క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. బైబిలు పండుగ
  5. దిద్దుబాటు పండుగ-1

దిద్దుబాటు పండుగ-1

 చదువదగిన వాక్య భాగములు:- ద్వితి. 26:15-19;28:1-12;

లేవి. 26:1-13; కీర్తన 46వ అధ్యాయము; మత్తయి 21:12,13; రోమా. 12:1-2; ఎఫెసి. 5:15.

    ప్రియులారా! ప్రభువు నామమున మీకు శుభములు కలుగును గాక! లూథర్ చరిత్ర 400 సంవత్సరాల క్రిందట జరిగినది. ప్రభువు లూథర్ ను పంపి బైబిలును బయలు పరచినందున ఈ పండుగ ఒక్క లూథర న్ మిషనుకే పరిమితము గాక, అన్ని మిషనులు దిద్దుబాటు చేసికొనుటకు ఏర్పాటైనది. బైబిలు ఆ ఒక్క మిషనుకే కాదు, అన్ని మిషనులకు ఉన్నది గనుక ఇది అన్ని మిషనులకు దిద్దుబాటు పండుగైనది.

    తండ్రియైన దేవుడు నావయొక్క తలుపు తీసి, రక్షణ ప్రకటించు వర్తమానము ఆయన హృదయములో వ్రాసి నోవాహును పంపెను. యూదా జనాంగము నేర్పర్చుటకు అబ్రహామును పిలిచెను. ఆయన విశ్వాసులకు జనకుడుగానుండి అనేకులకు సువార్తను ప్రకటించెను. తరువాత దేవుడు మోషేను పిలిచి చేతికి ధర్మశాస్త్రమునిచ్చి యూదులను మహాత్ములనుగా మార్చి, తన సువార్త పనిని కొనసాగించుకొనెను. కొందరిని సిం హాసనముపై కూర్చుండ బెట్టి రాజ కార్యములు చక్కబెట్టించెను. తరువాత ప్రవక్తలకు వ్రాతలు చూపి, దర్శనములు చూపి పని చేయించెను. లోక రక్షకుడుగా జన్మించి, ఆయనే స్వయముగా పనులన్నియు చక్కపెట్టుకొనెను. ఆయన పరలోకమునకు వెళ్ళుచూ శిష్యులైన వారికి భూదిగంతముల వరకు ప్రకటించుడని ఆజ్ఞ నిచ్చి వెళ్ళెను. అది సంఘములో ఒక మూల పేతురును, ఒక మూల పౌలును, మరి యొక మూల ఇంకొకరిని ఉంచి సంఘములోని పనులన్నీ చక్కగా జరిగించెను. తరువాత మిషనెరీలను ఏర్పాటు చేసికొని తండ్రి తన పనిని కొనసాగించెను.

    ఆలాగే 400 ఏండ్ల క్రిందట దేవుడు లూథర్ గారిని లేపి, సంఘములో గొప్ప పనిని చేయించుకొనెను. ఆ గొప్ప పనిని నేడు మనమందరము తలంచుకొని, లూథర్ ను పంపిన దేవుని స్తుతింప వలెను. లూథర్ తన జీవితములో రెండు గొప్ప పనులు చేసినాడు. మొదట తన్ను తాను దిద్దుకొనినాడు. రెండవదిగా సంఘమును దిద్దుబాటు చెసెను. ఆయన ఇంకా రెండు పనులు చేసెను. బైబిలును పైకెత్తి చూపించెను. సంఘములోని పొరపాట్లను చూపించి సరియైన సంగతులను పైకెత్తి చూపించెను. లూథర్ ను ముందు నిలువబెట్టి, వెనుక ప్రభువు నిలిచి తన పనులను చేయించుకొనెను.

ప్రభువు లూథర్ నకు కొన్ని వరములిచ్చి వాడుకొనెను. అవి ఏవనగా:- 1వ వరము:- తన స్వంత హృదయమును దిద్దుకొను వరము. ముందు తన హృదయమును దిద్దుకొనని యెడల రేపు సంఘము నెట్లు దిద్దగలడు? లూథర్ నకు మొదటగా తన హృదయములో ఒక కలత గలదు. అనగా పాపపు తలంపులు గలవు. ఒకసారి తన స్నేహితుడు పిడుగు పడి అకస్మాత్తుగా మరణించెను. అతనిని ఎవరు తీసికొని వెళ్ళుదురు? అతడు ఎక్కడికి వెళ్ళును? మొదలగు తలంపులు అతడు కలిగి యుండెను. ఇట్టి తలంపులు కూడ పాపమే. అప్పుడాయనకు ప్రభువు బైబిలు అను అద్దములో తన హృదయములోని కలత చూచుకున్నాడు గాని తన ముఖమును చూచుకోలేడు. తరువాత బైబిలనే అద్దమందు తన హృదయమనే ముఖమును చూచుకొన్నాడు. బజారులోని అద్దముకాదు. బజారులోని అద్దములో తన ముఖమును చూచుకొనిన, అటు వెళ్ళగానే తన స్వరూపము తనకు జ్ఞప్తి ఉండదు. కాని ఈ బైబిలను అద్దమందు తన హృదయ స్వరూపము కనబడెను. ఆయన బైబిలును బట్టి తన హృదయములోని కలతను, పాపపు తలంపులను తీసివేసికొని తన హృదయమును దిద్దుకొన్నాడు.     

ఎర్ ఫర్టు అను పట్టణములో ఒక పుస్తక భాండాగారము (లైబ్రరీ) కలదు. అందు కొన్ని పుస్తకములున్నవి. ఆ పుస్తకముల చాటున మరికొన్ని పుస్తకములున్నవి. వాటి వెనుక మరికొన్ని పుస్తకములున్నవి. వాటి చాటుననున్న బైబిలును, ప్రభువు లూథర్ నకు చూపించెను. అది ఆయన చదివి బైబిలని తెలిసికొన్నాడు. ఆ రీతిగా పొందిన దానిని ఉపయోగించి, మొదట తన తప్పు దిద్దుకొన్నాడు. ఇది బహు కష్టము. ఇతరులను చూచి నీలో పాపమున్నది గనుక ప్రభువు దగ్గర ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొందుము అని చెప్పుట సుళువు. కాని తన తప్పు దిద్దుకొనుట మిక్కిలి కష్టము. తప్పు తెలిసికొనుట ఒక పని, తప్పు ఒప్పుకొనుట మరియొక పని. ఈ దిద్దుబాటు పండుగ దినమున మనము మన తప్పిదములను ఒప్పుకొనవలెను. లూథర్ తనను దిద్దుకొని, తరువాత సంఘములో దిద్దుబాటు చేసెను.

     2వ వరము:- సంఘమును దిద్దువరము. తన హృదయమును దిద్దుకొనుటకు బైబిలునెట్లు ఉపయోగించెనో, అట్లే సంఘమును మరియు లూథర్ నకు ఒకే అద్దము పనికి వచ్చినది. అదే బైబిలు. ఈ అద్దముతోనే సంఘములో నున్న తప్పులు చూచి సవరించగలిగెను.

     తన్ను తాను దిద్దుకొని, సంఘమును దిద్దినాడు గనుక లూథర్ ను ఎవరు ఏమియు అనలేదు. తాను పరిశుద్ధుడనని ఆయన చెప్పలేదు. అయినను సంఘము ఆయన సలహాలను అంగీకరించెను. ఆయన సంఘములోని ఆచారములన్నిటిని పైకెత్తి కెలికి వేసెను. అప్పుడు ఇదివరకున్న బోధకులందరు తిరుగబడిరి. పెద్ద కలహము రేగెను. అప్పుడు ఈ అద్దము (బైబిలు) ను పైకెత్తి చూపించినాడు. ఇవి నా మాటలు కావు. బైబిలులో నున్నవని చెప్పెను. దేవుని వాక్యమును ఎత్తికొని సంఘమును దిద్దినాడు గనుక ఆయనకు ‘దిద్దేవాడను ‘ గొప్ప బిరుదు వచ్చెను. సంఘములోని పొరపాటులను క్రమముగా దిద్దవలయును.  

3వ వరము:- బైబిలు హెబ్రీ, గ్రీకు భాషలలో నున్నది. దేవుడు ఈ రెండు భాషలు తెలియు వరము లూథర్ న కిచ్చెను. బైబిలును సంఘమునకు తెలియజేయుటకు, తన స్వభాషలో వ్రాయుటకు పూనుకొనెను. పండితులను పిలిచి వారిని బహు వినయముగా గౌరవించి, తాను తర్జుమా చేసిన బైబిలును వారికి చూపించి, ఎక్కడ తప్పులున్నవి? ఎక్కడ మార్చవలెను? అని వారిని అడిగి, వారి సలహాలు తీసికొంటూ, ఈ రీతిగా బైబిలును తర్జుమా చేసెను. గనుక ఆయనకు ‘భాషాంతరకారుడు ‘ అను బిరుదు వచ్చెను. మోషే ధర్మశాస్త్రములో – జం తువులకు ఏ వరము ఎక్కడ ఉన్నదీ, ఏ పదార్ధము ఎక్కడ ఉన్నదీ తెలిసికొనుటకు, లూథర్ వాటిని కోసేవారి యొద్దకు వెళ్ళి, ఆ అసహ్య స్థలమందు కూర్చుండి, వాటిని తెలిసికొని, మోషే ధర్మశాస్త్రమును తర్జుమా చేసెను. తరువాత తన స్వభాషలో బైబిలును అచ్చువేయించెను.

ఆదివారము గుడిలో ప్రసంగించేవాడు గనుక అందరు దిద్దుబాటు సంగతి తెలిసికొనెడివారు. లూథర్ బైబిలును కంఠతగా చదివి గ్రహించువాడు గనుక మనము కూడ బైబిలును పూర్తిగా చదివి గ్రహించవలెను. అక్కడక్కడ చదివినందు వలన బైబిలులోని సంగతులు పూర్తిగా తెలియవు. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంధము చివరి వరకు, క్రమముగా చదువవలెను.

 4వ వరము:- ప్రార్ధనా వరము, మనము ఎక్కువ పని ఉన్నప్పుడు తక్కువ ప్రార్ధన చేయుదుము. లూథర్ దానిని తిరుగవేసినాడు. పని ఎంత ఎక్కువగా నుంటే అంతకు రెట్టింపు ప్రార్ధన చేసెడివాడు. అతడు బైబిలును పూర్తిగా చదివి, చెట్టువలె సారమంతయు లాగుకొనెను. ప్రార్ధనలోనికి వెళ్ళి, వాక్యము వ్రాసిన వారియొద్ద ఉపదేశము పొందవచ్చునని గ్రహించెను. ప్రార్ధన వల్ల వాక్య ప్రకారాము నడువగల శక్తి కలుగునని గ్రహించెను.

దేవుడు వాక్యములో చెప్పిన దానికంటే, ఎక్కువ ఏమి చెప్పునోయని ‘వినుట ‘ కొరకు ప్రార్ధనకు వెళ్ళేవాడు. మనము ఏమి వినవలెనో! ఏమి చేయవలెనో! అను విషయములను ప్రార్ధనలో గ్రహించవలెను. బైబిలు ఒక గంట చదువుట, ప్రార్ధనలో ఒక అరగంట ఉండుట సమానమని లూథర్ చెప్పెను. ప్రార్ధన లేకుండ బైబిలు చదువరాదు, బోధింపరాదు అని చెప్పెను. దేవుని గుప్పిళ్ళలో నుండి దీవెనలు తీసికొనుటకు ప్రార్ధనయే బలమైన సాధనము. మనము మన ఆచారములన్ని దిద్దుకొని, వృద్ధి పొందు బుద్ధి, తండ్రి మనకు అనుగ్రహించును గాక! 

Please follow and like us:
దిద్దుబాటు పండుగ-1
Was this article helpful to you? Yes 4 No

How can we help?

Leave a Reply