క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. క్రిస్మసు పండుగ
  5. క్రిష్ట్మసు ఈవి

క్రిష్ట్మసు ఈవి

యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన కుమారుని అనుగ్రహించెనని గలదు. ఈ లోకములో ఎవరివల్లను, ఎవరికి అనుగ్రహింపబడని మహా గొప్ప ఈవిని దేవుడు లోకమునకు అనుగ్రహించెను. ఈ ఈవి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఇది దైవ గ్రంధములోఎ గొప్ప ముత్యము. అది ప్రశస్త్రమైన మొదటి నక్షత్రమని పిలువబడుచున్నది. సంఖ్యా 24:17. ఇదే క్రైస్తవ మతమునకు పునాది. లోకములోని మనుష్యులకు ఇంతకన్న ప్రశస్తమైన వర్తమానము ఎన్నడును వినిపించబడలేదు. దాదాపు 2000 సంవత్సరముల క్రిందట లోకములో రక్షకుడు నికోదేము అను యూదుల అధికారితో ఈ మాటలు చెప్పెను. అప్పటినుండి నేటివరకు లోకమందంతట ఇది ప్రచురింపబడుచున్నది. ఇది ఘనమైన సత్యము. ఆయాసముగల హృదయమును బాగుచేయు ఔషదము వంటిది. అధైర్యముగల హృదయమును ఉత్సాహపరచునది వాక్యములోని “దేవుడు తన కుమారుని పంపెను” అను మాటను గూర్చి ముఖ్యముగా ఆలోచించము. దీనిని మనము పూర్తిగా గ్రహించ గలిగినయెడల అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు చెప్ప శక్యముగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు (||కొరింథీ 9:15) అని బిగ్గరగా సంతోషముతో కేకలు వేయగలము. దేవుడు మనకు ఈవులు (బహుమానములు) అనుగ్రహించుచున్నాడు గాని వాటన్నిటిలో విలువైనది, వర్ణింపలేనిది గొప్ప ఈవి క్రీస్తుయేసే. స్పర్జన్ దొరగారు ఈలాగు చెప్పెను. ఇతర ఈవులు మనలను ఆశ్చర్యమగ్నులనుగా చేయునుగాని, ఈ ఈవి మనలను దానిలో ముంచివేయుచున్నది. ఈ ఈవిని దేవుడు మనకు అరువుగా గాని, అమ్మివేసిగాని, తిరిగి తీసికొనుటకుగాని ఇవ్వలేదు. మనకు పూర్తిగా ఇచ్చివేసెను. మనకొరకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ క్రిష్ట్మసు దినములలో సాధారణముగా ఒకరికి ఒకరు కానుకలు, బహుమానములు ఇచ్చుట మామూలుగదా? ఇట్టి తరుణములో దేవుడు మనకు ఇచ్చిన బహుమతి లేక ఈవి ఎట్టిదో ఆలోచింతము

1) మనలో ఏ యోగ్యతా, అర్హత లేకపోయినను మనకు

ఇవ్వబడిన ఈవి: కీర్తన 8:4 “నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” కీర్తన 14:3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలుచేయువారెవరును లేరు, ఒక డైనను లేడు. యెషయా 64:6 మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి. మా నీతిక్రియలన్నియు మురికి గుడ్డలవలె నాయెను. మనుష్యునిలో ఏ యోగ్యత లేకపోయినను దేవుని ఉచిత కృపవలననే బేత్లెహేము గ్రామమున, పసువుల పాకలో ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అను ఈ గొప్ప ఈవి మనకు ఇవ్వబడెను. తండ్రియైన దేవునికి స్తోత్రము.

2) ఇది ఇష్టపూర్వకమైన ఈవి: మనుష్యులు సాధారణముగా ఎవరైన ఏదైన ఇచ్చిన యెడల తిరిగి వారికిచ్చుట మామూలు. ఇతరుల మెప్పుపొందుటకు మరికొందరును, ఇంకను అనేకమైన లోకసంబంధమగు కోరికలు తీర్చుకొనుటకు బహుమతులనిత్తురు. గాని, దేవుడైతే ఇష్టపూర్వకముగాను, మనస్పూర్తిగాను ఈ ఈవి ఇచ్చుచున్నాడు. తండ్రియైన దేవుడు ఇష్టపూర్వకముగా తన కుమారుని మనకొరకు అనుగ్రహించుటయేకాక ప్రభువైన యేసుక్రీస్తు తనంతట తాను ఇష్టపూర్వకముగా అర్పించుకొనెను. ప్రభువు ఈలాగు చెప్పుచున్నాడు యోహాను 10:15-18 గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను, గలతీ 2:20 అపోస్తలుడైన పౌలు దానిని నొక్కి చెప్పుచున్నదేమనగా ఆయన మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను. 1తిమోతి 2:6 క్రీస్తు అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే అప్పగించుకొనెను. కుమారుడైన దేవునికి స్తోత్రము.

3) ఇది ప్రశస్తమైన ఈవి: ఈ బహుమతి మనము వర్ణింపలేనంత శ్రేష్టమైనది. ఇది మనలను తృప్తిపరచుచున్నది. ఇది పరలోక సంబంధమైన ఈవి గనుక దేవుని స్తుతింతుము. దీనికన్న శ్రేష్టమైన బహుమానము ఇహ పరములలో లేదు. పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. ||కొరిథీ 5:21; రోమా 4:25; 8:3-4; గలతీ 3:13, 14 ఆయన మన దుఃఖములను, విచారములను మోసికొనెను. పేతురు 2:24 మన మీ పండుగ దినములలో ఈవులను బహుమతులను ఇచ్చుచు పొందుచున్నప్పుడు పరలోకపు తండ్రి తన కుమారుని మనకొరకు అర్పించెనని జ్ఞాపక ముంచుకొందుము. ఇది తన్నుతాను అర్పించుకొన్న ప్రశస్తమైన ఈవి. ప్రత్యేకముగా ఒక్కోక్కరికి ఇవ్వబడిన ఈవి. దేవునికి స్తోత్రములు.

4) ఇది ప్రేమ గల ఈవి: యోహాను 3:16 దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపర్చుచున్నాడు. రోమా 5:8 ఉదా: ఒకప్పుడొక చిన్నబిడ్డ యేసుక్రీస్తు కఠినుడై న్యాయాధిపతి మాత్రమే అని తెలిసికొనెను. అయితే ఒక దినమున ఆమెకు చినిగిపోయిన కాగితము దొరుకగా దానిని చదివెను. అది యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చదివి, దేవుడు ప్రేమగలవాడని తెలిసికొని సంతోషించి, నూతన జీవము గలదాయెను. దేవుని దయగల ఈ మహాగొప్ప శ్రేస్టమైన ఈవికై ఆయనను స్తుతించుదముగాక.

5) ఇది జీవ సంబంధమైన ఈవి: దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్యజీవము రోమా 6:23, ఆయనలో జీవముండెను యోహాను 3:4. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు యోహాను 3:36. క్రీస్తు మన ఆత్మలకు ఆహారమును, పానమును, మార్గమును , పునరు త్థానమును, జీవమునై యున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన నిత్యజీవమునకై ఆయనకు స్తోత్రములు కలుగునుగాక!

6) సమస్తమును కలిగియున్న ఈవి: దేవుడు క్రిష్ట్మసు దినమున మనకు అనుగ్రహించిన ఈవిలో సమస్తమును ఇమిడియున్నవి. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. ||కొరింథీ 1:31 తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమా 8:32 క్రిష్ట్మసు పండుగ ఆచరించుచున్న ప్రియులారా! బహుమతులనిచ్చును. వరముల ద్వారా పొందు ఈ గొప్ప యుగయుగముల క్రిష్ట్మస్ బహుమతి నీవు నిత్యముగా పొందినావా? ఈ బహుమతిని ఏ రీతిగా ఇతరులకు అందించుచున్నావు? కృతజ్ఞతతో ఈ ఈవిని పొంది, ఇతరుల కందించుచు సంతోషించునట్లు దేవుడనుగ్రహించును గాక!

చెప్పశక్యముగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమెన్.

Please follow and like us:
క్రిష్ట్మసు ఈవి
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply