క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మస్ పండుగ ప్రసంగము

క్రిష్ట్మస్ పండుగ ప్రసంగము

“దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు” (హెబ్రీ 1:6)

ప్రార్ధన:- క్రిష్ట్మస్ మరల వచ్చెనను తలంపు మాలో నుంచుటకు క్రిష్ట్మస్ ను గ్రంధములోనే దాచిపెట్టిన తండ్రీ! భూలోకమునకు నీ కుమారుని బహుమానముగా అనుగ్రహించిన నీ అంతరంగ ప్రేమ నిమిత్తమై వందనములు. నీ కుమారునిచ్చుట వలన నీవు తండ్రివి, సృష్టికర్తవు. బహుమానములిచ్చు దానకర్తవని గ్రహించినాము. గనుక నీకు వందనములు. కుమారుడవైన తండ్రీ! తండ్రి ఏ విధముగా బహుమాన మిచ్చుటకు సందేహింపలేదో అలాగే సత్రములో స్థలములేనట్లు నీకెక్కడను స్థలములేదని తెలిసినప్పటికిని సందేహించక అసహ్యించుకొనక మమ్మును రక్షింపవలెనను ప్రేమ వలన మీరు వచ్చిరి. కాబట్టి పరిశుద్ధ శిశువైన ఓ ప్రభువా! నీ కనేక వందనములు. పరిశుద్ధాత్మవైన తండ్రీ! తండ్రియొక్క పని నెరవేర్చుటలో గొప్పపని చేసినావు. మరియమ్మకు గొప్ప శక్తి, ప్రభావము కనపర్చినావు. ఆమెలో నీశక్తి ప్రభావము ప్రవేశింపజేసినావు గనుక నీకనేక వందనములు. త్రియేక దేవుడవైన తండ్రీ! మమ్మును రక్షించే ఉద్యోగములో గొప్పపని సాధించుచున్న నీకనేక వందనములు. నీ కుమారుని జన్మము ఆలోచించుటకు వెలిగింపు, గ్రహింపు అనుగ్రహించుమని బేత్లెహేము బాలకునిద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.

ప్రసంగము:- ‘క్రిష్ట్మస్ – దేవలోకములో క్రిష్ట్మస్ = దూతల లోకములో క్రిష్ట్మస్ మోక్షలోకములో క్రిష్ట్మస్, భూలోకములో క్రిష్ట్మస్ – పాతాళ లోకములోని వారిని కూడ రక్షించవలెనని ప్రభువుయొక్క ఉద్ధేశ్యము గనుక అన్ని లోకములలో ఈ పండుగ గలదు. క్రిష్ట్మస్ పరలోకములో, భూలోకములో, భూమి క్రింద అని ఫిలిప్పి 2:9లో ఉన్నది. పాతాళ లోకములోనివారు మోకాళ్ళు వంగవలెను. యేసుప్రభువు నామమును ఒప్పుకొనవలెను. హెబ్రీ 1: 6లో దేవుని దూతలు ఆయనకు (క్రీస్తుప్రభువునకు) నమస్కారము చేయవలెనని గలదు ఎందుకు? భూలోకమునకు రక్షణ భాగ్యము క్రీస్తు వలననే కలిగినది సంతోషించి నమస్కారము చేయుదురు. అందుకని వారు క్రిష్ట్మస్ పండుగ ఆచరింతురు. వారి క్రిష్ట్మస్ యొక్క ఉరవడి (నిజముగాస్థితి) ఎక్కువ రక్షింపబడి మోక్షములో నున్న వారి క్రిష్ట్మసు కూడ బాగుండును. మనమెంత బాగుగా చేసినను అంత బాగుండదు. గాని మనము కొంచమే చేసినను దేవునికి గొప్ప సంతోషము.

ఎ) నాలో పాపమున్నది. ఎన్నిమార్లు తీసివేసినను ఆ పాపము మరల వచ్చుచున్నదని తలంచు పాపులందరు క్రిష్ట్మసు చేయుటకు రండి. గొల్లలు తమ గొర్రెలను విడిచి రాలేదా? తూర్పు జ్ఞానులు వారి ఇండ్లను, కుటుంబములను, బంధువులను, పుస్తకములను విడిచి రాలేదా? అలాగే మీలోనున్న లోటులను విడిచి బేత్లెహేము బాలునికి నమస్కారము చేయుటకు రండి. అదే క్రిష్ట్మసు 2. రోగులారా! మీ జబ్బులను విడిచి వాటిని జ్ఞాపకము చేసికొనక క్రీస్తు బాలునికి నమస్కారము చేయుటకు రండి. అదే క్రిష్ట్మసు. 3. చిక్కులలో నున్నవారలారా! అనేక చిక్కులు అడ్డముగా నున్నను ఇంటిలోనికి వచ్చునప్పుడు బైట చెప్పులు విడుచునట్లు మీ చిక్కులు విడిచిపెట్టి దైవ బాలునికి నమస్కరించుటకు రండి అదే క్రిష్ట్మసు. 4. ఇబ్బందులలో నున్నవారలారా! భిక్షగాండ్లారా! ఈవేళ మీ వృత్తిని విడిచి దైవ శిశువునకు నమస్కరించుటకు రండి. అదే క్రిష్ట్మసు. 5. ఈ వేళ క్రిష్ట్మస్ అని ఎవరు అనుకొందురో ఎవరు ఈ పండుగచేయ ప్రయత్నములో నున్నారో వారు తమకున్న సాతాను శోధనలు, ఆటంకములు మరచి బేత్లెహేము బాలుని తలంచుకొని నమస్కారము చేయండి. అదే క్రిష్ట్మసు.

బి) పల్లెటూరిలో చదువురానివారు ఎక్కువ ఉందురు. ఒక దొరగారు ఆ గ్రామము వెళ్ళిరి. అనేకులు దొరగారిని చూచుటకు వచ్చిరి. అందులో ఒకరు నీవెందుకు వచ్చినావని మరియొకరిని అడుగగా 1. దొరగారిని దర్శించుటకు అని చెప్పెను. క్రిష్ట్మసుకూడ అటువంటిదే. దర్శించుట వలన క్రీస్తు బాలును యెడల గౌరవము, మర్యాద కనబరచినట్లు, నిజముగా ఎవరు శిశువును దర్శిం తురో వారే క్రిష్ట్మసు నాచరించువారు. 2. ఇంకొకరు దొరగారికి సలాము చేయుటకు వచ్చినానని చెప్పెను. సలాము అనగా సంతోషము, సమాధానము దొరగారి యెదల అతని అంతరంగములో నుండే గౌరవము తెలియజేయుట అలాగే క్రిష్ట్మసు బాలునికి సలాముచేసి అంతరంగములో గౌరవము కనబరచిన అదే క్రిష్ట్మసు. 3. ఒకరు ఏమియు చెప్పక చిత్తము, చిత్తము అని చెప్పి తన గౌరవము వినయము కనపర్చెను. అలాగే క్రిష్ట్మస్ బాలునికి వినయ, విధేయతలు కనపర్చుటే ఆయనకు నమస్కరించుట. అదే క్రిష్ట్మస్ గనుక పాపములు, చిక్కులు, జబ్బులు శోధనలు తలంచకుండా ఈ వేళ అంత ఆయనకు నమస్కరించుటే క్రిష్ట్మసు. 4. మరియొకరు దొరగారికి దండము పెట్టుటకు వచ్చినానని చెప్పెను. అదొక మర్యాద తన గౌరవము వెలిపుచ్చుటకు అదొక పద్ధతి. అలాగే ఈ దినము బేత్లెహేము బాలునికి దండము పెట్టవలెను. అదే క్రిష్ట్మసు. 5. ఇంకొకరు ఎవరికి ఏమియు చెప్పకుండా చప్పునవెళ్ళి దొరగారి రెండుకాళ్ళు పట్టుకొనెను. ఎంత గౌరవము? ఎంత భక్తి! అలాగే ప్రభువుయొక్క పాదములు పట్టుకొని ముద్దుపెట్టుకొని గౌరవము, భక్తి చూపించిన అదే క్రిష్ట్మసు. 6. మరియొకరిని ఎందుకు వచ్చినావని అడుగగా దొరగారిమీద ‘పదము ‘ (పాట లేక కీర్తన) కట్టినానని చెప్పెను. అదే అతని గౌరవము, తన సంతోషము దొరగారి యెడల అట్లు చూపించెను. అలాగే యేసు బాలునికి సంతోషముతో కీర్తనలు పాడి ఆయనను గౌరవించిన అదే క్రిష్ట్మసు. 7. మిషనెరీగారు వరండాలో నిలువబడి యుండగా దూరమునుండి ఒక అబ్బాయి సలాము చేసెను. దూరమునుండి చేస్తే మాత్రము సలాము గదా? అలాగే యేసుబాలుని పుట్టుక, తొట్టిలో పరుండిన బాలుని పుట్టుక మనకెంత దూరము __రెండు వేల సంవత్సరముల క్రితము. అయినను మనమిప్పుడు నమస్కరించిన ఆ కాలమున దేవదూతలు, గొల్లలు, జ్ఞానులుచేసిన నమస్కారము వంటిదగును. వారు చేసిన క్రిష్ట్మసు వంటిదగును. 8. ఆ పల్లెటూరిలో ఇంకొకరిని ఎందుకు వచ్చినావు అని అడుగగా “పంతులుగార్కి మీరు వ్రాసిన ఉత్తరము సంఘములో చదివి వినిపించినాను” ఇప్పుడు మీరు వచ్చినారని తెలుసుకొని వచ్చినానని చెప్పెను. అలాగే అబ్రాహాము ఇస్సాకు, యాకోబు, మోషే మొదలగు భక్తులు గ్రంధములు వ్రాయబడిన వ్రాతనుబట్టి ప్రభువు వచ్చునని కనిపెట్టిరి. ప్రభువు శిశువుగా వచ్చునప్పటికి వారు పరలోకములో నుండిరి గనుక అక్కడనుండి ఆయనకు నమస్కరించిరి అదికూడ క్రిష్ట్మసు.

సి) 1. క్రిష్ట్మసు అనునది భక్తులు పెట్టిన పేరు. బైబిలులో ఆరాధన, పూజ అని ఉన్నది. ఈ వేళ పూజరోజు, ఈ వేళ నమస్కారము రోజు. వస్తానని చెప్పిన ఆయన వచ్చియున్నారు. గనుక జ్ఞానులు ఆ బాలుని పలుకరించి మోకరించి, ఆరాధించి, నమస్కరించిరి, మ్రొక్కిరి. అదే క్రిష్ట్మసు. 2. పూర్వము ఎస్తేరు గ్రంధములో యూదులను నాశనము చేయుటకు పూనుకొనిరి. అయితే దేవుడు వారిని రక్షించెను. అందుకు యూదులు పండుగ చేసికొనిరి. దానికి పూరీము అని పేరు. ఎస్తేరు 9:26-32; ఆ దినమున వారు స్నేహితులకు బహుమానములిచ్చుకొనుట మొదలగు పనులు జరుగును. ఆ పండుగయొక్క కళ ఇప్పుడు మన పండుగకు వచ్చినది. అట్లే మనము నాశనము కాకుండ దేవుడు తన కుమారుని మనకు ఇచ్చెను గనుక మనము బహుమానములు ఇచ్చుకొనుట(shakehands ఇచ్చట greetings) అభినందనలు చెప్పుటకూడ క్రిష్ట్మసే. గౌరవముతో క్రిష్ట్మసు బాలునికి నమస్కారము చేయగల ధన్యత అందరకును కలుగును గాక.

Please follow and like us:
క్రిష్ట్మస్ పండుగ ప్రసంగము
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply