క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. మంచి శుక్రవారము
  5. మంచి శుక్రవారము 1

మంచి శుక్రవారము 1

వాక్య భాగములు: మత్తయి 26:36-75; 27అధ్యా|| మార్కు 14:32. 72; 15 అధ్యా|| లూకా 22:39-71;23అధ్యా|| యోహాను 18,19 అధ్యా||లు.

ధ్యానాంశము:- 1థెస్స 5:10 “ఆయన మన కొరకు మృతి పొందెను” యేసుప్రభువు మనకైమృతి పొందెను. ఇవి సంఘము నిమిత్తము చెప్పబడిన మాటలు.ఒక్కొక్కరు కొరకు ఆయన మృతి పొందిన యెడల ఆయన నాకోసమే చనిపోయెనని అందుము. ఆయన చనిపోయెను. చనిపోవుట అవమానము. బెత్లెహేములో పుట్టినప్పుడు గొల్లలు, దూతలు, సుమెయోను, హన్న దర్శించి, ఎవరి మహిమను చూచినారో ఆయనే చనిపోయెను. నమ్ముటకు వీలు లేదు,హేరోదు కత్తి తప్పించుకొన్న శిశువు ఈ వేళ చనిపోయెను. బాప్తిస్మమప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారముగా దిగివచ్చిన ఆయనే చనిపోయెను. ఈ చావు మనకు అర్ధము కాదు. ఈయనే నా ప్రియకుమారుడనిపించు కొన్న ఆయన, నేను లోకమునకు వెలుగైయున్నానని చెప్పి ఆయన చనిపోయెను. లోకదీపము చనిపోయినా, లోకములో వెలుగుండదు. గ్రామములలో సంచరించి, చనిపోయిన వారిని మాటతో లేపిన ఆయన ఈ వేళ చనిపోయెను. అది ఏలాగు నమ్మగలము! ఇతరులను బ్రతికించిన ఆయన ఎట్లు చనిపోగలడు? దారిలో ఒకరిని, ఇంటిలో ఒకరిని బ్రతికించిన ఆయనెట్లు చనిపోయెను? గెత్సెమనే తోటలో తన యొద్దకు వచ్చిన గుంపు, ఆయనను చూడగానే పడిపోయిరి. పడిపోయిన వారు ఆయనను ఏలాగు చంపగలిగిరి? కల్వరిగిరి వద్ద వారు ఎందుకు పడిపోలేదు? ఇది ఎలాగు నమ్మగలము! ఆయన మన కొరకు చనిపోయెను. అది ఎట్లు సాధ్యమైనది! ఆ నిజ సంగతి సువార్తికులు వ్రాసియున్నారు.

మన కొరకు మృతి పొందెనని వ్రాయబడి యున్నది గాని తన కొరకని లేదు. ఆయన బలహీనతవల్ల లేదా చావు తప్పించుకొనలేక, చనిపోవుట అవసరము గనుక చావును రానిచ్చెను గాని ఆయన చావు తప్పించుకొనలేక కాదు; ఆయన నిజముగానే ఊరుకొనే చనిపోయినట్టున్నది. నేను దేవుని కుమారుడను, మెస్సీయాను అని చెప్పిన ఆయన ఎట్లు చావగలిగెను? ఆయన చనిపోయినాడని మనము నమ్మవచ్చునా? దేవుని కుమారుడు ఎట్లు చనిపోగలడు? ఆయన నిజముగా చనిపోయిన ఎట్లు లేవగలడు? నిజముగా చావలేదు. ముగ్గురిని బ్రతికించిన ఆయన తాను కూడ బ్రతుకగలడు. అయితే ఎందుకు చనిపోయెననగా, మన పాపములు, వ్యాధులు, శిక్షలకొరకు చనిపోయెను. ఇంకా ఎందుకుచనిపోయెననగా, మూడురోజులకు తిరిగి లేచుటకు, మనము ఎందుకు పండుకొందుము? మరల లేవటానికే గదా! ఆయన చనిపోవడము చనిపోవుటకు కాదు, మరల లేచుటకే. చనిపోయి చెడ్డపేరు తెచ్చుకొనుటకు ఆయన చావలేదు. ఆయన తిరిగి లేవడని వారు ఏడ్చుచునే యున్నారు. అయితే ఆయన లేచినాడుగాన ఏడ్పు సంతోషముగా మారిపోయెను. ‘మనకొరకు చనిపోయెను; యేసుప్రభువు మనకొరకు వస్తారని పాత నిబంధనలోని వారందరు మలాకీ గ్రంధము వరకుచెప్పిరి. ఆయన వచ్చి 33 1|2 సంవత్సరములు బ్రతికి, మనకొరకు చనిపోయెను. (1) మన కొరకు వచ్చెను (2) మన కొరకు 33 1|2 సం||లు బ్రతికెను. (3) మనకొరకు చనిపోయెను. (4) మనకొరకు లేచెను. పై నాలుగు విషయములలో ఆయన వస్తారన్నప్పుడు సంతోషించిరి. 33 1|2 సం||లు బ్రతికియున్నపుడు సంతోషించిరి గాని చనిపోయినపుడు ఏడ్చినారు. ఆయన తన ప్రాణమును బలిచేసినప్పుడే మన యెడల ఎక్కువ ప్రేమను కనపర్చెను.

ఎందుకు మనకొరకు చనిపోయినాడు? (1) మనలను నరకమును రెండవ మరణము నుండి తప్పించుటకు, ఆయన చావకపోయిన యెడల నరకమను రెండవ మరణము మనకు వచ్చియుండెడిది. (2) ఎంత భక్తులైనను చనిపోవలసినదే. ఆ భక్తులు ప్రభువు మరణమును ఎరుగుదురు గనుక ధైర్యముతో చావును ఎదుర్కొందురు. మనము ఈ రోజు చనిపోయి, రేపు సమాధిలో నున్నను మూడవ దినమున లేస్తాము అని సంతోషించుటకు ఆయన చనిపోయెను. (3) మన మరణమును మార్చుటకును, అనగా మరణమును పరలోకమునకు వెళ్ళే మార్గముగా మార్చూటకు ఆయన చావకపోయినయెడల, మనము మన మరణము ద్వారా నరకమునకు పోవుదము. ఆయన మరణము ద్వారా మన మరణముయొక్క శక్తులను ఉడిగిపోవునట్లు చేయుటకు ఆయన చనిపోయెను. ఆయన లేచినాడు గనుక నన్నును మరణము నుండి లేపును. ఓ మరణమా! నీ ముల్లెక్కడ? ఓ మరణమా! నీ విజయమెక్కడ? అని మనము పలుకునట్లు చేయుటకు ఆయన చనిపోయెను. (4) ఆయన తన మరణము ద్వారా మన మరణ మును కొట్టివేసి, మనము మరణము లేకుండా ఆరోహణమగుటకు ఆయన చనిపోయెను. (5) హవ్వ, పండు తిని శరీర మరణము, దేవుని నుండి ఎడబాపు, నరకము అను వాటిని లోకములోనికి తెచ్చెను. వీటి నుండి మనలను తప్పించుటకు ఆయన చనిపోయెను. ఒక ఇంటి చావు, ఇంకొక ఇంటికి వెళ్ళినట్లు, మన చావు ప్రభువుపైకి వెళ్ళినది. సమాధులపై ‘ప్రభువునందు నిద్రించెనని ‘ వ్రాయుదురు. అనగా తిరిగి లేచెదరని అర్ధము. సంఘారోహణ సమయములో ఎత్తబడితే, శరీర మరణము ఉండదు, రెండవ మరణమైన నరకము ఉండదు. సంఘారోహణమునకు ముందు చనిపోయిన యెడల, మోక్షమునకు మార్గము ఏర్పడును. ఈ రెండును మన మేలు నిమిత్తమే. ఆయన మన కొరకు మృతి పొంది ఈ మేళ్ళన్నియు చేసెను.

Please follow and like us:
మంచి శుక్రవారము 1
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply