క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. పెంతెకొస్తు పండుగ
  5. పెంతెకొస్తు పండుగ

పెంతెకొస్తు పండుగ

అపోస్తలుల కార్యములు. 2వ అధ్యాయము.

ఆత్మ స్నానము కోరే విశ్వాసులారా! మీ జీవితాకాలమంతయు ఆత్మ వలన నడిపింప బడుదురుగాక! ‘సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించును ‘ అని పాత నిబంధన గ్రంధము వలన తెలిసికొనుచున్నాము (యోవేలు 2:28). నేను నీళ్ళతో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చు ఆయన అనగా యేసుప్రభువు మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చును అని యోహాను బోధించెను (లూకా 3:16). ప్రభువు తన శిష్యులకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి బోధించెను (అ.కార్య. 1:18). ఇప్పుడు ఆయన పరలోకమునకు వెళ్ళెను గనుక నూట ఇరవై మంది విశ్వాసులు యెరూషలేములో ఒకచోట కూడుకొని, దైవాత్మ బాప్తిస్మము కొరకు కనిపెట్టుచుండిరి. అప్పుడు పరలోకమునుండి దైవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. వెంటనే వారికి ఇతర భాషలలో మాట్లాడగల జ్ఞానము కలిగెను. ఆనాటి బోధవలన మూడు వేల మంది క్రైస్తవ మత సంఘములో చేరిరి. ప్రియులారా! మీరు కూడ క్రీస్తు శిష్యులవలె దైవాత్మ ప్రవేశము కలుగునని నమ్మి, ప్రార్ధించి, కనిపెట్టిన యెడల నిశ్చయముగ కలుగును. ఈ మాట సర్వమతముల వారికి చెప్పు చున్నాము. పెంతెకొస్తు పండుగనాడు పేతురు చేసిన ఉపన్యాసములో ఈ సంగతులు గలవు.

  1. మీరు మారుమనస్సు పొందండి. (అనగా ఉన్న పాపములను గురించి దుఃఖించి, పాప విసర్జన చేయవలెను.)
  2. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.
  3. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.
  4. ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని సంబంధించియున్నది.

చదువరులారా! క్రీస్తు ప్రభువు వచ్చునని బోధించుట అనునది యూదుల మతములో గలదు. ఆయన వచ్చి సమస్తమును నెరవేర్చి పరలోకమునకు వెళ్ళి మరల త్వరలో సజీవముగా భక్తులను తీసికొని వెళ్ళుటకు రానైయున్నాడని బోధించుట, అనునది క్రైస్తవ మతములో గలదు. పెంతెకొస్తు అను పండుగ యూదులకు సంబంధించిన పండుగ. గాని ఆ దినమే క్రీస్తు ప్రభువు శిష్యులకు, క్రైస్తవమత సంఘస్థాపన దినమై యుండెను. ఇది జరిగి షుమారు రెండు వేల సంవత్సరములైనది. అప్పటి నుండి క్రమక్రమముగ క్రీస్తు బోధ సర్వత్రా వ్యాపించుచున్నది.

Please follow and like us:
పెంతెకొస్తు పండుగ
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply