క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. మట్టలాదివారము
  5. మట్టలాదివారము 6

మట్టలాదివారము 6

జెకర్యా. 9:9; మత్తయి 21:1-17; మార్కు 11:1-17;లూకా 19:29-46; యోహాను 12:12-16.

(1) యేసుప్రభువు జయోత్సవముతో యెరూషలేమునకు, గార్ధభముపై కూర్చుని వెళ్ళుచుండగా శిష్యులు, పిల్లలు, పెద్దలు జయమని ప్రభువును సత్కరించిరి. శాస్త్రులు, ప్రధానయాజకులు వీరు అల్లరి చేయుచున్నారని ప్రభువుతో చెప్పినప్పుడు, ఆయన “వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలువేయునని చెప్పెను”

(2) ఈ రోజు పండుగ, రేపటి నుండి శ్రమ. ఈ ఆదివారము గాక వచ్చే ఆదివారము పండుగ. ఈ మధ్య శ్రమల లోయ. ఈ లోయ అడ్డుబడి సమాధిలోనికి వెళ్ళవలెను. అక్కడ నుండి పండుగ ఆచరించుటకు ఆదివారము లేవవలెను.

(3) ఈ జయోత్సవము రెండు గార్ధభములు కట్టియున్న స్థలము మొదలుకొని, పళ్ళెటూరు మొదలుకొని, యెరూషలేము పట్టణము వరకు సాగి వెళ్ళినది.

(4) ఆయన గార్ధభము మీద కూర్చుండి యెరూషలేము వెళ్ళుట, బట్టలు పరచుట, కొమ్మలు పరచుట ఇదంతయు పండుగే. శిష్యులను విప్పుకొని రమ్మనగానే వారు వెళ్ళిరి. వారిని ఎవరును ఆటంకపరచకుండుట గొప్ప శుభవార్త. ముందు, వెనుకనున్న వారు పాటలు పాడుట శుభవార్త. పల్లెటూరునుండి పట్టణము వరకు ఈ దినము శ్రమల బాటలేదు గాని అంతా ‘కళ ‘ కనబడుచుండెను. అంతా జయమే!

(5) వచ్చే ఆదివారము ఈష్టరు పండుగ. ఇదెంత జయకరముగాను, శుభకరముగాను, జరిగినదో ఈ కథ కూడా అలాగే జరిగెను. ఈ కథ చూచినవారు, విన్నవారు ధన్యులు.

(6) గార్ధభములను విప్పినప్పుడు ఊరుకొన్నారు. బట్టలుపరచిన, కొమ్మలు పరచిన ఊరుకొన్నారు. ఇవన్నీ ఎందుకు అనలేదు. పండుగ సమయము గనుక అనలేదు. పండుగ అంతా అయిపోన తరువాత శాస్ర్తులు, పరిసయ్యులు మూలుగుకొన్నారు. పండుగంతా అయిపోయిన తరువాత మూలుగుకొనిన ఏమి లాభము?

(7) కొన్ని సం||లకు ముందుగనే జకర్యా ప్రవచించెను. సీయోను కుమారీ! సంతోషించుము, మీ రాజు సాత్వికుడై గార్ధభాసీనుడై వస్తున్నాడనే వృత్తాంతము ఈ దినమున జరిగినది. జెకర్యా వ్రాసినది ప్రవచన చరిత్ర. పేతురు, యోహానులు జరిగిన చరిత్ర చూచిరి. వీరి చూచి ఆ చరిత్ర అనుభవించిరి, శాస్త్రులు చరిత్ర ఎరిగియుండియు చీవాట్లు అనుభవించిరి గాని మరేమియు అనుభవింపలేదు.

(8) పేతురు, యోహానులకు ప్రభువు చెప్పినట్లు చేసినాను. అను ఆనందానుభవము కలిగెను. విప్పుకొని వచ్చినందులకు ఆనందానుభవము, బట్టలు పరచిన ఏమియు అనలేదు. ఆదియు ఆనందమే, మరియు మట్టలు చేతపట్టుకొని, జయము అని పలికిన బాలురకు కూడా ఆనందానుభవము. ఇట్టి ఆనందానుభవములో లేకపోయిన లాభమేమి?

(9) పేతురు యోహానులకు ప్రభువు పని చెప్పగానే చేసిరి. వారు వ్యతిరేకమేమియు చెప్పలేదు. నీవు ఏది చెప్పిన వ్యతిరేకము చెప్పకుండ చేయగల విధేయత, పేతురు యోహానుల వంటి విధేయత అనుగ్రహించు ప్రభువా! అని ప్రార్ధించు విశ్వాసులు ఈ గుంపులో ఉన్నారా? సమయము వచ్చినప్పుడు, గడువు వచ్చినప్పుడు వారు గౌరవించినట్లు నిన్ను గౌరవ పర్చు బుద్ధి దయచేయుము ప్రభువా, అని ప్రార్ధించు విశ్వాసులు ఇక్కడ ఉన్నారా?

(10) ప్రభువా! నీ ఇష్టము వచ్చినట్లు నన్ను వాడుకొనుము అనగలరా? ఆయనకు ఏమికావలెనంటె అది ఇచ్చు గుణము గలవారున్నారా? ఏది అడిగిన అది ఇవ్వవలెను. మాకో అని అనకూడదు. ఆ యజమానుడు అయా! ఎప్పుడు మరల తోలుకొని వస్తారని అడిగినాడా? లేదు క్రీస్తు ప్రభువునకు ఇచ్చివేసినాము. ఆయన ఇచ్చిన మరల తీసికొందాము లేపోఏ, లేదు అన్న వివాస ఆనందము . అట్టి అనుభవము మీకు ఉన్నదా? ఆయనను గౌరవపరచే ఆనందానుభవము, ఆయనకిచ్చి మరల అడుగని విశ్వాసానందానుభవము. ఆయన చెప్పినట్లుచేయు విధేయతానుభవము గలిగి యుండవలెను.

(11) జయము అని పాడిన పిల్లలు పరిసయ్యుల దృష్టిలో పాడుపిల్లలు గాని ప్రభువుయొక్క దృష్టిలో పాడేపిల్లలు. బైబిలు చంకను పెట్టుకొన్న శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మెచ్చుకొనలేదు గాని జయము పాడిన పిల్లలను ప్రభువు మెచ్చుకొనెను.

(12) సంతోషముగల పాట, ప్రభువు మెచ్చుకొన్న స్తుతి, ఆయన కంగీకరమైన స్తుతి పిల్లలు వినిపించినారు. ఆ పిల్లలవలె స్తుతించు విశ్వాసులు ఇక్కడ ఉన్నారా? ఇదిగో అబ్బాయిలూ! మీకెవ్వరు ఈ స్తుతి నేర్పినారు? అని నేను అడిగినాను. ఈ పిల్లలు ఎక్కడ నేర్చుకొన్నారు? వేద శాస్త్రమునకు సంబంధించిన స్తుతి, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక! ఎక్కడిది వీరికీ స్తుతి? ఇట్టి స్తుతి చేయు పిల్లలు లోకమునకు పాడు పిల్లలు, అయితే వారు ప్రభువు దృష్టిలో పాడే పిల్లలు. వీరు పాడిన హల్లెలూయ, హోసన్నా అను స్తుతిలో పరలోకములో కూడ జయమని పాడిరి. ఈ పిల్లలు అల్లిన స్తుతి. ఆ అల్లికలో పరలోకమునకు, భూలోకమునకు చుట్టరికము కలిపివేసినారు. క్రిష్ట్మసు రోజున దూతల యొక్క పాటకూడ ఆలాగే యున్నది. ఈ పిల్లలవలె గానానంద అనుభవము కలిగిన విశ్వాసులిక్కడ ఉన్నారా? జయము అని పాడిన జయానంద అనుభవము గలిగిన విశ్వాసులిక్కడ ఉన్నారా?

ఈ కథలోనుండి వచ్చిన వర్తమానములు (1) విధేయతానంద అనుభవము. (2) కానుకానందము. (విప్పుకెళ్ళండి) ఒకరు పువ్వులు తీసికొనివచ్చి బల్లమీదపెట్టి సంతోషించిరి. (3) గౌరవానందము. (4) జయానందము. (5) త్యాగానందము (ఎంతమంచి కానుక! అని మెచ్చుకొందురు), (6) ఆయన వెళ్ళుచున్నప్పుడు ఒక గుంపు ముందున్నారు, ఒక గుంపు వెనుకనున్నారు. ప్రభువు మధ్య ఉన్నారు. మధ్యవర్తి అయిన ఆయన మధ్య నున్నారు. వారు పల్లెటూరికి పట్టణమునకు మధ్య నున్నారు. వారికినీ, వీరికిని సంబంధముగా మధ్య క్రీస్తుప్రభువు ఉన్నారు. గనుక మధ్యవర్తి ఆనందము. క్రీస్తుప్రభువు మనలను రక్షించినాడను సంతోషము మరియు రేపు వారిని రక్షించుననే ఆనందము, ముందు వచ్చిన వారిని, వెనుక వచ్చిన వారిని రక్షించుననే ఆనందము. ముందు వెళ్ళినవారు పరదైసులో నున్నారు, వెనుక మనము ఉన్నాము. వారికి మనకు మధ్య ప్రభువు ఉన్నారు. వారు మనకొరకు కనిపెట్టుచున్నారు. మనము వచ్చుచున్నాము, సిద్ధపడుచున్నామని అంటున్నాము. ముందువెళ్ళి కూర్చున్న వారికిని, వెనుక సిలువమోయుచు పడుచున్న మనకును క్రీస్తుప్రభువు మధ్యవర్తి. ఆ రెండు గుంపుల వారు యెరూషలేము వెళ్ళినారు. ఆలాగే ఈ రెండు గుంపులవారు నూతన యెరూషలేము వెళ్ళుదురు.

Please follow and like us:
మట్టలాదివారము 6
Was this article helpful to you? Yes 4 No

How can we help?

Leave a Reply