క్రైస్తవ పండుగలు

  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు
  4. ఆరోహణ పండుగ
  5. ఆరోహణము

ఆరోహణము

మత్తయి 28:16-20 మార్కు 16:19-20; లూకా 24:50-53; అ.కార్య 1:6-11.

ఆరోహణ విశ్వాసులారా! ఆరోహణ పట్టుదల గలవారలారా! ఈ దినము ఆరోహణ పండుగ. రెండవ రాకడ పండుగ. ఆరోహణ పండుగలోనే రెండవ రాకడ పండుగ కలదు. ఈ కథలో యేసుప్రభువు లేడు. అనగా కంటికి కనబడేటట్లు లేడు. యేసుప్రభువు ఉన్నాడు. ‘సదాకాలము మీతోనే ఉంటానని చెప్పెను ‘ గనుక ఉన్నాడు. ఆయన కంటికి కనబడుట లేదు కనుక లేడు అని మన నిర్ణయము. దేవుని వాక్యమయితే అట్లు నిర్ణయించుట లేదు. ఆయన మన దగ్గర ఉన్నాడు. పరలోకములోకూడా ఉన్నాడు అను రెండు నిర్ణయములు చెప్పుచున్నది. మన కన్ను నిజమా? దేవుని వాక్యము నిజమా? ఆత్మ నేత్రము వాక్య పక్షము. అనగా ఆయన ఉన్నాడనే పక్షము. ఈ ఆత్మీయ నేత్రమునకే విశ్వాస నేత్రమని పేరు. మనము విశ్వాస నేత్ర పక్షమా? శరీర నేత్ర పక్షమా? ఆయన ఇక్కడ ఉన్నాడు అనేది ఒక కథ. ఆయన పరలోకములో ఉన్నాడు అనునది మరియొక కథ.

యేసు ప్రభువు పరలోకమునకు వెళ్ళుట ఈ నేత్రము చూచినది. ప్రభువు ఈ నేత్రమును సంతుష్టిపరచి అమాంతముగా గాలిలో వెళ్ళిరి. మేఘము ఆయనను కమ్మెను. ఎందుకనగా శరీర నేత్రములారా! మీ గడువు అయిపోయినది. ఇక విశ్వాస నేత్రము ఉపయోగించండి అన్నట్లు మేఘము కమ్మెను. ఈ శరీర నేత్రములకు ఆ తరవాత ఆయనను చూచు టకు శక్తిలేదు. లూకా 24:52లో ఆయన వెళ్ళుచుండగా వారు నమస్కారము చేసిరని గలదు. వారు ప్రభువు వెళ్ళిపోయిరని దుఃఖముతో నుండవలసినది గాని మహానందముతో ఉన్నారని గలదు. వారు ఎడతెగక దేవాలయమునకు వెళ్ళుచుండిరి. ఎదతెగక దేవుని స్తుతించుచుండిరి. (1) నమస్కారము చేయుట. 92) మహానందముతో నుండుట. (3) ఎడతెగక దేవాలయములో నుండుట. (4) ఎడతెగక స్తుతించుట, లూకాలో గలదు. వారు యేసుప్రభువు వెళ్ళుట ఈ కళ్ళతోనే చూచిరి. అంతేకాదు ఆయన చేతులు చాపి వారిని దీవించుట కూడ చూచిరి. ఇద్దరు మనుష్యులు – ఆయన మరల వస్తారు అని చెప్పుటకూడా వినిరి, చూచిరి. ఈ మాటలన్నిటిలో విచారకరమైన మాటలేదు. విచారము ఉండవలసినదే గాని లేదు. ఆయన వెళ్ళినాడు, వారితో ఉన్నాడు, తిరిగి వస్తాడు అను మూడు సంతోషములు వారికి గలవు. ప్రభువునకేమి ఉన్నదో ఆయనను అనుసరించిన విశ్వాసులకు అదే గలదు. ప్రభువునకు శ్రమ ఉన్నది. ఆయన తనకు గల శ్రమలనుబట్టి ఏడ్వలేదు, మనమెందుకు మన శ్రమలనుబట్టి ఏడ్వలేదు? ఆయన ఏడ్చిన మనమును ఏడ్వవచ్చును. ఆయన మరణమైనారు. ఈ భూలోకములోని యోసేపు, మరియ అను వారిని అమ్మా! నాయనా! అని పిలుచుటకు ఏడ్వలేదు. ఇంకనూ అనేక పర్యాయములు ఏడ్వవలసిన పరిస్థితులలో ఆయనకు ఏడ్పురాలేదు. చివరకు తండ్రితో ఎడబాటును సహించలేక ‘నా తండ్రీ ‘ నన్నెందుకు చేయి విడచితివి ‘ అని అన్నారు గాని మరణ సమయములో కూడా ఏడ్వలేదు. గనుక విశ్వాసికి మరణమున్నను ఏడ్వరాదు. ఆయన సమాధిలోకి వెళ్ళెను. అనేక మంది విశ్వాసులకు సమాధి ఉండును. రాకడ వరకు బ్రతికే వారికి చావు ఉండదు, గనుక సమాధి ఉండదు. ప్రభువునకు ఆరోహణమున్నది. విశ్వాసులకు కూడ ఆరోహణమున్నది. మన గుడిలోనున్న వారు రాకడ వరకు ఎందరు ఉంటారో వారికి చావు-సమాధి ఉండవు. అందుకొరకు సిద్ధపడగలవారు సిద్ధపడండి.

ఒక హిందూ విశ్వాసి బాప్తిస్మము పొందినది, దర్శన వరము ఆమెకు గలదు. ఆమెకు, నా బిడ్డలు ప్రభువును గూర్చి వినకుండ, బాప్తిస్మము పొందకుండ చనిపోయినారనే విచారము గలదు. ఆమె ‘ప్రభువా’ నా బిడ్డలు ఎక్కడ ఉన్నారు? అని ప్రార్ధించెను. యేసుప్రభువు ఆమె బిడ్డలిద్దరిని చూపించి, నా దగ్గరే ఉన్నారని చెప్పెను. ఆమె ధైర్యమునకు, సంతోషమునకు అంతులేదు. నా బిడ్డలు మా నాయన దగ్గరే ఉన్నారు,నేను కూడ ఎప్పుడైనా అక్కడకే చేరుదునని సంతోషముతో చెప్పెను. ఆమె ఇంకా బ్రతికే ఉన్నది. విశ్వాసులందరు అదే వరుసలో ఉండవలెను. అనేక మంది తల్లిదండ్రులకు అదే ప్రశ్న ఉండును. మాకు నిశ్చయము తెలియుటలేదు. తెలిసిన సంతోషించగలము అందురు. దేవునిని అడిగే శక్తి, ప్రార్ధించే శక్తి (యాకోబు 5:16,17) వారికి లేదు. పట్టుదలతో పెండ్లికానుక అడిగినా, ప్రభువు ఏదో చెప్పుదురు.మదరాసులో ఉద్యోగములో ఉన్న అబ్బాయి ఎప్పటికైన వస్తాడు అని అందుము. ఆయన ఉన్నాడని అందుము గాని లేడని అనము గదా? అలాగే మనకు సంబంధించిన మృతులైన వారు పరలోకములో ఉన్నారు. మేమును అక్కడికి వెళ్ళుదుము అనే సంతోషము కలిగియుండవలెను. ‘లేడు ‘ అను తలంపు కలిగియుండరాదు. విశ్వాసుల బిడ్డలు, బార్య భర్తలు, అన్న దమ్ములు, అక్క చెల్లెండ్రు ప్రభువునకు నమ్మకమైన దాసులుగా ఈ లోకయాత్రలో నున్నారు. గనుక వారు తప్పక పరలోకములో ఉన్నారను సంతోషము విశ్వాసులకే ఉండును. మనము చనిపోయిన విశ్వాసులైన వారిని గురించి విచారపడుట దేవదూషణ. దేవుని దగ్గర ఉన్నవారిని ‘లేరు ‘ అనుట దేవదూషణ. వారు పరలోకములో నున్నారు. మేము వెళ్తామో, వెళ్ళమో అని సందేహించువారు వెళ్ళరు సందేహమున్న సమాధియే గనుక వెళ్ళరు. ఒకరు తన ఒక్కడే కుమారుని పెండ్లికాకముందే తీసికొన్నందుకు, దేవుడు అన్యాయస్తుడని దూషించిరి. ఎంత అజ్ఞానము! దేవుని పద్దతులను తప్పు పట్టకూడదు. ప్రభువువలె మనమును ఆరోహణ మగుదుము గనుక శిష్యులవలె మహానందము కలిగి యుండవలెను. విచారము పాతాళమునకు లాగివేయును. శిష్యులవలె మహానందము కలిగియుండు భాగ్యము అందరికిని కలుగునుగాక! ఆమెన్.

Please follow and like us:
ఆరోహణము
Was this article helpful to you? Yes 3 No

How can we help?

Leave a Reply