క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఈష్టరు పండుగ
  5. ఈస్టరువర్తమానము

ఈస్టరువర్తమానము

మార్కు 16:4 ” ఆ రాయి ఎంతో పెద్దది.”

యేసుప్రభువు ఉపవాసములో నలుబది దినములున్నారు. అనగా తండ్రి సన్నిధానములో ఉన్నారు. ఇక ముందుకు చేయవలసిన పనిని గూర్చి సన్నిధానములో ఉన్నారు. ఇక ముందుకు చేయవలసిన పనిని గూర్చి ఆలోచించుచుండెను. ఆయన సేవ, సిలువ, మరణము, పునరుత్థానము, సంఘ స్థాపన రెండవ రాకడ, ఏడేండ్ల పరిపాలన, వెయ్యేండ్ల పరిపాలన మొదలగు వాటిని గూర్చి ఆలోచించు చుండెను. ఈ కాలము అనాది కాలము వంటిది. సృష్టికి పూర్వము తండ్రి ఆలోచించిన రీతిగా ఈయన ఆలోచించు చుండెను. (ఎఫెసి 1:6). ప్రభువు లేచినది మొదలు మాకు కనిపించుట, విశ్వాసులను దేశించుట, ఆరోహణమువరకు గల చరిత్ర యావత్తు ఈష్టరు చరిత్ర. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి తీయక పూర్వము దానిక్రింద ఏమి దాగియున్నది? ప్రభువు, ఆయన జీవము, ఆయన మహిమ, ఆయన జయము దాగియున్నవి. రాయి తీయగానే అవన్నియు బయలుపడినవి. రాయి ఉన్నంతవరకు ఇవన్ని కనబడలేదు, స్త్రీలకు ప్రభువు లేచినాడనగానే ఏమి కలిగినది? సంతోషమును, వణకును పుట్టినవి. (మార్కు 16:8) వీరు వెళ్ళి తక్కిన శిష్యులకు ఈ సంగతి చెప్పిరి.

(1) స్త్రీల మాటలు శిష్యుల చెవులకు వెర్రిమాటలవలె కంపించెను (లూకా 24:11). (2) ఎమ్మాయి శిష్యుల తలంపు ఏమనగా వారి జనమును ఉద్దరిస్తాడని అనుకొన్నారు. గాని చనిపోయినాడని నిరాశ కలిగినది (లూకా 24:21). (3) తోమా గాయములలో వ్రేళ్ళు పెట్టి చూస్తేనేగాని ప్రభువు లేచినట్లు నమ్మననెను. (యోహాను 20:24,25) నేను నమ్మను, అసలే నమ్మను, నమ్మనంటే నమ్మను అని రెట్టింపు అపనమ్మిక కలిగియుండెను. తోమాలో ఇట్టి అపనమ్మిక అనే రాయి ఉంటే ప్రభువు కనబడడు. ఆయన జీవము, మహిమ, జయము దాగి యుండెడివి. తోమా శిష్యుల కూటములకు రాననెను. గాని వారిలోఒకరు బలవంతముగా రమ్మని అడుగుటనుబట్టి కూటమునకు వచ్చెను. కూటమునకు వచ్చిన తరువాత ఆయనకున్న అపనమ్మిక పోయెను. అట్ట్లే కొందరు వారి బోధలు తప్పు బోధలని మీటింగులకు వచ్చుట లేదు. కాని కొందరివలన బలవంత పెట్టబడి, మీటింగులకు వచ్చి సత్యమును తెలిసికొనుచున్నారు. శిష్యుల యొక్క వెర్రిమాటలను రాయి ఎల్లప్పుడు ఉంటే ప్రభువుయొక్క జీవము, మహిమ, జయము ఇవన్నియు బయలుపడక యుండెడివి. ఎమ్మాయి శిష్యుల నిరాశ అనే రాయి ఉంటే పైవన్ని బయలుపడక యుండెడివి. నిరాశ రాయి, వెర్రి రాయి, అపనమ్మిక రాయి ఇవన్నీ తీసివేస్తే పైవన్నీ బయలుపడును. వెర్రి రాయి గట్టిదా? నిరాశ రాయి గట్టిదా? అపనమ్మిక రాయి గట్టిదా? నిరాశ రాయి మహా గట్టిది. ఏది గడ్డురాయి? ఏది అడ్డురాయి? అన్నీ అడ్డు రాళ్ళే. అన్నీ గడ్డు రాళ్ళే. ఒకరు మూడు దినములు ప్రార్ధిస్తే దేవుడు కనబడలేదు, దేవదూత కనబడలేదు. మా పిల్ల కొంచెము సేపు ప్రార్ధించగానే దేవుడు కనబడినాడని మరియొకరు అన్నారు. నీలో నుండు ‘నిరాశ ‘ అను అడ్డు రాయి తీసివేయుము, అప్పుడు ప్రభువు కనబడును, పరమానందము కలుగును. అంతేగాక ఆయనయొక్క జీవము, మహిమ, జయము, కనబడును. అప్పుడు సంతోషముచే వణకుపుట్టును.

ఆ రాయి ఎంత పెద్దదైతే అది తొలగించుటచే వచ్చు సంతోషము కూడ అంత గొప్పది. గనుక ప్రభువును గూర్చి మీ హృదయములో ఉన్న అనుమానపు రాళ్ళు తీసివేయండి. సిలువ దినము భూమి వణకినది. ఈస్టరు దినము స్త్రీలు సంతోషముచే వణకినారు. మనకు ఎలాటి అడ్డురాళ్ళు ఉన్నప్పటికిని అవన్నీ తీసివేస్తే గొప్ప సంతోషము కలుగును. ప్రభువు ఆయన తరువాత అపోస్తలులు, స్తెఫను, పౌలు మొదలగు వారందరు వచ్చిరి. చచ్చినవాడు రక్షకుడు కాగలడా? చచ్చినవాడు బ్రతికినాడా? మొదలగు ప్రశ్నలతో యూదు లందరు పౌలును ఎదిరించిరి. పౌలు పాత నిబంధనలోని ప్రవచనములు తీసి వారికి నచ్చజెప్పెను. పౌలు దిగ్గజము, శాస్త్రములు బాగా చదివెను. మనము ఇతనిని ఎదిరించలేము గనుక ఇతనిని రాళ్ళతో చంపితే బాగుండునని యూదులు తలంచిరి. పౌలు చెప్పినది ఏమనగా ప్రభువు లేకపోయిన యెడల పాత నిబంధన అంతయు సున్నే. ఆయన లేచి, అనేకమందికి, పెద్దలకు, యెరూషలేము వాస్తవ్వులకు కనబడినాడు. అకాలమందు పుట్టిన నాకును కనబడినాడు. ఇట్టి అనేక రుజువులను పౌలు వారికి చూపించెను, గాని వారికి రుజువు పరిచే శక్తిలేదుగాని ఇది వట్టిది అనే శక్తి మాత్రమే వారికి గలదు. యూదులకు మొండితనము అనే అడ్డురాయి గలదు. ఆయన ఉత్తరమునకు వెళ్ళి అంతియొకయ, కొరింథి మొదలగు పట్టణములలోనూ, చిన్న ఆసియా అంతటను బోధించెను. పౌలుతో ఏగలేక ఆయనను చంపవలెనని యూదులు చూచిరి. శిష్యులు ప్రభువు కనబడగానే తమ అడ్డురాయి తీసివేసికొనిరి. స్త్రీల మాటలు నమ్మకూడదని అనుకున్నాము గాని నిజమే అని తరువాత నమ్మిరి. అట్లే ఎమ్మాయి శిష్యులు తమ నిరాశ అనే అడ్డురాతిని తీసివేసికొనిరి. లూకా ఆ శిష్యులలో ఒకడు, గనుక ఆ చరిత్ర బహు విపులముగ వ్రాసెను. ప్రభువు నాకు కనబడలేదు. ఆయన మహిమ నాకు కనబడలేదు అని మీరు అనుకొనవద్దు. మీలో అడ్డురాళ్ళు తీసివేసికుంటే ప్రభువు చక్కగా బయలుపడును. తోమాకు ఎందుకు అపనమ్మిక కలిగెను? తోమా మొదట కూటమునకు వెళ్ళలేదు గనుక అపనమ్మిక కలిగెను మీటింగులకు వెళ్ళినట్లయితే అనేక సంగతులు బయలుపడును. విశ్వాసము వృద్ధియగును. మన వారు (శిష్యులు) తోమా అను పేరు తిరగవేసి యుందురు. “తోమా” “తోమా” నీవు ‘మాతో’ లేవు గనుక నీకు తెలియలేదు అందురు.

యేసుప్రభువు ఈస్టరు పండుగ రోజున మహాజయశాలియై మరణమును గెలిచి వచ్చినాడు. మరొకసారి ఆయనకు ముళ్ళ కిరీటము ఉండునా? సమాధి ఉండునా? పునరుత్థానము ఉండునా? లేచుట ఉండునా? ఉండదు. అట్లే పెండ్లి కుమార్తెకు ఇప్పుడన్నీ శ్రమలే. ఎల్లప్పుడు ఈశ్రమలుఉండవు.ఒకదినమునప్రభువువచ్చితీసికొనిపోవును.పరలోకములో ఇవన్నీ ఉండవు. ఇక ఈ శ్రమలు కొద్ధి కాలమే. యేసుప్రభువు లేచి నలుబది దినములు విశ్వాసులను దర్శించిరి. వారికి మత ధర్మములు, మర్మములు తెలియజేసిరి.

శిష్యులకు స్త్రీల మాట వెర్రి రాయివలె నుండెను. అది అడ్డురాయి. ఎమ్మాయి శిష్యులు ప్రభువును చూచి గ్రహించకపోవుట గ్రుడ్డి రాయి. తోమాది మడ్డి రాయి. స్త్రీలు చూచినది అడ్డురాయి. (యోహాను 20:14) మరియమ్మ వెనుకకు తిరిగి చూచెను. ఎందుకు? ఎదురుగా దేవదూత ప్రభువునకు నమస్కరించెను. అందువలన ఆమె వెనుకకుతిరిగి చూచెను. రుమాలు సమాధిలో తల దగ్గర ఉండుటకు మారుగా మరియొక చోట నుండెను. (యోహాను 20:7) అనగా ఆయన హడావిడిగా లేవలేదు. శిష్యులు వచ్చి హడావిడిగా ఎత్తుకొని పోలేదు. ఆయనంతట ఆయనే లేచి వస్త్రములను పొదుపుగా ఒకచోట పెట్టి లేచెను. దీనిని ఋజువు పరచుటకు శిష్యులు రుమాలును గూర్చి వ్రాసిరి.

Please follow and like us:
ఈస్టరువర్తమానము
Was this article helpful to you? Yes 2 No

How can we help?

Leave a Reply