క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మస్

క్రిష్ట్మస్

1) ప్రేమా స్వరూపియైన దేవుడు తన స్వరూపమున నరుని కలుగజేసెను. ఆ నరుడు దేవుని యొద్దనే ఉండెనుగాని అతడు పాపము చేయుట వలన దేవునిలో నుండి దూరమై పోయెను. అయినను నరుని తనలోనికి చేర్చుకొనవలెనను ప్రయత్నములు దేవుడు మానలేదు. పాపములనుండి రక్షించి చేరదీయు గొప్ప పనిచేయుటయే కాక, రక్షకుని పంపెనను వాగ్ధానముకూడ ఆయన నరుని మనసులో పడవేసెను. అందుచేత ఆయన ఎప్పుడు వచ్చునో అని నరుడు ఎప్పుడును కనిపెట్టుచునే యుండెను. ఆ కనిపెట్టు నైజము క్షీణింపకుండునట్లు దేవుడా వాగ్దత్తమును పలుమార్లు వినిపించుచుండెను.

2) మానవునిలో ఎంత మంచితనము ఉన్నను అతడు మానవులను రక్షింప సమర్ధుడు కాడు గనుక దేవుడే మానవుడుగా జన్మించెను. దేవుడు దేవుడుగ వచ్చిన యెడల మానవుడు సహింపజాలడు. మరియు ఆయన జన్మము నరుల జన్మమువంటిది కాకూడదు, కాజాలదు. ఆయన ఒక కన్యక గర్భమున అద్భుత రీతిగా జననమాయెను.

3) దేవుడు నరావతారిగ జన్మమైన సంగతి నరులకానందము గనుక ఆ వార్త నరులకు తెల్పుటకై ఒక దేవదూత వచ్చెను. నిరీక్షణ విషయములో లోకమునకు ప్రతినిధులుగ నుండదగిన కాపరులకు ఆయన కనబడి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పెను. నరులకోసమై రక్షకుడు వచ్చుట దేవదూతలకును ఆనందము గనుక వారుకూడా దేవుని స్తుతించిరి. ఇది దేవునికి మహిమ అనియు, నరులకు శాంతి అనియు ఆ స్తుతిలో వినిపించిరి. కాపరులు ఆ బాలక్రీస్తును దర్శించి కనబడిన వారందరికి సంగతి చెప్పిరి. ఇది పాలస్తీనాలోని బేత్లెహేము అను ఊరిలో జరిగిన వృత్తాంతము. ఇది జరిగి రెండు వేల సంవత్సరములైనది. క్రొత్తరీతిగా పొడిచిన ప్రత్యేక నక్షత్రమును చూచి ఆ జన్మవార్త గ్రహించినవారై తూర్పు దేశమునుండి కొందరు జ్ఞానులు వెళ్ళి యేసుక్రీస్తు అను ఆ లోకరక్షకుని దర్శించిరి. ఈ విధముగా దేవుని చూడవలెను. ఆయనలో ఉండవలెను. అను నరవాంఛకు సిద్ధి లభించెను. ఆ జ్ఞానులలో నొకరు మన హిందూ దేశము నుండి వెళ్ళిన ఒక ఋషియనియు ఆయన శిష్యులింకను ఉన్నారనియు క్రైస్తవోత్తముడగు సాధు సుందరసింగు గారు వ్రాసి యున్నారు. ఇది మనకు క్రొత్త.

ఇట్లు వారు, వీరు వెళ్ళి దైవావతారుని ఆరాధించిన కార్యమునకు క్రిష్ట్మస్ అని పేరు, దేవదూత యేసుజన్మ వర్తమానమును కాపరులకు చెప్పుచు ఇది ప్రజలందరికి కలుగబోవు సువర్తమానము అని ప్రవచించెను. నేడు ఈ వార్త సర్వజనాంగమునకు తెలిసినది. అన్ని దేశములలో ఈ పండుగ చేయుచున్నారు.

సర్వలోక ప్రజాసంఖ్య వ్రాయునప్పుడు నడచిన ఈ చరిత్ర సర్వలోక రక్షణ నిమిత్తము గనుక సర్వలోక చరిత్రలో ముఖ్య చరిత్రలకు మించిన ముఖ్య చరిత్రయై యున్నది.

ఈ జన్మకథ నమ్మువారికి ఆయనను గూర్చిన అనుభవము ప్రత్యక్ష మగును.

ప్రార్ధన:- దేవా! నీవు మా నిమిత్తమై నరుడవైనావు. వందనములు. నిన్ను ఆరాధించు స్వభావము మాకు దయచేయుము. ఆమెన్.

Please follow and like us:
క్రిష్ట్మస్
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply