క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. కానుకల పండుగ
  5. కానుకల పండుగ – 1

కానుకల పండుగ – 1

1. కానుకల పండుగ అనగా నేమి? వస్తురూపముగాను, సొమ్మురూపముగాను సంవత్సరమునకు ఒకమారు దేవాలయములో దేవునికి కానుకలు అర్పించు పండుగను కానుకల పండుగ అందురు. దీనినే ‘కోతపండుగ ‘ కోత పండుగ అని కూడా అందురు. పొలములోని పంట, కూరగాయలు, గింజలు మొదలగునవి ఈ రోజున గుడిలో అర్పింతురు.

2. ఈ పండుగ రోజున పంటలోని కొంతభాగము తెచ్చుట క్రైస్తవుల ఆచారమై యున్నది. ఈ ఆచారము యూదులలో గలదు. అదే ఈ పండుగ యొక్క ఆరంభము. కానుకలు అర్పింప వలసినదని యూదులకు దేవుడు చెప్పిన మాట. అయితే ప్రజలు దేవుని ఇష్టమును తమ ఇష్టముగా మార్చుకొని కానుకలు చెల్లించవలెను. అట్టి కానుకలు ఇష్టపూర్వకముగాను, సంతోషముగాను అర్పించు కానుకలు అగును. అట్టివి దేవునికిష్టమైన కానుకలు.

3. ఈ పండుగ దినమున కొన్ని దేవాలయములను మిరపకాయలు, వంకాయలు, ఆవకాయలు మొదలగు వాటితో నింపివేయుదురు. వాటితో దేవాలయమును అలంకరించుదురు. అపుడు కంటికి ఇంపుగా కనబడును. గంపతో ధాన్యమును, ఇతర గింజలను తెచ్చి వరుసగా పెట్టుదురు.

4. దేవుని సన్నిధికి వచ్చువారు వట్టిచేతులతో రాకూడదని చెప్పుదురు. ఇది మంచి ఏర్పాటు.

5. సృష్టికర్త మనయొద్ద సొమ్ము తీసుకొనకుండ గాలి, ఎండ, వాన మొదలగునవి ఇచ్చుచునే యున్నాడు. అవి మనకు దేవుడిచ్చు కానుకలు. భూమిపై పండు పంట యావత్తును మన పనిమీదనే ఆధారపడియున్నదని అనుకొనకూడదు. మనము విత్తనములు చల్లినంత మాత్రమున దేవుడు పంపించకుండానే పంట పండునా? గనుక పంట కూడ దేవుడిచ్చు కానుకే.

6. ‘చందాలు ఎక్కువగా వేయండి, కానుకలు ధారాళముగ తీసికొని రండి. ఒకరిని చూచి ఒకరు, ఒకరి కంటే ఒకరు ఎక్కువ తీసికొని రండి. మీ పేరులు అచ్చువేసి సంఘములో చదివి వినిపింతుము ‘ అని బోధకులు చెప్పు ఆకర్షణ మాటలు విని సంఘము కానుకలు తెచ్చిన యెడల అదేమి గొప్ప పండుగ? కానుక అంటే సంతోషముతోను, నైజములోని ఇష్టగుణముతోను, దేవుడిచ్చిన వర్షాది కానుకలను సూచించు కృతజ్ఞతనుగల చూపుతోను వేసినది కానుక.

7. ఒక భాగ్యశాలి కానుకల పండుగదినమున శేరు బియ్యము కానుకగా తీసినది. గాని వంటకు చాలవని రెండు దోసిళ్ళు తీసికొన్నది ఇదేమి చందా? ఇదేమి కానుక? అనుకొన్నదెంత? ఇచ్చినదెంత? అప్పుడు మీరన్నది ఇంతేనా? అని అననీయ, సప్పీరాలను అడిగిన పేతురు వచ్చి, నీవనుకొన్న కానుక ఇంతేనా అని అడిగిన ఏమి జవాబు చెప్పును?

8. కొందరు పడని నాణెములు తెచ్చి చందాలో వేయుదురు. అట్టి పడని నాణెముల చందా, పడని చందా, గనుక తల్లిదండ్రులు పిల్లలకు ఈ విషయము బాగుగా బోధింపవలెను.

9. దేవుడు మనకిచ్చు కానుకలు మిక్కిలి శ్రేష్టమైనవి. వాన వంటి కానుక నీవు ఇయ్యగలవా? సృష్టించగలవా? గాలివంటి కానుక నీవు ఇయ్యగలవా? ఎండవంటి కానుక నీవు ఇయ్యగలవా? సృష్టించగలవా? అట్టి కానుకలు సృష్టింపలేక పోయినను, ఉన్నవాటిలోనైన శ్రేష్టమైనవి దేవునికి కానుకగా అర్పించకూడదా!

10. చిన్న కానుక, మధ్యరకపు కానుక, పెద్ద కానుక, అనేక వస్తువులున్న కానుక ఇవేవి లెక్కలోనికి రావు. పరిసయ్యుడు దేవాలయములో ప్రార్ధించినప్పుడు పెద్ద కానుకల చిట్టా జాగ్రత్త పడవలెను.

11. కుడిచేతితో చేసిన ధర్మము ఎడమచేతికి తెలియకూడదని ప్రభువు చెప్పియున్నారు. ఆ కానుక మనుష్యులకిచ్చే కానుక. దేవునికిచ్చు కానుక కూడ అట్లే యుండవలెను. మనము ఇచ్చే చందాలు ఎవరికిని చెప్పరాదు. ‘అయ్యా! 5రూ.లు ఇచ్చినాను. వ్రాసికొనండి, మరచిపోవుదురు ‘ అని కొందరు అంటారు. ఒక ఇల్లాలు మరియొక ఇల్లాలి చెవిలో పోయిన సంవత్సరము కంటే, ఈ సంవత్సరము ఒక రూపాయి ఎక్కువేసినానని చెప్పెను. ఇతరులకు తెలియునట్లు కానుకలిచ్చిన అది సున్న. దాని వలన ఏమి ప్రయోజనము?

12. ఓ సంఘస్తులారా! మీరిచ్చే చందాలు, ఇవ్వవలసిన చందాలే అని మీ మనస్సాక్షి చెప్పుచున్నదా?

13. దేవునికి ఒక చేతితో కానుక ఇచ్చినావు. దేవుని యొద్దనుండి రెండవ చేతితో దీవెనలన్ని తీసికొనుచున్నావు.

14. ఓ సంఘస్తులారా! మీరిచ్చే కానుకలు దేవుడు చూచి సంతోషించునని మీరు నమ్ముచున్నారా? హేబెలు కానుక దేవుడెందు కంగీకరించెను? ఎందుకనగా దేవుడు హేబెలును అంగీకరించినాడు గనుక. ఆలాగే దేవుడు మిమ్మునంగీకరించిన యెడల మీ చందాను కూడ అంగీకరించును.

15. ‘అయ్యా! నా కానుక ఇతరులకు తెలియనీయవద్దు, వ్రాసికొనవద్దు, నేనెంత వేసినది నా తండ్రీ తెలిసిన చాలు ‘ అని అనుకొనుచున్నవారు ధన్యులు.

16. దేవా! ఈ మొత్తము కానుక వేయవలెనని నాకు ఉన్నది. ఇంక ఎక్కువ వేయవలెనని నీ ఇష్టమైన యెడల నాకు తెలియజేయుము. నీవు చెప్పినంత కానుక వేయుదును అని ప్రార్ధించుకొనువారు ధన్యులు.

17. కృతజ్ఞతగల హృదయముతో వేయు చందాలు ప్రభువు తీసికొని వాడుకొనును. విసుగుకొనకుండ, అబ్బ! అన్నీ చందాలే అని అనకుండ, నేనెన్ని చందాలు వేసినా నా ఋణము తీరదు అని వేయువారు ధన్యులు.

18. ఒకరికి ఇంటిలో రెండు అణాలు మాత్రమున్నవి. అవి కానుక వేసినచో పిల్లలకు గంజి అన్నము ఏమిచేయవలెను? ఈ ప్రశ్న ఎదుట గృహిణి తటపటలాడును. వేసిన యెడల త్యాగము, వేయకపోయిన లోభిత్వము. కూర మాట తర్వాత చూడవచ్చును. నా తండ్రికి ఇవ్వవలసినది ఇచ్చివేయుదునని ఇచ్చినయెడల ఆమె ధన్యురాలు.

19. దేవుడు లోకమునకు ఇచ్చిన మరికొన్ని గొప్ప కానుకలు- వాక్యగ్రంధమునిచ్చెను, కుమారుని ఇచ్చెను. పరిశుద్ధాత్మను ఇచ్చెను. ఈ కానుకల కంటె మన కానుక లెక్కువా?

20. రెండు రూపాయలు తెచ్చినాను, ఇంకొక రూపాయికూడ వేసిన బాగుండునని అనుకొన్నావు. అప్పుడు వాగ్ధాన చీటివ్రాసి సంచిలో వేయవలెను. గాని గుడిబంట్రోతు వచ్చేవరకు ఉండక, ముందే పంపించి వేయవలెను.  గుడిబంట్రోతు వచ్చిన తరువాత ఇచ్చినచో బిల్లుకలెక్టరుకు పన్ను చెల్లించినట్లుండును గాని చందా వేసినట్లుండదు. వాగ్ధానము సుళువే గాని ఇవ్వడము కష్టము.

21. అందరు కలిమిలోనుండి ఇచ్చిరి. విధవరాలు లేమిలోనుండి ఇచ్చినది. అది మనకు అర్ధముకాదు. లేమిలోనుండి ఇచ్చినామె కలిమిగలదైనది. (లూకా 21:3) కలిమిలోనుండి ఇచ్చినవారు లేమిగలవారైరి.

22. మాసిదోనియ సంఘస్థులను గురించి ఒకమాట ఉన్నది. వారు శక్తి కొలది కాక శక్తికి మించి ఇచ్చిరి.     

(||కొరింథి 8:4) ఇదికూడ గ్రహించుట కష్టమే. అట్టి వారు ఇచ్చుటలో వరము పొంది యున్నారు. పాటలు పాడుటలో వరము గలిగిన వారున్నారు. బోధలో వరము కలిగినవారున్నారు. అయితే చందా ఇచ్చుటలో వరము గలిగిన వారెందరున్నారు?

23. దశమభాగము ఇవ్వవలెనని యూదుల కాజ్ఞాపింపబడెను. క్రైస్తవులైన మనకు అట్టి ఆజ్ఞ లేదు. గనుక మనము దశమభాగము కంటే ఎక్కువ ఇవ్వవలెను. వారికన్న మనమెక్కువ పొందినాము. వారికి నిరీక్షణ మెస్సీయ గలడు. మనకు వచ్చిన మెస్సీయ గలడు. ఎంత గొప్ప భేదము.

24. దేవుడు నా పాపములు క్షమించినాడను సంతోషముతోను, పాపమును జయించు శక్తి దయచేయునను విశ్వాసముతోను, శ్రమలు, శోధనలు రానిచ్చుట నా మేలుకొరకే అను నిరీక్షణతోను, రక్షణ అనుగ్రహించినాడను నిశ్చయతతోను కానుకలర్పించిన అవే అసలైన కానుకలు.    

25. ఒక పేద క్రైస్తవురాలు వారి దగ్గర వీరిదగ్గర సహాయము పొందుచున్నది. ఒక్కొక్కపూట తినుటకు ఏమియు ఆమెకు ఉండదు. ఆమె ఏమి చందా వేయగలదని కొందరు అనవచ్చును. ఆమె పొందు సహాయములో తనకు తోచినంత వేయుట మంచిది. వేయవలెనని చెప్పించుకొనుట నిజవిశ్వాసుల లక్షణము కాదు.

26. అందరు చందా వేయుచున్నారు. నేనెందుకు వేయకూడదు అని అనుకొని వేసిన అది కూడ మంచిదే.

27. తల్లిదండ్రులు పిల్లలకు అనేకమైన మంచి వాడుకలు నేర్పింతురు. చందా వేసేవాడుక, కానుకిచ్చే వాడుక, బీదలకు భిక్షమువేయు వాడుక మొదలైనవి తమ పిల్లకు నేర్పించిన, ఆ వాడుకలు స్వభావసిద్ధమైన వాడుకలుగా మారిపోవును.

28. ఒకరికి జ్వరముగా నున్నది, గుడికి వెళ్ళలేరు. వేరొకరిచేత పంపుటకు ఇష్టముండదు. ఏలాగు? దానికి జవాబు: ఎవరిచేతనైన పంపవచ్చును.

29. చందా ఇచ్చు సంఘము ఎప్పుడును జీవించు సంఘమై యుండును.

30. ఒకరు నిజక్రైస్తవుడు అని తెలిసికొనుటకు అనేక గుర్తులు గలవు. అందొక గుర్తు విధాయకముగ కానుకలిచ్చుట. అడిగినను అడుగకపోయినను ఇచ్చుట, ఇబ్బంది పడుచున్నను చందా ఇచ్చుట.

31. అయ్యో! అనుకున్నంత కానుక ఇవ్వకలేక పోవుచున్నాను అనినొచ్చుకొనువారు ధన్యులు.

32. పంటలు పండు పొలముల వలన, కాయు వృక్ష ఫలముల వలన, పచ్చగానుండు గడ్డి వలన, బాగుగా కాయు ఎండవలన, చల్లగా వీచు గాలివలన, మతాభి వలె వెలుగు వెన్నెల వలన, కురియు వానవలన, నిలువ ఉండు లోహముల వలన దేవునికి స్తుతి కలుగుచున్నది. ఈ స్తుతి, సృష్టి దేవునికి అర్పించు కానుక.

(1) ప్రశ్న: కానుకల పండుగలో ఏ కానుక గొప్పది? 

   జవాబు: ‘స్తుతి కానుక గొప్పది.

(2) ప్రశ్న: ఇది ప్రతి దినము ఎవరు చేస్తున్నారు? 

    జవాబు: దేవదూతలు, పరలోక వాస్తవ్వ్యులు.

(3) ప్రశ్న: వీరుకాక ఎవరూ చేయుట లేదా? 

          జవాబు: సృష్టి యావత్తును స్తుతిచేయుచున్నట్లు ప్రకటన 4వ అధ్యాయములో నున్నది.

(4) ప్రశ్న: మనుష్యులు చేయుచున్నారు కదా? 

           జవాబు: అందరు కాదు, ఎల్లప్పుడు కాదు

Please follow and like us:
కానుకల పండుగ – 1
Was this article helpful to you? Yes 3 No

How can we help?

Leave a Reply