క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మసు కాలోత్సవము

క్రిష్ట్మసు కాలోత్సవము

శుభవాక్యము: ప్రభువైన క్రీస్తునాతథాస్తు. ప్రభువైన క్రీస్తు -మీతథాస్తు

క్రిష్ట్మసు కథలు:- (లూకా 1వ అధ్యా- 2వ అధ్యాయము) ఇవి జరిగిన కథలు కట్టు కథలు నేడు క్రైస్తవ సంఘములో క్రిష్ట్మస్ పండుగ ఆచరించుట ఎట్లు ఒక వృత్తాంతమై యున్నదో అట్లే క్రీస్తు జన్మము నొక వృత్తాతమై యున్నది. ఇది ఉపమానముకాదు. ఇట్టి వృత్తాంతం స్మరణ మూలముగా మీకు ప్రభువైన క్రీస్తు -నాతథాస్తు అని సంతంసింపగల ధన్యత కలుగును గాక తథాస్తు.

1వ కథ:- క్రీస్తుప్రభువు జన్మింపకముందే ఆయన జన్మ విషయము చరిత్ర విషయమును నాలుగు వేల సంవత్సరముల వరకు భక్తులకు ప్రవచన రూపముగా తెలియుచునే వచ్చెను. ఆ ప్రవచనములు రెండువేల సంవత్సరముల క్రిందట నెరవేరినందున అవి నమ్మదగినవై యున్నవి. కొన్ని ఇంకను నెరవేరుచున్నందున అవి మరింత నమ్మదగినవై యున్నవి.

2వ కథ:- పాలస్తీనాలోని నజరేతు గ్రామమునకు ఒక దేవదూత వెళ్ళి కన్యయగు మరియాంబకు ప్రత్యక్షమై దైవ ప్రభావము వలన ఆమె యందు లోక రక్షకుడు జన్మించునను వార్త తెలియజేసెను. ఇది సంభవించుట అసాధ్యమైనను ఆ కన్యక నమ్ముట ఆశ్ఛర్యకరమై యున్నది.

3వ కథ:- మరియాంబ దక్షిణ ప్రాంతమునకు వెళ్ళి తన బంధువురాలైన ఎలీసబెతు అను నొక వృద్ధురాలిని దర్శింపగ ఆమె గర్భములోని శిశువుగంతులు వేసెను అని బైబిలులో వ్రాయబడి యున్నది. ఇదియును, కన్యక గర్భవతి యగుటయును, వృద్ధురాలు గర్భిణి యగుటయును, నరులు నమ్మలేని విషయములైనను దైవ గ్రంధమందు లిఖితమై యున్నవి గనుక నమ్మి తీరవలెను. గంతులు వేసిన శిశువు తరువాత యోహాను అను పేరు ధరించి లోక రక్షకుని ఈ మొదటివార్త బహిరంగముగా ప్రకటించెను.

4వ కథ:- సర్వలోక చక్రవర్తి సర్వలోక ప్రజాసంఖ్య వ్రాయించుచుండిన కాలములో సర్వలోక రక్షకుడు, సర్వలోక మధ్యవర్తియునైన యేసుప్రభువు సర్వలోక మధ్యస్థానమగు పాలస్తీనాలో జన్మించెను. ఈ కథ జ్ఞాపకముంచుకొనుట వీలైన సర్వపద పునరుక్తి.

5వ కథ:- ప్రజాసంఖ్య వ్రాయుచుండిన సమయములో యేసుక్రీస్తు ప్రభువు జన్మించుట చూడగా ఆయన మానవుల లెక్కలో చేరినట్లు కనబడుచున్నది. ఒక ఘనుడు మనమున్న స్థలమునకు వచ్చి మనతో ఉన్న యెడల మనకు అతిశయము కలుగును గదా, అట్లే యేసు ఎంత మంచి దేవుడైనను పాపులమైన మనయొద్దకు వచ్చినందున మన గ్రహింపునకు ఎంత ఉత్సాహముగ నుండవలసినది! తెలియనప్పుడుండదు. యేసు బలవంతుడైన దేవుడని ఆయన పుట్టకముందే బైబిలులో వ్రాయబడి యున్నది. గనుక విశ్వాసపాత్రయై యున్నది (యెషయా 9:6).

6వ కథ:- మరియాంబయును ఆమెను పరిగ్రహింపనైయున్న యోసేపు బేత్లెహేము అను చిన్న పట్టణమునకు వచ్చినప్పుడు యేసు జన్మించెను. ఇక్కడ జన్మించునని ముందే బైబిలులో వ్రాయబడియున్నది (మీకా 5:2) ఈ పట్టణము నేటివరకును ఉన్నది. ఇది ఒక సాక్షి. క్రీస్తుప్రభువు కల్పనా పురుషుడు కాక చరిత్ర పురుషుడు అని ఋజువు పర్చుటకు గ్రంధములో అనేకములున్నవి. ఋజువులకు తక్కువ ఏమియు లేదుగాని అంగీకారములకు తక్కువ గలదు.

7వ కథ:- క్రీస్తు యేసుప్రభువు ఉండుటకు సత్రములో స్థలముదొరకలేదని వ్రాయబడియున్నది.”ఆది యందు వాక్యముండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను” అని ఎవరిని గురించి చెప్పబడెనో ఆ క్రీస్తు ప్రభువునికి సత్రములో స్థలము దొరకక పోవుట ఎంత విచారకరమైన సంగతి! నానా స్థలములనుండి వచ్చిన వారికి స్థలమున్నది గాని ఈయనకు లేదు. నీలోనికి వచ్చుటకు చదువరీ నీ హృదయములో ఆయనకు స్థలమున్నదా?

8వ కథ:- యేసు పుట్టగానే ఆయన తల్లి ఆ శిశువును పొత్తిగుడ్డలలో చుట్టి, పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అన్నింటికిని ఒడబడి మానవులను రక్షించుటకు వచ్చినాడు గనుక యేసు ఎక్కడో ఒకచోట ఉండవలెను. దేవుడు మోక్షలోకమందు మహిమ సిం హాసనమున నుండక భూలోకమునకు దిగి వచ్చుటయు, రాజకుమారులవలె మేడలో జన్మింపక సామాన్య స్థలములో జన్మించుటయు, గొప్పవారి బిడ్డ ఉయ్యాల తొట్టిలో నుండునట్లు కాక పశువుల తొట్టిలో నుండుటయు, అన్నిటికన్నా ముఖ్యముగా మనుష్యుడగుటయు పరిశీలింపగ ఆయన ఎంత తగ్గించుకొనెనో కనబడుచున్నది. మన కొరకే ఇన్ని అవస్థలు చదువరీ నీ కొరకు అని వినినప్పుడు నీ మనస్సులో ఎంత గౌరవము కలిగి యుండవలెను.

9వ కథ:- ప్రభువు జన్మించినవార్త కాపరులకు ఒక దేవదూత వినిపించెను. జన్మించుననియు, జన్మించెననియు చెప్పిన వ్యక్తి దేవదూతయే. ఇట్టి మహిమ వార్తలు చెప్పుటకు దేవదూతలే తగినవారు. నరులు చెప్పిన వార్త నరులకు నమ్మదగిన వార్తయైన యెడల దేవదూతలు చెప్పిన వార్త మరింత నమ్మదగినదిగదా!

10వ కథ:- వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతను కలిసికొని ఇట్లు దైవస్తుతి చేసెను. (1) సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. (2) ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమిద సమాధానము కలుగునుగాక. ఈ స్తుతిలో దేవునికి కీర్తి రావలెననియు, నరులకు శాంతి కలుగవలెననియు, పరలోక వాస్తవ్వులు కోరిరి. ఈ రెండు కోరికలు ఉన్న యెడల నీ మనస్సునకు గొప్ప సంతోషము కలుగును. ఉన్నవా?

11వ కథ:- కాపరులు ఆ శిశువును దర్శించి ఆరాధించిరి. ఇతరులకు ప్రకటించిరి. చదువరీ నీవును ఆరాధింపగలవా? ప్రకటింపగలవా? చూచుకొనుము.

12వ కథ:- ప్రాగ్ధేశజ్ఞానులు దేవదూతవలన కాదుగాని నూతన నక్షత్ర ప్రదర్శనము వలన యేసు జన్మవార్త గ్రహించి వెళ్ళి ఆయనను ఆరాధించిరి., కానుకలిచ్చిరి, క్రీస్తే మానవులకు సమర్పణయైన గొప్ప కానుక. మన కానుకలు ఆ కానుక ఎదుట ఏ మూల? చదువరీ ఈ కథలను బట్టి ఆత్మలో, నీ ఇంటిలో, నీ సంఘములో క్రిష్ట్మస్ పండుగ చేసికొనగలవేమో తెలిసికొనుము. రక్షకుని ఈ మొదటి రాకడను బట్టి క్రీస్తు శకము అను ఒక నూతనశకమేర్పడినది. రెండవ రాకడ వరకు వచ్చుచుండు నూతన సంవత్సరములు మీకు రెండు రాకడల ఆనందానుభవము కలిగించు గాక.

Please follow and like us:
క్రిష్ట్మసు కాలోత్సవము
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply