క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. మంచి శుక్రవారము
  5. మంచి శుక్రవారము 3

మంచి శుక్రవారము 3

ప్రభువు మనకొరకు శ్రమపడెను గనుక యేసుప్రభువు సిలువ కల్వరిలోనున్నట్లు మనో దృష్టిలో చూడండి. ఆయన మన నిమిత్తము శ్రమ అనుభవించుచున్నట్టు విశ్వాస నేత్రముతో చూడవలెను. అప్పుడు మనము గ్రహించి, మేలు పొందగలము. విశ్వాస నేత్రముతో చూడవలెను. అప్పుడు మనము గ్రహించి, మేలు పొందగలము. మన నిమిత్తము ప్రభువు శ్రమపడెను గనుక మనము ఆయనను స్తుతింపవలెను.

1. ప్రభువు జన్మచరిత్ర: ఆయన జన్మమును గూర్చి దేవదూత మరియతో చెప్పుట, గొల్లలు, జ్ఞానులు ఆయనను దర్శించుట -ఇది జన్మచరిత్ర. 2. ప్రభువు యొక్క బాల్య చరిత్ర:12 సంవత్సరముల ప్రాయము వరకు నజరేతులో నుండుట, పిమ్మట యెరూషలేము వెళ్ళుట, తర్వాత ఇంటివద్ద నుండుట. 3. ఉద్యోగ చరిత్ర: 30 సం||లప్పుడు బాప్తీస్మము పొంది, ప్రార్ధించి, పిశాచిని జయించి, పెరియ, సమరయ, యూదయ ప్రాంతములలో సేవచేయుట. 4. శ్రమ చరిత్ర: దక్షిణము నుండి ఉత్తరమునకు వెళ్ళుచు, శ్రమ ఉన్నదని చెప్పెను. (లూకా 18:31) అప్పటి నుండి సమాధి వరకు శ్రమచరిత్ర. ఒక వారము కంటే ఒక వారము శ్రమ ఎక్కువ. ఈ వేళ క్రైస్తవులు శ్రమచరిత్ర ధ్యానించి, వందనములు చేయుటకు కూడుకొందురు. హెబ్రీ 5:7 లో యేస్ప్రభువునకు రోదన, కన్నీళ్ళు ఉన్నవి. ఆయన జీవితమంతయు శ్రమే గనుక రోదన, కన్నీళ్ళు గలవు. రోగి తనకున్న శ్రమనుబట్టి మూల్గుచుండును. అతని శ్రమ చూచినప్పుడు ఇతరులకు జాలిగ నుండును. రోగికి రోదనగా నుండును. గట్టిగా అనుకొనుట, విలపించుట, ఏదో అనుకొనుట ఇదే రోదన ప్రభువునకు, శ్రమనుబట్టి కన్నీరు ఉన్నది. రోదన కూడా ఉన్నది. ఇవి మన కోసము ప్రభువు అనుభవించెను. హెబ్రీ పత్రికలో తన జీవితకాలమంతా అని ఉన్నది. నాలుగు చరిత్రలలోను ఉన్నది. ఒక్క శ్రమ చరిత్రలోనే కాదు, ఆయనకు జీవితమంతయు రోదన, కన్నీరు కలదు. ఉదా: ఒక వ్యక్తికి మడమసోలవేసినట్లయిన, వాని బాధ వానికే తెలియునుగాని ఇతరులకు తెలియదు. మనకు విన్నందువలన తెలిసినదిగాని అదీ పూర్తిగా తెలియదు. అనుభవించిన యెడల తెలియును. మడమసోల వేసిన వానితో, దానికే ఏడ్వవలెనా! అనిన ‘నీకేమి తెలియును నా బాధ ‘ అనును. అట్లే ప్రభువు శ్రమ మనకు తెలియదు. తెలిసిన యెడల మనము బ్రతుకలేము. పై నాలుగు చరిత్రలలో ఆయన రోదన, కన్నీళ్ళు ఎప్పుడునూ మానలేదు. గనుక మనము ఎంతైనా కృతజ్ఞత చూపించి స్తుతించవలెను. ఆయన అనుభవించకపోతే నేనే కదా అనుభ వించ వలసినది అని ధ్యానించి, స్తుతించవలెను. అప్పుడు ప్రభువునకు సంతోషము.

1. జన్మ చరిత్ర: ఈ మొదటి దశలో ఆయనకు శ్రమ అనగా సర్వలోకమును కలుగ జేసిన ప్రభువు మనిషి అగుట, అదే గొప్ప శ్రమ. ఒకనితో నీవు పాముగా పుట్టెదవనిన అతనికి ఇష్టమా? అలాగే దేవుడు మనిషి అగుట ఎంతో శ్రమ. ఆయన కలుగజేసిన కన్యక గర్భములో జన్మించుట ఆయనకు మహాశ్రమ. ఈ శ్రమ మనకు తెలియకఓవుటయే మంచిది. తెలిసున్న యెడల బ్రతుకము. ఒక గొప్ప ఉద్యోగిని ‘నీవు రోడ్డు తుడువుము ‘ అనిన అతనికి శాంతి ఉండదు. రాత్రి నిద్ర ఉండదు. అలాగే ప్రభువునకు జన్మకాలములో చాలా శ్రమ గలదు.

2. బాల్య చరిత్ర: యోసేపు మరియమ్మలను తనకు తల్లిదండ్రు లనిపించుకొనుట ఆయనకు గొప్ప శ్రమ. వారు ఆయనకు భోజనము పెట్టుట, బట్టలిచ్చుట శ్రమ. లోకమంతటిని పోషించి కాపాడే ఆయన, మనిషి పోషణ క్రింద ఉండుట శ్రమ కాదా! జడ్జిగారు ప్రతినెల అందరికిని ధర్మము చేసి, ఆయనే పేదవాని ఇంటిలో ఉండి అడుగుకొక్క్న ఎంత శ్రమ! పన్నెండు సంవత్సరముల చరిత్రలో యేసుకు వారిని తల్లిదండ్రులని పిలిచి, వారి ద్వారా పోషణ పొందవలెనా అనే రోదన కన్నీరు ఆయనకు గలదు. పస్కాపండుగలో శత్రువులు, పరిసయ్యులు బోధించగా, పిల్లవాని వలె వారి బోధ వినుట ఆయనకు శ్రమ. మరియ ప్రభువు పాదముల యొద్ద కూర్చుండి బోధవినెను. అయితే దేవుడు మనుష్యుల యొద్ద బోధనేర్చుకొనుట శ్రమే; సర్వజ్ఞానియైన దేవుడు మానవునివద్ద జ్ఞానము నేర్చుకొనుట శ్రమే; ‘నీ కోసము మూడు దినముల నుండి వెదుకుచున్నాము ‘ అని ప్రభువును గద్దించుట శ్రమ కాదా! అయితే ఈ శ్రమలన్నియు మనకు కనబడవు. అవి ప్రభువునకే తెలియును.

3. ఉద్యోగ చరిత్ర: ఎవరు పాపము చేసిరో వారు తమ పాపములను ఒప్పుకొని యోర్ధాను నదిలో స్నానము పొందుట తగినది. పాపములేని ప్రభువు పాపి వలె శ్రమ పొందుట శ్రమ. ఆయన పాపములు ఒప్పుకొనలేదు. పాపము లేనిదే ఏమి ఒప్పుకొనును. యోహాను – నీవునాకు ఇవ్వవలెనని అన్నప్పుడు ప్రభువు నీతి యావత్తు ఇట్లు జరుగవలెనని చెప్పెను. ఇదే ప్రభువునకు రోదన, కన్నీరు. సైతాను ప్రభువును శోధించుట ఎంత శ్రమ! రొట్టెలు చేసి కొమ్మని చెప్పుట, తనకు మ్రొక్కుమనుట, ఆయనకు ఎంత శ్రమ. పరిశుద్ధుడు శోధించిన బాగుండును. పాపియైన దయ్యముతో శోధింపబడుట మహా గొప్ప శ్రమ. మనిషి ఆత్మను పొందవలెను, గాని మనిషి వలె ఆయన ఆత్మ పొందుట శ్రమ. ఆయన యొక్క బోధలో తప్పులు పట్టుకొనవలెనని ప్రయత్నించుట శ్రమ. తాను రక్షకుడనియు, ప్రజల పాపములు ఇవి, అని చెప్పుటకు తాను వచ్చెననియు ప్రజలు గ్రహింపలేక పోవుట శ్రమ. మరియు కుమారుడని తిరస్కరించిరి. ఇదియు శ్రమ.

రోగులను బాగుచేసినప్పుడు ఆయన మీద కుట్రాలోచన చేసిరి. ఇది శ్రమ. దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు పందులు చనిపోనని మా ప్రాంతము విడిచి పొమ్మనుట శ్రమ. ఉగ్రుడై ప్రజలమీద పడుచున్న దిగంబరిని బాగుచేసినందుకు నమస్కరింపక వెళ్ళగొట్టుట శ్రమ. ఆ గ్రామ మెవరిది? ఆ జనము ఎవరివారు? అయినను ఆయన వెళ్ళిపోయెను. పరమ రక్షకుడు అవసరము లేదు, పందులు కావలసి వచ్చెను. లాజరును బ్రతికించినప్పుడు ప్రభువును చంప ప్రయత్నము చేయుట శ్రమ తీసికొనివెళ్ళి మర్యాద చేయవలసినది గాని మరణము వచ్చెను. పైన చెప్పిన చరిత్రలో శ్రమగాక మరియేమున్నది. నేను కలుగజేసిన ప్రజలు పాపులై, వారికి కలిగిన బిడ్డలను కూడ పాపులనగా చేయుచున్నారనే రోదన, కన్నీరు ఆయనకు గలదు. పాపము వలన వ్యాధి, మరణము, నరకము వచ్చినదని ఆయనకు రోదన కన్నీరు.

4. శ్రమ చరిత్ర: మనము ధ్యానము చేయు ఈ కాలములో ఆయనకు అధిక రోదన, కన్నీరు, యూదా ఆయనను విడిచిపోవుట, గెత్సెమనే లో ముఖ్యులైన శిష్యులే ప్రార్ధించుమని చెప్పగా నిద్రపోవుట, ఆయనను పట్టుకొనుట, సంఘములో ఆయనకు న్యాయము దొరకకుండుట (అన్న, కయప, సనెహడ్రిన్), పేతురు ఎరుగనని బొంకుట, ఆయనను అపహసించుట, యుదా చనిపోవుట, గవర్నమెంటులో కూడ ఆయనకు న్యాయము దొరకకుండుట (పిలాతు, హేరోదు), సిలువ వేయబడుట, ఆయన వస్త్రములు పంచుకొనుట, ఆయనను దూషించుట, ఆయనకు చిరకనిచ్చుట, ఆయన మరణమగుట, సమాధి చేయబడుట; గనుక అంతా రోదన, కన్నీరు, శ్రమ ఆయనకు గలదు. ప్రభువు శ్రమల ధ్యానము, మన ఆత్మీయ జీవనాభివృద్దికి తోడ్పడును గాక! ఆమెన్.

Please follow and like us:
మంచి శుక్రవారము 3
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply