క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. త్రిత్వ ఆదివారము
  5. త్రిత్వ ఆదివారము

త్రిత్వ ఆదివారము

తండ్రి: యెషయా 6:1-8; కుమార:

మత్తయి 28: 16-20; పరిశుద్ధాత్మ:ఎఫెసి. 1:3-8.

త్రైక జనక దేవుని మహోత్సవమును ఆచరించు విశ్వాసులారా! మీకు త్రిగుణాశీర్వాదము కలుగును గాక.

ఇదివరకు విన్నట్లు క్రిస్ట్మస్ రోజున తండ్రి పండుగను, మంచి శుక్రవారమున కుమారుని పండుగను, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ పండుగను అనేకులు జరుపుకొందురు. అయితే ఈ దినము ముగ్గురిని కలిపి ఆరాధించే పండుగ దినము. మనము వేరువేరుగాను, ఒక్కరిని కూడా ఆయనను ఈ దినము ఆరాధింపవచ్చును.

ముగ్గురిని కలిపి ఏకముగాను మరియు ఒక్కరిగాను ఆరాధింప వచ్చును. మనకు దేవుడు ఒక్కడుగాను, ముగ్గురుగాను బయలుపడినాడు గనుక అట్లు కూడా ఆరాధింపవచ్చును. ఆదికాండము 1వ అద్యాయములో దేవుడని ఉన్నది. అనగా ‘ఆదియందు దేవుడు భూమి, ఆకాశములను సృజించెను ‘ అని ఉన్నది. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నప్పటికిని, ఒక్కరుగానే బయలుపడ్డారు. ఆదికాండము దగ్గర బయలు దేరి, రాగా రాగా మత్తయి సువార్త దగ్గరకు వచ్చినపుడు ముగ్గురుగా బయలు పడ్డారు. ఆదికాండములో ముగ్గురు కలిసి ఒక్కరుగానే బైలుపడ్డారు. గనుక ఇప్పుడు ఒక్కరినిగా కూడా మనము ఆరాధింపవచ్చును.

సువార్తలలో ముగ్గురుగా కనపడ్డారు గనుక వేరువేరుగా కూడా ఆరాధింపవచ్చును. యేసుప్రభువు తన శిష్యులకు ఇచ్చిన కడవరి అజ్జలో ‘మీరు వెళ్ళి తండ్రి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు పనిచేయుమని” సువార్తలలో కలదు. ఆదికాండములో ఈ మూడు మాటలు మర్మముగా యున్నవి. ‘వెలుగు కలుగును గాక ‘ అనే మాట ఉన్నది. వెలుగు కలుగును గాకని తండ్రిచే పలుకబడిన ఆ పలుకునుబట్టి, కుమారుడైన క్రీస్తు లోకమునకు వెలుగుగా వచ్చెను. పరిశుద్ధాత్మ మర్మమైన దేవుడే అనగా మర్మముగా కనబడిన పరిశుద్ధాత్మ, సువార్తలలో బహిరంగముగాను, వేరువేరు వ్యక్తులుగాను కనబడినారు. ఇది మర్మము. ఈలాగున కనబడడమనే మర్మము గొప్ప మర్మము. మనము ఈ విషయము ఎక్కడ చెప్పినను ఇతరులేమి, క్రైస్తవులేమి ఒక ప్రశ్న వేస్తారు. ఈ ముగ్గురు ఏలాగు ఒక్కరుగా ఉండగలరు? ఈ ఒక్కరు ఏలాగు ముగ్గురుగా ఉండగలరు? ఈ ప్రశ్న అడుగవలసినదే గాని దీనికి జవాబు చెప్పుట చాలా కష్టము. పరమ భక్తులైన వారు సహితము నేటి వరకు ఈ మర్మమును గ్రహించలేదు.

నాలుగు వందల సంవత్సరముల క్రిందట ఒక దైవాజ్ఞుడు ఉండేవాడు. ఆయన గొప్ప వేదాంతి. యవ్వన పురుషుడు. తన దేశము నుండి, ఇతర దేశములలోని అన్ని ప్రాంతముల నుండి ఆయన యొద్దకు బైబిలు పాఠములు నేర్చుకొనేటందుకు అనేక మంది వచ్చేవారు. ఆయన పేరు ఫిలిప్పు మిలాంగ్టన్. ఆయన మార్టిన్ లూథర్ గారికి ప్రియ స్నేహితుడు. స్నేహితుడు మాత్రమే కాదు, లూథర్ గారికి అనేక విషయములలో సలహాలు ఇచ్చేవాడు. లూథర్ గారు అధికారులకు ఉత్తరాల ద్వారా జవాబులు వ్రాసే సమయంలో, వాటిని మిలాంగ్టన్ గారికి చూపి ఆయన కొన్ని సలహాలిస్తేనే గాని ఆ జవాబులు, వారికి పంపేవారు కారు. లూథర్ గారు అంత ఘాటుగా వ్రాస్తారు.

మిలాంగ్టన్ గారు 18 సంవత్సరాల వయస్సులో గ్రీకు భాషలో వ్యాకరణము వ్రాసిరి. ఇది ఆయన స్వభాష కాదు. ఆయన స్వభాష జర్మన్. ఆయనకు బైబిలులో తెలియని సంగతులు లేవు. అంత అఖండుడైనను, బైబిలులో ఆయనకు తెలియని సంగతులేమి లేకపోయినను, ముగ్గురు ఏలాగు ఒక్కరో ఒక్కరేలాగు ముగ్గురో ఆయనకు తెలియలేదు. ఆయన చనిపోతూ ఒక మాట అన్నారు. అదేమనగా- ఇపుడు నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను గనుక వారిని చూస్తాను. ఈ ఒక్కరు ఏలాగు ముగ్గురో, ముగ్గురు ఏలాగున ఒక్కరో పరమందు చూచి గ్రహిస్తానని ఫిలిప్పు మిలాంగ్టన్ అన్నారు. 400 సంవత్సరాలకు త్రిత్వ మహిమ మనకు బోధపడినది. త్రిత్వముయొక్క పేరు మామూలైనది. తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామ మంటారు గాని వివరము చెప్పుట చాలా కష్టము. నేనైతే సుళువే అంటున్నాను. ఈ ఒక్కటే కాదు ఇంకా బైబిలో చాలా మ్మర్మాలున్నవి. వాటిలో కొన్నింటిని వివరించెదను.

1. దేవుడు ఆకాశమును, భూమిని అందులో ఉన్న సమస్తమును కలుగ జేసెను. చెక్క ఉన్నందున వడ్రంగి కుర్చీ చేసెను. గోడ కట్టుటకు మనిషికి టాపీ, రాయి, అడుసు కావాలి. అయితే దేవుడు లోకమును కలుగ జేసినపుడు ఏ వస్తువునుబట్టి చేయలేదు. శూన్యములో నుండి చేసెను. ఇది మర్మమే. సూర్యుడు ఏ ఆధారము లేకుండా పైన ఉండుట మర్మమే.

మన చుట్టూ ఉన్న చెట్లను చూస్తుంటాము. మఱ్ఱి విత్తనము చాలా చిన్నది. దీనిలో నుండి మహా వృక్షము వచ్చును. దానికి కొమ్మలు, ఆకులు, కాయలు ఏలాగు వస్తాయో అదియు మర్మమే. చిన్న మఱ్ఱి గింజలో మహా వట వృక్షము, అందులోని భాగములన్నియు ఉన్నవి. ఇది గ్రహించ వీలులేని మర్మమై యున్నది. ఆ గింజలు దృష్టికి ఆపని చిన్న విత్తనములు. ఆ విత్తనములో ఈ భాగాలన్ని లేకపోతే ఏలాగు పైకి వచ్చినవి.

ఇది మర్మము. త్రిత్వమనునది పెద్ద మర్మము. దేవుడు సృష్టించిన మర్మమును చదివినారు. మనిషి సృష్టి చేసిన మర్మమును గూర్చి కూడా చదవండి. దేవుడు చేసినదంతయు ఏదియు లేకుండా శూన్యములోనుండి చేసిరి. అయన సర్వ జ్ఞాని, సర్వ శక్తిమంతుడు గనుక ఆలాగున చేయగలరు.

2. మనిషైతే దేవుడు కలుగజేసిన దానిని తీసికొని చేస్తున్నాడు. ఉదాహరణకు ఒక మ్రానును రంపంతో కోసి చెక్కలుగా చేసి, వాటితో కుర్చీలు, మంచాలు, పెట్టెలు మొదలైనవి చేస్తున్నాడు. ఇది మాత్రము మర్మము కాదా? అలాగుననే రైళ్ళు, ఓడలు, సైకిళ్ళు, కార్లు, విమానాలు చేయుచున్నారు. ఇది మాత్రము మర్మము కాదా?

మనిషికి చెట్టును పడగొట్టి, రంపముతో కోసి, బాడిశెతో చెక్కి, చిత్రిక పట్టాలని, ఈ ఉపాయములు ఏలాగు తోచినది? చెప్పినట్లు చేయుట మర్మము కాదు, కర్మము. ఇప్పటి వరకు రెండు భాగములు తెలుపబడినవి. మొదటి భాగములో దేవుడు చేసిన వస్తువులు. 2వ భాగములో మనిషి చేసిన వస్తువులు. ఇకపోతే 3వ భాగములో పక్షి. పక్షి అనగా రెండు నేత్రములు, రెండు చెవులు, రెండు రెక్కలు, అనేకమైన ఈకలతోనున్న ఒక దేహము. ఆ శరీరములో రక్తము, మాంసము, ఎముకలు, ప్రాణము ఉన్నవి. పక్షి ఒకటే అయినను దానిలో ఇవన్నియు గలవు. బయట ఒక కాకి వాలినపుడు కాకి వాలినదంటాము, గాని రెండు రెక్కలు, రెండు కళ్ళు, ఒక ముక్కు వాలినదని మన మంటామా? అనము. ఇది యొక మర్మము. వడ్ల గింజను పరిశీలించినపుడు దానిలో బియ్యపు గింజ ఉన్నది. దానికి ఒక స్థూలము (ఆకారము), రంగు, రుచి ఉన్నవి. బియ్యపు గింజ ఉన్నవి. బియ్యపు గింజను చూచి వాటిలో ఏదో ఒక భాగము అని చె ప్పము గాని అనగా మూడు భాగములను కలిపి ‘బియ్యము ‘ అంటాము.

సూర్యుడు కొన్ని చోట్ల మైళ్ళ దూరములో ఉన్నాడు. ఆ సూర్యుని యొక్క ఎండ భూమి మీదికి వచ్చుచున్నది. దానిని పరీక్షించగా అందులో వేడి, వెలుగు ఉన్నది. అది ఎండకు ఆధారము. ఈ మూడు ఉన్నను ఎండ అనే అంటాము. ఆ మూడిటిలో త్రిత్వమున్నది గాని, మూడిటిని వేరు వేరుగా చెప్పము. మైనము మధ్య వత్తి, పైన జ్వాల ఉంటుంది. దానికి కూడా వేడి, వెలుగున్నది. ఆ జ్వాల మొదట లావుగాను, చివర సన్నగాను ఉంటుంది. వెలుగుచున్న వత్తిలోని వేడి తీసివేయగా వెలుగుండదు. ఈ మూడింటిలో ఏ ఒక్కదానిని తీసినా, మిగతా రెండూ ఉండవు. వీటి గురించి మాట్లాడునప్పుడు వేడి, ఆకారము, జ్వాల అని చెప్పుచున్నామా? చెప్పము. గనుక వీటిలో దేనిని వేరు చేయవీలులేదు. అదే విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిలో పరిశుద్ధాత్మను తీసివేస్తే మొదటి ఇద్దరుండరు. తీయుటకు వీలుండదు. మాటలలో మనము మాట్లాడ వచ్చును గాని వేరుచేయలేము. త్రిత్వము దేవుడే గాని ముగ్గురు దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే. ఒక్కడే ఆ దేవుడు. దేవుడు ప్రభువై యున్నాడు. తండ్రి కూడా ప్రభువై యున్నాడు కుమారుడు కూడా ప్రభువే. ఆత్మయు ప్రభువే. ముగ్గురు ఒక్కటే. కుమారుడు సర్వశక్తిమంతుడు. తండ్రి, ఆత్మ సర్వశక్తి మంతులే. ముగ్గురు ఒక్కటే. త్రిత్వము పరిశుద్దులే. ముగ్గురు లేరు, ఒక్కరే. నేను మీకు దేవునియొక్క లక్షణములను గూర్చి చెప్పియున్నాను. అవేమనగా అనాది, అనంత ప్రేమ, జ్ఞానము అను లక్షణాలు. ఆ లక్షణములన్నియు త్రిత్వ సందర్భములో చెప్పుకోవచ్చును. ముగ్గురు ఒక్కటే కానీ వారు స్వతంత్రులుగా (వేరువేరుగా) లేరు. ఎవరు దేవుని లక్షణాలు వాడుకుంటారో వారు ధన్యులు.

మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ, ఉన్నవి. ఈ మూడు కలిస్తేనే మనిషి. ఇది 1థెస్సలోనీకయులకు వ్రాసిన పత్రికలో యున్నది (1థెస్స 5;23). ఈ మూడింటిలో ఏదైన ఒక్కటి తీస్తే మిగిలినవి ఉండవు. గనుక త్రిత్వమును బోధపరచు కొనుటకు మనిషే మంచి ఉదాహరణ. మనిషి వచ్చాడు అంటాము గాని శరీరము వచ్చింది అని అనము. ఈ ఒక్క సంగతి మీరు తెలిసికొని ఇతరులకు బోధిస్తే వారికి త్రిత్వ మర్మము అర్ధమగును. గనుక మీలో ప్రతి ఒక్కరిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నివసించాలి ఈ త్రిత్వమును మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఈ త్రిత్వము మీలోనే యుండును గాక. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అంటాము గాని నామముల అని అనము. ఈ త్రిత్వము, ఈ భాగ్యము, ఈ స్థితి, ఈ బోధ మీకు బోధపడును గాక. ఆమేన్.

Please follow and like us:
త్రిత్వ ఆదివారము
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply