క్రైస్తవ పండుగలు

 1. Home
 2. Docs
 3. క్రైస్తవ పండుగలు
 4. క్రిస్మసు పండుగ
 5. క్రిష్ట్మస్ పండుగ ప్రసంగము

క్రిష్ట్మస్ పండుగ ప్రసంగము

తండ్రి: యెషయా 7:14;కుమార:లూకా2:1-14; పరిశుద్ధాత్మ:ఫిలిప్పీ2:5

ప్రార్ధన: తండ్రీ! నమస్కారము. నీ యెదుట నున్న మాకు నేడు ప్రత్యేక వర్తమానము అందించుమని యేసుప్రభువు నామములో వినయముతో వేడుకొను చున్నాము. ఆమెన్.

ఈ దినమున మూడు క్రిష్ట్మస్ లను గూర్చి చెప్పుదును. మూడు క్రిష్ట్మస్ లలో

మొదటిది: పాత నిబంధనకాల భక్తులు యేసుప్రభువు పుట్టకముందు చేసిన క్రిష్ట్మస్ పండుగ.
రెండవది: గొల్లలు, జ్ఞానులు మొదలైనవారు చేసిన క్రిష్ట్మస్ పండుగ.
మూడవది: అప్పటినుండి నేటివరకు ప్రతి సంవత్సరము చేస్తున్న క్రిష్ట్మస్ పండుగ. పండుగలు మూడు గాని క్రిష్ట్మస్ ఒక్కటే. మొదటిది, పాత నిబంధనకాల భక్తులకు, తండ్రియైన దేవుడు చెప్పిన క్రిష్ట్మస్. రెండవది, కుమారుడైన యేసుప్రభువు ఈ భూమి మీద అవతారమెత్తిన క్రిష్ట్మస్ పండుగ. మూడవ పండుగ పాత నిబంధన కాలములోను, క్రొత్త నిబంధన కాలములోను, ఉదహరింపబడిన క్రిష్ట్మస్ పండుగ. అనగా పై విషయములు పరిశుద్ధాత్మ తండ్రి నేటి సంఘమునకు చెప్పించి చేయించుచున్న క్రిష్ట్మస్ పండుగ.
1. పాత నిబంధనలో ఉన్నది తండ్రి పండుగ 2. క్రొత్త నిబంధనలో ఉన్నది కుమారుని పండుగ 3. మనకాలములో ఉన్నది పరిశుద్ధాత్మ తండ్రి పండుగ. పండుగలు మూడు కాలములలోని పండుగలు. కాని పండుగ ఒక్కటే. ఈ పండుగలలో ఈ దిగువ వాక్యములలో ఏదోఒకటి ఎత్తికొని ప్రసంగింతురు. ఆదికాండము 3:15; ఆది12 అధ్యాయము; దా||కీర్తనలు 72వ అధ్యాయము; యెషయా 7:14; యెషయా 9:6; మీకా 5:2; లూకా 2వ అధ్యాయము; యోహాను 1వ అధ్యాయము; గలతీ 4వ అధ్యాయము. ఈ వాక్యములలో ఏదో ఒకటి ఎత్తికొని ప్రసంగము చేయుదురు.
ఈ దినపు పాఠము మీకు తెలిసిన వాక్యమే గనుక క్రొత్తది కాదు, ఇదివరకు విన్నదే అని అనుకుంటారు. ఆలాగు అనుకొనవచ్చును అయినను అది తీసికొనక తప్పదు. ఆ వాక్యము లూకా 2:15. ఈ లూకా 2వ అధ్యాయముపై వాక్యము లన్నిటికి మూల, మధ్య భాగము. లూకా 2వ అధ్యాయమే లేకపోతే తక్కినవన్ని వట్టివే. దీనిలో సంపూర్ణ నెరవేర్పున్నది. ఈ రెండవ అధ్యాయం, మహా ముఖ్యమైన అధ్యాయము. ఎంత ముఖ్యమంటే, దానిలో ఎన్నిమాటలున్నవో అన్నిమాటలు మనము తీసికొని పరీక్షిస్తే, దేనిలో ఉన్న కాంతి దానిలో ఉండును. అన్ని మాటలకు అన్ని రకములైన కాంతులు ఉన్నవి. ఈ లూకా 2వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనము వరకు ఉన్నమాటలన్నీ, ఆకాశమందున్న నక్షత్రాలవంటివి. వాటిని బోధకుడు వివరింపగలిగితే, సభ్యులు వినగలిగితే, విని సంతోషించ గలిగితే, రోగులు మంచముమీద ఆనందించగలిగితే, సంపూర్ణ వెలిగింపు, స్వస్థత పొందగలరు. శ్రమల పాలైన వారు దేవుని స్తుతింపగలిగితే సంపూర్ణ వెలిగింపు పొందగలరు. ఇదిగో లూకా రెండవ అధ్యాయములో ఇన్ని నక్షత్రాలున్నవి. వీటిని 6 భాగములుగా చేసికొందాము.
లూకా 2వ అధ్యాయములో ఉన్న విషయముల భాగములు
