రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని పాత నిబంధన ప్రసంగము చేసెను. స్త్రీలు కన్నవారిలో ఈ యోహానే గొప్పవాడని గొప్ప సర్టిఫికెట్ యేసుప్రభువు ఇచ్చెను. ఎందుకు గొప్పవాడు? పాత నిబంధన ప్రవక్తలందరు ‘క్రీస్తు ప్రభువు వచ్చునని ‘ చెప్పిరి. అయితే యోహాను ‘క్రీస్తు ప్రభువు మీ మధ్య నున్నాడని ‘ చెప్పెను. ఇది మధుర స్వరము, ఆదరణ స్వరము, ప్రభువు వచ్చినాడని చెప్పు స్వరము గొప్పది. పాత నిబంధన చివరనున్న మానవులు – యోహాను, సుమెయోను, యోహాను అరణ్యములో పెరిగెను. సుమెయోను ఊరిలో పెరిగెను. వీరిద్దరు రెండు నిబంధనలలోను గలరు. సుమెయోను పాత నిబంధనకు ప్రసిద్ధి. అనగా, ప్రభువు క్రొత్త నిబంధనలో జన్మించెను గనుక క్రొత్త నిబంధనలోని వారు ప్రభువును చూడవలసినదే. అయితే పాత నిబంధనలోని సుమెయోను, ప్రభువును ఎత్తుకొనెను గనుక అతడు పాత నిబంధనకు ప్రసిద్ధి. గనుక పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండునూ ప్రభువును ఎత్తుకొనెను అని చెప్పగలము.
 3. మత్తయి., మార్కు, లూకా, యోహానులు ఫోటో తీసినట్లు, ఈ 4గురు నాలుగు ప్రక్కల నిలువబడి యేసు ప్రభువు యొక్క ఫోటోలు తీసినారు. మత్తయి – రాజు అని, మార్కు – సేవకుడు అని, లూకా- మనుష్యుడు అని, యోహాను – దేవుడని; యేసుప్రభువు యొక్క. ఫోటోలు తీసినారు. స్వంతముగా వారేమియు పెయింట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్లుగా తీసినారు. ఈ నలుగురు పరిశుద్ధులు, గొప్పవారు. ఒక్కొక్కరు, ఒక్కొక్క విషయములో ప్రసిద్ధికెక్కిరి.
 4. మొత్తం పన్నెండు మంది శిష్యులు గలరు. వీరిలో చివరి వరకు ఉన్నవారు పదకొండు మంది. వీరికి ‘యేసుతో కూడ ఉన్నవారని ‘ బిరుదు వచ్చెను. పాత నిబంధన భక్తులు ఆత్మీయరీతిగా యేసుతో నుండిరి. సుమెయోను కూడా కొంతసేపు యేసుతో నుండెను. రేపు మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాత వీరిని పిలిచినట్లైతే పరుగెత్తుకొని వచ్చి, అభయహస్తము (Shake hand) ఇస్తారు. ఈ విషయము గలతీ పత్రికలో వ్రాయబడి యున్నది.
 5. అపోస్తలుడైన పౌలు:- సంఘమును ఎట్లు కట్టవలెనను కట్టడలు ఫోటో తీసెను. నలుగురు సువార్తికులు ప్రభువును తీసిన బొమ్మ ఎంత దివ్యముగా నున్నదో, ఆది సంఘము యొక్క బొమ్మకూడా (పెంతెకొస్తు దినములలో) అంత దివ్యముగా నున్నది. తర్వాత సంఘము పాడైనది. సంఘము పాడుకాదు గాని, సంఘములోనివారు చెడిపోయిరి. ఆది సంఘము మనలను చూచి, మీరును మా వలె ఉండుడని చెప్పుచున్నది. అది కళంకము లేని సంఘము. ప్రేమ కలిగిన సంఘము. యేసుప్రభువు యొక్క మాదిరిని పొందిన సంఘము. ఈ సంఘమును స్థిరపరచుటకు పౌలు కొన్ని సిద్ధాంతములు వ్రాసెను.
 6. ప్రకటన వ్రాసిన యోహాను:- లోకాంతము వరకు జరుగవలసిన భవిష్యత్తును గూర్చి వ్ర్రాసెను. మోషే మొదటి రైటరు. యోహాను చివరి రైటరు. మోషే మొదటి సృష్టిని గూర్చి వ్రాసెను. యోహాను నూతన సృష్టిని గూర్చి వ్రాసెను. మోషే గతించిన సంగతులు వ్రాయుటకును, యోహాను రానైయున్న సంగతులు వ్రాయుటకును ఏర్పర్చబడిరి. ఒకరు ఆరంభించిరి. ఒకరు ముగించిరి.

ఈ క్రొత్త నిబంధన భక్తులందరి దివ్య చరిత్రలు తలంచుకొని స్తుతించి, వారివలె కళంకము తీసివేసికొని, శ్రమలు, కష్టములున్నను, ప్రకాశించునట్లు ముందుకు సాగిపోవుదుము గాక! ఆమెన్.

Please follow and like us:
సర్వ పరిశుద్ధుల పండుగ – I
Was this article helpful to you? Yes 9 No 1

How can we help?

Leave a Reply