క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఆరోహణ పండుగ
  5. మరణములేని కాలము

మరణములేని కాలము

దేశీయులైన సహకారులారా, మీకు నిత్యజీవాశీర్వాదము కలుగునుగాక! మరణము లేకుండా నూతన శరీరముతో మోక్షలోకమునకు ఎగిరి వెళ్ళగలస్థితి అక్కరలేనివారు ఉందురా! అందరికిని అది ఇష్టమే, దానికి సిద్ధపడుట అగత్యము. పూర్వము జరిగిన రెండు చరిత్రలు వినండి, హనోకు అను ఒక దైవజ్ఞుడు, దైవసన్నిధిని నడచినవాడు ఒకనాడు మరణము చూడకుండ మోక్షమునకు వెళ్ళెను. 9ఆది 5:240 రెండవ చరిత్ర: (రాజులు 2:1-18) ఏలీయా అను పేరుగల మరియొక భక్తుడు గలడు. ఆయన శరీరముతోనే ఆరోహణమగునని అందరకు ముందుగానే తెలిసినది. అందుచేత ఆయన శిష్యులు ఆయన వెంటబడి వెళ్ళిరి. యొర్ధాను నది అవతలకు ఆయన వెళ్ళగా, పరమండలమునుండి రథము వచ్చి యొర్ధాను నది అవతలకు ఆయన వెళ్ళగా, పరమండలమునుండి రథము వచ్చి ఆయనను కొనిపోయెను. ఇట్లు పరలోకమునకు వెళ్ళినవారు నూతన శరీరధారులై వెళ్ళిరి.

మరణము లేని కాలము: ప్రపంచములో పాపము ప్రవేశించిన కాలము మొదలుకొని నేటివరకు వచ్చిన కాలములలో మరణములు లేని కాలములు లేవు. ఎంతకాలము బ్రతికినను ఎప్పుడో ఒక పర్యాయము మరణము రాకమానదు. కాని మరణము లేని కాలము ఒకటి మిక్కిలి త్వరలోనే రానైయున్నది. అట్టికాలము అందరికీ కాదు. ఎవరు మరణములేని స్థితికి సిద్ధమగుదురో వారికే. మరణకాలము భయంకరమైన కాలము. ఇష్టము లేని కాలము, ఐనను తప్పదు. మరణము లేని కాలము సంతోషకాలము. నెమ్మదిగల కాలము, క్రొత్త జీవము కలుగు కాలము, క్రొత్త శక్తి కలుగు కాలము. అది ఎప్పుడు వచ్చును? రావలసిన కాలము మిక్కిలి సమీపములోనే ఉన్నదని మా నమ్మిక. దేవుడు మరణము లేనివాడు. అనగా నిత్య జీవము గలవాడు. కావలసిన వారికి నిత్యజీవము అనుగ్రహించువాడు. ఆయన మరణ స్వాధీనపరులైన నరులను దర్శించుటకును, వారియొద్ద కొంతకాలము నివసించుటకును, నిత్యజీవన విషయములు బోధించుటకును, కోరినవాడై కొన్నియేండ్ల క్రిందట మన భూమిమీద వెలసెను. ఇది ఆయనలోని ప్రేమ లక్షణమును వెల్లడిపరచుచున్నది.

ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలము మనుష్యుడు గనుక అందరును పిలుచుటకు వీలుండునట్లు యేసు అను పేరు పెట్టుకొనెను. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు అనగా పాపములను, జబ్బులను, ఇబ్బందులను, ఇతర దుస్థితులను తొలగించి రక్షింపగలవాడు అని అర్ధౌ. ఈ రక్షకుడు మనలను రక్షించి, దిక్కులేని స్థితిలో ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళువాడు కాడు గనుక ఈ పాప లోకములో కూడా మనకు కావలసిన ఆదరణ, ధైర్యము మొదలగు ఏర్పాటులు చేసినాడు. నరులు చనిపోవునపుడు దైవాంశగలవారై యున్న యెడల, తాను ఉన్న మోక్షలోకమునకు నిరాటంకముగ తీసికొని వెళ్ళగలవాడే రక్షకుడు. అట్టి రక్షకుడు యేసే. ఆయనకే గల మరియొక పేరు క్రీస్తు. క్రీస్తు అనగా రక్షింపగల ఉద్యోగమునకు ప్రత్యేకమైన రీతిని ఏర్పడియున్నవాడు. కొందరు ఆయనను ‘యేసు ‘ అని పిలుతురు. కొందరు ‘క్రీస్తు ‘ అని పిలుతురు. మరి కొందరు ‘యేసుక్రీస్తు ‘ అని పిలుతురు. ఆయన దేవుడా? ఔను. ఆయన మనుష్యుడా? ఔను. గనుకనే అన్ని కాలములలో, అన్ని స్థలములలో, అన్ని దుస్థితులలో ఉన్న అందరిని-అందరిని-అందరిని రక్షింపగల సమర్ధుడు. ఆయన అటువంటివాడని యేసుక్రీస్తు అను పేరులోనే ఉన్నది. ఇంతేనా? ఈ లోకములో ఉండగా రక్షించుటయేనా? ఈ లోకము దాటిన తర్వాత రక్షింపలేడా? ఔను. అప్పుడును రక్షింపగలడు. ఈ మాటలు చదువుచున్న నిన్నును రక్షింపగలడు.

మీరు నమ్మిన యెడల, చదువరులారా! మీకు వినగలిగిన శక్తి చూడగల శక్తి, నడవగల శక్తి ఉన్నది. అయితే నేను పైన చెప్పిన మాటలను నమ్మగల శక్తి కూడ ఉన్నదా! అట్లున్నయెడల మీకు స్వస్థి. స్వత్షి అనగా క్షేమము. స్వస్థి అనగా విశ్వాసము. స్వస్థి అనగా ఆరోగ్యము. స్వస్థి అనగా ధన్యత. స్వస్థి అనగా మంచి స్థితి. స్వస్థి అనగా ముగింపు. ముగింపు అనగా ఒక మంచి కార్యము నెరవేరిన సమయము. ఇవన్నియు క్రీస్తువలననే కలుగును. మీకు క్రీస్తువల్ల కలుగు సుఖజీవనము అక్కరలేదా? ఆ జీవనము కలిగించు క్రీస్తు మీకు అవసరము లేదా? అవసరము ఉన్న యెడల ఆయనను ప్రార్ధించండి. ఆశ్రయించండి. తీరా ఆయనను ఆశ్రయించిన తర్వాత మరియొకని ఆశ్రయింప వీలులేదు. నేను ఇవన్నియు చెప్పినాను గాని మరణము లేని సమయమేదో చెప్పలేదు. వినండి మరి. యేసుక్రీస్తు ప్రభువు ఇదివరకు వచ్చిన రాకడ రాక, ఇప్పుడు రెండవమారు రావలసిన రాకడ యొకటి కలదు. ఆయన మేఘాసీనుడై వచ్చును. ఆయనను నమ్ముకొన్నవారు భూమిమీద ఎందరుందురో వారినందరిని ప్రాణముతోనే మోక్షమునకు, అంతములేని జీవముగల లోకమునకు తీసికొని వెళ్ళును. అట్టి వారికి మరణము ఎట్లుండునో తెలియనే తెలియదు. ఆహా! ఆయన రెండవమారు రావలసిన రాకడ మన కాలములోనే జరిగితే మనమెంత ధన్యులము. కొందరు అదే అనుకొనుచున్నారు. ఆ తలంపుతోనే ఉన్నారు. అందుకే సిద్ధపడుచున్నారు. మరి మీరేస్థితిలో ఉన్నారు?

2. మనలను పరలోకమునకు వెళ్ళకుండ చేసి, తుదకు చంపునవి ఏవనగా చెడ్డ ఆలోచనలు, చెడ్డమాటలు, చెడ్డచేష్టలు, మొదలైనవి; వీటివలన కలుగు వ్యాధులు, వాటి వలన వచ్చు మరణము. అంతేగాక ఇబ్బందుల వలన మరణము. అధిక విచారము వలన మరణము. అజాగ్రత్త వలన మరణము. దయ్యములకు చోటిచ్చు వలన మరణము. మీరు క్రీస్తు తలంపే గలవారై యున్న యెడల ఒకవేళ మరణము వచ్చినను, భయపడనక్కరలేదు. మరణము రాగానే ఆయన మీ యొద్దకు వచ్చి మీరు ఆయన వారు గనుక మీ పాపశరీరమును ఇక్కడ ఉండిపోనిచ్చి, మిమ్మును మాత్రము మోక్షలోకమునకు తీసికొని వెళ్ళును. ‘అయ్యో! చనిపోతిమి ‘ అను విచారము మీకు లేకుండ చేయును.

3. దేవుడగు యేసుక్రీస్తు ప్రభువు నరలోక వాసిగా నున్నప్పుడు గొప్ప ధర్మములు బోధించెను. మంచిగా నడిచి చూపెను. రోగులకు ఆరోగ్యము, భూత పీడితులకు విముక్తి, ఆకలిగా నున్నవారికి అన్నము, ఆపదలో నున్నవారికి ఆపద నివారణ అనుగ్రహించెను. మృతులను కొందరిని బ్రతికించెను. మన పాపములన్నియు తనమీద వేసికొన్నందువలన, వచ్చిన మరణమును రానిచ్చెను. బ్రతికి వచ్చి మోక్షమునకు వెళ్ళెను. వెళ్ళకముందు కొన్నిమాటలు చెప్పెను. నమ్మి బాప్తిస్మము పొందువారికి రక్షణ; నేను మరలవచ్చి మిమ్మును తీసికొని వెళ్ళెదను; ఇట్లు చెప్పిన ఆయన రాకడ మానడు.

4. (1) మీకు బ్రతుకుదెరువు మాటలుగల శాస్త్రము బైబిలు గ్రంధము. (2) మిమ్మును మంచిలోనికి నడిపింపగల దేవపురుషుడు క్రీస్తుప్రభువు. మీరు ఎప్పుడు ప్రార్ధించిన మీ దగ్గరకు వచ్చును. చూడవలెనని కోరి ధ్యానించిన యెడల కనబడును, మాటలాడును. (3) మిమ్మును చేర్చుకొను సంఘము క్రైస్తవ మత సంఘము మీకు శుభము కలుగును గాక!

ఇష్టము లేకున్నను, ఒక స్త్రీ బోదురుకప్ప మాంసపు కూర తిన్నందున, ఉబ్బసవ్యాధి కుదిరినది. ఇష్టము లేకున్నను, క్రైస్తవ బోధ వినండి. మేలు కలుగకమానదు.

Please follow and like us:
మరణములేని కాలము
Was this article helpful to you? Yes 1 No

How can we help?

Leave a Reply