1వ భాగము: చరిత్ర: అనగా ఔగుస్తు చక్రవర్తి ఆజ్ఞ ఇవ్వడము, మరియ బేత్లెహేము రావడము, కుమారుని కనడము.
2వ భాగము: దేవదూతగారు చేసిన ప్రసంగ భాగము: అదేమనగా “నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు” ఈ భాగము అయిపోయింది.
3వ భాగము: పరలోకమునుండి దూతల సైన్యమువచ్చి, రక్షకుని స్తుతించిన భాగము. మొదట ఒక్క దూతగారే, ఆ తరువాత సైన్యసమూహము వచ్చి స్తుతించిరి. మొదట దేవదూతగారు ప్రసంగించిరి, పిమ్మట సైన్యసమూహము స్తుతించిరి.
4వ భాగము: గొల్లల సంభాషణ.
5వ భాగము: గొల్లల దర్శన భాగము. అనగా తొట్టిలోని శిశువును దర్శించిన భాగము.
6వ భాగము: గొల్లలు శిశువైన ప్రభువును గూర్చి సువార్త ప్రకటించిన భాగము
ఆరు భాగములు గల ఈ లూకా రెండవ అధ్యాయము మొదటి ఇరవై వచనములను గమనించవలెను. పోయిన సంవత్సరము ఈపండుగను చేసిన మనమును, రెండువేల సంవత్సరముల నుండి చేస్తున్న క్రైస్తవ సంఘమును, మామూలుగా చేసిన పండుగే. క్రైస్తవులు మామూలుగానే వింటూ ఉన్నారు. అయితే ఈ లూకా సువార్తలోని ఈ 2వ అధ్యాయం 1నుండి 20 వచనములు తీసికొని, భాగాలుగా వ్రాస్తే ఈ ఇరువై వచనములే ఒక లూకా సువార్త అంత పుస్తకమవుతుంది. దీనిలో ఆరు భాగములున్నవి.
1) చరిత్ర భాగము
2) దేవదూత ప్రసంగము
3) దేవదూతల సమూహ స్తోత్రము
4) గొల్లల సంభాషణ
5) తొట్టిలోని ప్రభుని దర్శించిన భాగము
6) సువార్త ప్రకటన భాగము.
ఇవన్నీ ఎందుకు చెప్పినాననగా డిసెంబరు 31వ తేదీ రాత్రివరకు ధ్యానించుటకు.
నేటి ప్రసంగ వాక్యము లూకా 2:15. ఈ వచనములోని భాగములు:
1) జరిగిన ఈ కార్యమును, 2) ప్రభువు మనకు తెలియచేయించి యున్నాడు (జన్మము) 3) మనము బేత్లెహేము వరకు 4) వెళ్ళవలెను (ఈ కథ కండ్లతో చూడవలెనని) 5) ఈ కథ ఒకరితో ఒకరు చెప్పుకొనవలెను. 6) చెప్పుకొనుచూ చూచుటకు రావలెను.
ఈయన జన్మలో కల్పనలేదు గాని నవీన విమర్శకులు ఇది కల్పన అంటున్నారు. గొల్లలువెళ్ళి చూడకముందే, జరిగింది చూడకముందే, జరిగింది అన్నారు. ఏమి జరిగింది? తొట్టిలో బాలుడు ఉండుట, పొత్తిబట్టలతో చుట్టబడుట జరిగింది. గనుక గొల్లలు విన్నవెంటనే జరిగిందని నమ్మినట్లు, మనమును జన్మ చూడలేదు గాని బైబిలులో ఉన్నది గనుక జరిగినట్లు నమ్మితే గొల్లల జట్టుకు వెళ్ళుదుము. విమర్శకులు జరుగలేదంటుంటే గొల్లలు, దూతలు చెప్పినది నమ్మక విమర్శకుల మాటెందుకు నమ్మాలి? గొల్లలు విన్నది, దేవదూతలు చెప్పినది, లూకా వ్రాసినది నమ్మకపోతే, విమర్శకులన్నది ఎందుకు నమ్మాలి. వారు జరుగలేదంటున్నారు. వారు చెప్పినదా నమ్మేది? దూతలు చెప్పిందా నమ్మేది? గొల్లలు చూచిందా నమ్మేది? లూకా వ్రాసిందా నమ్మేది? ఏది నమ్మవలెను. విమర్శకులు మా మాట నమ్మవలెనంటున్నారు. వారిమాట నమ్మవలెనంటే, దూత చెప్పినది, గొల్లలు చూచినది, లూకా వ్రాసినది ఎందుకు నమ్మకూడదు?

 1. జన్మము వట్టిది వట్టిది అంటున్నారు
 2. బైబిలు వట్టిది వట్టిది అంటున్నారు
 3. మతము వట్టిది వట్టిది అంటున్నారు

వట్టిదనేమాటా నమ్మేది? గట్టిదనే మాటా నమ్మవల్సినది? రెండు వేల సం||ల నుండి ఉన్నది నమ్మక నేటి విమర్శకుల మాట ఎట్లు నమ్మాలి?

 1. క్రిష్ట్మస్ సంతోషము మనము అనుభవించినాము గనుక గొల్లలు చెప్పిన ఈ మాట నమ్మకుండుట ఎట్లు? గనుక క్రీస్తు చరిత్ర కల్పనకాదు. క్రీస్తు చరిత్ర జరిగినదనే మాటకు ఋజువు ఈ సంఘమే. అదే గొప్ప అద్భుతము. వార్త చెప్పిన దేవదూత, దూతలు , గొల్లలు, మరియమ్మ యోసేపు గార్లు వార్త విన్నారు., బాలుని అందుకొని, చూచి, ఆరాధించి, వెళ్ళిపోయారు. చరిత్ర రాసిన లూకా వెళ్ళిపోయెను గాని, ఆయన ఏర్పాటుచేసిన సంఘము, సంఘముచేయు పండుగ ఉన్నది. సంఘము ఉండుట కల్పనకాదు. ఆయన పుట్టుట కల్పనకాదు. గనుక ప్రపంచములోని సంఘమును చూచి సంతోషింపవలెను.
 2. ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు:ప్రభువు తెలియపరచిరని ఉన్నదిగాని, దేవదూత తెలియపరచెనని గొల్లలు అనలేదు. అట్లే ప్రభువును ఈ గ్రంధము ద్వారా తన గురించి మనౌ తెలియజేయించి యున్నారు. ఇదే వార్త దూతద్వారా తెలియజేయిచియున్నారు. గొల్లలకు పరలోక దేవదూతద్వారా తెలియజేయించిన సంగతి బైబిలుద్వారా మనకు తెలియచేయుచున్నాడు. బైబిలు, దేవదూత ఒక్కమాటే. “మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడు” ప్రజల కందరికి మహా సంతోషము అనేమాట మనకాలములోనే నెరవేరినది. ఎందుకంటె మన కాలములోనే ఈ పండుగ అన్ని భాషలలో, అన్ని దేశములలో చేయుచున్నారు. ఈ దినము కాలు మోపేంత సందు లేకుండా బేత్లెహేములో పండుగచేయు జనులున్నారు. బేత్లెహేము పల్లెకాదు.ఇప్పుడు పట్టణము. ఇక్కడ లూథరన్ దేవాలయము ఒకటి పెద్దది ఉన్నది. యెరూషలేము నుండి బేత్లెహేమునకు, పూర్వ కాలము లేని రోడ్లు నేడు ఉన్నవి. బేత్లెహేము తొట్టెచుట్టు, తెల్లనిబట్టలు ధరించి ఉందురు. అప్పుడు గొల్లలు గాని, ఇప్పుడు భక్తులు వెళ్ళుచున్నారు.

అప్పటి గొల్లలకు కేవలము జన్మవార్తే గాని, ఇప్పటి భక్తులకు 33 1|2 సంవత్సరముల చరిత్ర, సిలువ కథ, పునరుత్థాన కథ, ఆరోహణ కథ మొదలైనవన్నీ ఉన్నవి. వారికి ఇవన్నీ లేవు, గనుక ఇవన్నీ నమ్మి అంగీకరించు మనమే ధన్యులము. అయితే బెత్లెహేము పట్టణము అప్పటి పట్టణము వంటిదికాదు. చాల పెద్దదైనది. అయితే 1) గొల్లలు 2)జ్ఞానులు 3) సుమెయోను 4) అన్న, వీరు కొత్తనిబంధన భక్తులు. ఇప్పుడు జనసంఖ్య, పండుగలు ఎక్కువైనవి. అందుకనే దేవదూతగారు సంతోషకరమైనది అని అనక, మహాసంతోషకరమైనది అని అన్నారు.

 1. మహా గొప్ప ప్రసంగము
 2. మహా గొప్ప సంఘము
 3. మహా గొప్ప సంతోషము

జరుగుచున్న పండుగలన్నిటిలో, అన్నిటికి, అందరికి మహా సంతోషకరమే. బైబిలు చదివి,పండుగలోపాల్గొని, ఎవరిలోసంతోషమున్నదో, వారికే ఈ మహా సంతోష ధన్యత.

మీలో రోగులు, పాపులు, బీదలు, చిక్కులు గలవారికి, సంతోషముండునుగాక అని చెప్పునుగాని, మహా సంతోషముండును గాకని చెప్పుచున్నాను. మీకందరికి మహా సంతోషము కలుగునుగాక! అనే క్రిష్ట్మస్ సంతోషము అందుకొనుడని అందించుచున్నాను. విచారము వచ్చినయెడల ఒత్తిగించుకొనండి. ఈ క్రిష్ట్మస్ పండుగ మిమ్మును మహాసంతోషముతో నింపునుగాక!

Please follow and like us:
క్రిష్ట్మస్ పండుగ ప్రసంగము
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply