క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. రాకడ పండుగ
  5. రాకడ పండుగ – VI

రాకడ పండుగ – VI

ప్రకటన గ్రంధములో పరిశుద్ధ త్రిత్వమున్నది. అలాగే దుష్ట త్రిత్వమున్నది. ఈ త్రిత్వము పరిశుద్ధ త్రిత్వమునకు పోటీగా కనబడుచున్నది. భూలోకమందున్న మనకు, పరలోకపు తండ్రి ఉన్నారు. అంధకార రాజ్య సంబంధులైన వారికి సాతానుడు ఉన్నాడు. ఇతడు మన తండ్రికి పోటీగా ఉన్నాడు. ఈ లోకము లోనికి అరుదెంచిన మనుష్యకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు ఉన్నాడు. ప్రభువునకు పోటీగా అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి అంధకార రాజ్యములో ఉన్నాడు. ఇతడు సాతాను వల్ల సర్వాధికారము పొందినవాడై యున్నాడు. సౌందర్యము, మహా సౌందర్యము గల అంత్య క్రీస్తు అను ఈ పురుషుడు, ఈ లోకమందు ఎవరియొద్దకు వెళ్ళినను తన మంచి మాటలవల్ల ప్రజలను లోబర్చుకొనును. ప్రపంచమంతటిలోనున్న ప్రజలు అతని చేతి క్రిద ఉందురు. రాకడ పిమ్మట సంఘము ఉండదు. ఎందుకంటే రాకడలో సంఘము వెళ్ళిపోయినది. మిగిలినవారు లోకములో ఉందురు. రాకడ పిమ్మట వచ్చు అంత్య క్రీస్తు లోకములోనున్న ఆఫీసులన్నీ, ఉద్యోగములన్నియు, వర్తకములన్నియు తన చేతిలో ఉంచుకొనును, అతడు బహు తెలివిగలవాడు. రాకడలో పెండ్లి కుమార్తె ఎత్తబడగానే ఇతని ప్రభావము భూలోకమంతట ఉండును. ఎంత ప్రభావము కలవాడైననూ, పెండ్లి కుమార్తె ఎత్తబడువరకు ఇతడు బయలుపరచబడడు. నేటి కాలములో రాకడ కొరకు నిరీక్షించినవారు పెండ్లి కుమార్తె వరుసలోనికి వెళ్ళగలరు. అవిశ్వాసుల గుంపులో ఉన్నవారు కూడా పెండ్లి కుమార్తె వరుసకు సిద్ధపడవచ్చు లేక ఆగిపోవచ్చును. ఆ విషయము మనము దృఢముగా చెప్పలేము.

పరిశుద్ధ త్రిత్వములోని మొదటివారు తండ్రి, రెండవవారు కుమారుడు, మూడవవారు పరిశుద్ధాత్మ తండ్రి. వారికి వ్యతిరేకముగా దుష్త త్రిత్వము ఉన్నది. ఇందులొ మొదటివాడు సాతానుడే. ఇతడు తండ్రియైన దేవునికి వ్యతిరేకమైనవాడు. రెండవవాడు అంత్యక్రీస్తు. ఇతడు క్రీస్తునకు విరోధి. మూడవవాడు అబద్ధ ప్రవక్త. ఇతడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనవాడు. ఈ దుష్ట త్రిత్వము పరిశుద్ధ త్రిత్వమునకు వ్యతిరేకమైనది. దుష్ట త్రిత్వము సేవించునది దుష్టత్వమే. పెండ్లి కుమార్తె వెళ్ళిపోవు వరకు వీరు ప్రత్యక్షము కారు.

క్రైస్తవ సంఘములోని మిషనులలో తప్పుడు సిద్ధాంతములు బోధించేవారు ఉన్నారు. వారు అబద్ధ ప్రవక్తలే. ప్రభుని శిష్యుడైన యోహాను పత్రికలు వ్రాసెను. ఆ కాలమందుకూడ ఇట్టివారు ఉన్నారు. ఇప్పుడును ఉన్నారు. ఏ మతములో తప్పు బోధలు చేయువారు ఉందురో వారు అబద్ధ ప్రవక్తలే. అలాగే క్రీస్తు విరోధులు కూడా ఉన్నారు. ఎవరైతే క్రీస్తునకు విరోధులుగా ఉందురో అట్టివారు అంత్య క్రీస్తులు. ఈ లోకములో అన్నియు ఒప్పుకొందురు గాని క్రీస్తును వారు ఒప్పుకొనరు. అట్టివారు అంత్యక్రీస్తులే. పెండ్లి కుమార్తె ఎత్తబడిన పిమ్మట వచ్చేవాడు అంత్య క్రీస్తు గాని, అంత్యక్రీస్తులు కారు. ఈ కాల మందు అబద్ధ ప్రవక్తలు అనేకులు ఉందురు గాని పెండ్లికుమార్తె ఎత్తబడిన పిమ్మట అబద్ధ ప్రవక్త ఒక్కడే. అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్త, పెండ్లి కుమార్తె ఎత్తబడగానే లోకములో ప్రత్యక్షమగుదురు. వీరిరువురు వచ్చెదరు గాని అసలైన సాతానుడు రాడు. రాకడ పిమ్మట భయంకరమైన ఏడేండ్ల శ్రమ భూలోకమునకు వచ్చును. ఆ శ్రమల తరువాత గొప్ప యుద్ధము జరుగనైయున్నది. క్రీస్తు ప్రభువునకును, అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్తకును ఘోర యుద్ధము జరుగును. అపుడు క్రీస్తు ప్రభువు అంత్య క్రీస్తు, అబద్ధ ప్రవక్తలను తీసికొనివెళ్ళి అగ్నిగుండములో పడవేయును. అట్టి సమయములో వాయుమండల అధిపతియైన సాతానుడు మనుష్య రూపములో భూలోకమునకు వచ్చును. పరిశుద్ధ త్రిత్వములోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే. వీరు ముగ్గురు ఒక్కరే. ఒక్కరే ముగ్గురు. తండ్రి రూపము కలిగిన కుమారుడు, ఈ లోకమునకు మానవ అవతారమెత్తి వచ్చెను. నన్ను చూచినవారు తండ్రిని చూచినట్లేనని ప్రభువు పలికెను. గనుక తండ్రి, కుమారుని ద్వారా ఈ రీతిగా మానవావతారియై, తన్నుతాను ఈ లోకమునకు కనబరచుకొనెను. తండ్రి ఏ రీతిని మానవావతారిగా లోకమునకు కనబరచుకొనెనో, ఆ రీతిగానే సాతానుడు కూడా మానవాతారిగా ఈ లోకమునకు వచ్చును. ఇది తండ్రియైన దేవుని రూపమునకు పోటీ రూపము. ఎప్పుడైతే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తలను ప్రభువు అగ్నిగుండములో పడవేసెనో అప్పుడే ప్రభువు, ఈ సైతానును పాతాళములో ఖైదీగా వేయును. అతడు అచ్చట మట్టులేని గోతిలో వెయ్యి సంవత్సరములు బంధింపబడును. ఈ వెయ్యి సంవత్సరములు మార్పు చెందుటకు, దేవుడు సాతానునకు అవకాశము ఇచ్చిన సాతానుడు మారుమనస్సు నొందడు గాని దేవునిపై తిరుగుబాటు చేసి తన కోపమును పెంచుకొనును. ఒక ఇనుప గుండు సాతానుడున్న పాతాళములో పడవేసి, వెయ్యి సంవత్సరములు అయిన పిదప వెళ్ళి చూచిన ఆ గుండు దిగుచూనే యుండును. గాని ఆగదు. అందుచేతనే దీనికి మట్టులేని గొయ్యి అని పేరుపెట్టిరి. దీనికి అర్ధము ఏమనగా ఇది మట్టులేని గొయ్యి. వెయ్యేండ్ల పిమ్మట ప్రభువు వెళ్ళి తాళము తీసి అతనిని బయటకు లాగును గాని అతడు తనంతట తాను బయటకు రాలేడు.

ఉత్తరము – కుభేరుడు

దక్షిణము – యముడు

తూర్పు – ఇంద్రుడు

పడమర – వరుణుడు

యమలోకములో యమకింకరులు ఉంటారు. వారికి రాజు యమ ధర్మరాజు. యమలోకమంటే తీర్పునకు లోనైనవారు. తీర్పు విధించునని హైందవులు చెప్పుదురు. ఇది మనకు సమీపమైనదే. హరిశ్చంద్రుడు యమదర్మరాజు చరిత్రలో, హరిశ్చంద్రుడు యమధర్మరాజుకు పరిచర్య చేసినాడు. ఆ పరిచర్య చేసినప్పుడు హరిశ్చంద్రునకు యమధర్మరాజు తక్కువ జాతివాడుగా కనబడినాడు. అప్పుడు సిం హాసనము వద్ద తీర్పు తీర్చువాడని అనుకొనెను.

7 సంవత్సరాల అంత్యక్రీస్తు పరిపాలనలో కోటి త్రిత్వ ముండును. ఇది శ్రమకాలము. రాకడ కాలములో పెండ్లికుమార్తె ఎత్తబడును. గనుక వధువు సంఘము ఈ శ్రమ కాలమందు భూమి మీద ఉండదు. ఈ రాకడ కాలమునకు ముందు, 20 వందల సంవత్సరముల నుండి సంఘము ఏర్పాటై యున్నది. ఈ సంఘము పెద్దది. అందులో సిద్ధపడి ఎత్తబడేవారు అ సంఘముయొక్క నిజమైన బిడ్డలు. తక్కినవారు సిద్ధపడనందున ఈ లోకములో మిగిలి పోవుదురు. సంఘములో నున్న మొదటి బిడ్డ ఎత్తబడినది. ప్రకటన 12వ అధ్యాయములో ఉన్న మగ శిశువు ఈ ఎత్తబడిన సంఘమే. సంఘముయొక్క బిడ్డకు మగ శిశువని పేరు వచ్చినది. సహజముగా లోకములో ఒక ఇంటిలో ఒక మగశిశువు తరువాత ఒక ఆడ శిశువు పుట్టిన యెడల వీరిరువురిలో మగ శిశువు ముఖ్యము ఎందుకంటే మగ శిశువు వంశకర్త. ఆడ శిశువు అయితే కొంతకాలము మాత్రమే ఇంటిలో ఉండి పిమ్మట అత్తగారింటికి పోవును. ఆత్మీయ క్రమములో, సంఘములో నుండి నిజమైన విశ్వాసులు పైకెత్తబడినారు. గనుక ఆ సంఘములో నుండి ఎత్తబడిన విశ్వాసులు మొదటి బిడ్డ. మగ శిశువును గూర్చి లోకములో గొప్ప వివాదము ఉన్నది. స్త్రీ అనగా మరియ అనియు శిశువు అనగా యేసుప్రభువు అని అనుచున్నారు. మరికొందరు ఇతడు మరియమ్మ కుమారుడు కాడు. ఇది యూదా సంఘమని కొందరి అభిప్రాయము. ఇట్టి గొప్ప వివాదమును బట్టి అయ్యగారు కొన్ని సంవత్సరముల క్రితము పత్రిక ఒకటి అచ్చువేయించి పంచిపెట్టిరి. అందులో “ఎత్తబడిన సంఘము మగశిశువు; అయితే మిగిలిపోయిన సంఘము ఏడేండ్ల శ్రమలోనికి వెళ్ళిపోవును; మిగిలినవారు సంఘము యొక్క సంతానమే గాని అసలు సంతానము గాదు; సంఘము యొక్క సంతానము 7 సంవత్సరాల పాలనలోను, వెయ్యేండ్ల పరిపాలనలోను ఉండునుగాని అసలు సంఘముకాదు; పైకి ఎత్తబడిన సంఘమే మగ శిశువు” అని వ్రాసిరి.

యేసుప్రభువు ‘నేను వెళ్ళిన పిదప అనేకులు నా పేరట వచ్చెదరూ అని అనెను. కాబట్టి నేనే క్రీస్తును అనేవారు ఈ కాలమందున వచ్చెదరు. అయ్యగారు రాజమడ్రిలో ఉండగా ‘నేనే క్రీస్తునని చెప్పుకొనువారు ప్రపంచమంతటిలో గడచిన సంవత్సరములలో 40మంది వచ్చిరి ‘ అని చెప్పిరి. అయ్యగారు గుంటూరు వచ్చిన పిదప ఒకాయన ఏలూరునకు వచ్చిరి. ఆయన శిష్యులు కొందరు బి.ఏ. వరకు చదివినారు. వారు అతనిని ఊరేగించారు. అప్పుడు అతడు ‘నేనే క్రీస్తునని ‘ చాటించుకొన్నాడు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు అనీబిసెంట్ యొక్క శిష్యుడు. అతని ఆఫీసు మద్రాసు దగ్గర అడయారులో ఉన్నది. అయ్యగారు అక్కడికి వెళ్ళినారు అతని పేరు జయరామమూర్తి. అతడు ‘నేనే క్రీస్తునని ‘ తెలియజేస్తున్నాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క చరిత్ర నిజమనియు, ప్రభువు బోధలు సత్యమనియు, ఋజువుపరచుటకు ఈ సంఘటనలు మనకు ఆధారమైయున్నవి. క్రీస్తునని చెప్పుకున్నంత మాత్రమున వారు క్రీస్తుప్రభువు అవుతారా? ఆ క్రైస్తవులే నేటికాలములో మతమును విడిచి వెళ్ళిపోవుచున్నారు. ఈ మధ్యకాలములో అనేకులు బౌద్ధ మతములో కలసిపోవుచున్నారు. ఎందుకంటే అనేకులకు అది అనుగుణ్యముగా ఉన్నది. కులము లేదు, అందులోని వారికి మతము లేదు. క్రైస్తవ మతములో అయితే అన్ని మిషనులే. క్రొత్తగా వచ్చినవారు ఏ మిషనులోనికి వెళ్ళవలెనో తెలియుటలేదని ఇబ్బందిపడుచున్నారు. ఒక్క బౌద్ధమతములోనికి, క్రైస్తవ మతములోనుండి కొన్నివేలమంది వెళ్ళిపోయిరి. బైబిలు మిషనులో నుండి కూడ హింస కాలములో కొందరు వెళ్ళిపోవుదురు.

రాకడ పండుగ – VI
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply