క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిస్ట్మసు దీవెనలు

క్రిస్ట్మసు దీవెనలు

దేవుడు మనకు తోడై యున్నాడు (మత్తయి 1;23).

క్రైస్తవేతరులకు కూడ క్రిష్ట్మస్ దీవెనలు కలుగును గాక.

1. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” (యోహాను 3:16) అను వాక్యమునుబట్టి మీకు ఈ క్రిష్ట్మస్ కాలమందు అనగా దైవావతార కాలమునందు దేవుని ప్రేమ మీకు అద్భుతకరమైన దీవెనగా ప్రత్యక్షమగును గాక.

2. “క్రీస్తుప్రభువు జన్మించిన దినమున కాపరులచుట్టు ప్రభువు మహిమ ప్రకాశించెను” అని వ్రాయబడి యున్నది. క్రీస్తు ప్రభువు యొక్క మహిమ కాంతి మీ చుట్టూ నిత్యము ప్రకాశించును గాక.

3. “ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను” అని దేవదూత కాపరులతో చెప్పినట్లు వ్రాయబడి యున్నది. క్రీస్తు జన్మించుట వలన సంతోషము మీకును కలుగును గాక.

4. “నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు” అని దేవదూత కాపరులకు చెప్పెనని వ్రాయబడియున్నది”. “మీకొరకు” అను మాటలోని దీవెన చదువుచున్న మీకును, వినువారికిని కలుగును గాక.

5. “రక్షకుడు పుట్టియున్నాడు” అని దూత వర్తమానములో కనబడుచున్నది. రక్షకుడు అనగా “తన ప్రజలను వారి పాపములనుండి రక్షించువాడు” ఇది మత్తయి 1:21లో వ్రాయబడియున్నది. పాపములను పరిహరించి రక్షించువాడే రక్షకుడు గదా. క్రిష్ట్మసు కాలమందు మనకు వినబడుచున్న క్రీస్తుప్రభువు వలన కలుగవలసిన రక్షణ మహా భాగ్యము మీకు అందును గాక.

6.”ఈయన ప్రభువైన క్రీస్తు” అని దేవదూత వర్తమానములో అగుపడుచున్నది. క్రిష్ట్మసు కాలమందు జ్ఞప్తికి వచ్చుచున్న క్రీస్తు వారిని మీరు కూడ ప్రభువుగా అర్ధము చేసికొందురుగాక.

7. మోక్షలోకమునుండి దేవదూతల సైన్యము వచ్చి కాపరులు వినునట్లుగా దేవుని స్తుతించిరి. ఈ క్రిష్ట్మసు వార్త ఈ సంవత్సరము కూడ వినబడుచున్న మీకును దేవుని స్తుతింపగల మనస్సు కలుగును గాక.

8. “భూమి మీద సమాధానము కలుగును గాక” అని దేవదూతలు పలిక్రి. వారు కోరిన సమాధానము మీకును కలుగును గాక.

9. దేవునికిష్టులైన మనుష్యులకు సమాధానమని దేవదూతలు పలికిరి. మీరును దేవునికి ఇష్టులుగా నుందురు గాక.

10. “జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని” దేవదూత తెచ్చిన కబురువిన్న కాపరులు తమలో తాము సంభాషించుకొనిరి. ఈ పత్రిక చదివిన తర్వాత ఈ సంవత్సరమున క్రిష్ట్మసు పండుగ శుభవార్త వినుచున్న మీరును క్రీస్తు జన్మచరిత్రను గురించి సంతోషముతో సంభాషించుకొనగల ఉద్రేకము మీకు కలుగును గాక. అనగా దేవుడే మనిషైనాడట ఆయన మరియాంబకు కన్యక గర్భమందు పుట్టినాడట. ఆయన మన ఉపయోగము నిమిత్తమై వెలసినాడట. ఆయన రోమా వారి ప్రభుత్వ కాలములో జన్మించినాడట. ఆయన పుట్టినప్పుడు రోమా చక్రవర్తి ప్రజాసంఖ్య వ్రాయించుచుండెనట. ఆ మొదటి శతాబ్ధమునాటి సర్వలోకమును పాటించుచు ప్రజాసంఖ్య వ్రాయించిన ఔగుస్తు నామధేయముగల రోమా చక్రవర్తికి గాని, పాలస్తీనా దేశాధికారులకుగాని, క్రీస్తు బేత్లెహేములో పుట్టునని వ్రాయబడిన బైబిలు వచనము చేతబట్టిన వేదాంత పండితులకు గాని, పేర్లు వ్రాయించుకొనుటకు వచ్చిన ప్రజలకు గాని దేవుడీ వార్త పంపక, సామాన్య ప్రజలైన కాపరులకు పంపినాడట. ఇదేమి చిత్రము! ఆయన నరావతారమెత్తిన సువార్త తెచ్చిన వారు మనుష్యులుకాదు, దేవదూతట. క్రీస్తుప్రభువు యొక్క నరావతారము సర్వలోకమునకు ఉద్ధేశింపబడినదట. ఆయన అవతార చరిత్ర ఎరిగినవారై మొట్టమొదట దేవదూతలే స్తుతించిరట. కాపరులు శిశుదర్శనము చేసి, తమ ఇండ్లకు వెళ్ళినప్పుడు కనబడినవారికి శిశువు సంగతి చెప్పగా వారు ఆశ్చర్యపడిరట. మరియాంబ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసికొనెనట, జన్మ వృత్తాంతము విన్న కాపరులు. దూతలు స్తుతి విన్న వీరు, దేవదూతలను కన్నులారా చూచిన వీరు, యేసుప్రభువును దర్శించిన వీరు ఆ సంగతి ఇతరులకు చెప్పిన వీరు ఎంత ధన్యులు! ఎంత ధన్యులు! ఎంత ధన్యులు! అని ఈ ప్రకారముగా క్రీస్తు జన్మ చరిత్ర ధ్యానించునట్టి క్రైస్తవేతరులైన మీకును, క్రిష్ట్మసు పండుగ ఆచరించు ధన్యత లభించునుగాక.

కీర్తన:- రారెమన యేసుస్వామిని – జూతము కోర్కెలూర ప్రియులారా పేర్మిని

1) పతిత పావనమౌ వేల్పట – అనాది దేవ – సుతుడైయిల జేరినాడట;

2) తుదలేని మహిమ వాడట – తనుగొల్చు సాధు-హృదయుల సొమ్ముమూటట. క్రైస్తవులకు మరల క్రిష్ట్మసు దీవెనలు కలుగును గాక.

1. ఏటేట చేయుచున్న పండుగే గదా అని నిర్లక్ష్యము చేయక నామకానందమును తొలగించుచు కాపరులు, మార్గస్థులు తూర్పు జ్ఞానులు సంతోషించినంతగా కృతజ్ఞతగల ఆత్మతో సంతోషించునట్టి దీవెన మీకును కలుగును గాక.

2. క్రిష్ట్మసు కాలములోనే గాక జీవితకాల మంతయు దేవుడుగా నా నిమిత్తమై నరుడుగా జన్మించెను అను సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు స్తుతించునట్టి దైవభక్తి మీకు కలుగుచుండును గాక.

3. మీరనుభవించునట్టి ఈ సంతోషములో పరులుకూడ పాల్గొనునట్లు ప్రయాసపడగల శ్రద్ధ మీకు కలుగును గాక.

Please follow and like us:
క్రిస్ట్మసు దీవెనలు
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply