క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఈష్టరు పండుగ
  5. ఈస్టరు పండుగ 2

ఈస్టరు పండుగ 2

వాక్యభాగములు : మత్తయి 28: 1-10; మార్కు 16:1-13; లూకా 24; 1-1; యోహాను 20:1-18.

త్రియేక దేవుని పునరుత్థాన దీవెన మీకు కలుగును గాక! ప్రభువు పునరుత్థానము ఎంత ముఖ్యమో, సంఘము యొక్క పునరుత్థానము కూడ అంతే ముఖ్యము. ఇప్పుడు ప్రభువుయొక్క జయము, రెండవ రాకడప్పుడు సంఘముయొక్క జయము. ఇది ఒక పునరుత్థానము. అది మరియొక పునరుత్థానము, మనము రెండు పునరుత్థానముల మధ్య నున్నాము. మొదటి పునరుత్థాన కాలమునుండి చాలా వరకు నడిచివచ్చి సంఘ పునరుత్థానమును సమీపించినాము. యేసుప్రభువు యొక్క జీవితమంతయు పునరుత్థానమే అనగా జయమే.

(1) యేసుప్రభువు దేవుడైయుండి మానవునిగా జన్మించుట పరాభవమైనను, ఆ పరాభము లెక్కచేయక జన్మించి జయించెను గనుక ఇది ఒక పునరుత్థానము.

(2) యేసుప్రభువు, మరియమ్మ, యోసేపులను తల్లి దండ్రులని పిలుచుట పరాభవమైనను వారిని అమ్మా, నాయన అని పిలిచి పరాభవమును జయించి పునరుత్థాన మొందెను.

(3) పన్నెండు సంవత్సరముల వయస్సులో (లూకా 2:42) తల్లి వలన ‘నీ కొరకు వెదుకుచున్నాము ‘ అను మాటపడి సహించి పునరుత్థానుడాయెను.

(4) యేసుప్రభువు యోహాను చేత బాప్తిస్మము పొందుటకు వెళ్ళగా (మత్తయి 3:13-17) యోహాను నీ చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెప్పిన ఆ పరిశుద్ధునికి ఎట్లు బాప్తిస్మమివ్వగలడు.

అట్లు తక్కువవానిచే బాప్తిస్మము పొందుట ప్రభువునకు అవమానమైనను, అట్టి అవమానము లెక్కచేయక జయించుట ఒక పునరుత్థానము.

(5) సైతాను యేసుప్రభువు ఎదుట నిలువబడి ఆయనను శోధించెను. (మత్తయి 4అ) ప్రభువు సైతాను శోధనలు జయించి గెలుచుటయే పునరుత్థానము. సైతాను పారిపోయెను.

(6) ఆయన అనేకసంగతులు బోధించినప్పుడు ఆ దేశ ప్రజలు అంగీకరించలేదు. (మత్తయి 11:20) అట్లు అంగీకరింపకపోవుట ఆయనకు పరాభవమైనను బోధించి జయించుట పునరుత్థానము.

(7) ప్రభువు రోగులను బాగుచేసినప్పుడు విశ్రాంతి దినమున బాగుచేయవద్దని కొందరు ఆంటకపరచిరి. (మార్కు 3:16) ప్రభువు అట్ట్లి ఆటంకములు జయించుట పునరుత్థానము.

(8) యేసుప్రభువును దయ్యముల శక్తిచేత, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనిరి. (మార్కు 3:22) ప్రభువునకు దయ్యము పట్టినదనిరి. అప్పుడు ప్రభువు ఆ పని మాని నజరేతులో కూర్చుండవలసినది గాని ఆయన అట్టి మాటలన్నిటిని లెక్కచేయక జయించి దయ్యములను వెళ్ళగొట్టెను. ఇదే పునరుత్థానము.

(9) యేసుప్రభువు యాయీరు కుమార్తెను బ్రతికించెను. ఆయన లాజరును బ్రతికించినప్పుడు వారు ప్రభువుపై కుట్రపన్నిరి. (యోహా 12:11) ఇట్టి కుట్రను ప్రభువు జయించుటే పునరుత్థానము.

(10) గెత్సెమనే తోటలో వారు ప్రభువును పట్టుకొన వచ్చినప్పుడు ఆయన ప్రభావమును చూచి “వెనుకకు తగ్గి నేలపడిరి” (యోహాను 18:60 అయితే ఆయన వారిని తన్ను పట్టుకొననిచ్చుట ద్వారా జయించి పునరుత్థానమొందెను.

(11) యేసుప్రభువు సనెడ్రిన్ తీర్పునకుగాని, హేరోదు పిలాతు కోర్టులలోని తీర్పునకు గాని భయపడలేదు. మనము చివరి తీర్పులలోనికి రాకుండ ఆయన మనకు బదులుగా భయపడకుండ తీర్పుపొంది జయించి పునరుత్థానుడాయెను. (లూకా 22:23 అ.)

(12) సిలువ మీద రక్తప్రవాహము ప్రవహించుచున్నది. ప్రజలు ఆయనను దూషించుచున్నారు అయినను ఆయన సిలువనుండి దిగలేదు. సహించి జయించుట పునరుత్థానము, శత్రువులు, అపవాది ప్రభువునకు కోర్టులలో, సిలువ మీద సమాధిలో అపజయమని తలంచిరి అట్లు పైకి కనబడెను, గాని ఆదివారమున ప్రభువు లేవగానే అపజయములన్ని కొట్టివేయబడి జయము, పునరుత్థానము కలిగెను. ఆ దినమున పునరుత్థానములపై పునరుత్థానము కలిగెను.

ప్రభువునకు పైకి అన్ని అపజయములవలె కనబడెను. కాని అవన్నీ జయములే అని ఆదివారము లేచుట వలన తెలియ వచ్చెను. శిష్యులుకూడ ప్రభువునకు అపజయమే అని తలంచిరి. (లూకా 24:21) ప్రభువు తన మనస్సులో జయమునాదే అని అనుకొనెను. ప్రభువు పరలోకమునకు వెళ్ళునప్పుడు ప్రభువునకే జయమని శిష్యులు గ్రహించిరి. (లూకా 24:52) ముందు ఈ జయములన్ని అపజయ రూపములు ధరించుకొన్నవి. అయితే పునరుత్థాన దినమున సంపూర్ణ జయరూపము వెలువడెను. సంఘము ఈ లోకములో బోధించునప్పుడు కొందరు విన్నను, వినకపోయినప్పటికి సంఘమునకే జయమని సంఘ పునరుత్థాన కాలములో తెలియగలదు. పైగా ప్రభువు శరీరధారిగా నున్నప్పుడు శ్రమ పడుట ఆయన వంతు, ఇప్పుడు శ్రమపడుట సంఘము యొక్క వంతు. ప్రభువునకు అపజయములో జయము, సంఘమునకుకూడా అలాగే నుండును. శోధనలలో, బోధలో, రోగములలో, మొదలగువాటన్నిటిలో జయము.

“కీడు కేవలముగ-కీడించు భావించి-ఖిన్నుడనైపోదునా = ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగ నుందునా” అప్పుడు భూలోకములో సంఘమునకు అయినను పరలోకములో మేలే, జయమే, ప్రభువును, మరణము, సమాధి, బండ, బంటులు ఆపలేదు ఆయన లేచినాడు. పూర్తిగా జయము పొందవలసి వచ్చినప్పుడు ఏవియు ఆయనను ఆపలేదు. అలాగే సంఘమును కూడ ఏవియు ఆపుచేయలేవు. విశ్వాసికి అపజయము లేనే లేదు. మంచిచేయగల మంచి విశ్వాసులకు కీడుకలిగినను జయమే కలుగును, ప్రభువునకు జయము. ఆయన జయమును బట్టి మనకు జయము. ఆయనకు అన్నిటిలో జయము వ చ్చి నది గనుక మనకును అన్నివిషయములలో జయమే కలుగును.

Please follow and like us:
ఈస్టరు పండుగ 2
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply