క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. కానుకల పండుగ
  5. కానుకల పండుగ – 5

కానుకల పండుగ – 5

(మత్తయి 13:47-50)

ఈ పాఠములో జాలరి వలవేసి, పైకిలాగి, చేతితో మంచివి బుట్టలో వేసికొని, చెడ్డవి (ఇసుక, చెట్లు, చెత్త) పారవేసెను. ఇది అంత్య తీర్పు కథ. నీతిమంతులను, దుష్టులను వేరుచేసి, దుష్టులను నరకములో వేయుదురు. ఆ సమయమున సజ్జనులే ఆయనకు కావలసిన కానుకలు. దేవుని రాజ్యములోనికి మంచివారు వత్తురు. ఇక్కడి గుడిలోనికి మంచివారు కానివారు, దుర్జనులు, నామక క్రైస్తవులు, నిజక్రైస్తవులు వచ్చెదరు. మనము కొంతవరకు ఎవరు సజ్జనులో, ఎవరు దుర్జనులో తెలిసికొన గలము గాని వేషధారులను తెలిసికొనలేము. వారిని రేపు దేవదూతలు వేరుచేయుదురు. ఇదివరకు యూదులు ఏర్పాటు ప్రజలు. అయితే మనలో ఎవరు ఏర్పాటు ప్రజలై ఉన్నారో దేవదూతలకు తెలియును.

కానుకల పండుగ చేయు విశ్వాసులారా! మీరు చందావేస్తే సంచి చాలా బరువుగా నున్నదని పాదిరిగారు సంతోషించును. సంఘమునకు దానశక్తి బాగా ఉన్నదని అనుకొనును. ఆయనకేమి తెలియును. అయితే దూత వచ్చి వాటిని వేరుచేసి, మంచివి పైకి దేవుని సన్నిధికి పంపును. కానివి తీసివేసి అగ్నిలో వేయును. పాదిరిగారు అన్ని తీసికొందురు. పాపము ఆయనకేమి తెలియును. అయితే దేవదూతలు వేరుచేయగలరు.

ఇపుడు బైబిలులో మొదటిగా అర్పించబడిన రెండు కానుకలను గూర్చి తెలుసుకొందాము. కయీను, హేబెలు వీటిని అర్పించిరి (ఆది 4:1-8), ఈ రెండు కానుకల వంటి కానుకలు పాదిరిగారి సంచిలోనికి వెళ్ళునుగాని, దేవదూత వచ్చి ఒకటవ కానుకను నరకము లోనికి, రెండవ కానుకను పరలోకమునకు పంపును.

1. ‘ఒకటవ కానుక ‘: అనగా కయీను కానుక, కయీను కానుక తెచ్చినాడు, తాను వచ్చినాడు గానీ తన హృదయము తేలేదు గనుక దేవుడు అతని కానుక తీసికొనలేదు. అతనిని అంగీకరింపలేదు. గనుక కానుక, హృదయము రెండును పోయినవి. ఆలాగే కొందరు కానుక తీసికొని వస్తారు గాని హృదయము అర్పించరు. గనుక అంగీకరించబడరు. కయీను కానుక తెచ్చెనుగాని హృదయము తేలేదు.

2. ‘రెండవ కానుక ‘: హేబెలు తన కానుక తెచ్చినాడు. తాను కూడ వచ్చినాడు. అయితే హేబెలు రెండు తెచ్చెను అనగా తన కానుక తెచ్చెను. తన హృదయము కూడ తెచ్చెను. గనుక రెండూ అంగీకరింపబడెను. మన సంఘములో కూడ ఒకటి తెచ్చిన వారుందురు. రెండు తెచ్చిన వారును ఉండవచ్చును.

3.’ఎక్కువ = తక్కువ ‘ (లూకా 21:3-4). ఎక్కువ చందా వేసిన ప్రభువు మెచ్చుకొనుననియు, తక్కువ చందా వేసిన మెచ్చుకొనరనియు అనుకొనవచ్చును. బీద విధవరాలు తక్కువ వేసినా, ఎక్కువే వేసెనని మెచ్చుకొనెను. పరలోకమునకు ఆ కానుక పరలోకమునకు వెళ్ళెను. శాస్త్రులు, పరిసయ్యులు సంచులతో వేసినా, అవి తక్కువే అన్నారు గనుక వారి కానుకలు నరకమునకే.

4.’తెల్పుట ‘: గుడికి వెళ్ళి కానుక అందరికిని తెలిసేటట్లు కొందరు వేయుదురు. ప్రభువు, కుడి చేతితో చేయు ధర్మము ఎడమ చేతికి తెలియకూడదని చెప్పెను.(మత్తయి6:3). ఇతరులకు తెలియవలెనని కానుక వేసిన యెడల దేవదూతలు దానిని అగ్నిగుండములో వేయుదురు. గనుక అట్టి బుద్ధి మార్చుకొనవలెను.

5. ‘కృతజ్ఞత ‘: దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చినాడు అను సంతోషముతో ఒకరు తనకు తోచినది కానుక వేయును. దేవదూతలు అది పరలోకమునకు పంపుదురు.

6.’వాడుక ‘: కృతజ్ఞత లేకుండ. ‘కానుకలు తెమ్మన్నారు ‘ అని వాడుక ప్రకారము వేసిన ప్రభువు అంగీకరించరు. ఆచార ప్రకారము కాదుగాని కృతజ్ఞతతో వేయవలెను.

7.’ఇష్టము ‘: కానుక తెచ్చుటకు ఇష్టము లేని ఒకరు, గత వారము పాదిరిగారు చేసిన ప్రసంగము విని మారుమనసు పొంది ఇష్టము తెచ్చుకొని కానుక వేసెను. అట్టిది దూతలు, ప్రభువు అంగీకరింతురు. ఉదా:- ఒక చిన్న పిల్ల అరటిపండుతీసికొని పంతులుగారికి ఇచ్చి చంకలుకొట్టుకొనెను. పంతులుగారు పండును తీసికొనెను. పిల్లను ఎత్తుకొనెను. రెండును అంగీకరించెను. ఆలాగే కానుక తెచ్చినప్పుడు ప్రభువు హేబెలు కానుకను అంగీకరించెను. హతసాక్షి అయినపుడు హేబెలును ఎత్తుకొనెను.

8.’నాది ‘: ఒక అబ్బాయిని, అణా ఎవరిది అనగా నాది అనెను. నీకెక్కడిది అనగా అమ్మ ఇచ్చినది అనెను. కష్టపడినది తేవలెను. కయీను కష్టపడి సంపాదించినది తేలేదు గాని, హేబెలు స్వంతముగా పెంచి, పెద్దచేసి, క్రొవ్వబెట్టి తెచ్చెను గనుక ప్రభువు అంగీకరించెను. మనము కష్టపడి సంపాదించినది తెవలెను. లేనిచో అట్టి కానుక అగ్నిలోకే.

9. ‘అరిగెను ‘.: కొందరు అరిగినవి, పడనివి, ఎవరు చూడరు గదా! అని చందాలో వేస్తారు. అవి పాదిరిగారికి పనికిరావు. అట్టివి నరకమునకే.

10. ‘కోరి వేయుట ‘: ఎవరును ప్రేరేపించకుండ, ఇష్టము కలిగి, దేవుని రాజ్యాభివృద్ధికొరకు, సంఘాభివృద్ధి కొరకు ఎవరు కానుకలు వేయుదురు? ఎందరు తమ స్వంత ఇష్టప్రకారము వేయుచున్నారు?

11.’నాకో’: ఇంటిదగ్గర కానుకల పండుగ ప్రమేయము వచ్చినది. ఒక బాలిక కొంత కానుక తీసికొనెను. మరల ‘నాకో’ అని కొన్ని తీసివేసి గుడికి వచ్చెను. ఒక ఆత్మను పొందిన బాలిక “నీవు అనుకొన్నంత తేలేదు కొంత తీసివేసికొంటివి గనుక కానుక అంగీకరింపబడదు” అని ప్రవచనము చెప్పెను. అప్పుడు సిగ్గుపడి వెనుకకు వెళ్ళి, తీసివేసినది కూడ మరల తెచ్చెను. అప్పుడు అంగీకరింపబడెను. ఈ కాలములో కూడ అంతా ఇస్తే ‘నాకో’ అని కొందరు అందురు. అది కూడా ప్రభువునకు అప్పగింపవలెను. అప్పుడాయన అంగీకరించును.

12. ‘ఎరుగక ‘: ఒకరు ప్రసంగము విని, బోధకుని ప్రేరేపణవలన ఇరుగు పొరుగువారి కానుకలు చూచి ఆనందించి, తన కూరగాయలన్ని దేవాలయమునకు తెచ్చెను. గాని బల్లమీద కూర్చుని “ఎరుగక తెచ్చెను. సంతలో అమ్మడానికి ఏమీలేవు” అని దిగులు పడెను. ఆలాగు విచారపడువారి కానుకలు అంగీకరింపబడవు.

13. ‘విచారించుట ‘: 4రకముల కూరగాయలు. 4గంపలలో వేసి ఇన్ని ఎందుకు అని తీసివేసి, మరల తీసి మరల వేయుచుండెను. ఇంకా ఎంత తీసికొని రావలెను అని తీర్మానమునకు రాకుండ విచారించుచుండెను. కథ విచారించుటలోనే ఉండెను. గుడి అయిపోయెను. అవి అక్కడ నుండియే అగ్నిలోనికి వెళ్ళును.

14. 'అపహరణ ': చందా పట్టునప్పుడు దొంగిలింతురు. అపహరించినది తనదా? ఇతరులదా? దేవునిదా? తనది దొంగిలించినందుకు మొదటి శిక్ష ఇతరులది దొంగిలించినందుకు రెండవ శిక్ష దేవునిది దొంగిలించినందుకు మూడవశిక్ష.

15. 'పరునిది ': ఒక కుర్రవాడు, తల్లి చందా ఇచ్చినప్పుడు బజారులోనికి పోయి కొనుక్కొని తినివేసెను. తల్లి చూచి, చందా మరల ఇవ్వలేదు. తల్లి గుడికి పోయిన తర్వాత అతడు కందుల మూట తెచ్చి చందా వేసెను. ఇది దొంగ పొమ్ము. ఇతరులది అంగీకరింపబడదు.

16. 'వర్తకము ': ఒక వర్తకుడు దశమ భాగమిచ్చెదనని రూ. 100 వచ్చినప్పుడు రూ. 10 ఇచ్చెను. రూ. 500 లు వచ్చినపుడు రూ. 50 ఇచ్చెను. రాబడి హెచ్చినది. రూ. 500 లు ఇవ్వవలసివచ్చెను. ఏలాగు ఇవ్వవలెను? వాగ్ధాన ప్రకారము ఇచ్చెను. ఇంకా రాబడి హెచ్చి, పదివేలు రాబడిలో వెయ్యిరూపాయలు ఇవ్వవలసి వచ్చెను. ఇది వరకు ఇచ్చినదే చాలు అని మానివేసెను. పొరపాటున వాగ్దానము చేసితిననుకొనెను. అప్పుడు, వచ్చే వర్తకపు ఓడలలో మూడు మునిగిపోయెనని వార్త వచ్చెను. తప్పు తెలిసికొనెను. విచారపడెను. దైవజనుడైతే నా మేలుకొరకే అనుకొనును. ఇది జరిగిన చరిత్ర.

17.’సున్న ‘: కొందరు మనకేమున్నది వేయడానికి అని ఏమి వేయకుండ కూర్చుందురు. మనకు ఉంటే గదా వేయడానికి అనుకొందురు.

ఈ కానుకలపై కొన్ని అగ్నిలోనికి పోయేవి, కొన్ని అంగీకరింపబడేవి ఉన్నవి. గనుక మనము దిద్దుకొని, శుద్ధికలిగి కానుకలు అర్పింపవలెను. దేవుడంగీకరించు కానుకలు వేయగల ధన్యత మీకు కలుగును గాక!

షరా:- బోధకుడు 17 చిన్న కాగితములపై ఈ 17 అంశములు వ్రాసి, 17 మందికి ఇచ్చి ఒక్కొక్కటి చదువునపుడు వాటిని వివరించవలెను. వివరించునపుడే, ప్రభువు అంగీకరించు కానుకల కాగితముల చీట్లు కుడిచేతివైపున ఉంచుకొనవలెను. అగ్నిలోనికి పోవునని ఎడమవైపున ఉంచుకొనవలెను. ప్రసంగము చివర ఏవి పరలోకమునకు వెళ్ళేవి, ఏవి నరకమునకు పోయేవి సంఘమునకు చూపించవలెను.

Please follow and like us:
కానుకల పండుగ – 5
Was this article helpful to you? Yes No

How can we help?

Leave a Reply