క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మస్ ప్రశ్నావళి (4వ సంభాషణ)

క్రిష్ట్మస్ ప్రశ్నావళి (4వ సంభాషణ)

ప్రశ్న: “మెస్సీయ” అను పేరునకర్ధమేమి?

జవాబు: మెస్సీయ అనగా అభిషిక్తుడు. అనగా ఏర్పరచబడినవాడు. అనగా నరులను రక్షించుటకు ప్రత్యేకముగా నియమింపబడినవాడు. అభిషేకము పొందినవాడు.

ప్ర: క్రీస్తు అనుమాటకు అర్ధమేమి?

జ: అభిషిక్తుడు, రక్షించుటకు ఏర్పర్చబడినవాడు అని అర్ధము. ఈ పేరు మెస్సీయ అను పేరుతో సమానమైన పేరు. క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని మేమెరుగుదుము అని సమరయ స్త్రీ చెప్పెనుగదా.

ప్ర: యేసు అను పేరునకు అర్ధమేమి? జ: రక్షించుటకు అభిషేకము పొందినవాడు లేక అభిషేకింపబడినవాడు. ప్ర: క్రీస్తుయేసు అనగా ఏమి?

జ: అభిషిక్తుడైన రక్షకుడు, లోకైక రక్షకుడు.

ప్ర: ఇమ్మానుయెలు అను పేరునకు అర్ధమేమి?

జ: దేవుడు మనకు తోడై యున్నాడని అర్ధము. అనగా దేవుడు మనతో కూడానే ఉన్నాడని అర్ధము.

ప్ర: దేవునికి ఇంకనుగల బిరుదులేవి?

జ: దేవునియొక్క ఆయాపనులనుబట్టి, ఆయా పేరులు, బిరుదులు కలిగినవి. క్రీస్తు, మెస్సీయ, యేసు, యేసుక్రీస్తు ప్రభువు, వాక్యము 1) క్రీస్తుయేసు, రెండవ ఆదాము, వెలుగు, దేవునిగొఱ్ఱెపిల్ల, రాజు, ప్రవక్త, యాజకుడు, యెహోవా దూత, యెహోవా, ఆల్ఫయు, ఓమెగయు, అధిపతి, అందరికి ప్రభువు, ఆత్మలకు కాపరి. అధ్యక్షుడు, ఆశ్చర్యకరుడు, కాపరుల ప్రధాని, జీవపు వాక్యము, జీవాధిపతి, దావీదు వేరు, చిగురు, నజరేయుడు, నమ్మకమైన సాక్షి, నీతిమంతుడు, నీతిసూర్యుడు, ఉండువాడు, పరిశుద్ధుడు, మర్మములు తెలుపు ప్రవక్త, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, నిబంధన దూత, భూరాజులకు అధిపతి, గొఱ్ఱెలకు మంచి కాపరి, మధ్యవర్తి, మహిమగల ప్రభువు, మార్గము, మూలరాయి, యూదా గోత్రపు సిం హము, బోధకుడు, అద్వితీయుడు, అభిషిక్తుడు మొదలగునవి. ఈ బిరుదులనుబట్టి దేవుడు మనకు స్నేహితుడు, మనుష్య కుమారుడు, మన సోదరుడని సంతోషింతుము.

ప్ర: అబ్రహాము, దావీదు, మరియమ్మ, యోసేపు కుమారుడని యేసుప్రభువును గూర్చి చెప్పుటలో అర్ధమేమి?

జ: యూదుల జనాంగమునకు సంబంధించిన మనుష్యుడని అర్ధము. ఆయన ఇతర మతములలో గాని, ఇతర జనాంగములలో గాని, ఇతర దేడ్సములలో గాని, ఇతర భాషలు గలవారిలో గాని పుట్టలేదు. యూదులలో మాత్రమే పుట్టినాడని అర్ధము.

ప్ర: మనుష్య కుమారుడనగా అర్ధమేమి?

జ: ఆయన ఎంత యూదులలో జన్మించియున్న మనుష్యుడైనను అందరికొరకు జన్మించినాడని అర్ధము. అందుచేతనే క్రీస్తు మతము అందరి మతమై యున్నది. గనుక అది మనదేశ మతము కూడ అయియున్నది.

ప్ర: దేవుని గొర్రెపిల్లలనగా అర్ధమేమి?

జ: దేవుని గొర్రెపిల్ల ఎవరికి హానిచేయదు. అలాగుననే క్రీస్తు ఎవరికిని హానిచేయనివాడు, కాబట్టి ఆయన గ్రంధముగాని, మతముగాని ఎవరికిని ఏ హాని చేయనివైయున్నవి. బొచ్చుకత్తిరించు వానియెదుట గొర్రె మౌనముగా నుండునట్లే క్రీస్తు ఉండునని వ్రాయబడియున్నది. మరియు అమాయకపు గొర్రె ఏమి చేసినను మౌనముగానుండును. అలాగే క్రీస్తుమీద ఏమి పడినను ఊరకుండెను. లోకపాపములన్నియు తన వీపుపై పడినను ఊరకుండెను. ఓర్చినాడు, మోసినాడు.

ప్ర: వాక్యమనగా అర్ధమేమి?

జ: వాక్యమనగా మాట. క్రీస్తు యావత్తును అనగా ఆయన జీవితకాల చరిత్ర అంతయు ఒక్కమాట. అది ఏమనగా ఈయన నీ రక్షకుడు అనుమాట, అను వాక్యము ఆది దేవుడు పలికినమాట. క్రీస్తు దేవుని మాటయైయున్నాడు.. మనము మాట్లాడుమాట మనమాట, అట్లే క్రీస్తు దేవుని మాట, దేవుని వాక్యము.

ప్ర: తండ్రి అనగా అర్ధమేమి?

జ: ఆయన సమస్తము కలుగజేసియున్నాడనియు, ఆయన లేకుండ ఏమియు కలుగలేదనియు గలదు. గనుక ఆయన అంతటికిని, అందరికిని తండ్రి, మనకు తండ్రి.

ప్ర: భూపతులకు అధిపతి అనగానేమి?

జ: నేను వచ్చువరకు భూమిమీద రాజులైయుండుడి అని క్రీస్తుప్రభువు రాజుల మనస్సులతో చెప్పి, ఆయన పరలోకమునకు వెళ్ళినాడు. ఆయన మిక్కిలి త్వరలో వచ్చి సంఘమును తీసికొని వెళ్ళిన తర్వాత భూమి మీదికి పరలోక వాస్తవ్వులతో వచ్చి, భూరాజులయొక్క కిరీటములు తీసికొని తానే రాజుగానుండి వెయ్యి సంవత్సరములు పరిపాలించునని అర్ధము.

ప్ర: పరిచారకుడనగా అర్ధమేమి?

జ: తల్లి బిడ్డలకంటే ఎక్కువైనది. అయినప్పటికిని స్నానము చేయించి, వస్త్రములు ధరింపజేసి, అన్నము తినిపించి, నిద్రపుచ్చి ఈ విధముగా పరిచర్యచేయును. అలాగుననే క్రీస్తు తన భక్తులకు కూడ భూలోకమందలి తల్లిదండ్రులవలె పరిచర్య చేయువాడై యున్నాడు.

ప్ర: ఇంతేనా క్రీస్తు ప్రభుని బిరుదులు?

జ: ఇంకా చాల ఉన్నవి గాని, చాల ఉన్నట్లు చాల సమయము లేదు. మీకు దీవెన కలుగును గాక.

క్రిష్ట్మస్ ప్రశ్నావళి (4వ సంభాషణ)
Was this article helpful to you? Yes No

How can we help?