క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మసు వర్తమానము

క్రిష్ట్మసు వర్తమానము

క్రిష్ట్మసు పండుగ వెళ్ళిపోయినది. ఇరువది వందల సంవత్సరములతో పాటు పండుగ కూడ వెళ్ళిపోయి మరల ఈ వేళ వచ్చినది. మనము బ్రతికి బాగున్న యెడల ప్రభువు పెండ్లికుమార్తె కొరకు రాకుండ నున్నయెడల మరల ఇంకొక క్రిష్ట్మసు వచ్చును. ప్రభువు రెండవసారి వచ్చువరకు మొదటి రాకడ పండుగ వచ్చుచునే ఉండును. వాక్యములో క్రిష్ట్మసు పండుగ వచనములు చదివి వినిపించినారు. యెషయా, మీకా, లూకా, పౌలు మొదలగువారు చేసిన ప్రసంగములు వాక్యములో విన్నారు. వాటికంటే ఎక్కువ ఏమి చెప్పగలము? అయితే పరిశుద్ధాత్మ సహాయము కోరిన యెడల చరిత్రలోని లోతైన అర్ధములను పైకెత్తి చూపించి గ్రహింపజేయును. 1) ఈ పండుగ సమయమున ప్రభువు జన్మించునని ముదుకు నిరీక్షించిన పాత నిబంధన పెద్దలు ఇక్కడ ఉన్నారు. యేసుప్రభువు జన్మము చూడకపోయినను పరలోకమునుండి వచ్చి ఈ సమయమున ఇక్కడ నున్నారు. 2) బేత్లెహేములో ప్రభువు జన్మించినపుడు ఆయనను-శరీర రీతిగా చూచినవరు కూడ ఈ పండుగ సమయమున హాజరైనారు. వీరు ప్రస్తుతము పరలోకములో నున్నవారే. 3) ఈ ఇరువది వందల సంవత్సరములలో ఆయన సంఘములో నుండి ఆయన చరిత్రను నమ్మి ఈ పండుగ చేసి పరలోకములో నున్న భక్తులున్నారు. వారు కూడా ఈ వేళ మనతో ఏకీభవించి పండుగ చేయవలెనని వచ్చియున్నారు. ఈ మూడు గుంపులవారు మనతో ఏకీభవించుటకు వచ్చియున్నారు. వారు పరలోకములో పండుగ చేయుదురు. వారు చేయుపండుగ గిప్పదా? లేక మనము చేయు పండుగ గొప్పదా? వారికి అడ్డులు లేవు. మనకు అన్ని అడ్డులే. మనకెంత బాగుగా చేయవలెనని యున్నను వారితో సమానముగ చేయలేము. గనుక పండుగ చేయువారిలో మనది నాలుగవ గుంపు. దర్శన వరము గలవారు దినమంత ప్రార్ధించిన యెడల పైమూడు గుంపులవారు కనిపించెదరు. బహిరంగముగనే కనిపింతురు. ఈ నాల్గవ గుంపునకు అవసరమైన రక్షకుడును, ఇంకను దేవదూతలును కూడ కనిపింతురు. ఈ దర్శన నేత్రము గలవారికి అయిదవ గుంపువారుకూడ కనబడుదురు. 4) ఈ దినము భూగోళ మంతటిమీద ఎవరు క్రిష్ట్మసు పండుగ చేయుచున్నారో వారును కనిపింతురు.

క్రిష్ట్మసు పండుగ చేయుట చాలాకష్టము. ఈ పండుగ చేయబోతే మనస్సులో అన్ని ఆటంకములే, గనుక కష్టము తక్కిన పండుగలు చేయుట కూదా కష్టమేగాని వాటన్నిటికి ముందుచేయు ఈ పండుగ చాల కష్టము. ఎందుచేత? ఈ పండుగ కథ బైబిలులో చదివిన రెండు ముఖ్యమైన మాటలు కనిపించును. ఆరెండు మాటలు గ్రహించినవారు ఈ పండుగ చేయుట కష్టమని ఒప్పుకొందురు. అవి కంఠత మాటలే తెలిసిన మాటలే (లూకా 2:9-10). దూత గొల్లలతో ప్రజలందరికి కలుగబోవు సంతోషకరమైన వర్తమానము అని చెప్పక “మహాసంతోషకరమైన” వర్తమానమని చెప్పెను. మహాసంతోషము అను మాట చాలాపెద్దది. లోకములోని సంతోషములన్నిటిని మించిన సంతోషము, గనుక క్రిష్ట్మసు చేయువారు సంతోషముతో గాక మహాసంతోషముతో చేయవలెను. అట్టి మహాసంతోషముతో క్రిష్ట్మసు చేయుట చాలాకష్టము. మరియు గొల్లలు దూతను చూచి “భయపడిరి” అని గలదు, మహాసంతోషము అను మాటకును మిక్కిలి భయపడిరి అను మాటకును సరిపోయినదని దేవుడు మహాసంతోషమును గూర్చి చెప్పుటకు వచ్చినపుడు లోకము మిక్కిలి భయపడుట ఆశ్చర్యము, ఇదే మొదటి మాట.

మత్తయి 2:10-11లో తూర్పుజ్ఞానులు బయటికి వచ్చి ఆ నక్షత్రమును చూచి”ఆనందభరితులెరి” అని వ్రాయబడలేదు గాని “అత్యానంద భర్తులైరి” అని వ్రాయబడెను. మహాసంతోషము అను మాటవలె అత్యానందము అను మాట కూదా చలాపెద్దది. మామూలు ఆనందముతోగాక అత్యానందముతో పండుగ చేయవలెను గనుక క్రిష్ట్మసు చేయుట చాలా కష్టము. గొల్లల దగ్గర ఆ మాట జ్ఞానుల దగ్గర ఈ మాట ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించక, వారు సంతోషించక మిక్కిలి భయపడిరి. ఆ కాలపు భక్తులు భయపడిరి. ఈ కాలపు భక్తులు కూడా మహాసంతోషముతో, అత్యానందముతో పండుగ చేయుటకు భయపడుచున్నారు. ఆ రెండు మాటలు గొల్లలనుబట్టి జ్ఞానులనుబట్టి వ్రాయబడినవి. అదే క్రిష్ట్మస్ పండుగ.

ఒక రోగి శరీర బాధలనుండి కేకలు వేయుచున్నాడు. అతనితో ఈ వేళ క్రిష్ట్మసు గనుక నీ బాధ మరచి మహానందముతో అత్యానందముతో నుండుమని చెప్పిన ఏమనును? నీవు సుఖముగ అన్ని కలిగి యున్నావు గనుక సంతోషముతో పండుగ చేయగలవు. నేనెట్లు చేయగలను? అని అనును గనుక ఈ పండుగ చేయుట కష్టము. ఇంకొక రోగితో ఈ మాటలు చెప్పిన అవును ఆయనలోనే అన్ని ఇమిడియున్నవని చెప్పి సంతోషించెను. ఇతడే నిజభక్తుడు. ఎట్టి కష్టములున్నను నిజభక్తులు సంతోషించగలరు.

మరియు ఇంకొక వర్తమానము – దేవదూతలు దేవుని స్తుతించిరి. వారితో స్తుతించుటకు వారిపంక్తిలో చేరుడని విశ్వాసులను పిలుచుచున్నారు. ఎందుకనగా వారి స్తుతులు బలమైనవి. వాటికి పునాదులు కదులును. గనుక దూతల పంక్తిలోచేరి స్తుతించండి. గొల్లలు మొదట భయపడినను తరువాత సంతోషించి, బేత్లెహేము వెళ్ళి, శిశువును పూజించిరి. వారి పంక్తిలోచేరి శిశువును పూజించుడి, ఆరాధించుడి. అలాగే దూరమునుండి వచ్చిన జ్ఞానులు ఆయనను ఆరాధించి కానుకలర్పించిరి. వారి పంక్తిలో చేరి ఆరాధించి కానుకలు అర్పించుడి. సంవత్సరమునకు పండుగ కనుక కష్టపడి వారివారి పంక్తులలో చేరవలెను.

అట్టి క్రిస్ట్మసు చేయుటకు, ప్రభువు ఆత్మ మిమ్మును ప్రేరేపించును గాక! అట్టి క్రిష్ట్మసు శుభములు మీకందరకును అందునుగాక.

Please follow and like us:
క్రిష్ట్మసు వర్తమానము
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply